కాకినాడ నుంచి యానంవైపు వెళ్ళే దారిలో ఉన్న జామికాయల తూముకి ఓ ఫర్లాంగ్ దూరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామివారి ఆశ్రమం, ఆశ్రమంలోనే కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయమూ ఉన్నాయి. సాయంత్రం ఆరు అవుతూ ఉండగా ఆశ్రమంలో గాలిగోపురం దాటి గుడిలోనికి ప్రవేశించాం. చలికాలం కనుక అప్పుడే చీకటి పడిపోయింది. గుడి ప్రశాంతంగా ఉంది. ఓ వైపు దేవాలయ సిబ్బంది కొందరు మట్టి ప్రమిదలలో వొత్తీ, నూనే వేసి వచ్చిన భక్తులకి దీపారాధన కోసం ఇస్తున్నారు. రంగమండపం వెనుకఉన్న పెద్ద హాలులో విద్యార్థులు వేదం చదువుతున్నారు. అది వింటూ ప్రదక్షిణ పూర్తిచేసి సరాసరి దర్శనానికి వెళుతూ ఉండగా, `ఆకాశ దీపం వెలిగిస్తున్నారు. చూసి వెళ్ళండి,` అన్నారు ఎవరో. పురోహితులు మంత్రోశ్చారణచేస్తూ ఆకాశదీపం వెలిగించి, చుట్టూ రంద్రాలున్న గుండ్రని ఇత్తడి ఉట్టిలో పెట్టారు. తరువాత ప్రమిదలు పట్టుకొని వేచి ఉన్న సుమారు పాతిక మంది భక్తులు వరుసగా వాటిని వెలిగించి ఆ ప్రదేశాన్నంతా దీపపు కాంతులతో శోభాయమానంగా మార్చేశారు. అందరూ `గోవిందా, గోవింద` అని చెపుతూ ఉండగా ఆకాశ దీపం కప్పీ మీద తాడు సహాయంతో నిటారుగా ఉన్న స్థంభం పైకొసకు వెళ్ళింది. గర్భగుడిలోనుంచి పదకొండు అడుగుల ఎత్తైన వేంకటేశ్వరుడు మందస్మితంతో బయట జరుగుతున్న కార్యక్రమాన్ని గమనిస్తున్నట్టు ఉన్నాడు.
చిరు మంచుతో కూడుకొన్న శరత్కాలపు రాత్రి, చమురు దీపాల వెలుగుల్లో కిరణాలుగా సాగుతున్న ఆధ్యాత్మికత, విత్యుద్దీపాల కాంతిలో మెరిసిపోతున్న దేవదేవుడు, గడియారాన్ని మరచిపోయి ఆగిపోయిన కాలం.. బయట జరుగుతున్న విషయాలని ఏదోలా వ్యక్తం చెయ్యవచ్చు. మరి మనసులోనో, మెదడులోనో ముద్రపడే ఇలాంటి దివ్యమైన అనుభూతులని ఎలా చెప్పగలం!
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment