శ్రీ రాళ్ళబండి సుబ్బారావుగారు ఎక్కడెక్కడినుంచో సేకరించిన పురాతన శిల్పాలు, నాణాలు, శాసనాలు, మధ్యయుగంలో ప్రజలు వాడిన పనిముట్లు మొదలైన వాటితో 1967వ సంవత్సరంలో ఆయనపేరు మీదే రాజమండ్రీలో మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంను సందర్శించే ఉద్దేశ్యంతో రాజమండ్రీలో ఉన్న కొంతమంది స్నేహితులని వివరాలకోసం అడిగాను. ఆశ్చర్యకరంగా అది ఎక్కడ ఉందో చెప్పగలిగారు తప్పించి ఎవ్వరూ అంతకుమించి సరైన సమాచారాన్ని ఇవ్వలేకపోయారు. ఇంటర్‌నెట్‌లో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వీకీపీడియాలో రాళ్ళబండి సుబ్బారావుగారి పేరుమీది పేజీయే లేదు!
ప్రతీ శుక్రవారం మ్యూజియంకి శెలవు అనే సంగతి తెలియదు. దురదృష్టవశాత్తు మేము(నేనూ, నా భార్య శుభా, పిల్లలు శ్రావ్యా, వర్షిత) రాజమండ్రీ వెళ్ళిన రోజు శుక్రవారం అయ్యింది. అయినాసరే కనీసం బయటినుంచయినా చూద్దామని వెళ్ళాము. రాజమండ్రీ గోదావరి వొడ్డున రాళ్ళబండి సుబ్బారావు గవర్నమెంట్ మ్యూజియం ఉంది. గేటు తెరిచే ఉంది. వాచ్‌మేనో, పనివాడో సరిగా తెలియదుకానీ ఒకవ్యక్తి మాత్రం లోపల ఉన్నాడు. `ఈ రోజు శెలవు బాబూ, రేపురండి,` అన్నాడు. దూరంనుంచి వచ్చామని, బయటినుంచి చూసి వెళ్ళిపోతాం అనీ అన్నాం. కొంచెం తటపటాయించి, `సరే!` అన్నాడు. గేటుమూసేయ్యాలని, తొందరగా చూసి వచ్చేయ్యమని కూడా చెప్పాడు.
క్రీస్తుశకం పదవ శతాబ్ధం నుంచి పంతొమ్మిదో శతాబ్ధం వరకూ వివిధకాలాకు చెందిన కుమారస్వామి, వినాయకుడు, ఆంజనేయుడు, శ్రీరామపట్టాభిషేకం, భద్రకాళి, పార్వతి, జైన మహావీరుడు, నందులు మొదలైన శిల్పాలు వరండాలో, ఆరుబయటా ఉన్నాయి. పన్నెండవ శతాబ్ధానికి చెందిన నాజూకుగా చెక్కబడిన వేణుగోపాల స్వామి విగ్రహం చాలా బాగుంది. క్యూరేటర్‌కానీ, గైడ్‌కానీ అందుబాటులో ఉంటే సమాచారం వివరంగా తెలుసుకోవడానికి బాగుండుననిపించింది.
క్రీ.శ. 3వ శతాబ్ధం నాటి బుద్దుడి విగ్రహం ఉంది. బయట ఉంచిన వాటిలో ఇదే అత్యంత పురాతనకాలం నాటిది. లోపల ఇంకా ప్రాచీనమైనవి ఉన్నాయేమో తెలియదు.
మ్యూజియం లోపల పురాతనమైన తాళపత్ర గ్రంధాలు; శాతవాహనులు, కుషాణులు, విజయనగర రాజులు, మొఘలాయిల కాలాల్లో చలామణీలో ఉన్న నాణాలు; ముఖ్యంగా తెలుగు లిపిలో క్రమాణుగతంగా వచ్చిన మార్పులు తెలియజేసే డిస్‌ప్లేబోర్డ్ ఉందట. వాటిని ప్రస్తుతానికి చూడలేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది.
ఈ మ్యూజియంను కొంచెం అభివృద్ది చేసి, ప్రచారం కల్పిస్తే మన సంస్కృతి, చరిత్ర గురించి తెలుసుకోవాలనుకొనే వాళ్ళకి బాగుంటుంది. చక్కని టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది.
ఎప్పుడైనా రాజమండ్రీ వెళ్ళినప్పుడు రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం సందర్శించండి. శుక్రవారం, పబ్లిక్ హాలిడెస్ తప్పించి మిగిలిన రోజుల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలవరకూ మ్యూజియం తెరిచి ఉంటుంది.
© Dantuluri Kishore Varma
చాలా మంచి సమాచారాన్ని,ఫోటోల్ని ఇచ్చారు.ఇలాంటి అంశాలు మరింత వెలుగు లోకి రావలసిన అవసరం ఎంతైనా ఉంది.ఓసారి మాలతీ చందూర్ అంటే ఏదో అనుకున్నాను గాని నిజమే..మన తెలుగువారికి తెలిసిన కల్చర్లు రెండేనేమో .. ఒకటి సినిమా కల్చర్ ఇంకొకటి అగ్రికల్చర్..!అభినందనలు వర్మ గారు..!
ReplyDeleteచరిత్రపుస్తకాల్లో మనం చదివిన మనుషులు నిజంగానే రక్తమాంసాలతో ఈ భూమిమీద తిరిగిన వాళ్ళేనని ఇటువంటి మ్యూజియంలకి వెళ్ళినప్పుడు నమ్మకం కలుగుతుంది. ఒక ఆథెంటిసిటీ వస్తుంది. మీరు కోట్ చేసిన దానిలో కొంత వరకూ నిజం ఉంది. మీ అభిప్రాయాన్ని పంచుకొన్నందుకు ధన్యవాదాలు మూర్తిగారు.
Deleteమంచి సంగతిని తెలియచేసినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteమీకు నచ్చినందుకు చాలా సంతోషం తృష్ణగారు. :)
Delete