ఇలాగే చెట్టుమొదలుకి కాడిని ఆనించి కట్టిన గుర్రబ్బండి
- గూడు ఉన్నది
చిన్నప్పటి దాగుడుమూతలాటల్లో ఫేవరెట్ హైడింగ్ ప్లేస్.
దొంగకి దొరకకుండా ఊపిరి బిగబట్టి
వొదిగి కూర్చున్నప్పుడు...
బుగ్గన పెట్టుకొని చప్పరించడానికి
చాక్‌లేట్ బిళ్ళో, తాటి తాండ్ర ముక్కో..
ఉంటే ఆట మరింత మజాగా ఉండేది.
ఆగిపోయిన బండి చక్రం
రోడ్డువార కొబ్బరి చెట్టుకి జారబెట్టినది
ఏమి చేస్తుందీ అంటే?
జ్ఞాపకాలని కాలంలో వెనక్కి
పరుగులు పెట్టిస్తుంది.
చిన్నప్పుడు ఎక్కిన బళ్ళు
తిరిగిన ఊళ్ళూ
లయబద్దంగా వినిపించిన గిట్టల చప్పుళ్ళు..
మాంచి హుషారు మీదున్న కోడెగిత్తల్ని
బరువు తక్కువ ఉన్న ఇలాంటి బండికి కడితే
`పరుగులు తియ్యాలి...
గిత్తలు ఉరకలు వెయ్యాలి,` అని
ఎక్కడికైనా అఘమేఘాలమీద
వెళ్ళిపోయేవారు... కదూ?
కాలాన్ని చక్రంతో పోలుస్తారు.
ఈ రోజు పైన ఉన్నది
కొంతకాలానికి క్రిందకు వెళుతుంది
అప్పుడు క్రిందకు పోయినది
పైకి రాక తప్పదుకదా?
`మళ్ళీ గుర్రపుబళ్ళ రోజులు తిరిగి వస్తాయా!?`
అన్నటు ఆశగా చూస్తున్నట్టు ఉంది కదూ?
ఈ ఊరిచివర గడ్డిమేస్తున్న ఖాళీ గుర్రం.
ఎక్కడెక్కడికో వెళుతున్నప్పుడు
కనిపించే ఇలాంటి దృశ్యాలని
నా డిజిటల్ కెమేరాతో క్లిక్‌మనిపిస్తాను.
కాలం కొమ్మన వేలాడుతూ
ఎప్పుడెప్పుడు రాలిపోదామా
అన్నట్టుండే పాతకాలపు జ్ఞాపకాలు..
గుర్రపు బళ్ళు, బండి చక్రాలు
నెమరేసే గుర్రాలు... ఇక్కడ పంచుకోవడం..
మీ కోసం!
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment