చదువంటే, విజ్ఞానసముపార్జన అంటే అనాసక్తి ఉన్నవాళ్ళు హ్యుయాన్‌త్సాంగ్ (Hsuan Tsang AD 602 - 664) గురించి తెలుసుకోవాలి. ఈయన మనజాతీయుడు కాదు - చైనా దేశస్తుడు. కాశ్యప మాతంగ అనే బౌద్ధ సన్యాసి క్రీస్తుశకం ఒకటవ శతాబ్దంలో భారతదేశం నుంచి చైనాకి వెళ్ళి బౌద్ధమతం గురించి ప్రచారం చేసినది మొదలు చైనీయులకి భారతదేశంమీద గొప్ప ఆసక్తి నెలకొంది. ఇక్కడి విజ్ఞానాన్ని జుర్రుకోవాలని తపన పెరిగింది. అలా బుద్దుడు నడిచిన ప్రదేశాలని చూడాలని, ఆయన బోధనలని మరింత సమగ్రంగా తెలుసుకోవాలని, అప్పటికే విశ్వవ్యాప్తంగా అత్యంత గొప్పదిగా పేరుగాంచిన నలందా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాలని అభిలాషతో క్రీస్తుశకం ఏడవ శతాబ్దానికి చెందిన హ్యుయాన్‌త్సాంగ్ భారతదేశానికి ప్రయాణం అయ్యాడు. అప్పట్లో చైనా నుంచి ఇతరదేశాలకు వెళ్ళడం చట్టవిరుద్ధం. రహస్యంగా సరిహద్దులు దాటి పోవాలి. ఈ ప్రయత్నంలో పట్టుబడితే ప్రాణాలకే ముప్పు. మోటారువాహనాలు, ఏరో్‌ప్లెయిన్లూ లేని కాలం. రోజుల తరబడి మంచినీళ్ళు దొరకని ఏడారుల్లో గుర్రమ్మీద వొంటరిగా ప్రయాణం, గాలి దుమారాలు, ఇసుక వర్షం, బందిపోటు దొంగలు, మంచు పర్వతాలు... వీటన్నింటితో పాటూ రాత్రిపూట దెయ్యాలు, ప్రేతాలు ఆకాశంలో మంటలు పుట్టించేవట. ఇటువంటి కష్టసాధ్యమైన ప్రయాణం చెయ్యడానికి ఎంతో గుండెనిబ్బరం ఉండాలి. ధైర్యం కోల్పోయి మధ్యలోనే వెనుదిరిగి పోవాలనే ఆలోచన హ్యుయాన్‌త్సాంగ్‌కి ఎప్పుడూ కలగలేదు.
ప్రయాణ మార్గంలో ఉన్న టర్పాన్ అనే ప్రాంతపు రాజుగారు హ్యుయాన్‌త్సాంగ్‌ని సాదరంగా ఆహ్వానిస్తాడు, ఆ రాజ్యంలో ఉన్న బౌద్ధ దేవాలయానికి అధిపతిగా చేస్తానని, అక్కడే ఉండిపోవాలని కూడా కోరతాడు. ఆవిధంగా చెయ్యడానికి హ్యుయాన్‌త్సాంగ్‌కి సమ్మతమైతే ఆతనికి సకల సౌకర్యాలూ కల్పించడానికి రాజు సిద్దమే. కానీ హ్యుయాన్‌త్సాంగ్ లక్ష్యం అది కాదు కనుక రాజు చేసిన అభ్యర్థనని నిరాకరిస్తాడు. రాజు ఒత్తడి చేస్తాడు. ప్రతిపాదనని అంగీకరించకపోతే తిరిగి చైనాకి పంపిస్తానని బెదిరిస్తాడు. ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాంటి పరిస్థితి. తిరిగి స్వదేశానికి పంపబడితే శిక్ష తప్పదు, టర్పాన్ దేశంలో ఉండిపోతే లక్ష్యం నెరవేరదు. ఏం చెయ్యాలి!? ఆహార పానీయాలు తీసుకోవడం మాని వేశాడు. మూడు రోజుల పాటు కటిక ఉపవాసం చేశాడు. తనని ముందుకు పోనీయక పోతే అలానే ప్రాణత్యాగం చేస్తానని రాజుని తిరిగి బెదిరించాడు. మొండివాడు రాజు కంటే గొప్ప అనే సామెత నిజమయ్యింది. హ్యుయాన్‌త్సాంగ్‌కి ఉన్ని బట్టలు, ప్రయాణానికి కావలసిన ధనం ఇచ్చి టర్పాన్ రాజు సాదరంగా సాగనంపాడు.
హ్యుయాన్‌త్సాంగ్ ప్రయాణించిన మార్గం |
ఇలాంటి ఎన్నో కష్టనష్టాలని ఎదుర్కొని హ్యుయాన్‌త్సాంగ్ కాశ్మీరు చేరాడు. కనౌజ్‌ని రాజధానిగా చేసుకొని హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలం అది. బుద్ధుడు జన్మించిన కపిలవస్తు నగరం చూశాడు, బుద్ధ గయని సందర్శించాడు, సారానాథ్ వెళ్ళాడు... ఇంకా గౌతమబుద్ధుడు నడిచిన ప్రదేశాలెన్నో తిరిగాడు. ఆంధ్రదేశం మీదుగా ధ్రావిడ దేశానికి వెళ్ళాడు. చివరగా నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్య శీలభద్రుడు అనే ఆయన దగ్గర చాలా కాలం విద్యను అభ్యసించాడు. భాతదేశంలో వివిధప్రాంతాల గురించి, ప్రజల ఆచార వ్యవహారాల గురించి, జీవన విధానం గురించి వివరంగా రాశాడు. ఆ కాలం గురించి ఇప్పటికీ హ్యుయాన్‌త్సాంగ్ రాసిన యాత్రా విశేషాలే ప్రామాణికమైన చారిత్రక ఆధారంగా ఉన్నాయి. సుమారు పదహారు సంవత్సరాల తరువాత, వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆరువందల పైచిలుకు బౌద్ధ గ్రంధాలు, బుద్ధుని గంధపు ప్రతిమలు, కొన్ని తదాగతుని వస్తువులు తీసుకొని చైనా వెళ్ళాడు. దేశంలో హ్యుయాన్‌త్సాంగ్‌కి అపూర్వ స్వాగతం లభించింది. రాజాస్థానంలో ఉన్నత పదవిని అలంకరించమని చక్రవర్తి అతనిని కోరాడు. కానీ హ్యుయాన్‌త్సాంగ్ తన వెంట తీసుకొనిపోయిన గ్రంధాలను జీవితాంతం చైనా భాషలోనికి అనువదిస్తూ గడిపాడు.
రాజ పదవిని స్వీకరించి ఉంటే హ్యుయాన్‌త్సాంగ్ జీవితం అష్టైష్వర్యాలతో నిండిపోయి వుండేది. కానీ బౌద్ధ గ్రంధాలని అనువాదం చేసి ఒక లెజండ్‌గా జనహృదయాలలో నిలచిపోయి ఉండేవాడుకాదు.
లక్యాన్ని నిర్ణయించుకోవడం (Goal Setting)
దాన్ని చేరుకోవడానికి కష్టపడి ప్రయత్నించడం (Hard Work)
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకే సాగడం (Perseverance)
అంతిమంగా లభించే చిన్న చిన్న ఫలితాలకు ప్రలోభ పడక పోవడం (Never to Swerve From Main Goal)
విజయాన్ని అందుకోవడం (Attaining Success)
విజయపు దారిలో ఈ ఐదు స్థాయిలకీ హ్యుయాన్‌త్సాంగ్ జీవితం ఒక చారిత్రక ఉదాహరణ.
రాజ పదవిని స్వీకరించి ఉంటే హ్యుయాన్‌త్సాంగ్ జీవితం అష్టైష్వర్యాలతో నిండిపోయి వుండేది. కానీ బౌద్ధ గ్రంధాలని అనువాదం చేసి ఒక లెజండ్‌గా జనహృదయాలలో నిలచిపోయి ఉండేవాడుకాదు.
లక్యాన్ని నిర్ణయించుకోవడం (Goal Setting)
దాన్ని చేరుకోవడానికి కష్టపడి ప్రయత్నించడం (Hard Work)
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకే సాగడం (Perseverance)
అంతిమంగా లభించే చిన్న చిన్న ఫలితాలకు ప్రలోభ పడక పోవడం (Never to Swerve From Main Goal)
విజయాన్ని అందుకోవడం (Attaining Success)
విజయపు దారిలో ఈ ఐదు స్థాయిలకీ హ్యుయాన్‌త్సాంగ్ జీవితం ఒక చారిత్రక ఉదాహరణ.
© Dantuluri Kishore Varma
మంచి సమాచారం చదివాను. ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్నాను.
ReplyDeleteధన్యవాదాలు రాంకుమార్ గారు.
Delete