Pages

Saturday, 31 January 2015

కాలువ గట్టు మీద...

ఇది ఏ ఊరు?

ఏ ఊరయితే ఏమిటి? చూడండి కాలువ గట్టు ఎంత బాగుందో? 

చూస్తున్నా! చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ సీతాకోక చిలుకల్లా ఎగిరి వస్తున్నాయి. స్నేహితులతో కలిసి గంటలు, గంటలు కాలువలో ఈత కొట్టేవాళ్ళం తెలుసా? ఓ సారి సుబ్బారావు నీళల్లోకి దిగిన తరువాత వాడి బట్టలు దాచేసాం. చాలా సేపు వెతుక్కొని, ఇమ్మని బ్రతిమాలి, లాభం లేక రెండు అరిటాకులు అడ్డం పెట్టుకొని ఊళ్ళోకి ఒకే పరుగు పెట్టాడు. ఆ సంఘటన తలచుకొంటే ఇప్పటికీ నవ్వు ఆగదు.      
ఇలాంటి కాలువే మావూళ్ళోది కూడా. అవతలి గట్టుకి వెళ్ళడానికి బల్ల కట్టు ఉండేది. పొడవైన వెదురు కర్రని నీటి అడుగుభాగానికి గుచ్చి బల్లకట్టుని ముందుకి నెట్టేవారు. గట్టు మీదే ఓ గుడిసెలో కుటుంబంతో పాటూ బల్లకట్టు పోలయ్య ఉండేవాడు. మోతుబర్లందరూ పెద్దపండగలప్పుడు పొలంలో పనిచేసే పాలేర్లతో పాటూ పోలయ్యకి కూడా వడ్లు కొలిచేవారు. 
చల్లని చెట్టు నీడలో నీళ్ళని చూస్తుంటే వాటిలోకి దిగాలని అనిపించడం లేదూ? దోసిటితో నీళ్ళు తీసుకొని ముఖంమీద చిలకరించుకొంటే ఎంత బాగుంటుందండీ అసలు!? కానీ, దిగుదామంటే  షూ తడిచిపోతుంది. బట్టలు మురికై పోతాయి. చిన్నప్పుడు అవేమీ పట్టించుకొనే వాళ్ళం కాదు. కలువపువ్వుల కోసం పోటీలుపడి మరీ నీటిలోకి దిగేసేవాళ్ళం. 
ఎవరో పశువుల కోసం గడ్డి కోసుకొంటున్నట్టున్నారు. 
ఇతను చూడండి అడ్డుకట్ట మీద నుంచి తలమీద అంత బరువుతో అడుగు తడబడకుండా ఎలా చకచక మని నడిచేస్తున్నాడో.    
కాలువ కొంచెం ఇరుకుగా ఉన్న చోట ఆ గట్టునుంచి, ఈ గట్టుకి అడ్డంగా సగానికి చెక్కిన ఒకే ఒక తాటి మాను ఇలానే వేశారు మా కాలువ గట్టున కూడా. అలవాటు ఉంటే కానీ దాన్ని దాటలేం. మాఊరి మునసబు గారి మేనల్లుడు ఓ సారి పట్నం నుంచి వస్తూ  తాటిపట్టి మీదనుంచి దాటడానికి కొంచెం సంశయిస్తున్నాడు. అదిగో సరిగ్గా అప్పుడు జూనియర్ కాలేజికి వెళుతున్న అమ్మయిలు అవతలి గట్టుమీదకి వచ్చారు. వాళ్ళల్లో మునసబుగారి అమ్మాయి కూడా ఉంది. పట్నం బావ తటపటాయింపు చూసి ముసిముసినవ్వులు నవ్వింది. మనోడికి అవమానంగా అనిపించింది. ధైర్యంగా ముందడుగు వేశాడు.  కాలు తడబడింది. దబ్బున కాలువలో పడ్డాడు. అమ్మాయిల నవ్వులు ఎగసిపడిన నీటి తుంపరలు అయిపోయాయి.
వరిచేలు, కొబ్బరిచెట్లూ భలేగా ఉన్నాయి మాష్టారు. ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతదూరమైనా నడిచేయ్యొచ్చు. 
ఇక్కడ చూడండి. ఈ కాలిబాట వెంట అలా వెళ్ళామనుకోండి కళ్ళాం వస్తుంది. సరిగ్గా చూడండి చిన్న దిమ్మలా కనిపిస్తుంది. దాన్లో ఒక పాక కూడా ఉంది. వరిచేలు కోసేసిన తరువాత ఆరబెట్టి, తరువాత కుప్ప నూర్పుళ్ళు చేస్తారు. పూర్వం ఎడ్లబళ్ళతో నూరిస్తే, ఇప్పుడు ట్రాక్టర్లు, వరినూర్పు యంత్రాలు ఉపయోగిస్తున్నారు. నూర్పుళ్ళు అయిన తరువాత, ధాన్యాన్ని ఎగరబోసి బస్తాల్లో కట్టేస్తారు. రైతులు ఈ పనులన్నీ  కళ్ళాల్లోనే చేసుకొంటారు.  
చింత లేకుండా ప్రశాంతంగా పనిచేసుకొనే ఈ మనుష్యులని చూస్తే ఈర్ష్యగా ఉంటుంది మాష్టారు. మీరేమంటారు?
దూరపు కొండలు నునుపు. మనం `స్ట్రెస్సో!` అని ఓ ప్రక్కనుంచి గోల పెడుతుంటే, ఉద్యోగాలు వెతుక్కొని ఇక్కడి వాళ్ళు పట్టణాలకి వలసపోతున్నారు. ప్రశాంతతని చూసి ముచ్చట పడతాం కానీ, `మా పొలం పనులు మీకిచ్చేస్తాం, మీ ఉద్యోగాలు మాకిచ్చేస్తారా?` అని ఇక్కడి వాళ్ళు అడిగితే మనం ఏం చెపుతాం!?
నామాట అలా ఉంఛండి. మీరయితే ఏమి చేస్తారు?

© Dantuluri Kishore Varma

Thursday, 29 January 2015

నడిచే ఆనందం

మణిరత్నం గీతాంజలి సినిమాలో `ఆమనీ పాడవే కోయిలా..` అని హీరోగారు పాడుకొంటూ వెళుతుంటే పాటతో పాటు వినిపించే సంగీతం, కనిపించే దృశ్యం మనసుని కట్టి పడేస్తాయి. మంచుకురిసే ఉషోదయాల్లోనో, చలి గిలిగింతలు పెట్టే సాయంకాలాల్లోనే అలాంటి ప్రకృతిలో నడిచే అదృష్టం ఎంతమందికి ఉంటుంది?  హిల్ స్టేషన్లలోనో, పచ్చని పల్లెటూళ్ళలోనో ఉండేవాళ్ళ సంగతి ప్రక్కన పెడితే కాకినాడలోనో, హైదరాబాదులోనో.. అలాంటి మరో పట్టణంలోనో నివశించే వాళ్ళకి స్వచ్చమైన గాలి పీల్చుకొనే అవకాశమే గగనం అయిపోతుంది. అయితే ఎప్పుడైనా పార్కులకి వెళితే మాత్రం కొంతలో కొంత ఆనందం.
జన్మభూమి పార్క్, కాకినాడ 
హెన్రీ డేవిడ్ థోరో గురించి ఎప్పుడైనా విన్నారా? ఈయన వాల్డెన్ అనే సరస్సు ప్రక్కన తన స్వహస్తాలతో ఒక చిన్న కేబిన్ నిర్మిచుకొని రెండు సంవత్సరాలు ప్రకృతితో సహజీవనం చేసాడు. తన అనుభవాలని వాల్డెన్ అనే పుస్తకంలో రాశాడు. థోరో ఆలోచనలు కొన్ని మహాత్మా గాంధీని ప్రభావితం చేశాయని చెపుతారు. నడవడం గురించి థోరో ఏమంటాడో తెలుసా?  `నా కాళ్ళు నడవడం మొదలు పెట్టడంతోనే, నా ఆలోచనలు ప్రవహించడం మొదలవుతాయి,` అని. ఉదయం నడిచే నడక ఒక వరం లాంటిదని కూడా అంటాడు. 

నీటికి సమీపంలో, నీడనిచ్చే వృక్షాల క్రిందనుంచి, మెత్తటి పచ్చికమీద, తలలూపే మొక్కల మధ్య అలా అలా నాలుగడుగులు వేస్తే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. మొక్కలూ, చెట్లూ, ప్రవహించే నీరూ నెగిటివ్ ఎనర్జీని పీల్చుకొంటాయట. అందుకే ధ్యానం చేసుకొన్నప్పుడు ఎలాంటి ప్రశాంతత లభిస్తుందో ప్రకృతిలో గడిపినప్పుడు కూడా అటువంటి ప్రశాంతతే కలుగుతుంది. దానికి తోడు సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. ప్రకృతిలోకి వెళ్ళడం అంటే మనసులోనికి వెళ్ళడమే అని ఒక పెద్దాయన అంటాడు. దీనిలో ఎంతో నిజం ఉంది. సుర్యరశ్మిని ఆకులు పీల్చుకొన్నట్టు, ఆనందాన్ని మనసు పీల్చుకొంటుంది. 
పొలం గట్లమీద, పచ్చిక మైదానాల్లో, అడవి దారుల్లో, కొండవాలుల్లో నడిచే అవకాశం రోజూ రాకపోవచ్చు.. కానీ ఎప్పుడైనా పార్కుల్లో అయినా నడవచ్చు కదా?  ప్రకృతిలో నడుస్తుంటే మనతో పాటూ ఆనందం నడుస్తున్నట్టే!

© Dantuluri Kishore Varma

Tuesday, 27 January 2015

అతను భగవధ్గీతను చదివుంటే...

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సువ:
మామకా: పాణ్డవాశ్చైవా కిమకుర్వత సంజయ.

`యుద్ధం చెయ్యడానికి సన్నద్దులైన పాండవులూ, కౌరవులూ కురుక్షేత్రంలో ఏమిచేశారు?` అని దృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు. భగవద్గీతలోని అర్జున విషాదయోగంలో మొట్టమొదటి శ్లోకం ఇది. సంజయుడు కురుక్షేత్ర మహాసంగ్రామానికి వ్యాఖ్యాత. చూసినది చూసినట్టు దృతరాష్ట్రునికి విన్నవిస్తున్నాడు. ఇరుపక్షాల సైన్యాలూ రణరంగంలో మోహరించి ఉన్నాయి. దుర్యోధనుడు తమ పక్షం వారు, ఎదుటి పక్షపు వీరులతో సమవుజ్జీలుగా ఉన్నారని సేనానాయకుడైన ద్రోణాచార్యుడితో చెపుతాడు. అప్పుడు భీష్మాదులు బిగ్గరగా శంఖారావాలు చేసి యుద్దానికి తయారుగా ఉన్నామని సన్నద్ధత  వ్యక్తం చేస్తారు. 

పాండవ పక్షం నుంచి అర్జనుని రధసారధి శ్రీకృష్ణుడు పాంచజన్యాన్నీ, అర్జునుడు దేవదత్తాన్నీ, ధర్మరాజు అనంతవిజయాన్నీ, భీముడు పౌండ్రాన్నీ, నకులుడు సుఘోషాన్నీ, సహదేవుడు మణిపుష్పకాన్నీ పూరిస్తారు. ఇవన్ని వాళ్ళ వాళ్ళ శంఖాల పేర్లు. ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. అప్పుడు  కృష్ణుడితో అర్జునుడు- 

సేనయోరుభయోర్మధ్యే రధం స్థాపయ మేzచ్యుత.

అంటూ తన రధాన్ని ఇరుపక్షాలమధ్యా నిలుపమని చెపుతాడు. ఇరువైపులా ఉన్న వీరులను చూస్తాడు. వారిలో గురువులు, తాతలు, తండ్రులు,  కొడుకులు, అన్నదమ్ములు, మనుమలు, మేనమామలు, స్నేహితులు ఉన్నారు. `వీరితోనా నేను యుద్ధం చెయ్యబోతున్నది!` అనే తలంపు అర్జునుడ్ని ఒక్క క్షణంలో నిర్వీర్యుడిని చేసింది. స్వజనులను చంపి ఎవరైనా సాధించేది ఏముంటుంది?    


నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా.  

వైరాగ్యం ఆ మహావీరుడ్ని ఆవహించింది. `రాజ్యంతోనూ, అది సమకూర్చే సుఖాలతోనూ మనకేమిటి అవసరం? అవేవీ నాకు అక్కర్లెద్దు,` అంటున్నాడు అర్జునుడు.  స్వజనాపేక్ష చేత అర్జునుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యాడు. ఈ లోపం `నా అయుదాల్ని విడిచిపెడుతున్నాను. ఈ యుద్దరంగంలో కౌరవులు నన్ను సంహరించినా కూడా మంచిదే,` అనేంతవరకూ అర్జునుడ్ని తీసుకొని వెళ్ళింది. తన నిర్ణయాన్ని సమర్ధించుకోవడానికి కౌరవులను చంపడంవల్ల పాపం కలుగుతుందని, నరకానికి పోతామని, వంశం నాశనం అవుతుందని.. ఎన్నో సాకులు చెపుతాడు.  కొండను తవ్వి వజ్రాన్ని వెలికితీసినట్టు, అపోహలను తొలగించి అర్జునుడిలో వజ్రసంకల్పాన్ని శ్రీకృష్ణుడు కల్పించకపోతే పాండవ మధ్యముడు కోరుకొన్నట్టే దుర్యోధనాదులు విజయాన్నీ, రాజ్యాన్ని పొంది వుండేవారు.

ఇప్పుడు భగవధ్గీతను విడిచిపెట్టి కొంచెం పశ్చిమంగా వెళ్ళి షేక్స్పియర్ రాసిన విషాదాంత నాటకం హేంలెట్‌లో ఏమయ్యిందో చూద్దాం. హేంలెట్ డెన్‌మార్క్ యువరాజు. అతని పినతండ్రి క్లాడియస్ హేంలెట్ తండ్రిని  చంపి రాజు అవుతాడు. అంతేకాకుండా వదినగారిని పెళ్ళాడి తన రాణిని చేసుకొంటాడు. ఓ వెన్నెల రాత్రి చంపబడిన రాజు ఆత్మ తన కొడుకు హేంలెట్‌కి కనిపించి జరిగిన కుట్రగురించి చెపుతుంది. ప్రతీకారం తీర్చుకోమని కోరుతుంది. `ఆత్మ చెప్పిన విషయం నిజమా, కాదా?` అనే సందేహంలో పడతాడు హేంలెట్. ఒక నాటక బృందాన్ని పిలిచి తన తండ్రిని చంపిన కుట్రని పోలిన సన్నివేశంతో ఓ నాటకాన్ని రాజమహల్లో వేయిస్తాడు. నాటకాన్ని చూస్తూ కళవెళ పడిన పినతండ్రి క్లాడియస్‌ని గమనించిన హేంలెట్‌కి తండ్రి ఆత్మ చెప్పిన విషయం నిజమే అని నిర్ధారణ అవుతుంది. క్లాడియస్ తత్తరపాటులో ఉన్నాడు. ఆ క్షణంలోనే హేంలెట్ అతనిని సంహరించాలి. అలాగే చేసి ఉండాలని విమర్శకులు ఇప్పటికీ నొక్కి వొక్కాణిస్తున్నారు. అర్జునుడిలో స్వజనాపేక్షలాగ హేంలెట్‌లో ఇండెసిసివ్‌నెస్(ఏదైనా పని చెయ్యడమా, మానడమా అనే ఊగిసలాట) అనే లోపం ఉంది. అయితే దురదృష్టవశాత్తూ కృష్ణుడిలాంటి కౌన్సిలర్ అతనికి లేక చివరికి తాను చంపబడడమే కాకుండా, తనవాళ్ళందరూ దుర్మరణం పొందడానికి కారణం అవుతాడు. 

ఉదయం మేల్కొన్న దగ్గరనుంచీ, రాత్రి నిద్రపోయేవరకూ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ప్రతీపనికీ రెండు ఆప్షన్‌లు ఉంటాయి - చెయ్యడం, చెయ్యకపోవడం అనేవి.  చిన్న పనులని ప్రక్కన పెడితే ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో చెయ్యవలసిన పనిని చెయ్యక పోవడం వల్ల, చెయ్యకూడని పని చెయ్యడం వల్లా అపారమైన నష్టం కలిగే అవకాశం ఉంది. సభావేదికమీద మన అభిప్రాయాలని చెప్పవలసి వచ్చినప్పుడు తప్పు మాట్లాడితే జనాలు నవ్వుతారని వెనకడుగు వేస్తాం; నష్టం వస్తుందేమో అనే సందేహంతో మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా ఊరుకొంటాం; పోటీని చూసి భయపడి పరీక్షల్లో పూర్తి సామర్ద్యాన్ని ప్రదర్శించలేకపోతాం; సమయం, డబ్బూ అందుబాటులో ఉన్నా సినిమాలు, స్నేహితులూ లాంటి ఆకర్షణల్లో పడి ఉద్యోగానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి నైపుణ్యాలని మెరుగు పరచుకోవడానికి బద్దకిస్తాం. చూశారా మన లోపాలు విజయావకాశాలని ఎలా దెబ్బతీస్తున్నాయో!  

హేంలెట్ భగవధ్గీతను చదివుంటే ఏమయ్యేది? ఈ షేక్స్పియర్ నాటకం సుఖాంతమయ్యేదా? నిజానికి ఎక్కడో భారతదేశంలో పుట్టిన గీతని డెన్మార్క్ యువరాజు చదివే అవకాశం లేనేలేదు కాబట్టి ఈ ఊహని కొంచంసేపు ప్రక్కన పెట్టి మనదగ్గరకి వద్దాం. `మోహంలో పడకుండా సరైన సమయంలో సరైన పని చెయ్యి,` అని భోధించిన గీత మనకేమైనా ఉపయోగపడుతుందంటారా? 

© Dantuluri Kishore Varma

Thursday, 22 January 2015

ఎ పాసేజ్ టు ఇండియా

పంతొమ్మిదివందల ఇరవై నాలుగులో ప్రచురితమైన ఎ పాసేజ్ టు ఇండియాని ఆంగ్లభాషలో వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటిగా ఇప్పటికీ పరిగణిస్తారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతున్న కాలం నాటి కథ. కానీ ఇందులో చరిత్ర లేదు. జాతుల మధ్య విరోధాన్ని ఓ సంఘర్షణ నేపద్యంలో రచయిత చక్కగా ఆవిష్కరించాడు. ఒకవైపు ఆంగ్లేయులు, మరొకవైపు భారతీయులు - మళ్ళీ భారతీయుల్లోనే వివిధ మతాల వాళ్ళు, కులాల వాళ్ళు పాత్రలుగా అద్భుతమైన విశ్లేషణ చేశాడు. రచయిత ఆంగ్లేయుడైనప్పటికీ వలసపాలన మీద ఏహ్యత ప్రస్పుటంగా తెలుస్తుంది. పాత్రల మానసిక విశ్లేషణ, దృక్కోణం అబ్బుర పరుస్తాయి. నవలలో తాత్విక చింతన కూడా బాగా ఉంటుందని చెపుతారు. అయితే ఆ దృష్టితో ఈ నవలని నేను పరిశీలించలేకపోయాను. మరొక సారి మళ్ళీ చదివినప్పుడు ఆ విషయాలు అర్థమౌతాయేమో!

కథ చంద్రపూర్ అనే ప్రాంతంలో జరుగుతుంది. బీహార్లో పాట్నా దగ్గర ఉన్న బంకీపూర్ అనే ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని  రచయిత ఎడ్వార్డ్ మోర్గాన్ ఫోస్టర్ (E.M. Forster) సృష్టించిన చిన్న పట్టణం ఇది.  చంద్రాపూర్ గంగానది వొడ్డున ఉంటుంది. అయినప్పటికీ జనాలు నదిలో దిగి స్నానం చెయ్యడానికి ఒక్క స్నానఘట్టం కూడా ఉండదు. వొడ్డు పొడవునా నదిని కప్పేస్తూ నిర్మించిన ఇరుకు బజార్లు, అవి వేసే చెత్త... చెదారం... నదిని అపవిత్రంగా మార్చేశాయి. చంద్రపూర్‌లో విశాలమైన రోడ్లు లేవు, అందమైన దేవాలయాలు లేవు.. చూడవలసిన ప్రదేశాలని చెప్పుకోవడానికి ఏమీ లేవు - ఊరికి సమీపంలోని మరాబార్ గుహలు తప్ప. (బరాబర్ గుహలకి రచయిత ఇచ్చిన పేరు మరాబార్ అని అంటారు). ఊరి బజార్లలో, భారతీయుల ఇళ్ళల్లో సౌందర్యం అనేది వెతికినా కనపడదు. కానీ నదికి సమాంతరంగా వేసిన రైల్వే లైనుకి అవతల కొంచెం ఎత్తుమీద ఉన్న ఆంగ్లేయుల నివాస ప్రాంతం - సివిల్ స్టేషన్ తీర్చిదిద్దినట్టు ఉన్న వీధులతో, అందమైన భవనాలతో గొప్పగా ఉంటుంది. ఒకే ఊరిలో ఉన్న రెండు భిన్న ప్రపంచాలు ఇవి. ఈ రెండు ప్రాంతాల్లోనూ వరుసగా ఆంగ్లేయులంటే మండిపడే భారతీయులూ,  భారతీయులని హీనంగా చూసే ఆంగ్లేయులు ఉంటారు.  పరిపాలించే జాతికి చెందిన ఆంగ్లేయులుకీ, పరిపాలింపబడుతున్న భారతీయులకీ మధ్య స్నేహం సాధ్యమేనా అనే అంశం నవల ప్రారంభంలోనే చర్చకు వస్తుంది. ఇంగ్లండ్‌లో అయితే సాధ్యమే కానీ భారతదేశంలో మాత్రం కాదని హమీదుల్లా అనే పాత్రచేత రచయిత చెప్పిస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే నవల యొక్క కధాంశం అదే.

నవలలో కథానాయకుడు డాక్టర్ అజీజ్ ఒక ముస్లిం ఫిజీషియన్. చంద్రపూర్ మెజిస్ట్రేట్ రోనీ హీస్లోప్ అనే వ్యక్తి తన తల్లి మిసెస్ మూర్‌ని ఇంగ్లండ్ నుంచి తనకోసం కాబోయే భార్యని తీసుకు రమ్మని కోరడంతో అడెలా క్వెస్టెడ్ అనే అమ్మాయిని వెంట బెట్టుకొని మిసెస్ మూర్ భారతదేశానికి వస్తుంది. వీళ్ళు కాక నవలలో ఇంకా ముఖ్యమైన కొంతమంది ఎవరో చూద్దాం.  సైరిల్ ఫీల్డింగ్ గవర్నమెంట్ కాలేజికి హెడ్‌మాస్టర్. డాక్టర్ అజీజ్‌కి కథాక్రమంలో స్నేహితుడు ఔతాడు; చంద్రపూర్ సిటీ కలెక్టర్ మిష్టర్ టర్టన్, అతని భార్య మిసెస్ టర్టన్; బ్రిటిష్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మిష్టర్ మెక్‌బ్రైడ్; మేజర్ కేలెండర్ అనే హెడ్ డాక్టర్ - ఈయన అజీజ్‌కి పై అధికారి; నారాయణ్ గాడ్‌బోల్ ఒక బ్రాహ్మణ ప్రొఫెసర్; అమృత్‌రావ్, మొహమద్ ఆలీ - ఇండియన్ లాయర్లు. చంద్రాపూర్ సమీపంలోని మరాబార్ గుహలు ఒక పాత్రలాగే కథలో ముఖ్యమైన సంఘర్షణని ప్రవేశ పెట్టడంలో కీలకమైన భూమికను పోషిస్తాయి.

నవల ప్రారంభంలో స్నేహితులతో కలిసి డిన్నర్ పార్టీలో అజీజ్ ఆనందిస్తూ ఉంటాడు. చంద్రపూర్‌లోని ఆంగ్లేయ అధికారుల గురించి, వాళ్ళ భార్యల గురించి ప్రస్థావన వస్తుంది. మధ్యభారత దేశంలో ఒక కాలువ తవ్వుతున్న ప్రోజెక్ట్ విషయమై కలెక్టర్ టర్టెన్ భార్యకి ఒక రాజుగారు బంగారంతో చేసిన కుట్టుమిషన్‌ని లంచం పెడతాడు. కాలువ వాళ్ళ రాష్ట్రం గుండా పోయేలా ఏర్పాటు చెయ్యమని ఆయన విజ్ఞప్తి. పాపం ఆ విజ్ఞప్తిని టర్టన్ నెరవేర్చలేదు. దీనిగురించి అజీజ్ తన స్నేహితులతో అంటాడు, `మన నల్లవాళ్ళం పిచ్చోళ్ళలా లంచం తీసుకొన్న పని పూర్తిచేసి చట్టానికి దొరుకుతాం. కానీ తెల్ల వాళ్ళు మహా తెలివైన వాళ్ళు. ఏ పని కోసం లంచం పట్టారో, దానిని చెయ్యరు కాబట్టి చట్టానికి దొరికే అవకాశమే ఉండదు,` అని. అప్పుడే తన పై అధికారి మేజర్ కేలెండర్ దగ్గరనుండి పిలుపు వస్తుంది. తన అధికారాన్ని చూపించడానికి కావాలనే పిలిచి చక్కని సాయంత్రాన్ని పాడుచేస్తాడని అజీజ్ కేలెండర్‌ని తిట్టుకొంటాడు. ఇదే సమయానికి యూరోపియన్ క్లబ్బులో పార్టీ జరుగుతూ ఉంటుంది. నర్సుగా పనిచేసిన ఓ దొరసాని భారతీయులని చూస్తే తనకి వొంటిమీద తేళ్ళూ, జెర్రులూ పాకినట్టు ఉంటుందని అంటుంది. స్థానిక రోగుల విషయంలో అత్యంత దయగల పని ఏమిటంటే - వాళ్ళ చావు వాళ్ళని చావనివ్వడమే అని కూడా నొక్కి వొక్కాణిస్తుంది.  తెల్లవాళ్ళకి భారతీయులంటే చులకన భావం, భారతీయులకి ఆంగ్లేయులంటే కోపంతో కూడిని ఏహ్యత నవలలో కనిపిస్తుంది. పైకి స్నేహపాత్రంగా కనిపిస్తూ ఉన్నా హిందూ, ముస్లింల మధ్య వైరుధ్యాలు ఉంటాయి. కుల ప్రాతిపధికగా మనుష్యులని తక్కువగా చూడడం ఉంది. భారతీయ సమాజంలో ఉండే సంక్లిష్టతని ఒక ఆంగ్లేయుడైనప్పటికీ రచయిత చక్కగా పట్టుకోగలిగాడు.

మిసెస్ మూర్‌కి డాక్టర్ అజీజ్‌తో యాదృశ్చికంగా పరిచయం ఏర్పడుతుంది. క్లబ్‌లో జరుగుతున్న పార్టీనుంచి, ఉక్కబోత నుంచి బయటపడి వెన్నెల రాత్రిలో మిసెస్ మూర్ దగ్గరలో ఉన్న మసీదులోకి వెళుతుంది. అప్పటికే అక్కడ ఉన్న అజీజ్ ఆమెని చూస్తాడు. `ఇటువంటి పవిత్రమైన ప్రదేశానికి చెప్పులతో వచ్చారా?` అని కోపంగా ఆమెని ప్రశ్నిస్తాడు. కానీ, చెప్పులు బయటే విడిచి పెట్టి వచ్చానని మిసెస్ మూర్ చెపుతుంది. తన తొందరపాటుకు నొచ్చుకొంటాడు. వారిద్దరి మధ్యా కొంత స్నేహపూర్వక సంభాషణ జరుగుతుంది. తరువాత కొన్నిరోజులకి ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాష్టర్ ఫీల్డింగ్ మిసెస్ మూర్‌ని, అడెలా క్వెస్టెడ్‌నీ తన ఇంటికి ఆహ్వానిస్తాడు. అప్పుడు మూర్ అజీజ్‌ని కూడా టీకి పిలవమని ఫీల్డింగ్‌ని కోరుతుంది. డాక్టర్ అజీజ్‌నే ఎందుకు..అంటే... ఇంగ్లీష్ ఆడవాళ్ళిద్దరికీ భారతీయులతో స్నేహంచేసి భారతదేశం గురించి తెలుసుకోవాలనే ఆలోచన ఉంది  - మిసెస్ మూర్ అంతకు కొంతకాలం ముందు డాక్టర్ అజీజ్‌తో యాదృచ్చికంగా మాట్లాడిన సందర్బాన్ని పురస్కరించుకొని అతనిని కూడా ఈ పార్టీకి పిలవమని ఫీల్డింగ్‌ని కోరింది.  ఈ సందర్భంగా అజీజ్‌కి ఫీల్డింగ్‌తో స్నేహం మొదలౌతుంది. అజీజ్ మాటల మధ్యలో వాళ్ళని మరాబార్ గుహల దగ్గరకి పిక్‌నిక్‌కి తీసుకొని వెళతానని వాగ్ధానం చేస్తాడు.

అజీజ్ పిక్‌నిక్‌కి ఏర్పాట్లు చేస్తాడు. మరాబార్ గుహల దగ్గరకి వెళ్ళేవాళ్ళలో మిసెస్ మూర్, అడెల క్వెస్టెడ్, ఫీల్డింగ్ ఆంగ్లేయులు. ప్రొఫెసర్ గాడ్‌బోల్ హిందూ, మిగిలిన వాళ్ళు ముస్లింలు. ఒక్కొక్కరిదీ ఒక్కో సంస్కృతి. వీళ్ళకి భోజన ఏర్పాట్లు చెయ్యడం అజీజ్‌కి కొంత ఆందోళణని కలిగిస్తుంది. తెల్లవాళ్ళకోసం స్పూన్‌లు, నైఫ్‌లు లాంటి కట్లెరీని మొహమ్మద్ ఆలీ నుంచి అరువు తీసుకొని వస్తాడు. వాళ్ళకి బహుశా మందు పుచ్చుకొనే అలవాటు ఉండవచ్చు. ప్రొఫెసర్ గాడ్‌బోల్‌కి కొన్నింటి విషయంలో పట్టింపులు ఉన్నాయి, కొన్నింటిని పెద్దగా పట్టించుకోడు. టీ, స్వీట్లు లాంటివి ఎవరు చేసినా తింటాడు. అన్నం, కూరలూ మాత్రం బ్రాహ్మణుడే  వొండాలి. మాంసం తినడు. కనీసం కేకులని కూడా రుచి చూడడు - వాటిలో గుడ్లు కలుస్తాయి కనుక. గొడ్డు మాంసం ఎవరు తిన్నా సహించడు. కానీ అతని ఉద్దేశ్యంలో తాను తప్ప మరెవరైనా మేక మాంసం కానీ, పంది మాంసం కానీ తినవచ్చు. ఇక అజీజ్ విషయానికి వస్తే జనాలు పంది మాసం తినడం విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. నవలలో ఆసాంతమూ ఇటువంటి క్రాస్-కల్చరల్ విషయాల విశ్లేషణ  ఉంటుంది.

మరాబార్ గుహలు అన్నీ ఒకేలాగ ఉంటాయి. ఐదు అడుగుల ఎత్తు ఉన్న సొరంగం సుమారు ఎనిమిది అడుగుల లోపలికి ఉంటుంది. సొరంగం చివర ఇరవై అడుగుల వ్యాసంతో వర్తులాకారపు గుహ ఉంటుంది. మొదటి గుహ ఎలా ఉంటుందో, నాలుగోది, పద్నాలుగోదీ, ఇరవైనాలుగోది... ప్రతీ గుహా అలాగే ఉంటుంది. రాతిమీద చెక్కుబడికానీ, గుహల దగ్గర పట్టిన తేనె పట్లు కానీ, గబ్బిలాలు కానీ.. అన్నీ ప్రతీ గుహదగ్గరా ఒకేలా ఉంటాయి. ఎవరైనా వాటిని చూసి వచ్చిన తరువాత నచ్చాయా, లేదా అని చెప్పడం కష్టం. అద్భుతం అని వర్ణించడం అసాద్యం. విసుగు పుట్టించే ఒకేరకమైన గుహలు ఎవరికైనా ఉత్సాహాన్ని ఇస్తాయా? మరాబార్ గుహల యొక్క ఇంకొక విచిత్రం ఏమిటంటే - ప్రతిధ్వని. గుహల్లో ఏ చప్పుడు చేసినా, అది గోడల్ని తాకి `భౌం!` అనే పెద్ద శబ్ధంగా మారి, మళ్ళీ మళ్ళీ తరంగితమౌతుంది. ఇటువంటి ప్రతిధ్వనికే మిసెస్ మూర్‌కి మూర్చ వచ్చినంత పనై, మొదటి గుహని సందర్శించిన తరువాత మిగిలిన వాటికి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. ఒక స్థానిక గైడ్ సాయంతో కేవలం అజీజ్, క్వెస్టెడ్‌లు మిగిలిన గుహలని చూడడానికి వెళతారు.   మార్గ మధ్యంలో క్వెస్టెడ్ అజిజ్‌ని `మీకు పెళ్ళయ్యిందా?` అని అడుగుతుంది.  అజీజ్ `అవునని` చెపుతాడు. క్వెస్టెడ్‌కి ముసల్మాన్‌లలో ఉండే భహుభార్యత్వం గురించి తెలుసు. ఆ దృష్టితోనే `ఎంతమందిని చేసుకొన్నారు?` అని అడుగుతుంది. నిజానికి అజీజ్‌కి ఒకేసారి పెళ్ళవుతుంది. వాళ్ళకి ఇద్దరు బిడ్డలు కలిగిన తరువాత భార్య మరణిస్తుంది. ఆమె అంటే ప్రేమతో మరొక వివాహానికి మొగ్గుచూపడు. ఈ నేపద్యంలో క్వెస్టెడ్ అడిగిన ప్రశ్న అతనిని కొంచెం నొచ్చుకొనేలా చేస్తుంది.  తను నొచ్చుకొన్న విషయాన్ని క్వెస్టెడ్ దగ్గర వ్యక్తం చెయ్యకుండా, ఆమెనుంచి కొంతదూరం వెళ్ళి ఓ సిగరెట్ కాలుస్తూ సాధారణ స్థితికి రావడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలోనే క్వెస్టెడ్ గైడ్‌ని కూడా విడిచిపెట్టి ఓ గుహలోనికి వెళ్ళిపోతుంది. ఏ గుహలోనికి వెళ్ళిందో గైడ్‌కూడా సరిగా గమనించడు. ఆమెని వొంటరిగా  విడిచిపెట్టినందుకు అజీజ్ కోపంగా గైడ్‌ని కొట్టడంతో, వాడు అక్కడినుంచి పారిపోతాడు. అజీజ్ ఆమెని పిలుస్తూ ఎన్ని గుహలు వెతికినా ఉపయోగం ఉండదు.  ఇంతలో కొండదిగువన మోటార్‌కార్ శబ్ధం వినిపిస్తుంది. క్వెస్టెడ్ కారులో వెళ్ళిపోవడం అతను కొండ పైనుంచి గమనిస్తాడు. పిక్నిక్ నుంచి మిగిలినవాళ్ళు అందరూ రైలులో చంద్రపూర్ తిరిగి రావడంతోనే క్వెస్టెడ్ పైన అత్యాచార ప్రయత్నం చేశాడనే అభియోగంతో అజీజ్‌ని పోలీసులు నిర్భందిస్తారు.

అజీజ్ తప్పుచేసి ఉండడని ఫీల్డింగ్ బలంగా నమ్ముతాడు. ఆంగ్లేయుల్లో అతనొక్కడే అజీజ్ పక్షం. అజీజ్ తరపున కోర్టులో వాదించడానికి హమీదుల్లాతో పాటూ అమృతరావ్ అనే హిందూ వకీల్‌ని కూడా ఏర్పాటు చేసుకొంటారు. తీర్పుచెప్పబోయే జడ్జ్ - దాస్ అనే భారతీయుడు. అజీజ్ కేసు కోర్టుకి వస్తుంది. జనాలతో కిక్కిరిసిన కోర్ట్ హాలులో వాదోపవాదాలు జరుగుతాయి. అజీజ్ నిరపరాధి అని సాక్ష్యం చెప్పగలిగిన సాక్షి మిసెస్ మూర్ కూడా అందుబాటులో లేదు. ఆమెని అప్పటికే ఇంగ్లండ్ పంపించివేస్తారు. కోర్టు కేసు జరుగుతున్న సమయంలోనే మిసెస్ మూర్ ఇంగ్లాండ్ వెళుతూ, షిప్‌లోనే చనిపోతుంది. చిట్టచివరికి అడెలా క్వెస్టెడ్‌ని ఆమె కేసుని రిజిస్టర్ చేసిన మిష్టర్ మెక్‌బ్రైడ్ ప్రశ్నిస్తూ సంఘటన జరిగిన గుహలోనికి ఆమె వెంట అజీజ్ కూడా వెళ్ళాడా అని అడుగుతాడు. జరిగిన విషయాలన్నీ ఆమె స్మృతిపదంలో కదులుతూ ఉంటాయి - ఆమె ఒక్కొక్కటీ జ్ఞాపకం చేసుకొంటుంది. అడేలాకీ తాను గుహలోనికి వెళ్ళడం కనిపిస్తూ ఉంది. `వెనుకే అజీజ్ వచ్చాడా?` అని మెక్‌బ్రైడ్ అడుగుతున్నాడు. అజీజ్ వెనుకనే రావడం గురించిన జ్ఞాపకం కోసం వెతుక్కొంటుంది - కానీ, అజీజ్ సంఘటనా స్థలంలో ఎక్కడా ఉన్నట్టు ఆమెకి జ్ఞాపకం రావడం లేదు! కొంత సమయం తీసుకొని తాను పొరపాటు పడ్డాననీ, అజీజ్ తన వెంట గుహలోనికి రాలేదని చెపుతుంది.  కేసు దూది పింజలా తేలిపోయింది. జడ్జ్ అజీజ్ నిరపరాధి అని తీర్పుచెప్పాడు. చివరినిమిషంలో అంతా తల్లక్రిందులు చేసిన అడేలాని విడిచి పెట్టి ఆంగ్లేయులందరూ వెళ్ళిపోతారు. తప్పని సరి పరిస్థితుల్లో ఫీల్డింగ్ ఆమెని తన ఇంటికి తీసుకొని వెళతాడు.

అజీజ్‌కి అడెలా క్వెస్టెడ్ అంటే కోపం. హమీదుల్లా లాంటి స్నేహితుల చెప్పుడు మాటలు విని ఫీల్డింగ్‌కి అడెలా క్వెస్టెడ్‌తో సంబంధం ఉందని అనుమానిస్తాడు అజీజ్. అడెలా మంచితనం గురించి ఫీల్డింగ్ చెప్పడానికి ప్రయత్నించినా వినడు. అడెలా ఇంగ్లాండ్ వెళ్ళిపోతుంది. తరువాత కొంతకాలానికి ఫీల్డింగ్ కూడా దేశం విడిచి వెళ్ళిపోతాడు. అజీజ్ చంద్రపూర్‌కి చాలా దూరంలో ఉన్న మౌ అనే హిందూ రాజ్యానికి వెళ్ళి, రాజుగారికి వ్యక్తిగత వైద్యుడిగా ఉంటాడు. అజీజ్‌కి ఈ ఉద్యోగం గాడ్‌బోల్ వల్ల వస్తుంది. నవల చివరి భాగంలో ఫీల్డింగ్ మళ్ళీ భారతదేశానికి - మౌ ప్రాంతానికి పాఠశాలల తణికీ అధికారి హోదాలో వస్తాడు. అజీజ్, ఫీల్డింగ్‌లు కలుస్తారు. ఫీల్డింగ్ పెళ్ళిచేసుకొన్నాడని తెలుస్తుంది. క్వెస్టెడ్‌నే అయి వుంటుందని అజీజ్ అనుకొంటాడు. కానీ, అది నిజం కాదు. ఫీల్డింగ్ పెళ్ళి చేసుకొన్న వ్యక్తి మిసెస్ మూర్ కూతురు స్టెల్లా - చంద్రాపోర్ మెజిస్ట్రేట్ రోనీ హీస్లాప్‌కి సవతి సోదరి. అజీజ్ సంతోషిస్తాడు. మిత్రుల మధ్య అపోహలు అన్నీ తొలిగి పోయాయి. `ఇప్పుడు మనం మళ్ళీ స్నేహితులుగా ఉండవచ్చు కదా?` అని ఫీల్డింగ్ అజీజ్ ని అడుగుతాడు. కానీ నింగీ, నేలా `ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు,` అన్నట్టు అనిపిస్తాయి.
బరాబర్ గుహలు
 ఈ.ఎం.ఫోస్టర్ (1879 - 1970) లండన్లో జన్మించాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే కేంబ్రిడ్జ్ నుంచి వచ్చే ది ఇండిపెండెంట్ రివ్యూ అనే న్యూస్‌పేపర్‌కి ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టాడు. క్రమంగా చిన్న కథలు, ఆ తరువాత నవలలు రాశాడు. వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రెడ్, ది లాంగెస్ట్ జర్నీ, ఏ రూం విత్ ఎ వ్యూ, హోవార్డ్స్ ఎండ్ లాంటి నవలలు రాసినా ది పాసేజ్ టు ఇండియానే ఫోస్టర్ యొక్క అత్యుత్తమమైన నవల. ఈ నవల తరువాత ఫోస్టర్ మరి ఏ నవలా రాయలేదు. భారతీయుల దృక్పదాన్ని తన పుస్తకంలో అంత బాగా రాయడానికి కారణం ఫోస్టర్ రెండుసార్లు భారతదేశానికి రావడమే. పాట్నా దగ్గర ఉన్న బరాబర్ గుహలని కూడా సందర్శించాడట. అందుకే వాటిని మరాబార్ గుహలుగా నవలలో చూపించాడు. తనది కాని జాతి గురించి, వలస పాలనలో వాళ్ళు పడే సంఘర్షణ గురించి భారతీయుల పక్షం వహిస్తూ రాయడం గొప్ప విషయం!

నాకు ఇష్టమైన నవలల్లో ఇది వొకటి. అందుకే ఈ బ్లాగ్‌లో ఈ టపా. నవల సినిమాగా వచ్చింది. ఇక్కడ చూడవచ్చు.

© Dantuluri Kishore Varma 

Friday, 16 January 2015

హరితా బీచ్ రిసార్ట్స్

సంక్రాంతి సందడి అడుగడుక్కీ కనిపిస్తుంది. షాపింగ్ సెంటర్స్, సినిమాహాళ్ళు, పబ్లిక్ ప్లేసులు జనాలతో కిటకిటలాడిపోతున్నాయి. కాకినాడ దగ్గర వాకలపూడి బీచ్‌లో ఈ మధ్యన నిర్మించిన ఏ.పీ టూరిజం వాళ్ళ హరితా బీచ్ రిసార్ట్స్ ప్రాంతం పర్యాటకులతో ఇసుకవేస్తే రాలనట్టు ఉంది. వరుసగా కట్టిన ఏ.సీ. కాటేజీలకి వశిష్ట, వైనతేయ, సీలేరు లాంటి గోదావరి పాయల పేర్లూ, కాలువల పేర్లూ పెట్టారు. రెండుసంవత్సరాల క్రితం సాగర సంబరాలు మొదలు పెట్టినప్పుడు ప్రారంభించిన శిల్పారామంలో శిల్పాలన్నీ ఇప్పుడు ఈ కాటేజీలకు ఎదురుగా  వచ్చేశాయి. కొంచెం దూరంలో ఇప్పటికీ ఉన్న శిల్పారామం పార్క్‌లో మాత్రం వాటిని నిలబెట్టడానికి కట్టిన దిమ్మలు మిగిలాయి. 
సముద్రానికీ, రిసార్ట్‌కి మధ్య ఉన్న కాలువమీద చెక్కలవంతెన కట్టారు. ఈ రోజు ఉన్న హెవీ రష్ వల్ల వంతెన దాటాలంటే ఒకవైపు నుంచి వచ్చేవాళ్ళు పూర్తిగా క్రిందకు దిగినవరకూ వంతెనకు రెండవవైపు వాళ్ళు పది, పదిహేను నిమిషాలపాటు వేచి ఉండవలసి వస్తుంది. కొన్ని వందలమంది ఒకేసారి దాటుతుంటే ఆ బరువుకి వంతెన ఆగుతుందా అని సందేహం కలుగుతుంది.


క్రింద కాలువలో బోటు షికారు పెట్టారు. పుట్టీలు అని పిలిచే రౌండ్‌బోట్లు ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిగా ఇక్కడే ఏర్పాటు చేశారు. వాటిని ఎక్కి ఎవరూ బోట్‌షికారు చెయ్యడంలేదు కానీ, కాలువ వొడ్డుమీద రెండు పుట్టీలు నిలిపి ఉన్నాయి.  ఇదిగో, ఈ పుట్టీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది?
కెరటాలహోరు, ఆ హోరుని మించి వాటికి ఎదురు వెళుతున్న జనాల కేరింతలు; సముద్రం పైనుంచి వచ్చే చల్లగాలిని రిసార్ట్స్‌లో కూర్చొని ఆస్వాదిస్తున్న భావుకులు; సముద్రానికీ, రిసార్టుకీ మధ్య కాలువలో బోటుషికారు; సరుగుడు చెట్ల వెనుకనుంచి మెల్లగా అస్తమిస్తున్న సూర్యుడు; దూ..రంగా నిలబడి అన్నింటినీ గమనిస్తున్నట్టున్న లైట్‌హౌస్...

ఈ రోజు హడావుడి చూస్తుంటే మామూలు రోజుల్లో కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులని ఆకర్షించగల సౌందర్యం కాకినాడ బీచ్‌కి ఉంది అనిపిస్తుంది. . ఆ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ప్రకృతి ప్రేమికులకి కావలసిన సౌకర్యాలను కల్పించే దిశగా ప్రభుత్వం, టూరిజంశాఖలు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగిస్తే అతిత్వరలోనే పర్యాటక పటం మీద కాకినాడ పేరు ప్రముఖంగా కనిపించవచ్చు.

విష్ కాకినాడ ఆల్ ద బెస్ట్!
© Dantuluri Kishore Varma

Wednesday, 14 January 2015

భోగి వినాయకుడు

`జంక్షన్‌లో భోగిమంట వేస్తున్నాం, చందా ఇవ్వండి,` అని వచ్చారు నలుగురు మనుష్యులు నిన్న సాయంత్రం. వీధి మొదటిలో ప్రతీసంవత్సరం భోగినాడు చిన్న మంట వేస్తారు వాళ్ళు. వాళ్ళు అంటే రిక్షావాళ్ళు, సైకిల్ మెకానిక్, ఇంకా ఆ కూడలిలో ఉన్న కొంతమంది చిన్నచిన్న షాపులవాళ్ళు. `చందాల డబ్బులు తీసుకెళ్ళి ఒక్కో పెగ్గేస్తారు. రేపు ఒక దుంగముక్కా, మునిసిపాలిటీ చెత్తా పోగేసి మండిస్తారు. డ్రెయిన్‌లోనుంచి తీసిన మురికి ప్రక్కనే ఉంటుంది. కనీసం శుభ్రంకూడా చెయ్యరు, ముగ్గు అసలే వెయ్యరు. దానికి మనం భక్తితో దణ్ణం పెట్టుకోవాలి,` అని విసుక్కొన్నాడు మా ఎదురింటాయన. చిన్నప్పుడు పల్లెటూరి ఇళ్ళల్లో పెరళ్ళు ఆవుపేడతో అలికించి, చక్కగా రంగులతో ముగ్గులు పెట్టి, అడవిపొలంనుంచి ప్రత్యేకంగా రప్పించిన ఎండు మానుల్ని నిలబెట్టించి, మంచు కురుస్తున్నప్పుడు తెల్లవారుజామున మంటపెడితే... ఇంటిలో ఒక్కొక్కళ్ళు స్నానంచేసి, కొత్తబట్టలు కట్టుకొని, మనిషంత పొడవు ఉన్న భోగిపిడకల దండలు మంటలో వేసి చలికాగుతూ సూర్యకిరణాలు చుర్రుమనిపించే వరకూ మంట చుట్టూ కూర్చున్నప్పటి నులివెచ్చని జ్ఞాపకాలు, జ్ఞాపకాలుగానే ఉండిపోయాయి. పండుగ సంబరాలకోసమో, పెగ్గుల కోసమో ఎవరో వేసిన మునిసిపాలిటీ మంట భోగిమంటగా ప్రతీ వీధి మొదటిలోనూ చెలామణీ అయిపోతుంది ఇప్పుడు.
భోగిగణపతి
ఉదయం తీసిన ఈ ఫోటోలో కూడా వినాయకుడు కనిపిస్తున్నాడు చూడండి.
కానీ, ప్రతీచోటా అలానే ఉంటుందని చెప్పలేం. ఈ రోజు ఉదయం నూకాలమ్మ గుడిదగ్గర మెయిన్‌రోడ్డుకి సమాంతరంగా చిన్న వీధిలో ఉన్న భోగిగణపతి ఆలయానికి వెళ్ళాం. గుడి ఉన్న ప్రాంతాన్ని సుర్యారావు పేట అంటారు. వీధి పేరు దూసర్లపూడి వారి వీధి. అన్నట్టు భోగి గణపతి పేరు ఎప్పుడైనా విన్నారా? 2008వ సంవత్సరంలో రావిమాను దుంగతో వేసిన భోగియజ్ఞం నుంచి వక్రతుండ మహాఖాయంతో, పాదాల చెంత మూషికంతో విఘ్ననాయకుని దారు విగ్రహం ఆవిర్భవించిందట. గుడిని కట్టి ఆరాధిస్తున్నారు. సంక్రాంతి రోజుల్లో సందడిసందడిగా ఉంటుంది ఇక్కడ. ఇంతకీ, ఉదయం ఈ గుడికి వెళ్ళాం అని చెప్పాను కదా? అప్పుడు సమీపంలో గుడి నిర్వాహకులో, వీధిలో వాళ్ళో వేసిన భోగి మంట బాగుంది. ఆ ప్రాంతాన్ని శుబ్రం చేసి, సంక్రాంతి శుభాకాంక్షలు అన్ని వైపులా వ్రాసీ, చక్కగా వేశారు.   ఇదిగో సరిగ్గా ఇక్కడ మంటలో నాలుగు భోగిపిడకలు వేసి, ఓ పిసరు కచ్చిక బూడిదని చెవితమ్మి వెనుక రాసుకోవడంతోనే పండుగ ఫీలింగ్ మొదలైంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.  

© Dantuluri Kishore Varma

Sunday, 11 January 2015

వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అన్నారు కదండీ...

ఈ సంవత్సరం కాకినాడ సాగర సంబరాలు మూడురోజులకీ కలిపి మూడులక్షల మంది వరకూ రావచ్చని అధికారులు అంచనా వేశారని పేపర్లలో వచ్చింది. సంబరాలు జరుగుతున్న ప్రదేశానికి ఒక కిలోమీటరు ముందు నుంచీ అక్కడక్కడా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో ఈ రోజు ఉన్న కార్లనీ, బైకులనీ చూస్తే పట్టణ జనాభా అంతా ఇక్కడే ఉన్నారేమో అనిపించింది. జనాలు అంచనాలకు మించి వస్తూ ఉండవచ్చు! కానీ, వాహనాలు నిలిపే చోటునుంచి సంబరాలు జరిగే బీచ్ వరకూ కిలోమీటరు పైగానే నడక ఉంది. చిన్నపిల్లలు, వృద్దులు, ఆరోగ్యం సరిగా లేనివాళ్ళు అంత దూరం ఎలా నడవగలరో దేవుడికే తెలియాలి. కాళ్ళు నొప్పిపెట్టేలా నడిచి వెళితే సంబరాలు ఏ రకమైన కొత్తదనం లేకుండా మూడవసంవత్సరం కూడా మూసలో పోసినట్టు ఉన్నాయి. నర్సరీ స్టాళ్లు, ప్రభుత్వ సంస్థల స్టాళ్లు, అన్నవరం సత్యదేవుని నమూనా ఆలయం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న సభావేదిక, ఫుడ్‌కోర్ట్, జాలీ రైడ్స్, బీచ్ ఇసుకలో చేసిన శిల్పాలు, పూలబండి, పూలపడవ.. వీటన్నింటినీ ఏర్పాటు చేశారు. ఫలపుష్ప ప్రదర్శన అని పిలుచుకొనే కాకినాడ ఎగ్జిబిషన్‌నే బీచ్ వొడ్డున పెట్టినట్టు ఉంది. అంచనాలకు మించి వచ్చిన జనాభాలో చాలా మందికి నిరుత్సాహం కలగవచ్చు. సాగర సంబరాలతో పట్టణానికి పండుగ శోభ రావడం నిజమే. అయినప్పటికీ వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అన్నారు కనుక - వచ్చే సంవత్సరానికైనా కాస్తంత వినూత్నత జోడిస్తే సంబరాలు అంబరాన్ని అంటుతాయి.   

సాగర సంబరాలు రేపటితోనే ముగుస్తున్నాయి. ఏ కారణం చేతనైనా చూడలేక పోయిన వాళ్ళ కోసం, దూరం ఊరినుంచి పండుగకి కొంచం ఆలశ్యంగా వస్తున్న వాళ్ళకోసం సాగర సంబరాల ఫోటోలు ఇక్కడ ఇస్తున్నాను. చూసి ఆనందించండి.







© Dantuluri Kishore Varma 

Saturday, 10 January 2015

మనుష్యులు రాని చోటుకోసం

అలస్కాకి పశ్చిమంగా బేరింగ్ సముద్రంలో సెయింట్ పాల్స్ అనే చిన్నద్వీపం ఉంది. ప్రతీసంవత్సరం జూన్, జూలై మాసాల్లో ఈ ద్వీపంలో ఉన్న నొవస్తోష్నా అనే బీచ్‌కి లక్షలకొద్దీ సీల్ చేపలు వస్తాయి. ఇక్కడికి సమీపంలో ఉన్న చిన్న కొండను ఎక్కి బీచ్ వైపు చూస్తే సముద్రపు కెరటాల మీద లుకలుకమని అసంఖ్యాకమైన సీల్‌చేపలు వొడ్డువైపు ఈదుకొంటూ రావడం కనిపిస్తుంది. ఇక తీరం మీద అయితే కనుచూపు మేర వరకూ లక్షల కొద్దీ సీళ్ళు దెబ్బలాడుకొంటూ, ఆటలాడుకొంటూ, విశ్రాంతి తీసుకొంటూ, కెరటాల హోరుని దాటి రణగొణ ధ్వని చేస్తూ కనిపిస్తాయి. నొవస్తోష్నా సముద్రతీరానికి వచ్చి, పిల్లల్ని పెట్టి అటు ఇటూగా అక్టోబర్ నాటి కల్లా సీలు చేపలన్నీ తిరిగి వెళ్ళిపోతాయి. 

చాలా సంవత్సరాల క్రితం సీక్యాచ్ అనే పదిహేను సంవత్సరాల మగ సీల్ ఎప్పటిలాగే ఇక్కడికి వస్తుంది. పదిహేను సంవత్సరాలంటే సీళ్ళ జీవనప్రమాణం ప్రకారం చాలా ఎక్కువ. సీక్యాచ్‌కి మెడమీద జూలు పెరిగి ఉంటుంది, కుక్కలకుండే పదునైన పళ్ళలాగ వొంపుతిరిగిన రెండు కోరలు ఉంటాయి, వెనుక కాళ్ళమీద నీటారుగా నిలబడిందంటే సుమారు నాలుగడుగుల ఎత్తు ఉంటుంది, మూడువందల కేజీల పైనే బరువు ఉంటుంది! ఆ సీజన్ అంతా కెరటాలకి సమీపంలో ఒక రాతి మీద ఉండడానికి చోటుకోసం మిగిలిన సీళ్ళతో సీక్యాచ్ భయంకరంగా పోరాడుతుంది. పోరాటాల ఫలితంగా వొళ్ళంతా రక్తసిక్తమైనా తన చోటుని ఎట్టకేలకు దక్కించుకొంటుంది. ఒక నెల ఆలస్యంగా సీక్యాచ్‌తో జతకట్టే మట్కా అనే ఆడ సీల్ నొవస్తోష్నాకి చేరుకొంది. వాటికి పుట్టిన సీల్‌చేపే కోటిక్. కోటిక్ మిగిలిన అన్ని సీల్స్ లాంటిది కాదు. దీని రంగు తెలుపు. దానిలో ప్రత్యేకత ఏముంది అని సీల్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు. కానీ సీక్యాచ్ ఉద్దేశ్యం ప్రకారం ప్రపంచంలో అప్పటివరకూ తెల్ల సీల్ అనేది లేనే లేదు. 
ఓ బుజ్జి కుక్క పిల్ల లాగ తల్లి కూడా బుడి బుడి అడుగులు వేసుకొంటూ నడవడం, తల్లి తెచ్చిన ఆహారం తినడం, మిగిలిన సీలు పిల్లలతో అలసిపోయేటంత వరకూ ఒడ్డుమీద ఆడుకోవడం, ఆ తరువాత నిద్రపోవడం. ఇదే పని కోటిక్‌కి. సీళ్ళు సముద్ర జంతువులు కనుక వాటికి చేపల్లాగ పుట్టకతోనే ఈత వచ్చేస్తుందని అనుకొంటాం. కానీ బుజ్జి పాపలకి ఎలా ఈత రాదో, బుజ్జి సీల్స్‌కి కూడా అలాగే ఈత రాదు. వాటికి భుజాలూ, బుర్రా బరువుగా ఉంటాయి. నీటిలోకి వెళ్ళడంతోనే బుర్ర ములిగి పోతుంది. కానీ ఈత కొట్టడం నేర్చుకొనే వరకూ సీలు చేపలు స్థిమితంగా ఉండలేవు!   `ఆరువారల వయసు వరకూ నీటి దగ్గరకు వెళ్ళకు మునిగి పోతావు. వేడి గాలులు, రాకాసి సొరచేపలు హాని చేస్తాయి జాగ్రత్తగా చూసుకో,` అని తల్లి వైట్‌సీల్‌కి చెపుతుంది. 

అక్టోబర్ వచ్చింది. కోటిక్ తల్లితో పాటూ సెయింట్ పాల్స్ ద్వీపాన్ని వదిలిపెట్టి సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఓ ఆరు మాసాల పాటు ఈదడం, వెల్లకిలా కెరటాల మీద తేలుతూ విశ్రాంతి తీసుకోవడం, డాల్ఫిన్లలాగ నీటిలోనుంచి నాలుగైదు అడుగుల ఎత్తువరకూ గెంతగలగడం, ఆహారం సంపాదించుకోవడం, శత్రువులనుంచి కాపాడుకోవడం, ప్రమాదాలకి దూరంగా ఉండడం, సముద్రపు నీటి ఉష్ణోగ్రతను బట్టి వాతావరణాన్ని తెలుసుకోవడం.. ఇలా ఎన్నో విషయాలు నేర్చుకొంటుంది. ఆ తరువాత సంవత్సరం సెయింట్ పాల్స్ ద్వీపానికి వచ్చేటప్పటికి కోటిక్ ఒక చక్కనైన సీల్.

ప్రమాదాలు సముద్రంలోనే కాదు, వొడ్డుమీద కూడా ఉంటాయి. ఓ రోజు సీల్‌చేపలను వేటాడే మూఠా నొవస్తోష్నా సముద్రతీరానికి వస్తారు. స్వేశ్చగా ఆడుకొంటున్న ఒకటి రెండు సంవత్సరాల వయసు సీళ్లల్లో ఓ వంద వాటిని ఎంచుకొని, గొర్రెలమందను తోలుకొని పోయినట్టు తీసుకొని పోతారు. మిగిలిన సీళ్ళు చూస్తాయి. కానీ వాటి ఆట వాటిదే. ఎక్కడికి తీసుకెళుతున్నారన్న ధ్యాస వాటికి లేదు.  ఇలా ఎందుకు జరుగుతుందని కోటిక్ సహచరులని అడుగుతుంది. కొన్నింటిని ప్రతీరోజూ ముఠా మనుషులు తీసుకొని పోవడం పరిపాటే అని చెపుతాయి. అంతకు మించి వాటికీ ఏమీ తెలియదు. కోటిక్ వాళ్ళను వెంబడిస్తూ వెళ్ళి ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తుంది. ఒక అరమైలు దూరం సీల్స్‌ని అలా నడిపించుకొని పోయిన దుండుగులు దుడ్డుకర్రలతో వాటి నెత్తులమీద మోది, చర్మాలు వొలిచి తీసుకొని పోతారు. 

ఈ మారణకాండని చూసిన వైట్‌సీల్‌కి అప్పుడే ఒక లక్ష్యం ఏర్పడుతుంది. మనుష్యులు రాని ఏదైనా సురక్షితమైన తీరానికి తన సహచరులనందరినీ తీసుకొని పోవాలని నిర్ణయించుకొంటుంది. తరువాత నాలుగు సంవత్సరాల పాటు పసిఫిక్ సముద్రంలో ఉత్తరంనుంచి దక్షిణం వరకూ అటువంటి తీరంకోసం వెతుకుతూ జల్లెడ పడుతుంది. సముద్ర జంతువులు ఎన్నింటీనో అడుగుతుంది. వెళ్ళిన ప్రతీచోటా చంపబడ్డ సీళ్ళ ఎముకలు లేదా మనుష్యుల ఉన్న ఆనవాళ్ళూ కనిపిస్తూ ఉంటాయి. తిరిగి తిరిగి అలసి పోయి, నిరుత్సాహంతో తిరుగు దారి పడుతుంది. సరిగ్గా అప్పుడే పచ్చ పచ్చగా చెట్లూ చేమలతో ఉన్న ఓ చిన్న దీవిమీద పండు ముసలి సీల్ ఒకటి కోటిక్ గాధ అంతా విని, మరొక్క సారి ప్రయత్నించమని ఉత్సాహ పరుస్తుంది. ముసలి సీల్ చిన్నప్పుడు తమ జాతిని కాపాడటానికి ఒక తెల్ల సీల్ వస్తుందని ఎవరో చెపుతారు. ఆ సీల్ కోటిక్కేనా!? 

ఒకసారి సముద్రపు పక్షి ఒకటి `సీ కౌ` అనే అసహ్యంగా కనిపించే జంతువుకి కోటిక్ వెతికే ప్రదేశం తెలుస్తుందని చెపుతుంది. కోటిక్ చిట్టచివరికి సీ కౌలని వెతికి పట్టుకొంటుంది. వాటిని వెంబండించి వెళుతుంది. సముద్రంలో కొన్ని వేల అడుగుల దూరం వరకూ మునిగి ఉన్న శిల, దాని నుంచి ఓ సొరంగం, ఆ సొరంగం నుంచి దూరి ఉపరితలం మీదకి వెళితే అక్కడ బలమైన కోటగోడ మధ్యలో ఉన్నట్టు విశాలమైన తీరం! మానవ మాత్రుడెవరూ వెళ్ళలేని దుర్భేద్యమైన ప్రదేశం - కోటిక్ కంట పడుతుంది. దాని అన్వేషణ ఫలించింది! 

కోటిక్ ఆనందంతో నొవస్తోష్నా తీరానికి తిరిగి వెళుతుంది. తనవాళ్ళనందరినీ వెంటరమ్మని, వాటిని శత్రువులు లేని చోటుకి తీసుకొని వెళతానని చెపుతుంది. నొవస్తోష్నాలో సీల్‌చేపల దృక్పదం వేరు. తీరంలో ఉండడానికి చిన్న చోటుకోసం వందల కొద్దీ ఇతర సీల్స్ తో పోరాడమే వాటి పని. గత నాలుగు సంవత్సరాలలో కోటిక్ ఏనాడు ఆ పని చెయ్యలేదు. దేశ దిమ్మరిలాగ ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది. ఇప్పుడు జాతిని ఉద్దరించే మాటలు చెపుతున్నందుకు హేళన చేస్తాయి. `నాకు పోరాడటం రాక కాదు. దమ్ముంటే నాతో తలపడండి. వోడితే నా వెంట రావలసి ఉంటుంది,` అని శవాల్ విసురుతుంది. అనడమే కాదు, తన తెల్లటి చర్మం ఎర్రగా రక్తసిక్తం అయ్యే వరకూ బలిష్టమైన సీళ్ళతో భీకరంగా పోరాడి లొంగదీసుకొంటుంది. పోరాటంలో తనకి తోడు తండ్రి కూడా కలుస్తాడు. ఇద్దరూ వోడించిన వేలకొద్దీ సీళ్ళను తమవెంట కొత్త ప్రదేశానికి తీసుకొని పోతారు. తరువాత సంవత్సరంనుంచి మిగిలిని సీళ్ళు కూడా విషయం తెలుసుకొని క్రమంగా కోటిక్ సామ్రాజ్యానికి తరలిపోతూ ఉంటాయి. అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. 

రుడ్‌యార్డ్ కిప్లింగ్ రాసిన జంగిల్‌బుక్‌లో ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆసక్తి ఉంటే అసలు కథని ఇక్కడ చదవండి. ఏనిమేటేడ్ ఫిలింస్ కూడా వచ్చాయి. ఇక్కడ చూడవచ్చు.  

© Dantuluri Kishore Varma

Thursday, 8 January 2015

ఆంధ్రసాహిత్య పరిషత్ ఆర్క్యలాజికల్ మ్యూజియం

రాజా పార్క్ ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న రామారావుపేట వీధిలో ఆంధ్రసాహిత్య పరిషత్ ఆర్క్యలాజికల్ మ్యూజియం ఉంది. మ్యూజియంకి ఆంధ్ర సాహిత్య పరిషత్ అనే పేరు ఏమిటి అనే అనుమానం వస్తుంది ఎవరికైనా. చాలా కాలం క్రితం అంటే 1911లో జయంతి రామయ్య పంతులు అనే ఆయన ఆంధ్ర సాహిత్య పరిషత్‌ని మద్రాసులో ప్రారంభించారట. తెలుగు నిఘంటువులలో తలమానికం లాంటి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువుని రాసి, ముద్రించినది ఈయనే. పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాలలో మొదటిది `ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక` అనే దాన్ని ప్రచురించడం. ఇది కాక అరుదైన తాళపత్ర గ్రంధాలనీ, చేతివ్రాత ప్రతులనీ సేకరించి ప్రచురించడం. పిఠాపురం రాజా వారి ఆర్థిక సహకారంతో పరిషత్ కార్యక్రమాలు చక్కగా కొనసాగాయి. 1919 లో పరిషత్‌ని మద్రాసునుంచి కాకినాడకు తరలించారు. 1973లో సేకరణలు అన్నీ పురావస్తు శాఖకు అప్పగించారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం కాకినాడలో ఈ మ్యూజియం నడుస్తుంది.    
క్రీస్తుశకం 11వ శతాబ్ధంలో నన్నయ్య రచించిన మహాభారతంలోని ఆదిపర్వం, 14వ శతాబ్ధం నాటి శ్రీనాథ విరిచిత భీమఖండం, 16వ శతాబ్ధంలో పిల్లలమర్రి చినవీరభద్రుడు రచించిన జైమినీ భారతం, రామాయణంలో కిష్కిందకాండ, నటరాజ యశోభూషణం లాంటి ఎన్నో తాళపత్ర గ్రంధాలు ప్రదర్శనలో ఉంచారు. ఇవికాక 19శతాబ్ధపు ఆంధ్ర శబ్ధ చింతామణి, శ్రీనాధుని శివరాత్రి మహత్యము లాంటి చేతివ్రాత ప్రతులు ఉన్నాయి. ఇక్కడ గమనించ వలసిన విషయం ఒకటి ఉంది. తాళపత్ర గ్రంధాలు కానీ, చేతివ్రాత ప్రతులు కానీ ఆయా కవులు స్వయంగా రాసినవి అనుకోవడానికి లేదు. ఇప్పటి ముద్రణలాగ అప్పుడు మూల గ్రంధం నుంచి ఎన్నో నకళ్ళు తయారు చేసి వ్యవహారంలోకి తెచ్చేవారట. కాబట్టి ఇవి మూల గ్రంధాలు కావచ్చు, నకళ్ళు కావచ్చు. ఈ గ్రంధాలతోపాటూ, అక్షరాల ముద్రణకి బంగారాన్ని వాడిన అరబిక్ పుస్తకం మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణ.
2,50,000 సంవత్సరాల నాటి పాత శిలాయుగపు రాతి పనిముట్లు ఉన్నాయి. ఇవి పశ్చిమగోదావరి జిల్లాలో పెదవేగి గ్రామంలో తవ్వి తీసినవి. ఒకటవ శతాబ్ధంలో కాకినాడ సమీపంలో చొల్లంగి గ్రామంలో ప్రజలు వాడిన మట్టిపాత్రలు ఉన్నాయి. మొదటి, రెండవ ప్రపంచ యుద్దాల్లో ఉపయోగించిన  కత్తులు, బాకులు, సింధునది నాగరికతకు చెందిన ముద్రల నకళ్ళు, ఐదవ శతాబ్ధంనాటి యక్షిణుల ప్రతిమలు, తెలుగు లిపి పరిణామక్రమాన్ని తెలియజేసే చార్టులు, తూర్పు చాళుక్యుల  దాన శాసనాలు, బ్రిటీషువాళ్ళ నాణాలు, ఏనుగు దంతంతో చేసిన పెద్ద పాచికలు, పురాతన పంచలోహ విగ్రహాలు, శిల్పాలు ఎన్నో మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.   
మ్యూజియం సిబ్బంది ఓపికగా పురాతన వస్తువులనన్నంటినీ చూపిస్తూ, వాటి గురించి వివరించారు. వంద చరిత్ర పాఠాలు చెప్పినా అర్థం కాని విశేషాలు ఒక్క మ్యూజియం సందర్శనతో అర్థమవుతాయి. కాకినాడ, పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు  విద్యార్థులని మ్యూజియం చూడడానికి పంపిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ రకమైన ప్రయత్నాలు మొదలు పెట్టామనీ; ప్రతీ సంవత్సరం క్విజ్, వ్యాసరచన పోటీలు లాంటివి నిర్వహిస్తున్నామని క్యూరేటర్ శ్రీ తిమ్మరాజుగారు చెప్పారు.  
వివిధ కాలాలకు చెందిన ఎన్నో అద్భుతమైన శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. మ్యూజియం ప్రతీరోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తెరిచి ఉంటుంది. ప్రతీ శుక్రవారం, రెండవ శనివారం శలవు. 

© Dantuluri Kishore Varma

Friday, 2 January 2015

నీ తలపుల మునుకలో..

శృతిలయలు సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. సినిమా కూడా ఎంతో బాగుంటుంది. త్యాగయ్య, అన్నమయ్య, రామదాసుల సంగీతానికి గుడి లాంటి సంగీత భారతిని నిర్మించాలని నాయుడు ఆశయం. ముగ్గురు అనాధలని చేరదీసి, వారికి సంగీతం నేర్పించి పెద్దవాళ్ళను చేస్తాడు. అన్నదమ్ములు ముగ్గురూ నాయుడి ఆశయాన్ని నెరవేర్చడానికి బదులు తమస్వార్థ ప్రయోజనాలకి ఎక్కువ విలువ ఇస్తారు. వ్యసనాలకి బానిసలై నైతికంగా పతనం అవుతారు. కర్ణాటక సంగీత సంబంధమైన ఆశయం చుట్టూ తిరిగే కథ కనుక చిత్రంలో పాటలు అన్నీ సంగీత సాహిత్య ప్రధానంగా ఉంటాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన అన్నమయ్య శృంగార సంకీర్తనలని పోలిన `తెలవారదేమో స్వామీ..` అనే పాట కూడా ఉంది. ఈ పాట పల్లవి దగ్గర సుమలత ప్రేమభావనతో సాత్వికాభినయం చేస్తే, చరణాలని మళ్ళీ పాడుతూ పాంచాలి పాత్రదారిణి జయలలిత శృంగారం అభినయిస్తుంది. దిగజారుడు పాకుడు మెట్లమీద ఈ సినిమా హీరో రాజశేఖర్ మొదటి అడుగు ఇక్కడే పడుతుంది. పాట వీడియో విడిగా లభించలేదు. సినిమాలో 52.52 నుంచి 1.01.12 వరకూ చూడండి. వీలయితే సినిమా అంతా కూడా చూడండి.

ఏసుదాస్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇక్కడ

గానం : కె.జె. ఏసుదాస్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం : కె.వి. మహదేవన్ 

తెలవారదేమో స్వామీ తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ
తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ
తెలవారదేమో స్వామీ

చెలువమునేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు 
చెలువమునేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు 
కలల అలజడికి నిద్దుర కరవై 
కలల అలజడికి నిద్దుర కరవై 
అలసిన దేవేరి.. అలసిన దేవేరి.. అలమేలుమంగకూ 
తెలవారదేమో స్వామీ

మక్కువ మీరగా అక్కున జేరిచి అంగజుకేళిని పొంగుచు తేల్చగా 
మక్కువ మీరగా అక్కున జేరిచి అంగజుకేళిని పొంగుచు తేల్చగా 
 ఆ మత్తునే మది మరి మరి తలచగా .. మరి మరి తలచగా 
అలసిన దేవేరి.. అలమేలు మంగకూ 
తెలవారదేమో స్వామీ.. గా మ ప ని 
తెలవారదేమో  సా ని ద ప మ ప మ గ ని స గా మ 
తెలవారదేమో స్వామీ 
పా ని ద ప మ గ మ ప స ని ద ప మ గ మ 
ప స ని రి స గ రి మ గ రి సా రి నీ స 
తెలవారదేమో స్వామీ

© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!