Pages

Tuesday 27 January 2015

అతను భగవధ్గీతను చదివుంటే...

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సువ:
మామకా: పాణ్డవాశ్చైవా కిమకుర్వత సంజయ.

`యుద్ధం చెయ్యడానికి సన్నద్దులైన పాండవులూ, కౌరవులూ కురుక్షేత్రంలో ఏమిచేశారు?` అని దృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు. భగవద్గీతలోని అర్జున విషాదయోగంలో మొట్టమొదటి శ్లోకం ఇది. సంజయుడు కురుక్షేత్ర మహాసంగ్రామానికి వ్యాఖ్యాత. చూసినది చూసినట్టు దృతరాష్ట్రునికి విన్నవిస్తున్నాడు. ఇరుపక్షాల సైన్యాలూ రణరంగంలో మోహరించి ఉన్నాయి. దుర్యోధనుడు తమ పక్షం వారు, ఎదుటి పక్షపు వీరులతో సమవుజ్జీలుగా ఉన్నారని సేనానాయకుడైన ద్రోణాచార్యుడితో చెపుతాడు. అప్పుడు భీష్మాదులు బిగ్గరగా శంఖారావాలు చేసి యుద్దానికి తయారుగా ఉన్నామని సన్నద్ధత  వ్యక్తం చేస్తారు. 

పాండవ పక్షం నుంచి అర్జనుని రధసారధి శ్రీకృష్ణుడు పాంచజన్యాన్నీ, అర్జునుడు దేవదత్తాన్నీ, ధర్మరాజు అనంతవిజయాన్నీ, భీముడు పౌండ్రాన్నీ, నకులుడు సుఘోషాన్నీ, సహదేవుడు మణిపుష్పకాన్నీ పూరిస్తారు. ఇవన్ని వాళ్ళ వాళ్ళ శంఖాల పేర్లు. ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. అప్పుడు  కృష్ణుడితో అర్జునుడు- 

సేనయోరుభయోర్మధ్యే రధం స్థాపయ మేzచ్యుత.

అంటూ తన రధాన్ని ఇరుపక్షాలమధ్యా నిలుపమని చెపుతాడు. ఇరువైపులా ఉన్న వీరులను చూస్తాడు. వారిలో గురువులు, తాతలు, తండ్రులు,  కొడుకులు, అన్నదమ్ములు, మనుమలు, మేనమామలు, స్నేహితులు ఉన్నారు. `వీరితోనా నేను యుద్ధం చెయ్యబోతున్నది!` అనే తలంపు అర్జునుడ్ని ఒక్క క్షణంలో నిర్వీర్యుడిని చేసింది. స్వజనులను చంపి ఎవరైనా సాధించేది ఏముంటుంది?    


నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా.  

వైరాగ్యం ఆ మహావీరుడ్ని ఆవహించింది. `రాజ్యంతోనూ, అది సమకూర్చే సుఖాలతోనూ మనకేమిటి అవసరం? అవేవీ నాకు అక్కర్లెద్దు,` అంటున్నాడు అర్జునుడు.  స్వజనాపేక్ష చేత అర్జునుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యాడు. ఈ లోపం `నా అయుదాల్ని విడిచిపెడుతున్నాను. ఈ యుద్దరంగంలో కౌరవులు నన్ను సంహరించినా కూడా మంచిదే,` అనేంతవరకూ అర్జునుడ్ని తీసుకొని వెళ్ళింది. తన నిర్ణయాన్ని సమర్ధించుకోవడానికి కౌరవులను చంపడంవల్ల పాపం కలుగుతుందని, నరకానికి పోతామని, వంశం నాశనం అవుతుందని.. ఎన్నో సాకులు చెపుతాడు.  కొండను తవ్వి వజ్రాన్ని వెలికితీసినట్టు, అపోహలను తొలగించి అర్జునుడిలో వజ్రసంకల్పాన్ని శ్రీకృష్ణుడు కల్పించకపోతే పాండవ మధ్యముడు కోరుకొన్నట్టే దుర్యోధనాదులు విజయాన్నీ, రాజ్యాన్ని పొంది వుండేవారు.

ఇప్పుడు భగవధ్గీతను విడిచిపెట్టి కొంచెం పశ్చిమంగా వెళ్ళి షేక్స్పియర్ రాసిన విషాదాంత నాటకం హేంలెట్‌లో ఏమయ్యిందో చూద్దాం. హేంలెట్ డెన్‌మార్క్ యువరాజు. అతని పినతండ్రి క్లాడియస్ హేంలెట్ తండ్రిని  చంపి రాజు అవుతాడు. అంతేకాకుండా వదినగారిని పెళ్ళాడి తన రాణిని చేసుకొంటాడు. ఓ వెన్నెల రాత్రి చంపబడిన రాజు ఆత్మ తన కొడుకు హేంలెట్‌కి కనిపించి జరిగిన కుట్రగురించి చెపుతుంది. ప్రతీకారం తీర్చుకోమని కోరుతుంది. `ఆత్మ చెప్పిన విషయం నిజమా, కాదా?` అనే సందేహంలో పడతాడు హేంలెట్. ఒక నాటక బృందాన్ని పిలిచి తన తండ్రిని చంపిన కుట్రని పోలిన సన్నివేశంతో ఓ నాటకాన్ని రాజమహల్లో వేయిస్తాడు. నాటకాన్ని చూస్తూ కళవెళ పడిన పినతండ్రి క్లాడియస్‌ని గమనించిన హేంలెట్‌కి తండ్రి ఆత్మ చెప్పిన విషయం నిజమే అని నిర్ధారణ అవుతుంది. క్లాడియస్ తత్తరపాటులో ఉన్నాడు. ఆ క్షణంలోనే హేంలెట్ అతనిని సంహరించాలి. అలాగే చేసి ఉండాలని విమర్శకులు ఇప్పటికీ నొక్కి వొక్కాణిస్తున్నారు. అర్జునుడిలో స్వజనాపేక్షలాగ హేంలెట్‌లో ఇండెసిసివ్‌నెస్(ఏదైనా పని చెయ్యడమా, మానడమా అనే ఊగిసలాట) అనే లోపం ఉంది. అయితే దురదృష్టవశాత్తూ కృష్ణుడిలాంటి కౌన్సిలర్ అతనికి లేక చివరికి తాను చంపబడడమే కాకుండా, తనవాళ్ళందరూ దుర్మరణం పొందడానికి కారణం అవుతాడు. 

ఉదయం మేల్కొన్న దగ్గరనుంచీ, రాత్రి నిద్రపోయేవరకూ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ప్రతీపనికీ రెండు ఆప్షన్‌లు ఉంటాయి - చెయ్యడం, చెయ్యకపోవడం అనేవి.  చిన్న పనులని ప్రక్కన పెడితే ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో చెయ్యవలసిన పనిని చెయ్యక పోవడం వల్ల, చెయ్యకూడని పని చెయ్యడం వల్లా అపారమైన నష్టం కలిగే అవకాశం ఉంది. సభావేదికమీద మన అభిప్రాయాలని చెప్పవలసి వచ్చినప్పుడు తప్పు మాట్లాడితే జనాలు నవ్వుతారని వెనకడుగు వేస్తాం; నష్టం వస్తుందేమో అనే సందేహంతో మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా ఊరుకొంటాం; పోటీని చూసి భయపడి పరీక్షల్లో పూర్తి సామర్ద్యాన్ని ప్రదర్శించలేకపోతాం; సమయం, డబ్బూ అందుబాటులో ఉన్నా సినిమాలు, స్నేహితులూ లాంటి ఆకర్షణల్లో పడి ఉద్యోగానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి నైపుణ్యాలని మెరుగు పరచుకోవడానికి బద్దకిస్తాం. చూశారా మన లోపాలు విజయావకాశాలని ఎలా దెబ్బతీస్తున్నాయో!  

హేంలెట్ భగవధ్గీతను చదివుంటే ఏమయ్యేది? ఈ షేక్స్పియర్ నాటకం సుఖాంతమయ్యేదా? నిజానికి ఎక్కడో భారతదేశంలో పుట్టిన గీతని డెన్మార్క్ యువరాజు చదివే అవకాశం లేనేలేదు కాబట్టి ఈ ఊహని కొంచంసేపు ప్రక్కన పెట్టి మనదగ్గరకి వద్దాం. `మోహంలో పడకుండా సరైన సమయంలో సరైన పని చెయ్యి,` అని భోధించిన గీత మనకేమైనా ఉపయోగపడుతుందంటారా? 

© Dantuluri Kishore Varma

17 comments:


  1. >>గీత మనకేమైనా ఉపయోగపడుతుందంటారా?

    గీత ని మార్చాలని అనుకుంటే గీత ఎంతైనా ఉపయోగ దాయిని .!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఈ వ్యాసంయొక్క సారాంశాన్ని ఒక్క మాటలో చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.

      Delete
  2. మంచి ఆలోచనలు. చాలా బాగా వ్రాసారు. చివరగా ఇచ్చిన లైను వ్యాసానికే హైలైట్. బాగున్నది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శివరామప్రసాద్ గారు :)

      Delete
  3. ఎక్కడ మంచి ఉన్నా స్వీకరించి ఉపయోగించుకోవచ్చు. గీతలో మంచిని అలాగే స్వీకరించవచ్చు. నైరాశ్యంలో మునిగి పనులు చేయకుండా ఉండేవారికి గీతోపదేశం చేసే శ్రీకృష్ణుడిలాంటి కౌన్సిలర్లు లేదా బోధకులు నేటి సమాజానికి చాలా అవసరం. గతంలో ఉమ్మడి కుటుంబాలు, మానవ సంబంధాలు మంచిగా ఉన్నరోజులలో వెన్నుతట్టి ప్రోత్సహించేవారూ, నిరాశా-డిప్రెషన్లను పారద్రోలి తిరిగి కర్తవ్యనిర్వహణకు పూనుకునేలా సలహాలు ఇచ్చి ధైర్యం చెప్పేవారు ఉండేవారు.నేటి జీవన విధానమంతా బిజీ గజిబిజి గా ఉంటోంది. పోస్టు బాగుంది. అయితే గీతలో మంచిని మాత్రమే స్వీకరించాల్సి ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. మీ ఆందోళన అర్థమైనది. మొదట గీతలో మంచిని అలాగే స్వీకరించవచ్చు అని ఉదారంగా అన్నా చివరకు కొంచెం నిర్మొగమాటంగానే గీతలో మంచిని మాత్రమే స్వీకరించాల్సి ఉంటుంది అన్నారు.

      గీతలో చెడు కూడా ఉండవచ్చునన్న భయమో, గీతలో చెడే హెచ్చేమోనన్న అనుమానమో ఈ నాటితరాల్లో కనిపిస్తోంది. శ్రీకృష్ణుడిలాంటి కౌన్సిలర్లు లేదా బోధకులు నేటి సమాజానికి చాలా అవసరం అని గుర్తిస్తూనే ఆ శ్రీకృష్ణుడు చెడువిషయాలను కూడా బోధించాడని మీరెలా భావిస్తున్నారో బోధపడటం లేదు. ఇది ఒక అపోహ మాత్రమే అని మాత్రం చెప్పగలను.

      కేవలం గీతాధ్యయనం మాత్రమే ఇలాంటి అపోహలను దూరం చేయగలదు. అధ్యయనం అంటున్నాను కాని పఠనం అనటం లేదని గమనించ ప్రార్థన. ఈ అధ్యయనం ఎలా అన్న విషయం జిజ్ఞాసువులు గ్రహించగలరు. ఈ విషయంలో అరవిందులు చెప్పిన మాటలు గమనార్హం. నిన్ననే అవి శ్యామలీయంలో వ్రాసాను. (చూడండిః http://syamaliyam.blogspot.in/2015/01/blog-post_69.html)

      Delete
    2. @శ్యామలీయం Well said.

      Delete
    3. కొండలరావు గారు ~ లెట్ నోబుల్ థాట్స్ కం ఫ్రం ఎవ్విరీవేర్ అని ఋగ్వేదం చెప్పింది కనుక (ఋగ్వేదం నుంచి ఈ కొటేషన్ వరకూ మాత్రమే నాకు తెలుసు :) భగవద్గీతలో ఉన్న మంచినంతా స్వీకరిద్దాం. అలా చెయ్యాలంటే ఇక్కడే శ్యామలరావుగారు చెప్పినట్టు గీతనంతా సమగ్రంగా అధ్యాయనం చెయ్యవలసిందే. మీ అభిప్రాయాన్ని పంచుకొన్నందుకు ధన్యవాదాలు కొండలరావు గారు.

      Delete
  4. Replies
    1. ధన్యవాదాలు కృష్ణచైతన్య గారు :)

      Delete
  5. నా దృష్టిలో భగవద్గీత లాంటి గ్రంథాలు యాంటీ వైరస్ బుక్స్.
    మన మనసులోని వైరస్‌లని తొలగిస్తాయి.
    పాజిటివ్‌గా చదివితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.

    ReplyDelete
    Replies
    1. భగవద్గీత లాంటి గ్రంథాలు యాంటీ వైరస్ బుక్స్
      Noteworthy novel thought!

      Delete
    2. హండ్రెడ్ పెర్సెంట్ ట్రూ బోనగిరి గారు. ధన్యవాదాలు.

      Delete
  6. శ్యామలరావు గారూ, మీ విలువైన అభిప్రాయాలని పంచుకొన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.

    ReplyDelete
  7. భగవద్గీత ని రకరకాల వ్యక్తులు రకరకాలుగా చూశారు.వారిదైన TEMPERMENTS ని బట్టి.ఈ లోకం లో చివరకి నిగ్గు తేల్చేది ఈ ప్రపంచం లో మనం ఏం సాధించామనే.బలహీనుడు చెప్పే శాంతి వచనాలకి విలువ లేదు ఈ లోకంలో..If you are a hero..show your heroism..! అంతే మిగతాదంతా చెత్త నా దృష్టిలో..! వివేకానందుని కోణమే నాదీనూ..!

    ReplyDelete
    Replies
    1. వెల్ సెడ్ మూర్తిగారు.

      Delete
  8. "....బలహీనుడు చెప్పే శాంతి వచనాలకి విలువ లేదు ఈ లోకంలో..."

    బాగా చెప్పారు మూర్తి గారూ. అలా చేతకాని శాంతి వచనాలు వల్లించే కదా 1962 లో చైనా చేతిలో దెబ్బతిన్నది. అప్పుడు నేర్చుకున్న పాఠాల దృష్ట్యా, మరింత పనికిరాని శాంతి పాఠాలు వల్లించకుండా. ఎన్ సి సి స్థాయికి ఒక పిసరు ఎక్కువ ఉన్న మన సైన్యపు స్థాయి పెంచుకుని శత్రువులు మనవంక చూడటానికి బెరుకు కలిగేట్టుగా పెరిగాము.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!