Pages

Thursday 22 January 2015

ఎ పాసేజ్ టు ఇండియా

పంతొమ్మిదివందల ఇరవై నాలుగులో ప్రచురితమైన ఎ పాసేజ్ టు ఇండియాని ఆంగ్లభాషలో వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటిగా ఇప్పటికీ పరిగణిస్తారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతున్న కాలం నాటి కథ. కానీ ఇందులో చరిత్ర లేదు. జాతుల మధ్య విరోధాన్ని ఓ సంఘర్షణ నేపద్యంలో రచయిత చక్కగా ఆవిష్కరించాడు. ఒకవైపు ఆంగ్లేయులు, మరొకవైపు భారతీయులు - మళ్ళీ భారతీయుల్లోనే వివిధ మతాల వాళ్ళు, కులాల వాళ్ళు పాత్రలుగా అద్భుతమైన విశ్లేషణ చేశాడు. రచయిత ఆంగ్లేయుడైనప్పటికీ వలసపాలన మీద ఏహ్యత ప్రస్పుటంగా తెలుస్తుంది. పాత్రల మానసిక విశ్లేషణ, దృక్కోణం అబ్బుర పరుస్తాయి. నవలలో తాత్విక చింతన కూడా బాగా ఉంటుందని చెపుతారు. అయితే ఆ దృష్టితో ఈ నవలని నేను పరిశీలించలేకపోయాను. మరొక సారి మళ్ళీ చదివినప్పుడు ఆ విషయాలు అర్థమౌతాయేమో!

కథ చంద్రపూర్ అనే ప్రాంతంలో జరుగుతుంది. బీహార్లో పాట్నా దగ్గర ఉన్న బంకీపూర్ అనే ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని  రచయిత ఎడ్వార్డ్ మోర్గాన్ ఫోస్టర్ (E.M. Forster) సృష్టించిన చిన్న పట్టణం ఇది.  చంద్రాపూర్ గంగానది వొడ్డున ఉంటుంది. అయినప్పటికీ జనాలు నదిలో దిగి స్నానం చెయ్యడానికి ఒక్క స్నానఘట్టం కూడా ఉండదు. వొడ్డు పొడవునా నదిని కప్పేస్తూ నిర్మించిన ఇరుకు బజార్లు, అవి వేసే చెత్త... చెదారం... నదిని అపవిత్రంగా మార్చేశాయి. చంద్రపూర్‌లో విశాలమైన రోడ్లు లేవు, అందమైన దేవాలయాలు లేవు.. చూడవలసిన ప్రదేశాలని చెప్పుకోవడానికి ఏమీ లేవు - ఊరికి సమీపంలోని మరాబార్ గుహలు తప్ప. (బరాబర్ గుహలకి రచయిత ఇచ్చిన పేరు మరాబార్ అని అంటారు). ఊరి బజార్లలో, భారతీయుల ఇళ్ళల్లో సౌందర్యం అనేది వెతికినా కనపడదు. కానీ నదికి సమాంతరంగా వేసిన రైల్వే లైనుకి అవతల కొంచెం ఎత్తుమీద ఉన్న ఆంగ్లేయుల నివాస ప్రాంతం - సివిల్ స్టేషన్ తీర్చిదిద్దినట్టు ఉన్న వీధులతో, అందమైన భవనాలతో గొప్పగా ఉంటుంది. ఒకే ఊరిలో ఉన్న రెండు భిన్న ప్రపంచాలు ఇవి. ఈ రెండు ప్రాంతాల్లోనూ వరుసగా ఆంగ్లేయులంటే మండిపడే భారతీయులూ,  భారతీయులని హీనంగా చూసే ఆంగ్లేయులు ఉంటారు.  పరిపాలించే జాతికి చెందిన ఆంగ్లేయులుకీ, పరిపాలింపబడుతున్న భారతీయులకీ మధ్య స్నేహం సాధ్యమేనా అనే అంశం నవల ప్రారంభంలోనే చర్చకు వస్తుంది. ఇంగ్లండ్‌లో అయితే సాధ్యమే కానీ భారతదేశంలో మాత్రం కాదని హమీదుల్లా అనే పాత్రచేత రచయిత చెప్పిస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే నవల యొక్క కధాంశం అదే.

నవలలో కథానాయకుడు డాక్టర్ అజీజ్ ఒక ముస్లిం ఫిజీషియన్. చంద్రపూర్ మెజిస్ట్రేట్ రోనీ హీస్లోప్ అనే వ్యక్తి తన తల్లి మిసెస్ మూర్‌ని ఇంగ్లండ్ నుంచి తనకోసం కాబోయే భార్యని తీసుకు రమ్మని కోరడంతో అడెలా క్వెస్టెడ్ అనే అమ్మాయిని వెంట బెట్టుకొని మిసెస్ మూర్ భారతదేశానికి వస్తుంది. వీళ్ళు కాక నవలలో ఇంకా ముఖ్యమైన కొంతమంది ఎవరో చూద్దాం.  సైరిల్ ఫీల్డింగ్ గవర్నమెంట్ కాలేజికి హెడ్‌మాస్టర్. డాక్టర్ అజీజ్‌కి కథాక్రమంలో స్నేహితుడు ఔతాడు; చంద్రపూర్ సిటీ కలెక్టర్ మిష్టర్ టర్టన్, అతని భార్య మిసెస్ టర్టన్; బ్రిటిష్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మిష్టర్ మెక్‌బ్రైడ్; మేజర్ కేలెండర్ అనే హెడ్ డాక్టర్ - ఈయన అజీజ్‌కి పై అధికారి; నారాయణ్ గాడ్‌బోల్ ఒక బ్రాహ్మణ ప్రొఫెసర్; అమృత్‌రావ్, మొహమద్ ఆలీ - ఇండియన్ లాయర్లు. చంద్రాపూర్ సమీపంలోని మరాబార్ గుహలు ఒక పాత్రలాగే కథలో ముఖ్యమైన సంఘర్షణని ప్రవేశ పెట్టడంలో కీలకమైన భూమికను పోషిస్తాయి.

నవల ప్రారంభంలో స్నేహితులతో కలిసి డిన్నర్ పార్టీలో అజీజ్ ఆనందిస్తూ ఉంటాడు. చంద్రపూర్‌లోని ఆంగ్లేయ అధికారుల గురించి, వాళ్ళ భార్యల గురించి ప్రస్థావన వస్తుంది. మధ్యభారత దేశంలో ఒక కాలువ తవ్వుతున్న ప్రోజెక్ట్ విషయమై కలెక్టర్ టర్టెన్ భార్యకి ఒక రాజుగారు బంగారంతో చేసిన కుట్టుమిషన్‌ని లంచం పెడతాడు. కాలువ వాళ్ళ రాష్ట్రం గుండా పోయేలా ఏర్పాటు చెయ్యమని ఆయన విజ్ఞప్తి. పాపం ఆ విజ్ఞప్తిని టర్టన్ నెరవేర్చలేదు. దీనిగురించి అజీజ్ తన స్నేహితులతో అంటాడు, `మన నల్లవాళ్ళం పిచ్చోళ్ళలా లంచం తీసుకొన్న పని పూర్తిచేసి చట్టానికి దొరుకుతాం. కానీ తెల్ల వాళ్ళు మహా తెలివైన వాళ్ళు. ఏ పని కోసం లంచం పట్టారో, దానిని చెయ్యరు కాబట్టి చట్టానికి దొరికే అవకాశమే ఉండదు,` అని. అప్పుడే తన పై అధికారి మేజర్ కేలెండర్ దగ్గరనుండి పిలుపు వస్తుంది. తన అధికారాన్ని చూపించడానికి కావాలనే పిలిచి చక్కని సాయంత్రాన్ని పాడుచేస్తాడని అజీజ్ కేలెండర్‌ని తిట్టుకొంటాడు. ఇదే సమయానికి యూరోపియన్ క్లబ్బులో పార్టీ జరుగుతూ ఉంటుంది. నర్సుగా పనిచేసిన ఓ దొరసాని భారతీయులని చూస్తే తనకి వొంటిమీద తేళ్ళూ, జెర్రులూ పాకినట్టు ఉంటుందని అంటుంది. స్థానిక రోగుల విషయంలో అత్యంత దయగల పని ఏమిటంటే - వాళ్ళ చావు వాళ్ళని చావనివ్వడమే అని కూడా నొక్కి వొక్కాణిస్తుంది.  తెల్లవాళ్ళకి భారతీయులంటే చులకన భావం, భారతీయులకి ఆంగ్లేయులంటే కోపంతో కూడిని ఏహ్యత నవలలో కనిపిస్తుంది. పైకి స్నేహపాత్రంగా కనిపిస్తూ ఉన్నా హిందూ, ముస్లింల మధ్య వైరుధ్యాలు ఉంటాయి. కుల ప్రాతిపధికగా మనుష్యులని తక్కువగా చూడడం ఉంది. భారతీయ సమాజంలో ఉండే సంక్లిష్టతని ఒక ఆంగ్లేయుడైనప్పటికీ రచయిత చక్కగా పట్టుకోగలిగాడు.

మిసెస్ మూర్‌కి డాక్టర్ అజీజ్‌తో యాదృశ్చికంగా పరిచయం ఏర్పడుతుంది. క్లబ్‌లో జరుగుతున్న పార్టీనుంచి, ఉక్కబోత నుంచి బయటపడి వెన్నెల రాత్రిలో మిసెస్ మూర్ దగ్గరలో ఉన్న మసీదులోకి వెళుతుంది. అప్పటికే అక్కడ ఉన్న అజీజ్ ఆమెని చూస్తాడు. `ఇటువంటి పవిత్రమైన ప్రదేశానికి చెప్పులతో వచ్చారా?` అని కోపంగా ఆమెని ప్రశ్నిస్తాడు. కానీ, చెప్పులు బయటే విడిచి పెట్టి వచ్చానని మిసెస్ మూర్ చెపుతుంది. తన తొందరపాటుకు నొచ్చుకొంటాడు. వారిద్దరి మధ్యా కొంత స్నేహపూర్వక సంభాషణ జరుగుతుంది. తరువాత కొన్నిరోజులకి ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాష్టర్ ఫీల్డింగ్ మిసెస్ మూర్‌ని, అడెలా క్వెస్టెడ్‌నీ తన ఇంటికి ఆహ్వానిస్తాడు. అప్పుడు మూర్ అజీజ్‌ని కూడా టీకి పిలవమని ఫీల్డింగ్‌ని కోరుతుంది. డాక్టర్ అజీజ్‌నే ఎందుకు..అంటే... ఇంగ్లీష్ ఆడవాళ్ళిద్దరికీ భారతీయులతో స్నేహంచేసి భారతదేశం గురించి తెలుసుకోవాలనే ఆలోచన ఉంది  - మిసెస్ మూర్ అంతకు కొంతకాలం ముందు డాక్టర్ అజీజ్‌తో యాదృచ్చికంగా మాట్లాడిన సందర్బాన్ని పురస్కరించుకొని అతనిని కూడా ఈ పార్టీకి పిలవమని ఫీల్డింగ్‌ని కోరింది.  ఈ సందర్భంగా అజీజ్‌కి ఫీల్డింగ్‌తో స్నేహం మొదలౌతుంది. అజీజ్ మాటల మధ్యలో వాళ్ళని మరాబార్ గుహల దగ్గరకి పిక్‌నిక్‌కి తీసుకొని వెళతానని వాగ్ధానం చేస్తాడు.

అజీజ్ పిక్‌నిక్‌కి ఏర్పాట్లు చేస్తాడు. మరాబార్ గుహల దగ్గరకి వెళ్ళేవాళ్ళలో మిసెస్ మూర్, అడెల క్వెస్టెడ్, ఫీల్డింగ్ ఆంగ్లేయులు. ప్రొఫెసర్ గాడ్‌బోల్ హిందూ, మిగిలిన వాళ్ళు ముస్లింలు. ఒక్కొక్కరిదీ ఒక్కో సంస్కృతి. వీళ్ళకి భోజన ఏర్పాట్లు చెయ్యడం అజీజ్‌కి కొంత ఆందోళణని కలిగిస్తుంది. తెల్లవాళ్ళకోసం స్పూన్‌లు, నైఫ్‌లు లాంటి కట్లెరీని మొహమ్మద్ ఆలీ నుంచి అరువు తీసుకొని వస్తాడు. వాళ్ళకి బహుశా మందు పుచ్చుకొనే అలవాటు ఉండవచ్చు. ప్రొఫెసర్ గాడ్‌బోల్‌కి కొన్నింటి విషయంలో పట్టింపులు ఉన్నాయి, కొన్నింటిని పెద్దగా పట్టించుకోడు. టీ, స్వీట్లు లాంటివి ఎవరు చేసినా తింటాడు. అన్నం, కూరలూ మాత్రం బ్రాహ్మణుడే  వొండాలి. మాంసం తినడు. కనీసం కేకులని కూడా రుచి చూడడు - వాటిలో గుడ్లు కలుస్తాయి కనుక. గొడ్డు మాంసం ఎవరు తిన్నా సహించడు. కానీ అతని ఉద్దేశ్యంలో తాను తప్ప మరెవరైనా మేక మాంసం కానీ, పంది మాంసం కానీ తినవచ్చు. ఇక అజీజ్ విషయానికి వస్తే జనాలు పంది మాసం తినడం విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. నవలలో ఆసాంతమూ ఇటువంటి క్రాస్-కల్చరల్ విషయాల విశ్లేషణ  ఉంటుంది.

మరాబార్ గుహలు అన్నీ ఒకేలాగ ఉంటాయి. ఐదు అడుగుల ఎత్తు ఉన్న సొరంగం సుమారు ఎనిమిది అడుగుల లోపలికి ఉంటుంది. సొరంగం చివర ఇరవై అడుగుల వ్యాసంతో వర్తులాకారపు గుహ ఉంటుంది. మొదటి గుహ ఎలా ఉంటుందో, నాలుగోది, పద్నాలుగోదీ, ఇరవైనాలుగోది... ప్రతీ గుహా అలాగే ఉంటుంది. రాతిమీద చెక్కుబడికానీ, గుహల దగ్గర పట్టిన తేనె పట్లు కానీ, గబ్బిలాలు కానీ.. అన్నీ ప్రతీ గుహదగ్గరా ఒకేలా ఉంటాయి. ఎవరైనా వాటిని చూసి వచ్చిన తరువాత నచ్చాయా, లేదా అని చెప్పడం కష్టం. అద్భుతం అని వర్ణించడం అసాద్యం. విసుగు పుట్టించే ఒకేరకమైన గుహలు ఎవరికైనా ఉత్సాహాన్ని ఇస్తాయా? మరాబార్ గుహల యొక్క ఇంకొక విచిత్రం ఏమిటంటే - ప్రతిధ్వని. గుహల్లో ఏ చప్పుడు చేసినా, అది గోడల్ని తాకి `భౌం!` అనే పెద్ద శబ్ధంగా మారి, మళ్ళీ మళ్ళీ తరంగితమౌతుంది. ఇటువంటి ప్రతిధ్వనికే మిసెస్ మూర్‌కి మూర్చ వచ్చినంత పనై, మొదటి గుహని సందర్శించిన తరువాత మిగిలిన వాటికి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. ఒక స్థానిక గైడ్ సాయంతో కేవలం అజీజ్, క్వెస్టెడ్‌లు మిగిలిన గుహలని చూడడానికి వెళతారు.   మార్గ మధ్యంలో క్వెస్టెడ్ అజిజ్‌ని `మీకు పెళ్ళయ్యిందా?` అని అడుగుతుంది.  అజీజ్ `అవునని` చెపుతాడు. క్వెస్టెడ్‌కి ముసల్మాన్‌లలో ఉండే భహుభార్యత్వం గురించి తెలుసు. ఆ దృష్టితోనే `ఎంతమందిని చేసుకొన్నారు?` అని అడుగుతుంది. నిజానికి అజీజ్‌కి ఒకేసారి పెళ్ళవుతుంది. వాళ్ళకి ఇద్దరు బిడ్డలు కలిగిన తరువాత భార్య మరణిస్తుంది. ఆమె అంటే ప్రేమతో మరొక వివాహానికి మొగ్గుచూపడు. ఈ నేపద్యంలో క్వెస్టెడ్ అడిగిన ప్రశ్న అతనిని కొంచెం నొచ్చుకొనేలా చేస్తుంది.  తను నొచ్చుకొన్న విషయాన్ని క్వెస్టెడ్ దగ్గర వ్యక్తం చెయ్యకుండా, ఆమెనుంచి కొంతదూరం వెళ్ళి ఓ సిగరెట్ కాలుస్తూ సాధారణ స్థితికి రావడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలోనే క్వెస్టెడ్ గైడ్‌ని కూడా విడిచిపెట్టి ఓ గుహలోనికి వెళ్ళిపోతుంది. ఏ గుహలోనికి వెళ్ళిందో గైడ్‌కూడా సరిగా గమనించడు. ఆమెని వొంటరిగా  విడిచిపెట్టినందుకు అజీజ్ కోపంగా గైడ్‌ని కొట్టడంతో, వాడు అక్కడినుంచి పారిపోతాడు. అజీజ్ ఆమెని పిలుస్తూ ఎన్ని గుహలు వెతికినా ఉపయోగం ఉండదు.  ఇంతలో కొండదిగువన మోటార్‌కార్ శబ్ధం వినిపిస్తుంది. క్వెస్టెడ్ కారులో వెళ్ళిపోవడం అతను కొండ పైనుంచి గమనిస్తాడు. పిక్నిక్ నుంచి మిగిలినవాళ్ళు అందరూ రైలులో చంద్రపూర్ తిరిగి రావడంతోనే క్వెస్టెడ్ పైన అత్యాచార ప్రయత్నం చేశాడనే అభియోగంతో అజీజ్‌ని పోలీసులు నిర్భందిస్తారు.

అజీజ్ తప్పుచేసి ఉండడని ఫీల్డింగ్ బలంగా నమ్ముతాడు. ఆంగ్లేయుల్లో అతనొక్కడే అజీజ్ పక్షం. అజీజ్ తరపున కోర్టులో వాదించడానికి హమీదుల్లాతో పాటూ అమృతరావ్ అనే హిందూ వకీల్‌ని కూడా ఏర్పాటు చేసుకొంటారు. తీర్పుచెప్పబోయే జడ్జ్ - దాస్ అనే భారతీయుడు. అజీజ్ కేసు కోర్టుకి వస్తుంది. జనాలతో కిక్కిరిసిన కోర్ట్ హాలులో వాదోపవాదాలు జరుగుతాయి. అజీజ్ నిరపరాధి అని సాక్ష్యం చెప్పగలిగిన సాక్షి మిసెస్ మూర్ కూడా అందుబాటులో లేదు. ఆమెని అప్పటికే ఇంగ్లండ్ పంపించివేస్తారు. కోర్టు కేసు జరుగుతున్న సమయంలోనే మిసెస్ మూర్ ఇంగ్లాండ్ వెళుతూ, షిప్‌లోనే చనిపోతుంది. చిట్టచివరికి అడెలా క్వెస్టెడ్‌ని ఆమె కేసుని రిజిస్టర్ చేసిన మిష్టర్ మెక్‌బ్రైడ్ ప్రశ్నిస్తూ సంఘటన జరిగిన గుహలోనికి ఆమె వెంట అజీజ్ కూడా వెళ్ళాడా అని అడుగుతాడు. జరిగిన విషయాలన్నీ ఆమె స్మృతిపదంలో కదులుతూ ఉంటాయి - ఆమె ఒక్కొక్కటీ జ్ఞాపకం చేసుకొంటుంది. అడేలాకీ తాను గుహలోనికి వెళ్ళడం కనిపిస్తూ ఉంది. `వెనుకే అజీజ్ వచ్చాడా?` అని మెక్‌బ్రైడ్ అడుగుతున్నాడు. అజీజ్ వెనుకనే రావడం గురించిన జ్ఞాపకం కోసం వెతుక్కొంటుంది - కానీ, అజీజ్ సంఘటనా స్థలంలో ఎక్కడా ఉన్నట్టు ఆమెకి జ్ఞాపకం రావడం లేదు! కొంత సమయం తీసుకొని తాను పొరపాటు పడ్డాననీ, అజీజ్ తన వెంట గుహలోనికి రాలేదని చెపుతుంది.  కేసు దూది పింజలా తేలిపోయింది. జడ్జ్ అజీజ్ నిరపరాధి అని తీర్పుచెప్పాడు. చివరినిమిషంలో అంతా తల్లక్రిందులు చేసిన అడేలాని విడిచి పెట్టి ఆంగ్లేయులందరూ వెళ్ళిపోతారు. తప్పని సరి పరిస్థితుల్లో ఫీల్డింగ్ ఆమెని తన ఇంటికి తీసుకొని వెళతాడు.

అజీజ్‌కి అడెలా క్వెస్టెడ్ అంటే కోపం. హమీదుల్లా లాంటి స్నేహితుల చెప్పుడు మాటలు విని ఫీల్డింగ్‌కి అడెలా క్వెస్టెడ్‌తో సంబంధం ఉందని అనుమానిస్తాడు అజీజ్. అడెలా మంచితనం గురించి ఫీల్డింగ్ చెప్పడానికి ప్రయత్నించినా వినడు. అడెలా ఇంగ్లాండ్ వెళ్ళిపోతుంది. తరువాత కొంతకాలానికి ఫీల్డింగ్ కూడా దేశం విడిచి వెళ్ళిపోతాడు. అజీజ్ చంద్రపూర్‌కి చాలా దూరంలో ఉన్న మౌ అనే హిందూ రాజ్యానికి వెళ్ళి, రాజుగారికి వ్యక్తిగత వైద్యుడిగా ఉంటాడు. అజీజ్‌కి ఈ ఉద్యోగం గాడ్‌బోల్ వల్ల వస్తుంది. నవల చివరి భాగంలో ఫీల్డింగ్ మళ్ళీ భారతదేశానికి - మౌ ప్రాంతానికి పాఠశాలల తణికీ అధికారి హోదాలో వస్తాడు. అజీజ్, ఫీల్డింగ్‌లు కలుస్తారు. ఫీల్డింగ్ పెళ్ళిచేసుకొన్నాడని తెలుస్తుంది. క్వెస్టెడ్‌నే అయి వుంటుందని అజీజ్ అనుకొంటాడు. కానీ, అది నిజం కాదు. ఫీల్డింగ్ పెళ్ళి చేసుకొన్న వ్యక్తి మిసెస్ మూర్ కూతురు స్టెల్లా - చంద్రాపోర్ మెజిస్ట్రేట్ రోనీ హీస్లాప్‌కి సవతి సోదరి. అజీజ్ సంతోషిస్తాడు. మిత్రుల మధ్య అపోహలు అన్నీ తొలిగి పోయాయి. `ఇప్పుడు మనం మళ్ళీ స్నేహితులుగా ఉండవచ్చు కదా?` అని ఫీల్డింగ్ అజీజ్ ని అడుగుతాడు. కానీ నింగీ, నేలా `ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు,` అన్నట్టు అనిపిస్తాయి.
బరాబర్ గుహలు
 ఈ.ఎం.ఫోస్టర్ (1879 - 1970) లండన్లో జన్మించాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే కేంబ్రిడ్జ్ నుంచి వచ్చే ది ఇండిపెండెంట్ రివ్యూ అనే న్యూస్‌పేపర్‌కి ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టాడు. క్రమంగా చిన్న కథలు, ఆ తరువాత నవలలు రాశాడు. వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రెడ్, ది లాంగెస్ట్ జర్నీ, ఏ రూం విత్ ఎ వ్యూ, హోవార్డ్స్ ఎండ్ లాంటి నవలలు రాసినా ది పాసేజ్ టు ఇండియానే ఫోస్టర్ యొక్క అత్యుత్తమమైన నవల. ఈ నవల తరువాత ఫోస్టర్ మరి ఏ నవలా రాయలేదు. భారతీయుల దృక్పదాన్ని తన పుస్తకంలో అంత బాగా రాయడానికి కారణం ఫోస్టర్ రెండుసార్లు భారతదేశానికి రావడమే. పాట్నా దగ్గర ఉన్న బరాబర్ గుహలని కూడా సందర్శించాడట. అందుకే వాటిని మరాబార్ గుహలుగా నవలలో చూపించాడు. తనది కాని జాతి గురించి, వలస పాలనలో వాళ్ళు పడే సంఘర్షణ గురించి భారతీయుల పక్షం వహిస్తూ రాయడం గొప్ప విషయం!

నాకు ఇష్టమైన నవలల్లో ఇది వొకటి. అందుకే ఈ బ్లాగ్‌లో ఈ టపా. నవల సినిమాగా వచ్చింది. ఇక్కడ చూడవచ్చు.

© Dantuluri Kishore Varma 

4 comments:

  1. మీ సమీక్ష చాలా బావుంది. చాలా ఏళ్ల తరువాత మళ్ళీ ఆ మంచి నవలని గుర్తుకి తెచ్చారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. చాలా బాగా రాశారండీ! ఈ నవల చదివి ఉన్నా కూడా నాకు మాత్రం ఆ సినిమానే కళ్ళ ముందు కదుల్తూ ఉండి పోయింది మీ పరిచయం చదువుతుంటే . థాంక్ యూ

    ReplyDelete
    Replies
    1. నవల నుంచి పెద్దగా డీవియేషన్ లేకుండా సినిమా కూడా చాలా బాగుంటుంది సుజాతగారు. మీ స్పందనకి ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!