కర్మ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది పని. మనంచేసే ప్రతీపనీ కర్మే. రెండవది, మనం చెసే పనులవల్ల సంప్రాప్తించే ఫలితం. ఏదయినా అనుకోనిది జరిగినపుడు, చెడు సంభవించినప్పుడు నుదుటిమీద బొటనవేలితో అడ్డంగా గీసుకొని, `అంతా మనకర్మ!` అనుకోవడం చూస్తూ ఉంటాం. ఇదివరలో మనం చేసిన పనుల యొక్క ఫలితంగా అలా జరిగిందని దీని అర్థం.
ఏదయినా ఒక సంఘటనో, చర్యో జరిగినప్పుడు దానికి ప్రతిస్పందిస్తూ మనం నవ్వడమో, ఏడవడమో, ఆ చర్యకి కారణం అయినవాళ్ళని తిట్టడమో, ప్రశంసించడమో చేస్తాం. ఈ ప్రతిస్పందనలన్ని మనవ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపిస్తాయి. అప్పుడెప్పుడో ఒకహీరో, ఒకకమేడియన్ బోటులో షికారుకి వెళ్ళారు. నది మధ్యలోకి వెళ్ళాక మెరక వేసిన ఇసుకకి గుద్దుకొని, బోటుకి అడుగు భాగంలో ఒక పగులు ఏర్పడింది. విపరీతంగా నీళ్ళు బోటులోనికి రావడం ప్రారంభించాయి. ఇక కొన్ని క్షణాల్లో బోటు మునిగిపోబోతుండగా వీరోచితమైన పాత్రలుచేసే హీరో బోరుమని ఏడిస్తే, కమేడియన్ మాత్రం నిబ్బరంగా ఉన్నాడట. వేరే బోటువాళ్ళు పరిస్థితిని గమనించి వాళ్ళిద్దరినీ రక్షించారు. కానీ, హీరోగారి ధీరత్వం మాత్రం బట్టబయలయ్యింది.
ఉదాత్తమైన వ్యక్తిత్వం నిర్మించుకోవడం మనచేతుల్లోనే ఉంది. ఒక్కోసారి ఏవో చర్యలకి ప్రతిచర్యలుగా కాకుండా మనకు మనమే కర్మలు చేస్తుంటాం. ధనంకోసమో, కీర్తికోసమో, అధికారంకోసమో, ముక్తికోసమో, ఇదివరలో మనం చేసిన తప్పుని సరిద్దికొనే ఉద్దేశ్యంతో ప్రాయశ్చిత్తంగానో ఈ పనులు చేస్తాం. ఇవన్నీ ఫలితాలని ఆశించి చేసే పనులు. ఏ ఫలితం ఆశించకుండా కర్మలను ఆచరించడం ఉత్తమమైన పద్దతి కానీ అలా చెయ్యడం చాలా కష్టమని విజ్ఞులు అంటారు. వీటికి పూర్తి వ్యతిరేకంగా అధమమైన చర్యలు కొన్ని ఉంటాయి. కొంతమంది రాజకీయనాయకులని, ప్రభుత్యోద్యోగులని, వ్యాపారస్తులని చుస్తూ ఉంటే అధమమైన కర్మలు అంటే ఏమిటో తెలుస్తుంది. ప్రజాధన్నాన్ని వాళ్ళ తాతగారిసొమ్ములా వేల కోట్లలో మింగేస్తూ, నిర్లజ్జగా తిరిగేస్తూ ఉంటారు కొందరు నాయకులు. ప్రజలు చెల్లించిన పన్నులని పెద్ద, పెద్ద పే పేకెట్లగా జీతాలు అందుకొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఏపనీచేయ్యితడవకుండా చెయ్యరు. ప్రతీ చిన్నదానికీ లంచం కావలసిందే. ఇక మోసపూరిత వ్యాపారులు ఎక్కువలాభాలకోసం ప్రతీదీ కల్తీ చెయ్యగలరు. రోగులు వాడే మందులు, పసిపిల్లలకు పట్టే పాలపొడి, వంటల్లో వాడే నూనె... అదీ, ఇదీ లేదు.
తత్వశాస్త్రం గురించి మాట్లాడుకొంటున్నప్పుడు కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఉదాహరణకి ఇటువంటి కర్మల గురించిన చర్చలో `ఆత్మ శాశ్వతమైనది, కర్మల యొక్క ఫలితాలను తనతో తీసుకొని వెళుతుంది` అనే విషయాల మీద నమ్మకం ఉంచాలి. స్వామీ వివేకానంద అంటాడు, `ముందుజన్మల కర్మల ఫలితంగా మనకు కలిగిన అర్హత వల్లే మనం ఏదయినా పొందగలం,` అని. దీనికి ఒక చక్కని ఉదాహరణకూడా చెపుతాడు. మూర్ఖుడు ఒక లైబ్రరిలో ఉన్న పుస్తకాలన్నింటినీ ఇంటికి తెచ్చుకోవచ్చు కానీ, `ఎన్ని చదువుతాడు?` అనేది అతని మునుపటి కర్మలద్వారా పొందిన అర్హతపైన ఆధారపడి ఉంటుంది అని. అలాగే ధనం కూడా. కొన్ని వేల కోట్లు అక్రమంగా గడించినవాళ్ళు అనుభవించగలిగేది ఎంత?
మునుపటి కర్మలవల్ల పొందిన అర్హత కారణంగా ఇప్పుడు ఇలా ఉన్నాం. కాబట్టి, ఇప్పటి పనుల ఫలితంగా భవిష్యత్తులో మనకి మంచిఅర్హత లభించాలంటే ఏమిచెయ్యాలి? దీనికి సమాదానం నిష్కామ కర్మ అని చెపుతారు. పైన చెప్పుకొన్నట్టు పలితం ఆశించకుండా చేసే పని ఉత్తమమైనది, దుర్లభమైనది. జీతం తీసుకొకుండా, ప్రమోషన్ ఆశించకుండా ఉద్యోగం చేస్తాను; లాభం లేకుండా వ్యాపారం చేస్తాను అంటే ఎవరికీ కుదరదు. కాబట్టి మధ్యేమార్గంగా కనీసం ఎవరినీ మోసం చెయ్యకుండా వ్యాపారం, లంచాలు తీసుకోకుండా ఉద్యోగం, ప్రక్కవాడికి గోతులుతియ్యకుండా పని, ప్రజాదనాన్ని కబళించకుండా పరిపాలనా చేస్తే కర్మల ఫలితంగా వచ్చే అర్హతలని పెంచుకోవచ్చు!
మునుపటి కర్మలవల్ల పొందిన అర్హత కారణంగా ఇప్పుడు ఇలా ఉన్నాం. కాబట్టి, ఇప్పటి పనుల ఫలితంగా భవిష్యత్తులో మనకి మంచిఅర్హత లభించాలంటే ఏమిచెయ్యాలి? దీనికి సమాదానం నిష్కామ కర్మ అని చెపుతారు. పైన చెప్పుకొన్నట్టు పలితం ఆశించకుండా చేసే పని ఉత్తమమైనది, దుర్లభమైనది. జీతం తీసుకొకుండా, ప్రమోషన్ ఆశించకుండా ఉద్యోగం చేస్తాను; లాభం లేకుండా వ్యాపారం చేస్తాను అంటే ఎవరికీ కుదరదు. కాబట్టి మధ్యేమార్గంగా కనీసం ఎవరినీ మోసం చెయ్యకుండా వ్యాపారం, లంచాలు తీసుకోకుండా ఉద్యోగం, ప్రక్కవాడికి గోతులుతియ్యకుండా పని, ప్రజాదనాన్ని కబళించకుండా పరిపాలనా చేస్తే కర్మల ఫలితంగా వచ్చే అర్హతలని పెంచుకోవచ్చు!
ఆత్మమీద, కర్మఫలితాలమీదా ఏమాత్రం నమ్మకం లేకపోయినా కూడా, ఇలా చెయ్యడంవల్ల ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవచ్చు. తలయెత్తుకొని జీవించవచ్చు.
© Dantuluri Kishore Varma
Karma Siddantam Gurinchi Chala baga chepparandi...
ReplyDeleteమీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది శ్రీనివాస్‌గారు.
Delete