Pages

Thursday, 26 July 2012

సర్పవరం శ్రీభావనారాయణ స్వామి దేవాలయం

సర్పవరం శ్రీభావనారాయణ స్వామి దేవాలయం:

మన కాకినాడలో, సర్పవరం జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైనదని చెప్పబడుతున్న ఒక దేవాలయం ఉంది! అదే సర్పవరం శ్రీభావనారాయణ స్వామి దేవాలయం. ఎత్తైన గాలిగోపురం, విశాలమైన ప్రాంగణం, పురాతనంగా కనిపించే మండపమూ, ప్రవేశద్వారాలూ, నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంబమూ… మనకి ఒక కొత్త అనుభూతి కలుగజేస్తాయి. గాలిగోపురానికి ఎదురుగా రోడ్డుకి అవతలివైపు నారదుడు స్నానం చేశాడని చెప్పబడే కొలను ఉంది.
గాలిగోపురం

ఈ ఊరికి సర్పవరం అనే పేరు ఎందుకు వచ్చింది?:

కశ్యప, కద్రువ దంపతులకు చాలామంది సర్పరూప సంతానం ఉంటారు. జనమేజయుడనే చక్రవర్తి చేస్తున్న సర్పయాగంలో వారందరూ ఆహుతి కాబోవుచున్న సమయంలో వారిలో అనంతుడనే సర్పము విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి ఆ ఆపదనుంచి రక్షించబడతాడు. అనంతుడు తపస్సు చేసిన ఆ చోటనే విష్ణుమూర్తిని మూల భావనారాయణ స్వామి గా ప్రతిష్ఠ చేశాడట. ఇది పురాణాలలో చెప్పిఉన్నందున, ఈ ప్రతిష్ఠని పురాణవ్యక్తమైన మూర్తి అంటారు. ఒక సర్పముచే ప్రతిష్ఠించబడిన మూర్తి గల క్షేత్రం కనుక ఈ ఊరిని సర్పవరం అని పిలుస్తారు.   
నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంబo 

 స్వామిని భావనారాయణ స్వామి అని ఎందుకు పిలుస్తారు?:

ఒకసారి నారద మహర్షి దేవతలసభలో 'విష్ణుమాయను తెలుసుకోవడం నిరంతర నారాయణ జపం చేసే తనకు సాధ్యమని ' అన్నాడట. తరువాత కొంతకాలానికి ఆయన భూలోక సంచారంచేస్తూ ఒక సుందరమైన సరస్సు చూసి, అక్కడ స్నానము చేయవలెనని తలచి, ఆసరస్సులో మునిగి తేలేసరికి విష్ణుమాయ వలన స్త్రీ రూపం పొదుతాడు.స్త్రీరూపంలో ఉన్న నారదుడిని నారదస్త్రీ అని వ్యవహరిస్తారు. 
శ్రీభావనారాయణ స్వామి
ఆమె పీఠికాపుర మహారాజుని వివాహమాడి 60 మంది సంతానాన్ని కంటుంది. వారి పేర్లే 60 తెలుగు సంవత్సరాల పేర్లని చెబుతారు.పొరుగు రాజ్యంతో జరిగిన యుద్దంలో నారదస్త్రీ యొక్క భర్తా, 60 మంది సంతానమూ మరణిస్తారు. అప్పుడు ఆమె ఆకలిబాధతో తనవారినిపోగొట్టుకొన్న దుఖా:న్ని కూడా మరచి అలమటిస్తుండగా ఒక బ్రాహ్మణుడు అక్కడ ఉన్న సరస్సులో ఆమె ఎడమచేయి తడవ కుండా స్నానం చెయ్యమని చెబుతాడు.  
నారదుడు స్నానం చేశాడని చెప్పబడే కొలను 
అతను చెప్పిన విధంగానే సరస్సులో స్నానం చేసి భయటకు వచ్చేసరికి ఆమెకి అసలు రూపం వస్తుంది కానీ ఎడమ చేతికి ఉన్న గాజులు అలానే మిగిలిపోతాయి. బ్రాహ్మణుడు ఎక్కడా కనిపించడు. నారద మహర్షి విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి వాటిని వదిలించుకొంటాడు. అప్పుడు నారద మహర్షి రాజ్యలక్ష్మీ సమేత శ్రీ భావన్నారాయణ స్వామిని ప్రతిష్ఠిస్తాడు. నారదుని గర్వమనే భవరోగాన్ని వదిలించిన స్వామి కనుక ఈయనను భావన్నారాయణ స్వామి అంటారు. ఋషిచే  ప్రతిష్ఠించబడినది కావున ఈ క్షేత్రాన్ని ఆౠషం అంటారు.             
పురాతనంగా కనిపించే మండపo 

ఇక్కడి విశేషం ఏమిటి?:

ఇక్కడ స్వయంభూగా వెలసిన పాతాళ భావనారాయణ స్వామికూడా ఉంది. ముగ్గురు మూర్తులున్న దీనిని త్రిలింగ క్షోణి వైకుంఠము అంటారు. శ్రీ కృష్ణదేవరాయల తండ్రి వసంతభోగరాయలు నిర్మించిన మండపం ఈ దేవాలయంలో ఉంది. ఈ విషయం ఇక్కడి శాశనాల వల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడంవల్ల 108 నారాయణ క్షేత్రాలు దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు.
పురాతనంగా కనిపించే మండపo 

విశేషంగా జరిగే కార్యక్రమాలు ఏమిటి?: 

మాఘమాసంలో నాలుగు ఆదివారాలూ తిరుణాళ్ళు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణం ఘనంగా జరుగుతుంది.
Visit this ancient temple and....
Have a happy darshan!

© Dantuluri Kishore Varma

వామ్మో, ఇలా కొడుతున్నారేంటయ్యా...!


వేరే రాష్ట్రం నుంచి ముంగేరీ కాకినాడ వచ్చాడు. రోడ్డుమీద నడుస్తూఉండగా, అతనికి కత్రీనా కైఫ్ లాంటి ఒక అందమైన అమ్మాయి ఫోటో దొరికింది. దానివెనుకవైపు చక్కని చేతివ్రాతతో ఏదో రాసిఉంది. భాష తెలియని అతను `ఒంటి`మామిడి జంక్షన్ దగ్గర ఒక ఆసామికి చూపించాడు. అతను ముంగేరీ వైపు అనుమానంగా చూసి, లాగి చెంపమీద ఒక్కటి కొట్టాడు.

ముంగేరీ అంతతొందరగా పట్టు వదిలే రకం కాదు. ఫోటోని `టూ` టౌన్ దగ్గర వేరొక వ్యక్తికి చూపించాడు.అతనుకూడా మొదటి వ్యక్తిలాగే ముంగేరీని చూసి,రెండు చెంపలూ వాయించాడు. `మూడు`లైట్ల జంక్షన్ దగ్గర మూడు తన్నులు, `చార్`టీస్ దగ్గర నాలుగు గుద్దులూ తిన్నతరువాత ముంగేరీ ఓపిక అయిపోయింది. 

ఈసారి అలాక్కదని, తను ఉంటున్న హోటెల్ లో రూం బోయ్ కి ఫోటో చూపించకుండా విషయం అంతా వివరించి, కాకినాడలో ఎక్కడ ఈ సమస్యకి సమాదానం దొరుకుతుందో చెప్పమని బ్రతిమాలాడు.

రూం బోయ్ సమాదానం: "మీరు 50 బిల్డింగుల దగ్గర కాని, 100 బిల్డింగుల దగ్గర కాని ప్రయత్నించండి."

© Dantuluri Kishore Varma 

శ్యామలా సదన్

కాకినాడలో శ్యామలా సదన్ అనే అపార్టుమెంట్ ఉన్నట్టుండి ఒకరోజు (సెప్టెంబర్ 16, 2011 న ) అకస్మాత్తుగా గ్రౌండ్ ఫ్లోర్ భూమిలోనికి దిగబడిపోయింది. భూకంపం సంభవించినప్పుడు ఇలా జరిగినా ఆశ్చర్యం లేదుకానీ, ఆరోజు అటువంటిది ఏమీ జరగలేదు. నిట్టనిలువుగా భూమిలోనికి కుంగి పోయినా భవనం కుప్పకూలిపోకపోవడం, ఏ విధమైన ప్రాణ నష్టం జరగకపోవడం విచిత్రాలలోకెల్లా విచిత్రమనే చెప్పాలి.ఈ సైట్లో భూమి అడుగున మట్టిపొరలు గట్టిగా లేకపోవడంవల్ల ఇది జరిగి ఉండవచ్చని తరువాత అధికారులు నిర్ధారణకి వచ్చారు. భూమిలోనికి కృంగి పోవడం వల్ల నివాశయోగ్యం కాకుండా పోయిన శ్యామలా సదన్ ని 25-02-2012 న కూల్చివేశారు.  
In the evening of that day, the building suddenly sank into the ground as if by the effect of an earthquake. Though the complete ground floor went down, the building did not collapse - it was like a miracle. Fortunately there were no fatalities, a few people were injured. Authorities stated that it might be because of loose soil beneath Syamala Sadan.


© Dantuluri Kishore Varma

కోరింగ మడ అడవులు

మడ అడవులు కాకినాడకి సమీపంలో కోరింగ వద్ద ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద మడ అడవులు కొరింగ మాంగ్రూవ్ ఫారెస్ట్. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నయి.  దీనిని అభయారణ్యం గా గుర్తించారు.
నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో మడ అడవులు పెరుగుతాయి. సముద్రతీర ప్రాంతాలలో భూభాగం క్రమంగా సముద్రంలో కలసిపోవడం(సాయిల్ ఎరోజన్), గ్లోబల్ వామింగ్ ప్రభావం వలన సముద్రమట్టం పెరిగి తీరప్రాంతాలు మునిగిపోవడం వంటి ప్రమాదాలనుంచి మడ అడవులు కవచంగా ఉండి తీరానికి రక్షణ కల్పిస్తాయి. సముద్రానికి, తీరానికి మధ్య ఇవి షాక్ అబ్జాబర్లలాగ ఉపయోగపడతాయి. తీర ప్రాంతానికి ఏ విధమైన మానవ నిర్మిత కట్టడాలు ఇవ్వలేని రక్షణని మడ అడవులు ఇస్తాయి. 

జీవన వైవిధ్యం(బయోడైవర్సిటీ)ఈ అడవులవల్ల బాగా సంరక్షించడానికి అవకాశం వుంటుంది. ముఖ్యంగా సముద్రజలాలలో పెరిగే రొయ్యలు, చేపలు, మిగిలిన జీవజాలం అభివృద్ధి చెందుతుంది.   సీ ఆటర్స్ (otter) అనబడే నీటి జంతువులు ఇక్కడ పెద్దసంఖ్యలొ కనిపిస్తాయి.
తెల్ల కొంగలు, అరుదుగా వలస పక్షులు (migratory birds) కనిపిస్తాయి.
Photo: The hindu business line
సుమారు ఒక కిలోమీటరు పొడవయిన చెక్కల వంతెన ఇక్కడి ప్రత్యేకత. చిత్తడినేలలొ పెరిగే చెట్లయొక్క వేర్ల వ్యవస్త భిన్నంగా ఉంటుంది. భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్ తీసుకొనే అవకాసం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి. అందుకే ఇక్కడి చెట్లు ఊడలని పోలిన వేర్లను కలిగి ఉంటాయి. కోరంగి అడవిలో నిర్మించిన చెక్కల వంతెనవల్ల ఈ విషయాలను గమనించడానికి అవకాశం ఉంటుంది.          
వర్షాకాలం వెళ్ళిన తరువాత అక్టోబర్ నుంచి మే వరకు కోరింగ అభయారణ్యాన్ని సందర్సించడానికి అనువయిన సమయం. బోట్లమీద మడ అడవుల గుండా సముద్రం వరకూ సుమారు 30 నిమిషాల సేపు ప్రయాణించగలిగే సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. 
బయోడైవర్సిటీని ప్రత్యక్షంగా చూపడానికి, విజ్ఞానాన్నీ, వినోదాన్నీ ఒకే చోట పొందడానికి ఎకో టూరిజం - మడ అడవుల సందర్శన.   
కలర్ ఫుల్ బోట్లు,  చిత్తడినేలలు, సముద్రపుగాలి...You can have great time!  

© Dantuluri Kishore Varma 

స్టేట్ బ్యాంక్ హెరిటేజ్ గేలరీ

కాకినాడలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ వాళ్ళ శాఖ 1864 జనవరి ఒకటిన అద్దెకు తీసుకొన్న భవనంలో ప్రారంభించారు. తరువాత ఓ అరవై ఐదు సంవత్సరాలకి అంటే 1929లో స్వంత భవనంలోనికి మార్చారు. 1.83 ఎకరాలలో నిర్మించిన ఈ బ్యాంక్ భవనం ఇప్పటికీ కాకినాడ మెయిన్ రోడ్‌లో ఉంది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖకి వెనుక వైపు ఈ భవనం ఓ పెద్ద కోటలా ఉంటుంది. శ్రీకాంప్లెక్స్ రోడ్డులో నుంచి ప్రవేశపు గేటు ఉంది. ఈ భవనానికి సంబంధించి మనకాకినాడలో చాలా మందికి తెలియని విశేషాలు కొన్ని ఉన్నాయి. 

2011 ఫిబ్రవరి 9న ఈబిల్డింగ్ లో స్టేట్ బ్యాంక్ హెరిటేజ్ గేలరీని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ బ్యాంక్ యొక్క మొట్ట మొదటి మ్యూజియం ఇదే. మన దేశం లో రెండవది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం …లాంటి పెద్ద నగరాలనివదిలిపెట్టి దీనిని మన కాకినాడ లో ఎందుకు మొదలుపెట్టారని మీకు సందేహం కలగవచ్చు.

అప్పట్లో దక్షిణభారతదేశంలో ఉన్న నాలుగు బ్యాంక్ ఆఫ్ మద్రాస్ శాఖల్లో మన కోకనాడలోనిది ఒకటి. మిగిలిన మూడూ కొచ్చి, కాలికట్, బెంగుళూరులలోఉండేవి. ఆంధ్రప్రదేశ్ లో ఒక వాణిజ్య బ్యాంక్ యొక్క మొట్టమొదటి శాఖ కోకనాడలోఉన్న బ్యాంక్ ఆఫ్ మద్రాసుదే! అంత పురాతనమైన చరిత్ర ఉన్న భవనం కనుకనే స్టేట్ బ్యాంక్ తన హెరిటేజ్ గేలరీని ఇక్కడ ప్రారంభించింది. హెరిటేజ్ గ్యాలరీ అంటే మ్యూజియమే. భారత దేశంలో బ్యాంకుల చరిత్రని తెలుసుకోవడానికి ఈమ్యూజియం సందర్శన బాగా ఉపయోగ పడుతుంది. 

సంక్షిప్తంగా చెప్పాలంటే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవహారాలు నిర్వహించడానికి బ్రిటీష్ వారు బ్యాంకాఫ్ కలకటాని 1806 వ సంవత్సరంలో ప్రారంభించారు. దీనినే వెంటనే బ్యాంకాఫ్ బెంగాల్ గా మార్చారు. తరువాత వరుసగా బ్యాంకాఫ్ బొంబాయ్(1840), బ్యాంకాఫ్ మద్రాసులను(1843) ప్రారంభించారు.  ఈ మూడు బ్యాంకులనీ ప్రెసిడెన్సీ బ్యాంకులని వ్యవహరించేవారు. ప్రస్తుతపు  మన రిజర్వ్ బ్యాంక్ లాగ వీటికికూడా కరెన్సీ ముద్రించి, చెలామణీ చేసే అధికారం ఉండేది. 1921 లో ఈ మూడింటినీ కలిపి ఇంపెరియల్ బ్యాంకాఫ్ ఇండియా గా చేశారు. ఇదే 1955లో స్టేట్ బ్యాంకాఫ్ ఇండియాగా అవతరించింది.

ఇక మన కాకినాడలో ఉన్న ఈ గ్యాలరీ విషయానికి వస్తే - ఇందులో ప్రముఖుల బ్యాంక్ ఖాతా కాపీలు, లెడ్జర్లు, బ్యాంక్ చరిత్రను తెలియజేసే ఫోటోలు, అప్పటి ఫర్నీచర్, ముఖ్యంగా బ్రిటీష్ కాలం నాటి ఈ భవనం - హెరిటేజ్ గేలరీని ప్రశంసించవలసిన విధంగా ఏర్పాటు చేశారు.     

ఇప్పటివరకూ మీరు ఈగేలరీని చూడకపోతే, ఒక్కసారి విజిట్ చెయ్యండి.ప్రతీ మంగళవారం, శుక్రవారాలు సాయంత్రం 3 గంటల నుంచి, 5 గంటలవరకూ సందర్శకులని అనుమతిస్తారు. 


© Dantuluri Kishore Varma 

సామర్లకోటశివాలయం - కుమారారామం

10 వ శతాబ్ధానికి చెందిన కుమారారామం అని పిలువబడే సామర్లకోట (Samalkot) శివాలయం కాకినాడకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.  భీమేశ్వరస్వామి కొలువై ఉన్న పురాతన దేవాలయం ఇది. ఆయన దేవేరి బాలా త్రిపుర సుందరి. లభిస్తున్న శాశనాల ప్రకారం ఈ ప్రాంతాన్నీ పాలించిన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తుంది. క్రీస్తుశకం 892 నుంచి 921 వరకూ కుమారా రామాన్ని రాజధానిగా మొదటి చాళుక్య భీముడు పరిపాలించాడు.  ఈ ఆలయ ప్రాకారాన్ని, మండపాలనీ ఈయనే నిర్మించాడు.  
సామర్లకోట  పంచారామక్షేత్రాలలో(మొత్తం ఐదు శివాలయాలు) ఒకటి.  మిగిలిన నాలుగూ... గుంటూరుజిల్లా అమరావతిలో ఉన్న అమరారామం, తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఉన్న ద్రాక్షారామం, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్న క్షీరారామం, పశ్చిమగోదావరి జిల్లాలోనే భీమవరం గునుపూడిలో భీమారామం.
14వ శతాభ్దం లో శ్రీనాధుడు రచించిన భీమేశ్వరపురాణం లో పంచారామాల వివరం ఉంది. క్షీరసాగరమదనం తరువాత అసురులు  శివుడిని గురించి ఘోరతపస్సుచేసి ఎన్నోవరాలు పొందారు. ఆ గర్వంతో వాళ్ళు దేవతలని అష్టకష్టాలు పెట్టడంతో, శివుడు పాశుపతాస్త్రం ప్రయోగించి వాళ్ళని నాశనంచేస్తాడు. అగ్నిజ్వాలలలో సర్వం ఆహుతి అయినా.. అసురులు పూజించిన శివలింగం మాత్రం అలాగే ఉంటుంది. దానిని అయిదు భాగాలు చేసి, పంచారామాలలో శివుడు  ప్రతిష్టింపచేశాడని  ఈ పురాణం చెపుతుంది.   ముఖ్యంగా ఇక్కడ కుమార స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించిన కారణంగా ఈ ప్రదేశాన్ని కుమారా రామం అంటారు. ప్రతీ సంవత్సరం చైత్ర, వైసాఖ మాసాల్లోసూర్యకిరణాలు ఉదయం పూట భీమేశ్వరస్వామి పాదాలను, సాయంత్రంపూట బాలా త్రిపుర సుందరి అమ్మవారి పాదాలను తాకుతాయి.  ఈ దేవాలయం నిర్మాణంలో ద్రాక్షారామక్షేత్రాన్ని పోలి ఉంటుంది.   రాతితో నిర్మించిన రెండు ప్రాకారాలు - లోపలి ప్రాకారం నుంచి నాలుగువైపులా ప్రవేశ ద్వారాలు ఉంటాయి. లోపలివైపు ఈ గోడ రెండు అంతస్తులుగా కట్టబడింది. 
స్థూపాకారపు శివలింగం, ఏకశిలా నంది,  కోనేటి పుష్కరిణి, చిన్ని నమూనా దేవాలయము, కాంతులీనే ఉన్నతమైన ధ్వజ స్థంభము, శిల్పకళా సంపద.....  వందస్థంభాల మండపం... ఈ దేవాలయ విశేషాలు. 

బయటి ప్రాంగణంలో  రాతితో నిర్మించిన మందిరం, మొదలు చుట్టూ చెట్టునీడలో భక్తులు కూర్చోవడానికి గుండ్రంగా కట్టిన అరుగు, బ్యాక్‌గ్రౌండ్లో రాతి ప్రాక్రారం, పొడవుగా సాగిన నీడలు... మంచి చిత్రకారుడు ఎవరైనా దీనిని వాటర్ కలర్స్‌తో అద్భుతమైన బొమ్మ గీయవచ్చు.
సామర్లకోటశివాలయం -  కుమారారామం కనీసం ఒక్కసారయినా చూడవలసిన ప్రదేశం. ఓం నమశ్శివాయ! 

© Dantuluri Kishore Varma 

దామెర్లరామారావు ఆర్ట్ గ్యాలరీ - రాజమండ్రి

ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళినప్పుడు గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని సందర్శించండి. నిస్సందేహంగా మీకు ఒక గొప్ప రసానుభూతి కలుగుతుంది. దామెర్ల రామారావు, ఆయన భార్య దామెర్ల సత్యవాణి, చేమకూర సత్యన్నారాయణ, రామారావుగారి మిత్రుడు వరదా వెంకటరత్నం వంటివారి చిత్రాలని ఈ ఆర్ట్‌గేలరీలో రెండు బ్లాకుల్లో ప్రదర్శనకి ఉంచారు. అద్భుతమైన ఆయిల్ పెయింటింగ్స్, వాటర్‌కలర్ చిత్రాలు, పెన్సిల్ స్కెచ్‌లు అన్నో సందర్శకులని సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. దామెర్ల రామారావు స్మారక గ్యాలరీని 1957వ సంవత్సరంలో దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ప్రారంభించారట.



దామెర్ల రామారావు బ్రతికింది కేవలం 28 సంవత్సరాలు (1897 - 1925). ఆ స్వల్ప కాలంలోనే ఎన్నో అద్భుతమైన చిత్రాలు గీసి, గొప్ప చిత్రకారుడిగా పేరు పొందాడు. దామెర్ల రామారావు ఆంద్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ని స్థాపించారు. ఈయన చిత్రాలు, బొంబై, ఢిల్లీ, కలకత్తా, టోరెంటో, లండన్ లలో ప్రదర్శించబడ్డాయి.  ఎన్నో తైల వర్ణచిత్రాలు, జలవర్ణ చిత్రాలు, పెన్సిల్తో గీసినవి మంత్రముగ్దుల్ని చేస్తాయి. రేఖా విన్యాసం అబ్బురపరుస్తుంది. పుష్పాలంకారం, బావి వద్ద, కార్తీకపూర్ణిమ, కృష్ణలీల, శిద్ధార్థ రాగోదయం లాంటి సన్నివేశ చిత్రాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇవే కాకుండా పోర్త్రైట్‌లు, లాండ్‌స్కేప్ చిత్రాలు లాలిత్యం తొణికిసలాడుతూ చూపరులను విస్మయపరుస్తాయి.

దామెర్ల రామారావు తన చిన్నతనం నుంచే చిత్రకళలో చక్కని ప్రతిభ కనబరిచే వారట. అది గమనించి అప్పటిలో రాజమండ్రీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న కూల్ర్డే గారు తన సొంత ఖర్చులతో రామారావుగారిని బొంబాయిలో జె.జె.స్కూల్ ఆఫ్ ఫైన్  ఆర్ట్స్‌కి శిక్షణ నిమిత్తం పంపించారు. అక్కడి ప్రిన్సిపాల్ దామెర్లవారికి సరాసరి కోర్స్‌లో మూడవసంవత్సరంలో ప్రవేశం కల్పించారు.  23 సంవత్సరాలకే తన శిక్షణ ముగించుకొని రాజమండ్రీ తిరిగివచ్చి, సత్యవాణి అనే చిత్రకారిణిని వివాహం చేసుకొన్నారు. చిత్రకారులకి మోడల్ లభించడం ఎంతో కష్టమైన ఆరోజుల్లో తన భార్య సత్యవేణినే మోడలుగా ఉంచి ఎన్నో కళాఖండాలవంటి చిత్రాలు గీశారు. దామెర్లరామారావు చిన్నవయసులో అకాల మృత్యువాత పడకుండా ఉంటే మరెన్నో అధ్భుతాలు ఆవిష్కృత మయ్యేవి.
రామారావు గీసిన బొమ్మలని అందంగా ముద్రించి పిక్చర్ పోస్టుకార్డులుగా అమ్ముతున్నారు. సావనీర్లుగా కొని ఉంచుకోవచ్చు.

© Dantuluri Kishore Varma 

పులసల పులుసు

ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఎర్రగోదావరి నీరు సముద్రంలో కలిసే సమయంలో ఆస్ట్రేలియాలో పుట్టిన పులస చేపలు సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీదుతాయి. సముద్రంలో ఉన్నప్పుడు వీటిని ఇలస అని పిలుస్తారు. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారిపోతుంది. ఇలస పులసగా మారుతుంది. పులసలు గోదావరి జిల్లాలకే ప్రత్యేకం. తూర్పుగోదావరిజిల్లా కాట్రేనికోన, యానం, దవళేశ్వరం; పశ్చిమగోదావరి జిల్లా సిద్దాంతం  దగ్గర పులసలు దొరుకుతాయి. కేవలం ఒకేఒక్క సీజన్లో అరుదుగా లభ్యం అవడం వలన వీటికి మంచి గిరాకీ ఉంటుంది. కేజీ పులస ధర  వేలల్లో ఉన్నా దూరప్రాంతాలనుంచి కూడా వచ్చి కొనుక్కొని తీసుకువెళతారు. న్యూస్‌పేపర్లలో, టీవీల్లో, కథల్లో, ఇలాంటి బ్లాగుల్లో పులసల రుచిగురించి `అమోఘం, అత్యద్భుతం, అమృతమయం` అని ఊదరగొట్టేస్తూ ఉండడంవల్ల కూడా ఎక్కడెక్కడి నుంచో చేపలప్రేమికులు లొట్టలేసుకొంటూ ఉభయగోదావరి జిల్లాల్లో పులసలు లభించే ప్రాంతాలకి వచ్చేసి, కొనుక్కొంటూ పులస ధర ఆకాశాన్నంటే క్రమంలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. చాలాసార్లు పులసంత రుచి ఉండని ఇలసల్నే పులసలుగా నమ్మించి అమ్మేస్తూ ఉంటారు కనుక, ఈ విషయంలో కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్ళని కొనుక్కొంటున్నప్పుడు ప్రక్కన ఉంచుకోవడం ఉత్తమం.

అతిశయోక్తి అనుకోకుండా నామాట నమ్మండి పులసల పులుసు రుచి నిజ్జంగానే అమోఘం. కాకపోతే సరిగ్గా వొండుకోవాలి. కట్టెల పొయ్యి మీద, మట్టి కుండలో పులస పులుసు వండితే దాని రుచికి సాటే ఉండదు. పులస పులుసుని ఉల్లిపాయలు, వెల్లుల్లి, దనియాలు, జీలకర్ర పేస్ట్, నిలువుగా చీరిన పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు, బెండకాయ ముక్కలు, ఆవకాయ నూనె లతో తయారుచేస్తారు.

వంశీ రాసిన `మా పసలపూడి కథలు` తూర్పు గోదావరి నేటివిటీని చక్కగా అవిష్కరిస్తాయి. మనుషుల స్వభావాలని, జరిగిన సంఘటలని, పల్లెల్ల అందాలని, గోదావరి గలగలల్ని ఆవిష్కరించిన సాహితీ సుమాలు ఇవి. గోదావరి జిల్లాల కథల విరించి - వంశీ రాసిన `చిట్టెమ్మ కాసే చేపల పులుసు` కథలో చిట్టెమ్మ పులసల పులుసు తయారు చేసిన విధానం చదివితే ఎవరికైనా నోరూరడం ఖాయం. సందర్భానుసారంగా ఉంటుందని ఆ నాలుగు ముక్కలూ ఇక్కడ ఉట్టంకిస్తున్నాను చిత్తగించండి.
"ఉల్లిపాయ ముక్కలూ, వెల్లుల్లి పాయరేకలూ, అల్లం, జీలకర్ర, ధనియాలు కలిపి ముద్ద కింద నూరి ఒక సీవండి గిన్నెలో వేసింది. గుప్పెడు పొడుగాటి మిరప పళ్ళని తీసుకొచ్చి రోట్లో వేసి ముతగ్గా దంచి ఇంకో చిన్న గిన్నెలో వేసేకా లోపలికెళ్ళి చాలా వెడల్పాటి మట్టిదాక బయటికి తెచ్చింది. ...... దాకని మండుతున్న చింతపుల్ల పొయ్యి మీద పెట్టి రమణ నువ్వుల గానుగలోంచి తెచ్చిన నువ్వుల నూని అందులో వేసి సెగొచ్చేదాకా కాగేకా నూరిన ముద్దలన్నీ ఒకదాని తర్వాత ఒకటేసి చెక్క గరిటితో దోరగా వేయించేకా అంతసేపు లేత కొబ్బరినీళ్ళల్లో నానేసిన పాత చింతపండుని పులుసుగా పిసికి దాక సగానికి పైగా నిండేలాగ వేసింది. టమాటా పళ్ళు కసకసమంటా పిసికేసి జల్లేసింది. చిటికనవేలు సైజులో కోసిన లేత బెండకాయ ముక్కలేసి ఆ తర్వాత  ఒకో చేప ముక్కా పులుసులో ములిగేలాగ వేస్తా వచ్చింది. అలాగ అన్నీ వేసేసేక దాకకి సరిపడా చేయించిన జల్లిమూకుడు తెచ్చి పైనబెట్టి పొయ్యిలో మండుతున్న చింతపుల్ల లెగదోసింది.

పావుగంట దాటింది.

కుతకుతా ఉడుకుతా బుళుకు బుళుకు మనే బుడగల్తో చప్పుళ్ళు చేస్తుంది దాకలో పులుసు. కమ్మటి పులుసు వాసన నోరురించే వాసన. అలాగ కాసేపు ఉడకనిచ్చి ఆ తర్వాత పొయ్యిలో మండుతున్న చింతపేడుల్ని వెన్నక్కి లాగేసి నీళ్ళు చల్లేసరికి సుయ్యిమంటా ఆరిపోయినియ్యా పుల్లలు.

ఇప్పుడు లోపలున్న చింతనిప్పుల్తో సెగమీద మరుగుతుంది పులుసు. ఇలా మరగడంవల్ల చేపముక్కల్లో సన్నటి ముళ్ళు అన్నీ కరిగిపోతాయంట. అలా కరిగి మరిగి మరిగి కాసేపటికి చక్కటి రుచి వచ్చేలాగ చిక్కబడింది పులుసు. ఇంకాస్సేపయ్యేకా దాక కిందకి దింపేసి వెన్నపూస ముద్ద ఆ పులుసులో వేసి పొయార్పేసింది. మొత్తం వెడంతా పోయి చల్లరేకా సీవండి రేకులో ఉంచుకొన్న ఆవకాయతేట ఆ పులుసులో కలిపేసి `తెల్లరేకా తీద్దారిలే` అనుకుంటా భోషాణం పెట్టెలో పెట్టేసింది.

`అమ్మో ఎంత రుసీ` అంటూ ఎగిరి గంతేసుకొంటా తిన్నారు జనాలు."

Pulasa season has come - get ready to have ambrosial pulasa pulusu
© Dantuluri Kishore Varma

Wednesday, 25 July 2012

సండే మార్కెట్

ఆదివారం మూసిఉన్న షాపు షట్టర్ల ముందు చిన్న చిన్న తాత్కాలికమైన దుకాణాలు వెలుస్తాయి. మెయిన్ రోడ్డులో టౌనుహాలు దగ్గర నుంచి గోల్డ్ మార్కెట్ సెంటర్ వరకూ రోడ్డుకి రెండు వైపులా తోపుడు బళ్ళమీద, సైకిళ్ళ మీదా రకరకాల వస్తువులు అమ్మకానికి వస్తాయి. కాకినాడ ప్రజలూ, సమీపంలోని ఉళ్ళనుంచి ప్రత్యేకంగా షాపింగుకి వచ్చే జనాలతో మెయిన్ రోడ్ కిక్కిరిసిపోతుంది.

బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, చిన్నపిల్లలికి బొమ్మలు, కిచెన్లో ఉపయోగపడే సామాన్లు, సాఫ్ట్ టోయస్, నోవల్టీ ఐటంస్, ఫ్లవర్ వాజులు, వాటిల్లోకి ఆర్టెఫీషియల్ ఫ్లవర్సు, ఇంటిలోకి అలంకరణ వస్తువులు, పోస్టర్లమీద ముద్రించి ఉన్న అందమైన దేవుళ్ళు, సొగసైన సినీతారలు, ముద్దులొలికే చిన్నారులు, మంచి కొటేషన్లు… కాదేదీ అమ్మకానికి అనర్హం అన్నట్టు అన్నీ దొరకుతాయి ఇక్కడ. అన్నింటికంటే ముఖ్యంగా పాతపుస్తకాలు కూడా అమ్మకానికి వస్తాయి.


“సినిమా, బీచ్ తప్పించి ఈఉళ్ళో మరో వినోదం లేదు,” అనే వ్యక్తులు, ఒక్కసారి ఈ మార్కెట్టును నడుస్తూ చూడాలి. 

ఇక్కడ బేరమాడడం ఒక కళ. ఈ విషయంలో మొహమాట పడితే నష్టపోవలసిందే. ఒక వస్తువుని చూపించి, ధర ఎంతో తెలుసుకొని, “నా దగ్గిరి ఇరవై రూపాయలే ఉన్నాయి. ఇత్తే ఇయ్యి, లేపోతే లేదు.” అంటుంది ఒకామె. “యాభై రూపాయలకి ఒక్క రుపాయి కూడా తగ్గేదిలేదు,” అంటాడు అమ్మేవాడు. ఆమె వెళ్ళిపోతున్నట్లు ముందుకు నడుస్తుంది. “సర్లే, నలభై ఇవ్వు,” అంటాడు. ఇంకొక పావుగంట బేరమాడి, పాతిక రుపాయలు చేతిలో పెట్టి, ఆ వస్తువుని పట్టుకొనిపోతుంది. బైక్ మీదో, స్కూటర్ మీదో వచ్చిన వ్యక్తిని – “డబ్బున్న గొప్పోళ్ళు మీరే బేరమాడితే ఎలాబాబు?” అని మధ్యతరగతి ఫాల్స్ ప్రస్టేజ్ ని పొగిడి, అదే వస్తువుని నలభై రూపాయలకి అమ్మేస్తాడు.

చైనా అని పిలువబడే పోర్స్‌లీన్‌తో తయారైన కళాత్మకమైన వస్తువులు అమ్ముతారు - పూలకుండీల దగ్గరనుంచి ఆవకాయజాడీలవరకూ, టీకప్పుల నుండి ఫ్లవర్‌వాజుల వరకూ, అలంకరణ వస్తువుల నుండి డిన్నర్‌సెట్ల వరకూ, యాష్ట్రేల దగ్గరనుండి కొవ్వొత్తుల స్టాండ్‌ల వరకూ. గ్లాస్‌లాంటి మెరుపు, నునుపుదనం, అందమైన డిజైన్లతో రారమ్మని పిలుస్తాయి, కొనమని ఊరిస్తాయి.  

ఎప్పుడో క్రీస్తుపూర్వం 1600 సంవత్సరాలప్పుడే దీనిని చైనాలో వాడేవారట. అందుకే పోర్స్‌లీన్‌ని చైనా అని పిలుస్తారు. మనం తెలుగులో పింగాణీ అంటాం. ఇంతకీ ఇది ఎలా తయారవుతుందో తెలుసా? కేయాలిన్(Kaolin) అనే పదార్థాన్ని(ఇది మట్టిలాంటిదే) పన్నెండువందలనుండి పద్నాలుగువందల డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతవరకూ మరిగించి పింగాణీని తయారు చేస్తారు. ఇంకా చాలా ఇతరపదార్థాలు కూడా కలుపుతారు. ఒక్కోసారి జంతువుల దుమ్ముల పొడిని చేరుస్తారు. ఈ రకంగా తయారు చేసిన పింగాణీని బోన్‌చైనా అని పిలుస్తారు. బోన్‌చైనాతో టీకప్పులూ, డిన్నర్‌సెట్లు తయారు చేస్తారు.

పింగాణీ తయారీలో ఉపయోగించే ముఖ్యమైన ముడిపదార్థం కేయాలిన్ గురించి ఇంకొక ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే దీనిని టూత్‌పేస్టుల్లో, సిరామిక్ టైల్స్‌లో, లైటు బల్బుల్లో, రంగుల్లో, సౌందర్య సామాగ్రిలో కూడా వాడతారట.  

అందమైన సోఫాసెట్ ప్రక్కన ఇండోర్‌ప్లాంట్ పెట్టుకోవాలనుకోండి, అప్పుడు లతల డిజైన్ ఉన్న కుండీలో మొక్కని వేసి, మొదలుచుట్టూ గుండ్రని, నున్నటి రాళ్ళని పేర్చి అలంకరిస్తే లివింగ్ రూం అందం రెట్టింపుఅవుతుంది. బోన్‌చైనా టీసెట్లో అతిధులకి టీ అందిస్తే బాగుంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా, చాలా వస్తువులను లైఫ్‌స్టైల్‌లో కలుపుకోవచ్చు.

మరొకచోట చిన్న తోపుడుబండి మీద వేసుకు వచ్చిన వస్తువులని, “ఏదైనా పదే,” అని అరుస్తూ, అమ్ముతూవుంటాడు ఒకడు. బేరం చేసే అవకాశం లేదు. చూడగానే `డర్ట్ చీప్` అనిపించే ఈ వస్తువులు హాట్ కేకుల్లాగ అమ్ముడుపోతాయి.

ఒక పట్టణం యొక్క ఆత్మ ఆవిష్కృతమవ్వాలంటే అది అక్కడ నివశిస్తున్న సామాన్య ప్రజల ద్వారానే జరగాలి. You can get glimpses of Kakinada`s soul in its Sunday market.


సండే మార్కెట్ అంటే…

పేదవాడి అన్ బ్రాండెడ్ బట్టల షాప్

మధ్య తరగతి షాపింగ్ మాల్

చిన్నపిల్లల తీర్తం

బుక్ లవర్ల స్వర్గం

సృజనాత్మక వస్తువులు అమ్మే బూటీక్

కార్లలో వచ్చి ఆగడానికి సిగ్గు పడే సంత


© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!