యానం పాత బస్టాండ్ దగ్గరకి వచ్చి కాకినాడ బస్ కోసం ఎదురుచూడడం మొదలు పెట్టి గంట దాటింది.
"బస్ కోసం, పోయిన కరెంటు కోసం ఎదురుచూడడం అంత బుద్ది తక్కువపని మరొకటి లేదు,"అని తిడుతున్నాడు ఒక పెద్దాయన.
బస్టాపుకి కొంచెం దూరంలో నిలిపిఉంది ఒక పాసింజర్ ఆటో. దాని వెనుక పేనల్ మీద 'ఆటో రాజానా మజాకా' అన్న కేప్షన్ ఎర్ర అక్షరాలతో రాసి ఉంది.
ఆటో ముందు సీటులో మోకాళ్ళూ, బుర్రా బయటకుపెట్టి కుర్చున్న ఆటోరాజా, నేను ఆటో వైపు చూడటం గమనించి, "రండి సార్, పోదాం," అన్నాడు. వాడలా అడగడం అప్పటికి ఆరోసారి.
"పైకా, పోవడం? హూ!" అన్నడు నాప్రక్కన ఉన్నాయన. "ఆటో ఎక్కితే సరాసరి నరకానికి పోయినట్టే" అనికూడా అన్నడు.
హేంలెట్ స్వగతించిన్నట్లు `టు బి ఆర్ నాట్ టు బి - దటిజ్ ద క్వశ్చన్`. ఆటోలో ఎక్కడమో, బస్ కోసం వేచిఉండటమో తెలియడం లేదు.
"రారా వెళ్దాం. ఇక్కడ నుంచుని టైం వేస్టు," అనుకొంటూ ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళు ఆటో వైపు నడవడంతో, కొంచం తటపటాయించి నేనుకూడా వాళ్ళని అనుసరించాను.
మూడు టిక్కెట్లు ఒకేసారి వచ్చిన ఆనందం ఆటోరాజా మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది."ఎక్కండి," అన్నాడు .
ఒక చేపలమ్మీ, ఓ ఇన్షర్టాయన కొంచెం సర్దుకొని చోటిచ్చారు. ఎక్కి, "పోనియ్" అన్నాం.
ఆటోరాజా పోకెట్ లోంచి కర్చీఫ్ తీసి, దులిపి షర్ట్ కాలర్ లోపలినుంచి మెడచుట్టూ తిప్పి, ముందువైపు ముడివేసుకొన్నాడు. బ్లాక్ గాగుల్స్ తీసి రజనీకాంత్ స్టైల్ లో వేళ్ళమీద `ట్రియుం... ట్రియుం...` అని తిప్పి కళ్ళకి పెట్టుకొని, "టికెట్లు ఎక్కిందాకా ఆగాలి," అన్నడు కేర్లెస్ గా.
అయిదు నిమిషాలలో ఇంకొక ఇద్దర్ని పట్టాడు. వాళ్ళనికూడా లోపలికి కుక్కిన తరువాత, మళ్ళీ వెయిటింగ్.
"ఏం నాయనా, ఇంకా ఎక్కడ ఎక్కిస్తావ్," అంటుంది చేపలమ్మి.
"నువ్విచ్చే పదిహేనురూపాయలకీ టాక్సీ వస్తుందా? కస్టంగా ఉంటే దిగిపో," అని గదమాయించాడు.
"ఏమన్నా ప్రమాదమే వీడితో," అని కుక్కిన పేనుల్ల, కిక్కురుమనకుండా కూర్చున్నాం.
రెండు నిమిషాలు గడిచింది. రాని బస్సు, కదలని ఆటో, నకనకలాడుతున్న ఆకలి. ఆటో కదిలే అమృత గడియల కోసం చకోరపక్షుల్లా ఉన్నాం.
సడన్ గా ఆటోరాజాలో మార్పు వచ్చింది. నిప్పుకోడిలా మెడ ముందుకి చాపాడు, చెవులు రిక్కించాడు, ఒక్కసారి డ్రైవర్ సీటులోకి లంఘించి, కిక్ రాడ్ బలంగా లాగి, గేరుమార్చి ఆటోని ముందుకి ఉరికించాడు.
ఏమైందో అర్ధంకాక అయోమయంగా అటూ ఇటూ చూస్తున్న మాకు వెనుకనుంచి మలుపుతిరిగి బస్టాపు వైపు వస్తున్న కాకినాడబస్సు కనిపించి - "ఆర్నీ," అనుకొన్నాం.
స్టాపుకీ, స్టాపుకీ మధ్య రాకెట్ లాగ దూసుకుపోతుంది ఆటో. బైకు, కారు, లారీ... అన్నీ సైడు ఇచ్చేస్తున్నాయి. ఒకచేతితో సెల్ ఫోను మాట్లాడుతున్నాడు, స్పీకర్లలోంచి హిందీయో, ఇంగ్లీషో తెలియని పాట ఒకటి చెవులు గళ్ళెక్కిస్తుంది. వెనుక వచ్చే ఆర్టీసీ బస్సుకి ఓవర్ టేక్ చేసే అవకాశం ఇవ్వకుండా పోనిస్తున్నాడు. నువ్వునాకు నచ్చావు సినిమాలో రోలర్ కోస్టర్ ఎక్కిన బ్రహ్మానందం లాగ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని కూర్చున్నాం.
ఒకచోట ఒకరు దిగితే, పక్క స్టాపులో ఇద్దరిని ఎక్కిస్తున్నాడు. చెడిపోయిన గొడుగులోనుంచి ఊచలు వచ్చినట్టు పాసింజర్ల కాళ్ళూ, చేతులూ ఆటోలోంచి బయటకు పొడుచుకు వచ్చేశాయి. నిండా బట్టలుపెట్టిన బ్యాగ్ జిప్ తెగిపోతే ఎలా ఉంటుందో మా ఆటో అలా ఉంది.
"మొన్న అలాగేనండి, ఆటో ఏక్సిడెంటు జరిగి ఆరుగురు అక్కడికక్కడే ఠా," అంటున్నాడు ఒకడు. తెలుగు మసాలా సినిమా వయొలెన్స్ సీన్ లోలాగ ఏక్సిడెంటు విక్టింసు ఎలా పచ్చడి అయిపోయారో వివరించి చెబుతుంటే వినేవాళ్ళందరికీ గుండె ఝల్లుమంటుంది.
కోరంగి దగ్గరికి వచ్చేసరికి, ఎదుటినుంచి వచ్చే వేరే ఆటో డ్రైవర్, ఆటోరాజాకి ఏదో సిగ్నల్ ఇచ్చాడు. ఒక్కసారి మా ఆటో రెండు చెక్రాలమీద యూ-టర్న్ తీసుకొని రోడ్డుకి అటువైపు వెళ్ళిపోయింది. ఊహించని ఈ సడన్ జెర్క్ కి మా బుర్రలు ఇనుపకమ్మెలకి, మిగిలిన బుర్రలకీ కొట్టుకొని బొప్పికట్టేశాయి. వెనుకవస్తున్న బైకర్ సడన్ బ్రేక్ కొట్టడంతో స్కిడ్ అయ్యి, అతి కష్టం మీద పడకుండా నిలదొక్కుకొన్నాడు.
"బండి కొనగానే సరిపోదు, నడపడం రావాలి," అని మా హీరో బైకర్ని తిట్టేసరికి, బూకరించి బతికేస్తున్న ఆటోరాజాని చూసి మా మతులు పోయాయి.
మీటింగ్ పుర్తిచేసి రోడ్డు ఎక్కించిన ఆటో నిమిషం కూడా కాకుండానే చెట్టుకింద ఆపేశాడు. "ఏమైంది?" అన్నాం అందరం. "డబ్బులు," అన్నాడు. "ఆర్టీసీ వాడు బస్సాపి టిక్కెట్లు కొట్టినట్టు ఇదేంటి?" అని ఎంత చెప్పినా వినకుండా మా అందరి దగ్గరా ఫేర్ వసూలు చేసేశాడు.
ఈ కార్యక్రమం పూర్తయిన తరువాతకూడా బండి కదలక పోవడంతో, మా కోపం నషాళానికి అంటింది. "ఏంటి మళ్ళీ ప్రోబ్లం?" అన్నాం.
"కనిపించడంలేదా? ఎదర పోలీస్ స్టేషన్ దగ్గర ట్రాఫిక్కోళ్ళు చెకింగు చేస్తున్నారు. ముందుకెళితే దొరికిపోతాం. మనం వెళ్ళాలంటే అది పూర్తవ్వాల్సిందే. లేటవుతుందనుకొంటే అదిగో బస్సు వస్తుంది ఎక్కేయండి," అన్నాడు.
ఆశ్చర్యంతో తెరుచుకొన్న మానోళ్ళు కాకినాడ వచ్చేవరకూ మూసుకోలేదంటే నమ్మండి.
ఆటోరాజానా మజాకా?
© Dantuluri Kishore Varma