Pages

Tuesday, 4 June 2013

ఇలా చేస్తే లక్ష్యం నెరవేరుతుంది - ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పరిశుభ్రత అనేది అలవాటు. వంటిని, ఇంటిని, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడం అలవాటు చేసుకోలేకపోవడంవల్ల మసలే ప్రదేశాలన్నింటినీ  మురికి కూపాల్లా మార్చేస్తున్నారు. చెత్తనిండిన ఏ  బస్‌కాంప్లెక్స్‌నో, రైల్వే్‌స్టేషన్‌నో, రోడ్లనో చూసి `చి,చ్చీ!! ఈ జనాలు మారరు` అని తిట్టుకొనే ప్రబుద్ధుల్ని మోషన్ పిక్చర్లో లాగ చిత్రీకరించి, వాళ్ళు కొంతసమయం ముందు  తిని కేర్‌లెస్‌గా పడేసిని అరటిపండు తొక్కనీ, బస్‌స్టాప్ గోడమీద నమిలి ఊసిన కిళ్ళీని, రోడ్డుప్రక్క కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌ని చాటుగా చేసుకొని తడిపిన గోడని రెవైండ్ చేసి చూపించగలిగితే వాళ్ళ ప్రతిస్పంధన ఎలా ఉంటుంది! `చెత్తకుప్ప, ఉమ్మితొట్టి, టాయిలెట్టు ఉపయోగించాలని నీకు ఎవరూ నేర్పలేదా?` అని అడిగితే ఏమి సమధానం చెపుతారు?  

తల్లితండ్రులూ, చదువుచెప్పే పాఠశాలలూ పిల్లలకి పరిశుభ్రంగా ఉండడం యొక్క ఆవశ్యకతని తెలియజెయ్యాలి. కానీ దురదృష్టవశాత్తూ చాలా సందర్భాలలో ఈ విషయం గురించి ఎవ్వరూ పెద్దగా శ్రద్ద కనబరుస్తున్న ధాఖలాలు కనిపించడంలేదు. గోళ్ళు కత్తిరించుకో, ఉతికిన బట్టలు వేసుకో, బూట్లకి పాలిష్ చేసుకో, నీ పుస్తకాలని చక్కగా ఉంచుకో, ఉపయోగించిన తరువాత నీ వస్తువులని వాటి వాటి ప్రదేశాల్లో తిరిగి పెట్టెయ్యి, రెండుపూటలా పళ్ళుతోముకో, స్నానం చెయ్యి, చెత్తని తప్పనిసరిగా చెత్త బుట్టలోనే వెయ్యి...లాంటి ఒక పది, పన్నెండు సూత్రాలని క్రమంతప్పకుండా పిల్లలకి చెప్పగలిగితే కొన్నిరోజుల్లోనే పెద్దవాళ్ళు సైతం ఆశ్చర్యపోయే లాంటి మార్పు వాళ్ళల్లో వస్తుంది.  

ఒక పని అలవాటుగా మారాలంటే ఓ ఇరవై ఒక్క రోజులపాటు దానిని కొనసాగిస్తే చాలని అంటారు. `చిన్నప్పుడు స్కూల్లో పరిశుభ్రతా సూత్రాలేమీ నేర్పలేదు, లేకపోతేనా.....` అని పెద్దవాళ్ళు విచారపడకుండా పైన చెప్పిన ఇరవైఒక్కరోజుల్లో అలవాటు వ్రతం చేసి చూస్తే ఫలితం కనిపిస్తుంది.   

సినిమా హీరోయిన్లని, హీరోలనీ చూసి మనసు పారేసుకొనే వాళ్ళు కోకొల్లల్లు. దీనికి కారణం సినిమా వాళ్ళ అందంమాత్రమే కాదట. తళుక్కుమనే వాళ్ళ పలువరుస, నిగనిగలాడే చర్మం, చక్కగా కత్తిరించుకొన్న గోళ్ళు, సిల్కులాంటి శుభ్రమైన కురులు, వాళ్ళు ధరించే బట్టలు మొదలైనవే ఎక్కువగా ఆకర్షణని కలిగిస్తాయట. కాబట్టి అందంగా లేకపోయినా, ఆకర్షణియంగా ఉండాలంటే శుభ్రంగ ఉండడం ఒక్కటే మార్గమని చెపుతారు.

మనతో పాటూ పరిసరాలని కూడా చక్కగా ఉంచాలి. పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లని వాడకుండా ఉండడం; చెట్లని నరికి నాశనం చెయ్యకుండా, మొక్కలని పెంచి భూమికి పచ్చదనాల అందాలని అందించడం, వాహనాల కాలుష్యం తక్కువస్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మొదలైనవి పర్యావరణాన్ని కాపాడతాయి. 

వ్యక్తి నుంచి కుటుంభానికి, కుటుంభంనుంచి సమజానికి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలన్న అవగాహన వ్యాపించాలి. ప్రతీ వ్యక్తీ మారినప్పుడే సమాజం మారుతుంది. అప్పుడే ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు(జూన్ 5) లాంటివి చేసుకోవడం యొక్క లక్ష్యం నెరవేరుతుంది.
© Dantuluri Kishore Varma 

4 comments:

  1. ప్రస్తుతం చాల అవసరమైన concept ని రాశారు.అసలు మిగతా చదువులన్నిటికన్నా శుబ్రత ని నేర్పే చదువుని కొన్ని ఏళ్ళపాటు మన తరగతి గదుల్లో నేర్పాలి.దాన్ని ప్రభుత్వం ఒక కార్యక్రమంగా తీసుకుని అమలు చేయాలి.చాలా యూరపు దేశాల్లోను..ఇంకా ఇజ్రాయెల్ లాంటి దేశాల్లోను ఇంటర్మీడిఎట్ స్థాయి తరవాత నిర్భందంగా సైనిక శిక్షణ ఇస్తారు. దీని వల్ల శరీరం చురుకుగా..పని చేయడానికి వురకలు వేస్తున్నట్టుగా తయారవుతుంది. దేశభక్తి...పరిశుబ్రత...సంసిద్దత..అవసరమైనప్పుడు త్యాగం చేయడం ఇలాంటి గుణాలన్ని అలవోకగా వస్తాయి.తక్కువ మంది పౌరులు ఉన్నప్పటికి వారిలో గల quality వల్లనే అగ్ర దేశాలుగా వివిధ రంగాల్లో వుండగలుగుతున్నారు.ఎంతసేపు నాలుగు ఓట్లు వచ్చే జనాకర్శక పధకాలే తప్ప పౌరుల్లో quality పెంచుదామనే ఆలోచన మన నాయకుల్లో ఎక్కడుంది..?

    ReplyDelete
    Replies
    1. మీరు వ్యాఖ్యానించినది వందశాతం నిజం. గత మూడు సంవత్సరాలుగా మా స్కూల్లో ట్వంటీ గోల్డెన్ రూల్ అని ఒక కాన్సెప్ట్ విద్యార్ధులకి నేర్పిస్తున్నాం. దీనివల్ల వాళ్ళల్లో అభిలషణీయమైన మార్పు వస్తుంది. నిజానికి, ఈ అనుభవంతోనే టపా రాయడం జరిగింది. ధన్యవాదాలు.

      Delete
  2. ఆచరించేవారుండటం లేదు, ప్రతివారు మరొకరెవరో చెట్లు పెంచుతారనుకుంటే ఎలా?

    ReplyDelete
    Replies
    1. మీరు పెరటిలో చెట్లు పెంచుతున్నారని తెలుసు శర్మగారు. మీరు చేస్తున్న కృషి గొప్పది. కానీ, ఇంక ఎవరూ ఆచరించడంలేదు అని అనుకోకూడదు. లభించిన చిన్న స్థలంలోనే మా అనుకూలతలను బట్టి మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. టపాలో ఇంకా కొన్ని అంశాలు ప్రస్థావించడం జరిగింది. దురదృష్టవశాత్తూ అవి మీ దృష్ఠిని ఆకర్షించలేదు. అందరూ అన్నీ భుజానికి ఎత్తుకోలేక పోయినా, ఎవరిమటుకు వాళ్ళు పర్యావరణానికి వీలయినంత తక్కువ హానికలిగేలా నడచుకొంటే అదే పదివేలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!