Pages

Wednesday, 19 June 2013

వీ కాంట్ హెల్ప్!

`బీచ్ ఫెస్టివల్‌లో బొమ్మల ముసుగులు తొడుక్కొని జనాలమధ్య తిరగాలి. పొద్దున్నే ఎనిమిది గంటలనుంచి రాత్రి పదిగంటల వరకూ. రోజుకి  ఆరొందలు ఇచ్చి భోజనాలు, టిఫిన్లు పెడతారు. మూడు రోజులు పని ఉంటుంది. ఎవరయినా వస్తారా?` లేబర్ కాంట్రాక్టరు నాలుగురోడ్ల జంక్షన్లో పోగయిన డైలీ లేబరుతో అంటున్నాడు.

అప్పుడప్పుడే వెలుగు వస్తుంది. మునిసిపల్ వర్కర్లు పొడుగు చీపుర్లతో రోడ్లు ఊడుస్తున్నారు. పూరీలు, పుల్లట్లు, మైసూరు బోండాలు, ఇడ్లీలు అమ్మే రోడ్డు ప్రక్క బండినుంచి కమ్మని వాసనలు అన్ని వైపులకీ పోతున్నాయి. ఇద్దరు, ముగ్గురు రిక్షావాళ్ళు గాజుగ్లాసుల్లో పొగలుకక్కుతున్న టీని ఊదుకొంటూ తాగుతున్నారు. 

షాపింగ్ కాంప్లెక్స్ మూసిఉన్న షట్టర్లముందు ముణగదీసుకొని పడుకొని వున్న సురేషుకి అప్పుడే మెలుకువవచ్చింది. ముందురోజంతా ఏమీ తినలేదేమో కడుపులో నకనకలాడుతుంది. టిఫిను బండి దగ్గరనుంచి వస్తున్న నోరూరించే వాసన సహనాన్ని పరీక్షిస్తున్నట్టు వుంది. సరిగ్గా అప్పుడే లేబరు కాంట్రాక్టరు మాటలు అతని చెవిలో పడ్డాయి. ఒక్క ఉదుటున లేచి, మెట్లు దిగి వెళ్ళి, `నేను వస్తాను,` అన్నాడు.   ఆకలి తీరడం, అజ్ఞాతవాసం - ఒకే దెబ్బకి రెండు పిట్టలు లాగ మంచి అవకాశం వెతుక్కొంటూ వచ్చింది.  బోనస్‌గా డబ్బు కూడా వస్తుంది. బహుశా పోలీసులు ఇప్పటికే తనకోసం వెతుకుతూ ఉండిఉంటారు. సంఘటన జరిగిన వెంటనే సరాసరి పారిపోయి వచ్చేశాడు. జేబులో నయాపైసా లేదు. సెల్‌ఫోన్ కావాలనే ఆఫీసులో వదిలిపెట్టేశాడు.
*  *  *
బైకుల్లో, కారుల్లో, ఆటోల్లో వచ్చిన ప్రజలు వాకలపూడి లైట్ హౌస్‌కు దగ్గరలో వాహనాలని పార్క్ చేసుకొని ఫెస్టివల్ దగ్గరకి నడచి వెళుతున్నారు. స్వాగత ద్వారం దాటిన వెంటనే ఇరువైపులా కలర్‌ఫుల్‌ నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అన్నవరం సత్యదేవుని నమూనా దేవాలయం, దానికి సమీపంలోనే జిల్లాలోని ప్రముఖ దేవాలయాల స్టాల్ ఏర్పాటుచేసి ప్రసాదాలు అమ్ముతున్నారు. ఉత్తరంవైపు పెద్ద సభాస్థలిని నిర్మించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.సంబరాలు జరుగుతున్న బీచ్ ఏరియా అంతా విద్యుత్ లైట్లు ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఇసుకలో సైకత శిల్పాలు చేశారు. ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. చాట్, బిర్యానీ, బొంగులో చికెన్, స్వగృహా ఫుడ్స్ మొదలన స్టాల్స్ ధక్షిణం వైపు వరుసగా ఏర్పాటు చేశారు. గంగిరెద్దులవాళ్ళు,  జానపద కళాకారులు, రకరకాల వేషదారులు కార్టూన్‌మనుషుల్లాగ బీచ్ ప్రాంతం అంతా తిరుగుతూ సందడి చేస్తున్నారు. వాళ్ళల్లో హాలీవుడ్ హాస్యజంట లారెల్ అండ్ హార్డీలలో, బొద్దుగా ఉండే హార్డీ లాంటి వేషధారణలో సురేష్ కూడా ఉన్నాడు.
* * *
పార్కింగ్ ప్లేస్‌లో ఇన్నోవా ఆగింది. ఈజీ చిట్స్ అధినేత కుమారస్వామి కుతుంభసమేతంగా దిగి ఫెస్టివల్ ప్రాంతానికి చేరుకొన్నాడు. ఫ్లడ్ లైట్ల కాంతిలో ఆ ప్రదేశమంతా చాలా సందడిగా ఉంది. ఒక్కొక్క స్టాలూ చూసుకొంటూ, తెలిసినవాళ్ళు కనిపించినప్పుడు హుందాగా విష్ చేస్తూ ముందుకు వెళూతున్నారు. కాయగూరలని అందంగా చెక్కి ప్రదర్శించిన ముకిమోనో అనే కళాకృతుల స్టాల్ ముందు నిలబడిపోయారు.

`హల్లో, కుమారస్వామీ! ఎలా ఉన్నావ్?` అనే పలకరింపుకి, వెనక్కి తిరిగి, అలా పిలిచిన పెద్దమనిషికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు 

`ఈ మధ్య ఎదో ఎమౌంట్ గల్లంతయ్యిందటకదా? మీ క్యాషియర్ కొట్టేశాడంటున్నారు, నిజమేనా?` అన్నాడు ఆ పెద్దమనిషి. 

కార్టూన్‌కేరెక్టర్ల వేషాలు వేసుకొని, ఆ ప్రాంతం అంతా సందడి చేస్తున్న వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు కుమారస్వామి కూతుళ్ళు. వాళ్ళ వెనుక కదలకుండా శిల్పంలా నిలబడిపోయిన హార్డీని ఎవరూ పట్టించుకోలేదు.   

`లెడ్జర్‌లో ఒక లక్ష రూపాయలు తేడా వచ్చింది. మా క్యాషియర్ సురేషు తీసిఉంటాడని, పోలీసు కేసు పెడతామని బెదిరించేసరికి. ఆఫీసు నుంచే ఎక్కడికో పారిపోయాడు. వాడి పెళ్ళాం తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ అని కూడా చూడలేదు పిరికి సన్నాసి. ఆ పిచ్చిది వీడు ఎక్కడికి పోయాడో తెలియక మూడురోజులుగా ఒకే దారగా ఏడుస్తుంది,` అన్నాడు కుమారస్వామి. 

వెనుకనుంచి వింటున్న హార్డీకి మనసులో కలుక్కుమంది. నవ్వుతున్న ముసుగు ముఖం వెనుక కన్నీళ్ళు చెంపలని తడిపేస్తున్నాయి. 

`మరి లక్షరూపాయలు పోయినట్టేనా?`

`అసలు పోలేదండి. కౌంటర్ ఎంట్రీ ఒకటి పొరపాటున మిస్అయ్యి, తేడా కనిపించింది. ఆ విషయం ఇన్‌టర్నల్ ఆడిట్లో తెలిసింది`.

`పాపం మీ క్యాషియర్ని బాగా భయపెట్టినట్టున్నారు`.

`పూర్ ఫెలో! వీ కాంట్ హెల్ప్. తిరిగి వస్తే ఉద్యోగంలోకి తీసుకొంటాం. లేకపోతే వాడి కర్మా, వాడి పెళ్ళాం దౌర్భాగ్యం` అన్నాడు కుమారస్వామి. ఇద్దరూ గొల్లుమని నవ్వుకున్నారు.

కుమారస్వామి ముఖం మీద నవ్వు విశాలంగా పరచుకొని ఉండగానే ఒక బలమైన తాపు అతని వీపుమీద పడింది. ఎగిరి వెళ్ళి సొరకాయలతో చేసిన హంసల బొమ్మలమీద పడ్డాడు. కాయగూరలు ముక్కలుగా విరిగిపోయి చెల్లా చెదురు అయ్యాయి. ఈ హఠాత్ సంఘటనకి అందరూ నిశ్చేష్ఠులైయ్యారు. కుమారస్వామిని ఎవరు తన్నారో తెలియలేదు. అతన్ని లేవదీసి, వెనక్కి తిరిగిచూస్తే, అటూఇటూ పోతున్న జనాలూ, డ్యాన్స్ చేస్తూ వాళ్ళకి చేతులు ఊపుతున్న కార్టూన్ మనుషులూ తప్పించి ఇంకేమీ కనిపించలేదు.
© Dantuluri Kishore Varma 

11 comments:

  1. ఒక్కోసారి చేయని తప్పుకి శిక్ష అనుభవించవలసి రావడం ,అది ఇతరులకి ఆనందం కలిగించడం నిజంగా బాధాకరం . కథ బాగుంది .

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ ఆచార్యులు గారు!

      Delete
  2. suresh pirikitanam kuda kanabadutodi వీ కాంట్ హెల్ప్.....

    ReplyDelete
    Replies
    1. అది సురేష్ పిరికితనమే! కానీ, అతను ప్రయివేట్ సంస్థలో చిన్ని ఉద్యోగం చేసుకొనే సామాన్యుడు. చెయ్యని తప్పుకి పోలీసులు తీసుకొని వెళ్ళి కుమ్మేస్తారంటే, ఆత్మస్థైర్యం ఎక్కడుంటుంది. కనీసం బెయిలిచ్చి బయటకు తీసుకు రాగల ధన్ను కూడా ఉండదు. మీ కామెంటుకి ధన్యవాదాలు గోపాల్ గారు.

      Delete
  3. తను తప్పు చేయలేనప్పుడు పారిపోవడంలో పిరికితనం,
    ఇంటి వారి గురించి ఆలోచించకుండా మూడు రోజులుగా బయటనే ఉంటూ తన చేతకానితనం చూపించుకున్నాడు...
    ఆ situation ని ఎదుర్కొని నిలబడాల్సింది.......

    ఇందులో కుమారస్వామి తప్పు ఏముందండి, వాడి చేతకాని తనం చూసి నవ్వుకున్నారు తప్పిస్తే, నన్నడిగితే వాణ్ని job లోంచి discontinue చేయాలి..... ఏమంటారు......

    ReplyDelete
    Replies
    1. సురేష్ అర్భకుడు. తొందరగా రియాక్ట్ అయ్యే గుణం ఉన్నవాడు. పారిపోయినప్పుడు, లేబర్ కాంట్రాక్టర్కి తాను పనిలో చెరతానని చెప్పినప్పుడు, ఆఖరికి కుమారస్వామిని తన్నినప్పుడూ కూడా అదే తొందరపాటుతనం కనిపిస్తుంది. ఇక కుమారస్వామి విషయానికి వస్తే, - - నిజంగా దొంగతనం జరిగిందో, లేదో నిర్ధారణ కాకుండానే అనుమానంతో తనక్రింద పనిచేసే ఉద్యోగిమీద నేరారోపణ చేశాడు. పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం లాగ పోలీసులని పిలుస్తానన్నాడు.

      అది అలా ఉంచితే నిజం తెలిసాకా అయినా జరిగిన పొరపాటుకి బాధ్యత వహించి, పేపర్ ప్రకటనలాంటిదేదయినా ఇచ్చి, సురేష్‌ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేసి ఉండవలసింది. నిస్సహాయంగా ఉన్న సురేష్ భార్యకికూడా ధైర్యం చెప్పించే ఏర్పాట్లు చెయ్యలేదు. తప్పేకదా?

      విశ్లేషణాత్మకమైన మీ కామెంటుకి ధన్యవాదాలు సంతు గారు.

      Delete
    2. మీ reply చదివాక పై నా కామెంట్ కూడా తొందరపాటు కామెంట్ లాగా అనిపిస్తోంది నాకు... :p :p
      కథ చాల బావుంది... :)

      Delete
  4. కొందరు ఇలాగే పొరబాట్లు చేసి సంస్థ లో పనిచేసే చిరు ఉద్యోగులని బలి చేస్తారు. సురేష్ సామాన్యుడు ఆతను అలాగే ప్రవర్తిస్తాడు :)

    కథ బావుంది . అభినందనలు

    ReplyDelete
    Replies
    1. కరెక్ట్‌గా చెప్పారు. ధన్యవాదాలు.

      Delete
  5. సురేష్, కుమారస్వామి అలా ప్రవర్తించడానికి ఎవరి కారణాలు వారికుంటాయి .సురేష్ కు ఒక దెబ్బ కు మూడు పిట్టలు .కథ బావుందండీ . కాకినాడ బీచ్ ను కళ్ళకు కట్టేశారండీ .

    ReplyDelete
    Replies
    1. ప్రతీకారం తీర్చుకోవడం మూడవ పిట్ట లాంటిదే - బోనస్! బాగా చెప్పారు. కథని మెచ్చుకొన్నందుకు ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!