ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫాం మీద ట్రెయిన్ బయలుదేరడానికి సిద్దంగా ఉంది.
"మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ షాపులో గజ్జలని దొంగతనం చేసిన వాడిని నిన్నే చూశానురా," అన్నాడు ట్రెయిన్లో కూర్చున్న నందకుమార్.
నందకుమార్‌కి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన వెంకటేష్ కిటికీకి ప్రక్కన ప్లాట్‌ఫాం మీద నుంచొని ఉన్నాడు. స్నేహితుడి మాటలకి ఇబ్బందిగా నవ్వాడు.
ఇరవై సంవత్సరాలక్రితం విడిపోయిన వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకోవడం ఆ రోజే! అదికూడా కావాలని కాదు. నాటకీయంగా జరిగింది. ఆఫీస్ పనిమీద కాకినాడ వచ్చిన నందకుమార్, జగన్నాధపురం వంతెన డౌన్‌లో యానం బస్టాండుకి ఎదురుగా ఉన్న కోకిలా రెస్టారెంటులో చపాతీ తిని బయటకి వస్తుండగా, పక్కనే ఉన్న వాద్యపరికరాలమ్మే షాపులోనుంచి గలాటా వినిపిస్తుంటే అటు తొంగి చూశాడు.
చక్కగా డ్రెస్ చేసుకొని, మర్యాదస్తుడిలా ఉన్న ఒక వ్యక్తిని షాపువాళ్ళు కొట్టబోతున్నారు. ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్టు ఉంది. మొహమాటపడుతున్నట్టు ఇబ్బందిగా నవ్వే నవ్వు - అవును అదే - చప్పున గుర్తుకువచ్చింది - డిగ్రీ క్లాస్‌మేట్ వెంకటేష్‌గాడు! ఒక్క పరుగున వెళ్ళి పడబోతున్న దెబ్బల్ని ఆపుచేశాడు. షాపువాళ్ళకి నచ్చజెప్పి, స్నేహితుడిని బయటకి తీసుకువచ్చిన తరువాత అతనికి ఉన్న సైకలాజికల్ డిజార్డర్ గురించి తెలిసింది.
అన్నీ ఇచ్చినా దేవుడు ఎందుకో మనుష్యులకి కొన్ని అవకరాలు కూడా ఇస్తాడు. ఏదయినా వస్తువు కంటికి ఇంపుగా కనిపిస్తే చాలు స్వంతం చేసుకోవాలనిపిస్తుంది. అది వెంకటేష్ బలహీనత.
"అవసరంలేకపోయినా దొంగతనం చెయ్యాలనిపించే క్లెప్టోమేనియా గురించి నిన్ను చూశాకే తెలిసింది. దిగులు పడకు, మంచి సైకియాటిస్ట్‌ని కలిస్తే నీ సమస్య పరిష్కారం అవుతుంది. నేను హైదరాబాద్ వెళ్ళాక అక్కడ వివరాలు తెలుసుకొని నీకు ఫోన్ చేస్తాను," అన్నాడు నందకుమార్.
ఆకుపచ్చ సిగ్నల్ పడింది. ట్రెయిన్ మెల్లగా కదిలింది. ఇబ్బందికరమైన సన్నివేశంలో ఉండగా స్నేహితుడి కంటిలో పడినా; నందకుమార్ విషయాన్ని అర్థంచేసుకొని సానుభూతిగా ప్రతిస్పందించడంతో అతడి పట్ల కృతజ్ఞతతో కంటిమీద నీటిపొర కమ్ముకొంటుంది. వీడ్కోలుగా చెయ్యి ఊపాడు. క్రమంగా ట్రెయిన్ కనుమరుగయ్యింది.
నందకుమార్‌కి కనీసం థాంక్స్ కూడా చెప్పలేదన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చింది. జేబులోనుంచి సెల్‌ఫోన్ తీసి `థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్` అని టైప్ చేసి, అంతకుముందే సేవ్ చేసుకొన్న స్నేహితుడి నెంబరుకి పంపాడు.
`టింగ్ టింగ్` మని చప్పుడు వచ్చింది. వెంకటేష్ చెయ్యి అసంకల్పితంగా ట్రౌజర్ రెండవ జేబులోకి వెళ్ళి ఒక స్మార్ట్ ఫోన్‌ని బయటకి తీసింది. దానితెరమీద `మెసేజ్ ఫ్రం వెంకటేష్` అనే అక్షరాలు మెరుస్తున్నాయి. ఓపెన్ చేస్తే `థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్` అనే మెసేజ్ కనిపించింది.
© Dantuluri Kishore Varma
naku ardham kaledhu
ReplyDeleteతన స్నేహితుడి దగ్గరే సెల్ దొంగిలించాడు, క్లెప్టోమేనియా అనే మానసిక రోగం వల్ల. ఆ సంగతి మరచిపోయి నందకుమార్‌కి థాంక్స్ మెసేజ్ పంపించాడు.
DeleteIppudardhmaindi.
Deletegood one!
ReplyDeleteధన్యవాదాలు నారాయణ స్వామి గారు.
Deletechaalaa baavuMdi.
ReplyDeleteధన్యవాదాలు వనజవనమాలి గారు.
DeleteExcellent
ReplyDeleteధన్యవాదాలు రాజశేఖర్ గారు. మీకు నా బ్లాగుకి స్వాగతం. ఈ కథ మీకు నచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది.
DeleteVery nice
ReplyDeleteChinni Aasa garu, thanks for the appreciation.
Deleteహహహహా.... superb..... చాల బావుంది,
ReplyDeleteవెంకటేష్ డిసార్డర్ ని చాల బాగా proove చేసారు....
మీ మెచ్చుకోలుకి ధన్యవాదాలు!
Delete