Pages

Saturday, 13 July 2013

గుర్రబ్బండి

గుప్పెట్లో ఉంచుకొన్న మంచుముక్కలాగ కాలం కరిగిపోతుంటుంది. అరచేతిలో ఆతరువాత కొంతసేపు ఉండి మాయమయ్యే చల్లదనపు తిమ్మిరిలాగ కనుమరుగైపోయిన పాతకాలపు జ్ఞాపకాలు ఉండి లేనట్టో, లేక ఉన్నట్టో మనసు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైపోతాయి. 

సత్యంశంకరమంచి గారు రాసిన అమరావతి కథల్లో ఊరిలోకి కొత్తగా వచ్చిన బస్సుని చూడటానికి జనమంతా అద్గదుగో బస్సని పనులు మానుకొని ఎగబడతారు. గాలిలో ఎగురుతున్నట్టు పోయే బస్సంటే అందరికీ అద్భుతమే! ప్రపంచంలో అతివిలువైన వస్తువేదో వస్తున్నట్టు సంబరపడిపోతారు. కానీ, జట్కా సాయిబు మాత్రం తనజీవనాదారం పోతున్నందుకు దిగులు పడతాడు. దు:ఖం  గొంతులోకి వస్తుంది. ఆ మరునాటి నుంచి ముసలి గుర్రం లాగే డొక్కు బండి ఎవరు ఎక్కుతారు? వాడి భోగం అంతా పోయింది! 
గుర్రపుబండిలో ప్రయాణిస్తుంటే రోడ్డుమీద నాడాలుకొట్టిన గుర్రపుడెక్కల చప్పుడు, తిరుగుతున్న బండి చక్రపు ఆకులకి బండివాడు కొరడా కర్ర అంచు ఆనించి ట్ర్(((( అనిపించే చప్పుడు -   ఒకప్పుడు చాలా సాధారణమైన విషయాలు - ఇప్పుడు ఏమైపోయాయి!  ఊరూరికీ బస్సులొచ్చాయి. అవిలేనిచోట ఆటోలు ప్రయాణీకుల అవసరాలు తీరుస్తున్నాయి. వేగంగా పోయే బైకులు, కార్లు గుర్రం బండిని గుటుక్కున మింగేశాయి. 
నిన్న ద్రాక్షారామ నుంచి కోటిపల్లి వెళుతుంటే దారిలో ధైన్యాన్ని ఎక్కించుకొన్నట్టు రోడ్డువారగా భారంగా నడచిపోతున్న ముసలి గుర్రం, దానికి కట్టిన పాత బండి! జ్ఞాపకాలకి ఆకృతివచ్చినట్టు - నిజ్జంగానే నిజం!

`అదే గుర్రం బండి. చిన్నప్పుడు మేం ఎక్కేవాళ్ళం,` అని చెపితే - కిరీటాలు పెట్టుకొని తిరిగే అశోకుడి కాలంవాళ్ళని మనం ఎంత ఆశ్చర్యంగా చూస్తామో, మా పిల్లలు మమ్మల్ని అంత అబ్బురంగా చూశారు! శెలవులకి తాతగారింటికి వెళ్ళినప్పుడు, బస్సుదిగేసరికి బస్‌స్టాప్‌నుంచి రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి తీసుకొనివెళ్ళడానికి ఇప్పటి ఆటోలాగ అప్పుడు తయారుగా ఉండే గుర్రబ్బండి. దానిని ఎక్కడమంటే కథల్లో మాత్రమే సాధ్యమయ్యేలాంటి ఒక ఫేంటసీ వాళ్ళకి !

గుర్రబ్బండి సవారీ చేసినందుకు సంతోషం కళ్ళల్లో తళూక్కుమంది శ్రావ్యా, వర్షితలకి. ఈ జ్ఞాపకం ఒక తీపి గుర్తుగా ఉంటుందేమో వాళ్ళకి -  తరువాతి తరానికి చెప్పడానికి. 

గుర్రానికి గుగ్గిళ్ళు కొనమని డబ్బులిస్తే ఎంతో ఆనందపడ్డాడు బండి నడిపే వ్యక్తి.

© Dantuluri Kishore Varma 

8 comments:

  1. "guppetlo manchu mukka la kaalam karigipovadam"
    ee pada pprayogam chaala baagundi, mi tapaalu idokkate kaadu anni baaguntaayi. keep writing..!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శర్మగారు. మీ వ్యాఖ్య చాలా ఆనందాన్నిచ్చింది.

      Delete
  2. ఆ సంధర్భాన్ని మంచి టపా గా మలచడం మీ సృజనాత్మకతని తెలియజేస్తున్నది.

    ReplyDelete
  3. చాలా బాగుందండీ. మంచి జ్ఞాపకాన్ని తవ్వి తీశారు.

    ReplyDelete
  4. ధన్యవాదాలు మూర్తిగారు.

    ReplyDelete
  5. ధన్యవాదాలు శిశిరగారు.

    ReplyDelete
  6. aa rojullo .. mundu onteddu bandi... aa varusa lo rendedla bandi.. taruvaata gurrabbandi bandi ki chargeelu koodaa .. ide varusalo perugutoo undevi --ordinary -deluxe -- superdeluxe laagaaa -- aa teepi jnapakalu meerannatlu kramepee karigi- kanumarugavutoo vasthunnaayi

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సుశీగారు. గుర్రబ్బండిపోస్టు మిమ్మల్ని జ్ఞాపకాలదారుల్లో పరుగులు పెట్టించినట్లుంది :)

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!