* * *
ఎప్పుడో పురాణ కాలంలో జనార్ధనుడైన విష్ణుమూర్తి వామనావతారం దాల్చి, బలిచక్రవర్తిని అంతం చేసినతరువాత ఇప్పుడు కోటిపల్లి ఉన్నప్రాంతంలోనే ధ్యానం చేసుకొన్నాడట. సమస్తదేవతలూ వచ్చి ఆయనని దర్శించుకొన్నారట. అందుకే, దేవతలు వచ్చి పావనమొనర్చిన కోటిపల్లి ప్రాంతం పరమ పవిత్రమైనది అని అంటారు. ఈ ప్రాంతంలో కశ్యపమహర్షి సిద్ధిజనార్ధన స్వామిని ప్రతిష్టించాడట. ఈయన భూదేవీ, శ్రీదేవీ సమేత సిద్ధిజనార్ధన స్వామి - అంటే మొట్టమొదట ఇది విష్ణుక్షేత్రం.
గౌతమ మహర్షి భార్య అహల్య చాలా అందగత్తె. ఇంద్రుడు ఆమెని మోహించి, గౌతమ మహర్షి ఇంట్లోలేని సమయంలో కామరూపవిద్యచేత ఆయన రూపంలో అహల్యని పొంది, గౌతముడిచే శపించబడతాడు. ఆ శాపవిమోచన కావాలంటే కోటిపల్లి వెళ్ళి కోటీశ్వరలింగాన్ని ప్రతిష్టించి, పూజించాలి. ఇంద్రుడు ఆవిధంగానే ఉమాసమేత కోటీశ్వరలింగాన్ని ప్రతిష్టించి శాపవిమోచనుడయ్యాడట.
ఇంద్రుడు, అహల్య కథలాంటిదే మరొకటి ఉంది. కాకపోతే దానిలో కథానాయకుడు సమ్మోహనరూపుడు. సకల కళలు కలవాడు. విద్యను అభ్యసించడానికి గురువుగారిదగ్గరకి వెళ్ళి, గురుపత్నిచేత మోహింపబడి, ఆమెనికూడి, గురువు శాపంవల్ల తన కళలని కోల్పోయినవాడు. ఇప్పటికే గ్రహించి వుంటారు అతనుఎవరో - చంద్రుడు. చంద్రుడినే సోముడు అని కూడా అంటారు. ఈతని గురువు బృహస్పతి. ఆయన భార్య తార. చంద్రుడు శాపంవల్ల తన చాయని కోల్పోయాడు కనుక, దానిని తిరిగి పొండడానికి కోటిపల్లిలో శివలింగాన్ని ప్రతిష్టించాలి. సోముడనబడే చంద్రుడు ప్రతిష్టించాడు కనుక ఆయన చాయాసోమేశ్వరుడు. ఆయన దేవేరి రాజరాజేశ్వరి.
ఇంద్రుడూ, చండ్రుడూ చేత విష్ణుక్షేత్రమల్లా శివక్షేత్రం కూడా అయ్యింది. అన్నవరం లాగానే శివకేశవులు కలిసి ఉన్న మరొక పవిత్ర ప్రదేశం ఇదే. ఇక్కడ ఉండే లింగాన్ని భోగలింగం అంటారు. ఇది గుప్పెడంత చిన్నదిగా ఉంటుంది. అత్యంత పొడవైన స్తూపాకారలింగం ద్రాక్షారామలోనిదైతే, అత్యంత చిన్న లింగం కోటిపల్లి లోనిది.
పొడవైన ధ్వజస్థంబం, అందమైన పెద్ద నంది, గుడికి ఎదురుగా సోమగుండం అని పిలువబడే చెరువు ఇక్కడి ప్రత్యేకతలు. ఈ ఊరిపేరు నిజానికి కోటిపల్లి కాదట, కోటిఫలి అట. ఒక్కసారి ఈ క్షేత్రంలో స్నానం చేస్తే మూడు కోట్ల శివలింగాలను ప్రతిస్టించిన ఫలితం వస్తుందట. కోటిఫలితాలను ఇచ్చే క్షేత్రం ఇది.
కాకినాడకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది.
ద్రాక్షారామ చుట్టూ ఎనిమిది ప్రదేశాలలో చంద్రుడు అష్టసోమేశ్వరాలయాలని ప్రతిష్టించాడు. వాటిలో ఒకటి కోటిపల్లి. మిగిలినవి ఇవిగో - కోలంక, వెంటూరు, వెల్ల, పెనుమళ్ళ,దంగేరు, సోరుమిల్లి, సోమేశ్వరం.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment