Pages

Wednesday, 31 July 2013

ద్రాక్షారామం శివాలయం

భీమేశాత్ ఉత్తమం దైవం న మహీతలే!

అంటే భీమేశ్వరుని కంటే ఉత్తమమైన దైవం ఈ భూమిమీద లేదు అని. స్కాందపురాణంలోని గోదావరి ఖండంలో వ్యాసమహర్షి స్వయంగా చెప్పిన మాట ఇది. `ఇంతకీ ఈ భీమేశ్వరుడు ఏ ఊరిలో ఉన్నట్టూ` అంటారా? పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామంలో. ఇది కాకినాడకి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

క్రీస్తుశకం పదవ శతాబ్ధంలో చాళుక్యభీముడు-1 అనేరాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. సామర్లకోటలో గుడిని కట్టించింది కూడా ఈయనే. అందువల్లనే ఇవి రెండు దేవాలయాలూ ఒకే విధంగా ఉంటాయి.   

ఇదివరకు సామర్లకోట శివాలయం గురించి రాసిన టపాలో పంచారామాలు ఎలా ఏర్పడ్డాయి అనే వివరణ కుప్తంగా ఇవ్వడం జరిగింది - "14వ శతాభ్దం లో శ్రీనాధుడు రచించిన భీమేశ్వరపురాణం లో పంచారామాల వివరం ఉంది. క్షీరసాగరమదనం తరువాత అసురులు  శివుడిని గురించి ఘోరతపస్సుచేసి ఎన్నోవరాలు పొందారు. ఆ గర్వంతో వాళ్ళు దేవతలని అష్టకష్టాలు పెట్టడంతో, శివుడు పాశుపతాస్త్రం ప్రయోగించి వాళ్ళని నాశనంచేస్తాడు. అగ్నిజ్వాలలలో సర్వం ఆహుతి అయినా.. అసురులు పూజించిన శివలింగం మాత్రం అలాగే ఉంటుంది. దానిని అయిదు భాగాలు చేసి, పంచారామాలలో శివుడు  ప్రతిష్టింపచేశాడని  ఈ పురాణం చెపుతుంది." 

మొదటి భాగాన్ని ఇంద్రుడు అమరారామం అని పిలువబడే గుంటూరుజిల్లా అమరావతిలో, రెండవభాగాన్ని చంద్రుడు సోమారామమని పిలువబడే పశ్చిమగోదావరిజిల్లా గునుపూడి భీమవరంలో, మూడవభాగాన్ని శ్రీరాముడు క్షీరారామమని పిలువబడే పశ్చిమగోదావరిజిల్లా పాలకొల్లులోను, నాలుగవభాగాన్ని కుమారస్వామి కుమారారామం అని పిలువబడే సామర్లకోటలోనూ ప్రతిష్ఠించారు. అయిదవభాగాన్ని సప్తఋషులు ప్రతిష్ట చెయ్యాలి, కానీ ఆసమయానికి గోదావరినుంచి అభిషేక జలాలు తీసుకురావడంలో ఆలశ్యం జరగడంతో పరమశివుడు తనకుతానే శ్వయంభూగా వెలిశాడట.  ద్రాక్షారామంలో గోదావరిలేదు. కానీ సప్తఋషులు దానిని అంతర్వాహినిగా తీసుకొని వచ్చారని చెపుతారు. ప్రస్తుతం ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొలనుకే ఆ జలాలు వస్తాయని చెపుతారు. అందుకే దానికి సప్తగోదావరి అని పేరు.

ద్రాక్షారామం -

1. పంచారామాలలో ఒకటి
2. త్రిలింగాలలో ఒకటి (శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం)
3. నూట ఎనిమిది అతిగొప్ప శైవక్షేత్రాలలో ఒకటి
4. దక్షిణకాశీ
అంతే కాకుండా ఆదిశంకరాచార్యులవారిచే ప్రతిష్టించబడిన మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో(18) ఒకటి అని చెపుతారు (ఆ కథ ఇదిగో ఈ టపాలో దొరుకుతుంది).

ఋగ్వేదంలో, యజుర్వేదంలో, ఎన్నో పురాణాలలో, ఇతిహాసాలలో ద్రాక్షారామయొక్క పేరు ప్రస్తావించబడిందట. శివుని భార్య సతీదేవి యొక్క తండ్రి దక్షుడు. ఈతనియొక్క ఆరామమే(ప్రాంతం) ద్రాక్షారామం. అంటే పరమేశ్వరుని మావగారి ఊరు. అందుకేనేమో స్వయంభూగా వెలిశాడు! దక్షయజ్ఞం జరిగిన ప్రదేశం కూడా ఇదేనట. 

ద్రాక్షారామంని దక్షిణకాశీ అని పిలుస్తారు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. 1. వింధ్యపర్వతం పెరిగి పెరిగి సూర్యప్రకాశానికి కూడా అడ్డుపడేటంతగా ఎదిగిపోవడంతో, దాని గర్వం అణచడానికి కాశీనుంచి అగస్త్య మహర్షి వింధ్యపర్వతం దాటి వచ్చి ద్రాక్షారామంలో ఉండిపోయాడట. 2. వ్యాసమహర్షి తన శిష్యులతో కలసి కాశీలో ఇంటింటికీ తిరిగి బిక్షస్వీకరిస్తున్న క్రమంలో, ఆయనని పరీక్షించే ఉద్దేశ్యంతో పరమేశ్వరుడు ఎక్కడా భిక్ష లభించకుండా చేశాడట. వీధులన్నీ తిరిగి అలసిపోయి, అన్నపూర్ణ కొలువున్న ఆ వూరిలోనే అన్నం దొరకలేదనే కోపంతో కాశీక్షేత్రాన్ని శపించ బోవడంతో ఆదిదంపతులు ప్రత్యక్షమై, ఊరిని విడిచి వెళ్ళిపొమ్మని చెప్తారు. అప్పుడు కాశీలాంటి మరొక క్షేత్రం ద్రాక్షారామమే కనుక ఇక్కడికి వచ్చేస్తాడు.

శాతవాహనరాజులలో ఒకడైన హాలుడు గాధాసప్తసతి అనే గొప్పగ్రంధాన్ని రచించాడు. ఈయన భార్యపేరు లీలావతి. వీరిద్దరి వివాహం ద్రాక్షారామ భీమేశ్వరుని సన్నిధిలోనే జరిగిందట. లీలావతి అనే పేరుగల కావ్యంలో ఈ వివరాలు ఉన్నాయట.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కనుకే ఈ క్షేత్రాన్ని గొప్పగా ప్రస్తుతించడం జరిగింది.

© Dantuluri Kishore Varma

4 comments:

  1. Good info.. very very informative. I went to this place couple of months ago.. Felt great

    One comment, this should be called as Dakshaaraamam (Daksha + Aramam) Chaganti guruji mentioned this several times in his discourses... My 2cents.

    ReplyDelete
  2. Already mentioned it in the article Kumar garu - "శివుని భార్య సతీదేవి యొక్క తండ్రి దక్షుడు. ఈతనియొక్క ఆరామమే(ప్రాంతం) ద్రాక్షారామం" - Thanks a million for having stopped by.

    ReplyDelete
  3. Kishore garu,
    Annee rasaru gani, Lingam gurinchi, lingam yettu (Height) gurinchi rayaledemi? Alane gudi chuttu vunna prahari goda meeda chala kadhalu vinnam. Vaati meeda kooda kasta vivarana ichunte bavundedi. Chala manchi post. Dhanyavadalu.
    Bhaskar.

    ReplyDelete
    Replies
    1. ఇకముందు రాయబోయే పోస్టులలో ఇంకా సమగ్రమైన సమాచారం అందించడానికి ప్రయత్నిస్తాను.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!