Pages

Friday, 16 August 2013

రైల్‌బస్ దారిలో ఏమిచూడచ్చో చెపుతానన్నవి ఇవే!

ట్రేక్‌ని మింగుతూ ట్రెయిన్ పోతుంటే, డ్రైవర్ ప్రక్కన కూర్చొని చూడచ్చు.

బస్ మీద పోతుంటే జనావాసాల ముంగిళ్ళు కనిపిస్తే, ట్రైయిన్ లో పోతున్నప్పుడు పెరటివైపు కనిపిస్తుంది. ఎందుకంటే తొంభై శాతం మంది రోడ్‌ని ఫేస్ చేసుకొని ఇళ్ళుకట్టుకొంటారుకానీ, పట్టాలకి అభిముఖంగా కట్టుకోరు.

రేపూరులో కట్టిన 116 అడుగుల ఎత్తయిన సాయిబాబా, కొవ్వాడ స్టేషన్ దాటిన తరువాత ఓ రెండు నిమిషాలపాటు మనకు దర్శనమిస్తాడు. తాడిచెట్ల తలలకు పైన, ఇంకొక అంత ఎత్తులో అభయహస్తం చూపిస్తూ కనిపిస్తాడు. 
   
పెరటివైపు పాపలకి గోరుముద్దలు తినిపిస్తున్న తల్లులు వాళ్ళచేత టాటా చెప్పిస్తారు.

చాలా మంది పొలాల్లో పనిచేసుకొంటుంటే, కొంతమంది జల్సా రాయుళ్ళు మాత్రం రైలు పట్టాలకి చేర్చి ఉన్న పొలంగట్లమీద, చెట్టునీడలో కూర్చుని ముక్క తిప్పుతారు. పేకాట బోర్డులు ఈ నలభై అయిదు కిలోమీటర్ల దారిలో కనీసం మూడు నాలుగు కనిపిస్తాయి.

నడుములు వంచి చేలల్లో పనిచేసుకొంటున్న కూలీలు రైలు వెళుతున్నప్పుడు పని ఆపి, నిటారుగా నుంచుని అది వెళ్ళేవరకూ చూస్తారు. అలా వాళ్ళకి కొన్నిక్షణాలు విరామం.

తెల్లకొంగలు, నల్లకొంగలు, తెలుపూ నలుపుల కాంబినేషన్లో ఉన్న కొంగలు, ఇంకా నాలుగైదు రకాల రంగురంగు పిట్టలు పట్టాలమీద ఇనుప చక్రాల చప్పుడికి బెదిరి ఒక్కసారిగా పైకి ఎగురుతాయి.

పాడుపడినట్టు ఉన్న స్టేషన్లు, రంగుపోయి నాచుపట్టిన రైల్వే గేట్లూ కనిపిస్తాయి.

కనుచూపుదూరంవరకూ విస్తరించిన ఆకుపచ్చని చేలు, గట్ల వెంబడి కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, కట్టవల మీద గుబురుగా పెరిగిన రకరకాల వృక్షాలు, అరటిచెట్ల మధ్య ఉన్నాయో, లేవో తెలియకుండా ఉన్న పూరిగుడిసెలు అడుగడుగునా కనిపిస్తాయి.

గొర్రెలకాపర్లు, పసువులకాపర్లు, రైలు గేట్ల దగ్గర అసహనంగా ఆగిన వాహన దారులు, బోదెల్లో ఈతకొడుతున్న బుడతలు, బట్టలు ఉతుకుతూ బిజీగా ఉన్న ఆడవాళ్ళు... ఎందర్నో ఈ ప్రయాణంలో గమనించవచ్చు. 

ప్రవహిస్తున్న కాలువలు, వాటిమీద వంతెనలు, కాలువలకు సమాంతరంగా పోతున్న రోడ్లు ఎన్నో!

మరీ ఎండలో ప్రయాణం బాగోక పోవచ్చు.

మంచుకురిసే చలిలో అయితే చాలా బాగుంటుంది.

వర్షం కురుస్తూ ఉండగా అయితే ఇంకా బాగుంతుంది.


© Dantuluri Kishore Varma 

4 comments:

  1. ఎప్పుడొ స్వాతివారపత్రికలొ వంశి రైల్ బస్ కద రాస్తే ఇదినిజం కాదనుకున్నాను తర్వాత ఈనాడు ఆదివారంలొ రాశారు ఒకసారిచూడాలనుకున్నాను కానీ మీ అర్టికల్ చూశాకా తప్పనిసరిగా ఒకసారి

    వీలు చూసుకుని ఈ రైల్ బస్ తప్పనిసరిగా ఎక్కుతాను మీకు మళ్ళీ నా పొస్త్ లొ రాస్తాను

    ReplyDelete
    Replies
    1. నా పోస్ట్ మీచేత తప్పనిసరిగా రైల్‌బస్ చూడాలనిపించేలా చేసినందుకు చాలా అనందంగా ఉంది. రైలు బస్ గురించి వంశీగారు ఎలా రాసి ఉంటారో తెలుసుకోవాలని ఉంది. మీ కామెంటుకి ధన్యవాదాలు.

      Delete
  2. Bt ee train timings nd route cheppaledu.... pls mention it

    ReplyDelete
    Replies
    1. పోస్టులో స్లైడ్‌షో క్రింద లింక్ ఇచ్చాను చూడండి విజయ్‌గారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!