Pages

Friday, 30 August 2013

మీరెప్పుడైనా లాంచీ మీద గోదావరి దాటారా?

కోనసీమ ప్రాంతం మూడువైపుల గోదావరితో, ఒకవైపు సముద్రంతో ఉంటుంది. తూర్పుగోదావరిజిల్లాలో మిగిలిన ప్రాంతంతో రోడ్డుద్వారా అనుసంధానం కావడానికి గోదావరి నదిమీద వంతెనలు ఉండాలి. ఒకటి రావుల పాలెం దగ్గర ఉంది. రెండవది యానం నుంచి, ఎదుర్లంకకి గోదావరిమీద 1.80కిలోమీటర్ల పొడవైన వంతెన. ఈ వంతెన  జిల్లాకేంద్రమైన కాకినాడనుంచి, కోనసీమలో అమలాపురానికి 70 కిలోమీటర్ల వరకూ దూరాన్ని తగ్గించింది.

12వ, 13వ లోక్‌సభ స్పీకర్‌గా సేవలు అందించిన జి.ఎం.సీ బాలయోగి ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి చాలా పాటుపడ్డారు. కానీ, నిర్మాణం పూర్తికాకుండానే హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. నూటపదికోట్లవ్యయంతో, కేవలం 33 నెలల సమయంలో నవయుగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళచే 2002లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిచెయ్యబడింది. బాలయోగి కృషికి గుర్తింపుగా దీనికి జి.ఎం.సీ బాలయోగి వారధి అని నామకరణం చేశారు.

బాలయోగి వారధి నిర్మించడానికి ముందు కాకినాడనుంచి, అమలాపురం వెళ్ళాలంటే రెండు మార్గాలుండేవి. ఒకటి రోడ్డుమార్గం ద్వారా రావులపాలెం వంతెన మీదనుంచి. రెండవది యానంవరకూ రోడ్డుద్వారా వెళ్ళి, అక్కడినుంచి గోదావరి అవతల ఉన్న ఎదుర్లంకకి లాంచీ లేదా పంటు మీది ప్రయాణం చేసి, ఎదుర్లంక నుంచి మళ్ళి రోడ్డు మార్గం ద్వారా అమలాపురం వెళ్ళడం. ఈ రెండవ ప్రయాణ మార్గంలో కేవలం బైకులు, కార్లూ వరకే లాంచీ ద్వారా నదిదాటగలవు కానీ లారీలు, బస్సులవంటి పెద్దవాహనాలకి ఆ అవకాశం లేదు.

(P.S: "కాకినాడనుంచి, అమలాపురం వెళ్ళాలంటే రెండు మార్గాలుండేవి."  ఇంకో మార్గం కూడా ఉండేది. కాకినాడనుండి దక్షారామం మీదుగా కోటిపల్లి, అక్కడ గోదావరి పడవలోనూ లేక వరదల టైములో లాంచీ లమీదా దాటి, ముక్తేశ్వరమూ, అక్కడనుంచి అమలాపురం -ఫణిబాబుగారూ మీ సవరణకి ధన్యవాదాలు.) 
యానం రేవు 
గోదావరికి వరదనీరు వచ్చిన సమయంలో నది దాటడం చాలా కష్టం అయ్యేది. కోనసీమనుంచి కొబ్బరి, అరటి, వరిలాంటి వ్యవసాయ ఉత్పత్తులు; చెరువుల్లో పండించే రొయ్యలు, చేపలు లాంటి మత్యసంపద; పారిశ్రామిక ఉత్పత్తులు, భవన నిర్మాణానికి కావలసిన మెటీరియల్ మొదలైనవి కేంద్రపాలిత ప్రాంతమైన యానానికి కానీ, జిల్లా కేంద్రమైన కాకినాడకి కానీ; లేదా ఇటునుంచి కోనసీమకి కానీ తరలించాలంటే లారీలమీద చుట్టూతిరిగి వెళ్ళవలసిన పరిస్థితి.
ఎదుర్లంక గోదావరి గట్టు. కొబ్బరి మొక్కలమధ్య కనిపిస్తున్నది దుర్గా దేవి గుడి.
కాకపోతే, లాంచీ మీద ప్రయాణం మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. బైకులు, కార్లు, మనుషులతో కిక్కిరిసిపోయి; ఒక్కొక్కసారి మేకలు, గేదెలు, కోళ్ళు లాంటి సహప్రయాణీకులతో; అందరూచేసే రణగొణధ్వనితో, లాంచి ఇంజను శబ్ధం కలసిపోయి డు..డు..డు..మని వెళుతుంటే, వీటన్నింటినీ మరచిపోయేలా చేసే చల్లని గోదావరి గాలి. అభివృద్ది, సౌకర్యం లాంటివి ఎన్ని కల్పించినా ఈ బ్రిడ్జి లాంచీ అనే వాస్తవాన్ని మింగేసి, జ్ఞాపకాన్ని మాత్రం మిగిల్చింది.
 బై ద వే, మీరెప్పుడైనా లాంచీ మీద గోదావరి దాటారా?    
© Dantuluri Kishore Varma 

11 comments:

  1. "కాకినాడనుంచి, అమలాపురం వెళ్ళాలంటే రెండు మార్గాలుండేవి."-- మాస్టారూ , ఇంకో మార్గం కూడా ఉండేది. కాకినాడనుండి దక్షారామం మీదుగా కోటిపల్లి, అక్కడ గోదావరి పడవలోనూ లేక వరదల టైములో లాంచీ లమీదా దాటి, ముక్తేశ్వరమూ, అక్కడనుంచి అమలాపురం. మా చిన్నప్పుడు అలాగే వెళ్ళేవారం. మీ వ్యాసం బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ఫణిబాబుగారూ మీ సవరణకి ధన్యవాదాలు. నేనుకూడా ఒకటిరెండుసార్లు ఈ రేవుదాటినా, ఈ వ్యాసంలో దాన్ని ప్రస్తావించడం మరిచాను ఇప్పుడు కలిపాను.

      Delete
  2. బాగుందండి పోస్ట్ .పాపికొండలు వెళ్ళడానికి లాంచీ ఎక్కటమే ఎప్పుడూ లాంచీ ఎక్కలేదు .

    ReplyDelete
    Replies
    1. పాపికొండలు లాంచీ మీద వెళితే ఓ వందసార్లు పంటు/లాంచీమీద గోదావరి దాటినట్టే. మహత్యం అంతా లాంచీలోనూ, పంటులోనూ లేదు గోదావరిలోనే ఉంది. మీ స్పందనకి ధన్యవాదాలు రాధికగారు.

      Delete
  3. బడబడ లాంచీ ఎక్కకపోటమా? బలేవారే! లాంచీ ప్రయాణం గురించి టపా రాసేస్తానంతే :) హన్నా! టపా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. హా.. హా..శర్మగారు. మీకుతెలియని గోదావరి కబుర్లా? ధన్యవాదాలు.

      Delete
  4. Replies
    1. థాంక్స్ మూర్తిగారు.

      Delete
  5. ముమ్మిడివరం లోక్‌సభ నియోజకవర్గం లేదండి. అమలాపురం.

    మా నరసాపురం నుంచి చిన్నప్పుడు ప్రతీ ఏడాదీ, లాంచిలో అంతర్వేది వెళ్ళేవాళ్ళం.
    ఇప్పుడు కూడ వీలైతే అంతర్వేది తీర్థానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాను.

    ReplyDelete
    Replies
    1. మీ సవరణకి ధన్యవాదాలు బోనగిరిగారు.

      Delete
  6. I am delighted you liked this post. Sorry for the late response. Do visit my blog now and then and leave your valuable comments.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!