Pages

Monday, 13 January 2014

అరకు ఘాట్‌రోడ్‌లో...

అరకు ఘాట్ రోడ్లో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. గతంలో ఒకసారి అరకు వెళ్ళినప్పుడు విశాఖపట్నం నుంచి ట్రెయిన్‌లో వెళ్ళి వచ్చాం. అప్పటినుంచీ రోడ్డుమార్గంలో వెళ్ళలేకపోయామన్న వెలితి అలా ఉండిపోయింది. ఘాట్‌రోడ్‌లో స్వంతకారులో వెళ్ళాలంటే అలవాటులేని కొండదారులు కనుక కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి బస్‌లో కానీ, ప్రయివేట్ వెహికల్‌లో కానీ వెళ్ళాలని నిర్ణయించుకొన్నాం. వైజాగ్ బస్‌స్టేషన్ నుంచి అరకు వెళ్ళడానికి ప్రతీ అరగంటకీ ఒక్కో బస్సు ఉంది. దారిలో కొండలు, లోయలు, జలపాతాలు, సుందరమైన ప్రదేశాలు చాలా ఉంటాయి. బస్సుని కావలసిన ప్రదేశంలో నిలుపుకొని ప్రకృతిని ఆస్వాదించడానికి కుదరదు కనుక టవేరాని హయర్ చేసుకొన్నాం. డ్రైవర్ చాలా కోపరేటివ్. ఓపికగా అన్ని ప్రదేశాలూ చూపించుకొంటూ, గైడ్‌లాగా తనకు తెలిసున్న విశేషాలు వివరిస్తూ తీసుకొని వెళ్ళాడు.


ఉదయం ఆరున్నరకే వైజాగ్లో బయలుదేరాం. సన్‌లైట్ ఉన్నంతవరకూ చూసుకొని సాయంత్రం అరకులో తిరుగు ప్రయాణం అవ్వడానికి మాట్లాడాం. సాధారణంగా ఈ సీజన్లో సాయంత్రం నాలుగు, నాలుగున్నరకల్లా అరకులోయలో చీకట్లు ముసురుకొంటాయట. కానీ అదృష్టంకొద్దీ ఆరువరకూ వెలుతురు ఉంది. వాతావరణంకూడా భరించలేనంత చలి కాకుండా చిరుచలితో, నులివెచ్చని సూర్యకిరణాలతో ఆహ్లాదకరంగా ఉంది.  

డ్రైవర్ పేరు విశాఖ. `ఇలాంటి పేరు ఎప్పుడైనా విన్నారా సర్ మీరు?` అని అడిగాడు. తనది విశాఖా నక్షత్రమట, విశాఖపట్నంలో పుట్టాడుకనుక ఆ పేరు పెట్టారట. అలా ఊరిగురించో, దారిగురించో, రాజకీయాలగురించో, తనగురించో ఏదో చెపుతూనే ఉన్నాడు.  డ్రైవర్ రాముడు దగ్గర నుంచి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వరకూ వేలీలో ఏఏ ప్రదేశాలలో ఏ సినిమాలు నిర్మించారో, సన్నివేశాలతో సహా చెప్పాడు. శృంగవరపుకోట దగ్గర ఘాట్‌రోడ్‌లో ప్రవేశించడానికి ముందు తలతిరగకుండా, వొమిటింగ్స్ కాకుండా ఉండడానికి ఏమయినా టేబ్‌లెట్స్ కావాలంటే అక్కడే కొనుక్కొని వేసుకోమని సలహా ఇచ్చాడు. దారి అంతా మెలికలు తిరుగుతూ హెయిర్‌పిన్ బెండ్స్‌తో ఉంటుంది కనుక చాలా మందికి ఈ సమస్య వస్తుందని చెప్పాడు.  

మంచులో తూర్పుకనుమల అందం సమ్మోహనకరం. దూరంగా కొండవాలుల్లో అగ్గిపెట్టెలతో కట్టినట్టు కనిపిస్తున్న ఇళ్ళు, గడ్డిమోపులు, పొలంమడులు, ఎవరో వంటచేసుకొంటున్న పొయ్యిలోనుంచి పైకి వెళుతున్న పొగ, రోడ్డుప్రక్కన చిన్న చిన్న గ్రామాల్లో సంతలు, సంతకు తట్టల్లో, కావిడుల్లో సరుకులు మోసుకొని పోతున్న గిరిజనులు, అంగడుల్లో అమ్మకానికి పెట్టిన తేనెసీసాలు... ప్రతీ చోటా అగి ఫొటోలు తీయాలనే కోరికని ఆపుకోలేం.

ఉడికించిన వేరుశనగ కాయలు, మొక్కజొన్నపొత్తులు, చికెన్‌ముక్కలని పుల్లకు గుచ్చి బొగ్గులమీద కాల్చే గ్రిల్డ్‌చికెన్, బొంగులో చికెన్లని ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్నారు. కానీ వేరుశనక్కాయలు తప్పించి మరేమీ తినలేదు. బొర్రాగుహల దగ్గర లంచ్ చేశాం. 

టైడా అనే ఊరిలో రోడ్డుపాయింట్‌కి దగ్గరలో రైల్వే టన్నెల్ ఉంటుంది. రైలు మార్గంలో అరకు వెళ్ళేటప్పుడు ఇలాంటి టన్నెల్స్ 44 దాటాలి. పట్టాలమీదుగా చీకటి టన్నెల్‌లోనికి నడిచి వెళ్ళవచ్చు. ఒకవేళ అదే సమయానికి రైలు వచ్చినా ప్రక్కకు జరిగి నుంచోవడానికి టన్నెల్ గోడకి, పట్టాలకీ మధ్యలో చాలా జాగా ఉంది. అక్కడ పనిచేసుకొంటున్న ఒక రైల్వే ఉద్యోగిని `లోనికి వెళ్ళవచ్చా?` అని అడిగితే, `ఏమీ పరవాలేదు వెళ్ళండి,` అన్నాడు. టైడాలోనే జంగిల్‌బెల్స్ అనే రిసార్ట్ ఉంది. ట్రెక్కింగ్, క్యాంఫయర్, ధింసాడ్యాన్స్ లాంటి ఆక్టివిటీస్‌ని నిర్వహిస్తారు ఇక్కడ.


బొర్రాగుహలు, గాలికొండ, సూయిసైడ్‌పాయింట్, అనంతగిరి ఏపిటీడీసీ హెస్ట్‌హౌస్, కాఫీతోటలు, పసుపుపూలతో ఉండే వలెసెల తోటలు చూసుకొంటూ అరకువేలీకి వెళ్ళి ట్రైబల్ మ్యూజియం చూసి, పాడేరు రోడ్డులో అరకులోయకు సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న చాపురాయి జలపాతాన్ని, తిరిగి వస్తూ మళ్ళీ అరకులో పద్మాపురం గార్డెన్స్ చూసి సాయంత్రం ఆరయ్యేసరికి వైజాగ్ వైపు బయలుదేరాం.  కానీ సరిగ్గా అప్పుడు మొదలయ్యింది సమస్య. చలి, చీకటిలో ప్రయాణం. `ఈ సమయానికి మనం ఘాట్ దిగిపోవాలి సర్,` అన్నాడు విశాఖ. నావైఫ్‌కి, వదినగారికి, అన్నయ్యకొడుకు ప్రణిత్‌కి తలతిరుగుడు, వొమిటింగ్స్ ప్రారంభమయ్యాయి. ఘాట్‌రోడ్ జర్నీ ఎఫెక్ట్. మాటి, మాటికీ ఘాట్‌లో బండి ఆపుకోవడం. చుట్టూ చీకటి, కీచురాళ్ళ అరుపులు, ఉండుండి వేగంగా మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతున్న వాహనాలు. ఎప్పుడు ఘాట్ దిగుతామా అని ఎదురు చూశాం - డ్రైవర్తో సహా అందరం! 


ఈ చిన్న సమస్య కొంచెం ఇబ్బంది పెట్టినా మిగిలిన ప్రయాణం అంతా సజావుగా సాగింది. అందమైన జ్ఞాపకాలు మనసులో దాచుకోవచ్చు!   
© Dantuluri Kishore Varma

2 comments:

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!