తేనెలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయని చెపుతారు. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తాగితే మధురంగా ఉంటుంది. ఉదయాన్నే తేనెని నిమ్మరసంతో కలుపుకొని తాగితే వొళ్ళుతగ్గుతుంది. తులసి ఆకుల రసంతో కలిపి తీసుకొంటే జలుబు, దగ్గు తగ్గుతాయి. పాలతో కలిపి సేవిస్తే బరువు పెరుగుతుంది. దెబ్బలు తగిలిన మచ్చలమీద తేనెని రాస్తే మచ్చలు క్రమంగా చర్మపు రంగులో కలిసి పోతాయి... ఇటువంటి ఎన్నో రకాల చిట్కాలు పెద్దలు చెపుతూ ఉంటారు, ఆయుర్వేద పత్రికల్లో లేదా టీవీల్లో కనిపిస్తాయి. కాబట్టే అందరం దీనిని కొని వాడుతుంటాం. కానీ శ్వచ్చమైన తేనెలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో, కల్తీ తేనెలో అన్ని అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు ఉంటాయి. మా చిన్నప్పుడు కోయవాళ్ళు చెట్టునుంచి కొట్టిన తేనెపట్టుల్ని స్టీలు కేరేజీల్లో పెట్టి, సరాసరి తీసుకొని వచ్చేవారు. తేనె లభ్యత ప్రధానంగా అలానే ఉండేది. క్రమంగా వినియోగం పెరిగింది, ఉత్పత్తి తగ్గింది. తేనె తెచ్చేవాళ్ళకి తెలివి తేటలు పెరగడంతో పంచదార పానకాన్ని తేనెలో కలిపి తేనెపట్టులకి పట్టించి ఊళ్ళమీద అమ్మడం మొదలు పెట్టారు. ఒకసారి వాళ్ళదగ్గర కొని మోసపోయాం. కొన్న కొన్నిరోజులకే పంచదార పెచ్చులు పైన పొరలాగ ఏర్పడ్డాయి. పూర్తి సీసాడు తేనెని(?) బయట పారవెయ్యవలసి వచ్చింది. అప్పటినుంచీ బ్రాండెడ్ తేనెని వాడడం మొదలు పెట్టాం. దానిలో కూడా కొంత కల్తీ ఉండవచ్చునేమో చెప్పలేం!
అరకులోయలో తేనె ఉత్పత్తి చేసే ప్రదేశాన్ని చూశాను. కొంచెం స్టడీ చేస్తే ఎపీకల్చర్ గురించి ఎన్నో విషయాలు తెలిశాయి. తేనెటీగలు తేనెని సేకరించే, నిలువచేసే విధానం చాలా ఆసక్తి కలిగించేలా ఉంటుంది. ప్రతీ పట్టుకీ ఒకటే రాణీ ఈగ ఉంటుందట. రెండవది ఉండడానికి అవకాశంలేదు. ఎందుకంటే అలా ఉన్నసందర్భంలో ఒకటి రెండవదానిని చంపేస్తుంది. ఒకటో, రెండో మగ ఈగలు ఉంటాయి. వాటితో పాటూ కొన్ని వేలల్లో శ్రామిక ఈగలు ఉంటాయి. ఈ శ్రామిక ఈగలు అన్నీ ఆడవే. రాణీ ఈగ గుడ్లని పెట్టడానికి మైనంతో గదులను నిర్మించడం, పువ్వులనుంచి తేనెని సేకరించి తెచ్చి వాటికి తినిపించడం, తేనెపట్టుకి కాపలా కాయడం మొదలైన పనులన్నీ శ్రామిక ఈగలే చేస్తాయి. మగఈగలని డ్రోన్‌లు అంటారు. వాటి పని కేవలం రాణీ ఈగతో కలియడం మాత్రమే. కానీ కర్తవ్య నిర్వాహణ చేసిన మరుక్షణమే అవి మరణిస్తాయి. రాణీ ఈగ గుడ్లుపెడుతుంది. రాణీ ఈగ విడుదలచేసే ఒకరకమైన ఎంజైమువల్ల శ్రామికి ఈగల్లో ఏవీకూడా సంతానోత్పత్తికి పనికి రాకుండా అవుతాయి. క్వీన్‌బీ మహా నిరంకుశురాలు, కదూ?
మనకు ఒక అనుమానం రావచ్చు క్వీన్‌బీ ఎలా తయారవుతుంది అని. ఇంతకు ముందు రాణీ ఈగ గుడ్లు పెడుతుందని అనుకొన్నాంకదా? అవి అన్నీ మకరందాన్ని తాగి శ్రామిక ఈగలుగా ఎదుగుతాయి. కానీ ఎప్పుడైనా పట్టులోని క్వీన్‌బీ ముసలిది అయినా, మరణించినా శ్రామిక ఈగలు ఒకటి రెండు రాణీ ఈగల్ని తయారు చేస్తాయి. పువ్వులనుంచి సేకరించిన మకరందాన్ని కాకుండా అవి స్రవించే రాయల్ జెల్లీ అనే ఒకరకమైన ఎంజైముని ఒకటి రెండు గదుల్లో ఉన్న లార్వాకి అందించడం వల్ల, ఆ లార్వే రాణీ ఈగలుగా ఎదుగుతాయి.
ఈ విధానం అంతా చూస్తుంటే మన ప్రజాస్వామ్యం గుర్తుకువస్తుంది. ప్రజలందరూ రాత్రనక, పగలనక బ్రతకడానికి కష్టపడి పనిచేసుకొంటూ..రూపాయి, రూపాయి కూడబెట్టుకొని ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తూ.. తమని పరిపాలించడానికి ఒకదొరగారినో, దొరసానినో ఓట్లేసి అందలం ఎక్కిస్తే.. ఏమవుతుంది? మంచితేనె కోసం ఆశపడితే, కల్తీతేనే దొరుకుతుంది. ప్రజాస్వామ్యఫలాలు స్వార్థపరుల చేతుల్లో పడి విషతుల్యంగా మారుతున్నాయి.
మనదేశం ఒక పెద్ద తేనెపట్టులా తయారయ్యింది!
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment