బొర్రాగుహలు విశాఖపట్టణం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో, అరకు వెళ్ళే మార్గంలో ఉన్నాయి. బొర్రాగుహలు నుంచి అరకు 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుహల దగ్గరకి వెళుతున్నపుడు మనకు నది ప్రవాహపు శబ్దం వినిపిస్తుంది. గుహల బయట ఏర్పాటుచేసిన వ్యూపాయింట్ దగ్గరనుంచి చూస్తే కొండలమధ్యనుంచి ప్రవహిస్తున్న గోస్తనీ నది కనిపిస్తుంది. ఈ నది బొర్రా గుహలలోనే పుట్టింది. కొన్ని లక్షల సంవత్సరాలక్రితం ప్రస్తుతం గుహ ఉన్న కొండప్రాంతం పైనుంచి గోస్తనీ నది ఉరుకులెత్తుకొంటూ ప్రవహించేదట. దానివల్ల కొండల్లో ఉన్న సున్నపురాయి నిక్షేపాలు కరిగిపోయి, నీటితోపాటు కొట్టుకొని పోగా బొరియలు మిగిలాయి. అవే ఇప్పటి బొర్రాగుహలు. బొర్ర అంటే బొరియ అనే అర్థం. గోస్తనీ అంటే గోవుయొక్క పొదుగు అని అర్థం. సున్నపురాతి నిక్షేపాలతో ప్రవహిస్తున్న నీరు తెల్లగా ఉండి, గోవు పొదుగునుంచి వచ్చే పాలలా ఉంటుంది కనుక ఈ నదిని గోస్తనీ నది అనిపిలవడం మొదలుపెట్టారట.
విలియం కింగ్ జార్జ్ అనే జియాలజిస్టు 1807వ సంవత్సరంలో ఈ గుహలని కనుక్కొన్నాడని ఇక్కడ పెట్టిన బొర్డ్‌లో రాసి ఉంది. అనంతగిరి కొండలమీద మేస్తున్న ఆవు ఒకటి ప్రమాదవశాత్తూ బొరియలోనుంచి గుహల్లోకి పడిపోవడంతో, ఇక్కడ గుహలు ఉన్న సంగతి జనాలకి తెలిసిందని చెపుతారు. తెలియడం అంటే ఇప్పుడు తెలిసింది కానీ 30,000 నుంచి 50,000 సంవత్సరాలకి పూర్వమే ఈ గుహల్లో ఆదిమానవులు నివశించేవారని పరిశోధనలు చేసిన ఆంత్రొపాలజిస్టులు కనుగొన్నారు.
గుహపైనుంచి చుక్కా, చుక్కా కారే సున్నపురాయి క్రమంగా పేరుకొని, గట్టిపడి బొర్రాగుహల్లో రకరకాల ఆకారాలని పొందాయి - కొన్ని గుహసీలింగ్ నుంచి క్రిందకి, కొన్ని నేలమీదనుంచి పైకి. కేవ్ అంతా తిప్పి చూపించడానికి ఇక్కడ గైడ్లు ఉంటారు. కావాలంటే వాళ్ళని ఫీజ్ చెల్లించి ఎంగేజ్ చేసుకోవచ్చు. కానీ అది అనవసరం. ఒకవేళ మీరు అలా కనుక చేస్తే, వాళ్ళు మీకు చూపించేది ఈ ఆకారాలనే. మహర్షి గెడ్డం అని, ఆవు పొదుగు అని, తల్లీబిడ్డా అని, ఇంకా చాలా చాలా చెపుతారు. శివలింగం లాంటి ఆకారాలు కూడా ఉన్నాయి. ఒక శివలింగానికి గుహ అంతర్భాగంలో చిన్న మందిరం కట్టారు. శివరాత్రి రోజు ఈ చుట్టుప్రక్కల గ్రామాలనుంచి ప్రజలు తొండోపతండాలుగా వస్తారట ఇక్కడ పూజలు చెయ్యడానికి.
గట్టిపడి వివిధ ఆకారాలను పొందిన వీటిని స్టాలక్‌టైట్, స్టాలగ్‌మైట్ అని పిలుస్తారు. గుహపైనుంచి తోరణాల్లా వ్రేలాడ బడినట్టు ఏర్పడినవి స్టాలక్‌టైట్స్, క్రిందనుంచి పైకి ఏర్పడినవి స్టాలగ్‌మైట్స్. ఈ రెండు పేర్లూ చాలా సారూప్యత కలిగి ఉండి గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటాయి. జియాలజిస్టులే ఒక్కో సారి ఏది, ఏదో తెలియక తికమక పడతారట. అందుకే జ్ఞాపకం పెట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా ఉపయోగిస్తారు. సీలింగ్ నుంచి వ్రేలాడేవి స్టాలక్‌టైట్స్ - సీలింగ్‌లో ఇంగ్లీష్ అక్షరం `సి`, స్టాలక్‌టైట్‌లో `సీ`. గ్రౌండ్‌నుంచి పైకి ఏర్పడినవి స్టాలగ్‌మైట్స్ - గ్రౌండ్‌లో `జి`, స్టాలగ్‌మైట్‌లో `జి`. ఈ నెమోనిక్ బాగుంది కదా?
గుహకి లైటింగ్ ఏర్పాటు చెయ్యడంతో చూడడానికి బాగుంది. మెడడును పోలిన ఆకారం ప్రత్యేక ఆకర్షణ. గుహ సీలింగ్ మీద రెండు కొండలు కలిసిన అతుకు ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది. లోపల మెట్లు, ఎత్తుపల్లాలు, ఒకటిరెండు చోట్ల చిన్న సొరంగ మార్గాలు ద్వారా నడక మూడువందల నుంచి నాలుగువందల మీటర్ల వరకూ ఉంటుంది. ఈ గుహలు మొత్తం ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయట. విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రైలు మార్గం ఈ గుహల మీదనుంచే వెళుతుంది!
ఉదయం పదినుంచి సాయంత్రం ఐదు వరకు తెరిచే ఉంటాయి. మధ్యాన్నం ఒంటిగంట నుంచి రెండు వరకూ లంచ్‌బ్రేక్. ఎంట్రన్స్ టిక్కెట్ల ధర మాత్రం పేలగొట్టేస్తున్నారు. పెద్దవాళ్ళకి అరవై, పిల్లలకి నలభైఐదు, కెమేరాకి వంద!
గుహల్లోకి వెళ్ళే ముందే బయట ఉన్న చిన్న రెస్టారెంట్లలో ఏదో ఒకదాని దగ్గర లంచ్ ఆర్డర్ చేసి వెళితే, మీరు తిరిగి వచ్చేసరికి రెడీ చేస్తారు.
© Dantuluri Kishore Varma
మంచి పరిచయము. గతములో రెండు మార్లు చూసిన చోటే ఐనా, వాటిని కొత్త కోణముల్లో, మీ ఫోటోల ద్వారా తిరిగి నెమరవేసుకున్నాను. ధన్యవాదాభివందనములండీ ...
ReplyDeleteధన్యవాదాలు ప్రసాదరావుగారు. మీకు నచ్చేలా రాయగలగడం సంతోషానిస్తుంది.
Deleteవర్మగారూ! సంక్రాంతి శుభాకాంక్షలు. కాపీ క్యాట్స్ గురించి చదివాను. దానిగురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకంటే మీరు ట్రెండ్ సెట్టర్. ఆ ట్రెండ్‌ను కొంతమంది ఫాలో అవుతున్నారంటే అది మీకు గౌరవమే. మరొక మాట. అనుకరణకూడా ఒకవిధమైన ప్రశంశ అని ఒక నానుడి ఉంది. శుభాభినందనలు.
ReplyDeleteతేజస్విగారు, ఇలా అనుకోవడం చాలా కంఫర్టింగ్‌గా ఉంటుంది. మీ మాటలు పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేశాయి. చాలా కాలానికి మీ కామెంట్ చూడడం సంతోషదాయకం. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
DeleteNice place to visit if you want to have a best wildlife tour in Corbett so visit on- Corbett National Park
ReplyDelete