Pages

Friday 7 February 2014

గుండె ఝల్లుమంది...

రాంగోపాల్‌వర్మ రాత్రి సినిమాలో నిర్మానుష్యమైన ఊరిలో రేవతినీ దించేసినట్టు నన్ను ఒక్కడిని దించేసి బస్సువెళ్ళిపోయింది. ఐస్క్రీం బండివాడు ఒక్కడే ఉన్నాడు. `బాబూ, ఇదేనా దారి?` అన్నాను.`ఆ.... వెళ్ళండి,` అన్నాడు.
ఎర్రమట్టి దిబ్బలు ఎన్నివేల లేదా లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయో తెలియదుకానీ, వాటి ఏర్పాటు ఒక భౌగోళిక అద్భుతం. పూర్వం సముద్రమట్టం ఇంకా పైకి ఉండేదని, ఎగసిపడే కెరటాలవల్ల మట్టి కొట్టుకొని పోయి నెర్రల్లాగ అయివుండవచ్చని కొందరు అంటారు. మరొక అభిప్రాయం ప్రకారం బొర్రాగుహల్లో పుట్టిన గోస్తనీ నది ప్రవాహమార్గం ఇదేనని అంటారు. విశాఖపట్నం నుంచి, భీమిలి వెళ్ళేదారిలో సముద్రంలో కలిసేది. తరువాత ఈ నది తన ప్రవాహ మార్గం మార్చుకొని ఉండవచ్చునట. ఏది ఏమయినా ఇంత విస్తీర్ణంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు లాంటి ప్రదేశం భారతదేశపు తూర్పుతీరంలో మరొకటి లేదని జియాలజిస్టులు చెపుతారు.
నేను ఉద్యోగరీత్యా వైజాగ్‌లో ఒకసంవత్సరం ఉన్నప్పుడు, ప్రతీనెలా భీమిలి వెళ్ళవలసి ఉన్నప్పుడూ కూడా ఒక్కసారీ ఎర్రమట్టిదిబ్బలని చూడకపోవడం క్షమించరాని విషయం! ఆ ఫీలింగుని పోగొట్టుకోవడానికి మొన్న అరకు ట్రిప్ వేసిన సందర్బంలో ఒక్కపూట సమయం దొరకడంతో బస్‌కాంప్లెక్స్ దగ్గర భీమిలీ బస్ పట్టుకొని, ఓ గంట ప్రయాణం చేసి, ఎర్రమట్టిదిబ్బలదగ్గర దిగాను. అప్పటికి సాయంత్రం నాలుగు అవుతుంది. సముద్రానికి అభిముఖంగా రోడ్డుకి అవతల ఇసుక పుంతలాంటి మార్గం ఉంది.
అడుగువేస్తే కాళ్ళు ఇసుకలో కూరుకొనిపోతున్నాయి. కొంచెం దూరం వెళ్ళినతరువాత పుంతమార్గానికి అటూ, ఇటూ ఎత్తైన దిబ్బలు, వాటిమీద గుబురుగా అడవిలా పెరిగిన చెట్లు. మార్గం రెండుగా విడిపోయింది. `ఎడమవైపుకా, కుడివైపుకా?` అనుకొని ఓ వైపుకి వెళ్ళాను. మరికొంతదూరం నడక. దారులోనుంచి, దారి. రెండు, రెండుగా చీలిపోతున్న మార్గం. నేను తప్ప మరొక నరమానవుడు కనిపించడంలేదు. పిట్టల అరుపులు కూడా లేవు. దూరంనుంచి వినిపిస్తున్న ట్రాఫిక్ హోరుకూడా వినిపించడం మానేసింది. ఇంకా వెళితే సెల్‌సిగ్నల్ కూడా పోతుంది, లాబిరింత్‌లో ప్రవేశించినట్టు, దారితప్పిపోతే డైరెక్షన్ చెప్పడానికి కూడా ఎవరూ ఉండని ప్రదేశం. శీతాకాలమేమో ఐదు గంటలకే చీకట్లు ముసురుకొంటున్నాయి. ఇంకాస్తముందుకు వెళ్ళినా కనిపించే దృశ్యం అదే. కాబట్టి వెనక్కితిరిగాను. నిజంచెప్పొద్దూ, గుండెఝల్లుమంది...

నేను నడచి వచ్చిన మార్గంలో, అంతకు రెండునిమిషాలముందు లేరు - కానీ, ఇప్పుడు ఉన్నారు - ఇద్దరు వ్యక్తులు  ఇసుకలో కూర్చొని కబుర్లుచెప్పుకొంటూ, నడచి వచ్చినందుకు ఆయాసపడుతూ, అలసట తీర్చుకొంటూ.... వాళ్ళని అక్కడ ఊహించలేదు. అందుకే,  రిలీఫ్‌గా ఫీలవ్వడానికి బదులు షాకయ్యాను. నేను ఒక్కడినే కాదన్నమాట, ఇంకా కొంతమంది టూరిస్టులు కూడా ఈ ప్రదేశానికి వస్తూ ఉంటారు! వాళ్ళను దాటుకొని, రోడ్డు చేరుకొని, బస్సుపట్టుకొని, ఇంటికి చేరాను.
© Dantuluri Kishore Varma

2 comments:

  1. కానీ,ఇప్పుడు అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది కదా, క్రైం పెరిగిపోయింది,
    ఒంటరిగా వెళ్ళటం ప్రమాదమే, ఎప్పుడూఒ ఇలాంటి సాహసాలు చేయకండి.(అన్యదా బావించవద్దు, మిత్రులుకదా అని చెప్పాను)

    ReplyDelete
    Replies
    1. మిత్రుల సలహా తప్పక స్వీకరించవలసిందే. ధన్యవాదాలు మెరాజ్ గారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!