కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో
రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే
ఓ కొత్త వలపు వికసించగనే ఎన్నెన్నీ హొయలో ఎన్నెన్నీ లయలో
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో
ఎన్నెన్నీ హొయలో, ఎన్నెన్నీ లయలో....
అని సీతారామశాస్త్రిగారు అన్నట్టు అరకులోయలో దారిలో అందాల హొయలు వర్ణించతరం కాదు. అందుకే ఈ ఫోటోలు చూపిద్దామని... చిన్ని ఆశ.
ఈ రిసార్ట్ కిటికీలోనుంచి చూస్తే లోయ అందం కనిపిస్తుంది. ప్రొద్దున్న మంచులో, మధ్యాహ్నం ఎండలో, సాయంత్రం ఏటవాలు సూర్యకిరణాలలో కొండదారుల్లో నడుస్తూ వెళ్ళి ఎక్కడినుంచో ప్రవహిస్తున్న సెలయేటిని చూడాలనిపిస్తుంది. గొంతెత్తి పాడుతున్న ఏదో పక్షి కూతకి బదులివ్వాలనిపిస్తుంది. కానీ, రాత్రయితే!? దూరంగా ఉన్న పూరిగుడిసెలో ఎప్పుడూ కాపురముండే కోనవాసులు ఎలా ఉంటారో?
ఆకాశం దాకా నిటారుగా పెరిగినట్టున్న చెట్లు, వాటి మొదళ్ళనుంచి `మేము కూడా మేఘాలని అందుకొంటాం,` అన్నట్టు పైకి ఎగబ్రాకుతున్న కాఫీతోటల్లో పాదులు, పొద పొదకీ మధ్య వాలునుంచి పైకి ఎక్కడానికి కాఫీ తోటల యజమానులు కట్టిన మెట్లు, మెట్లక్రింద ఘాట్‌రోడ్డుని చేర్చి మంచెల్లా కట్టిన బడ్డీలమీద కాఫీ పొడిని, మసాలా దినుసుల్నీ, తేనెనీ అమ్ముతున్న మనుషులు. ఒక కప్పు వెచ్చని కాఫీనీ సిప్ చేస్తూ, చిరుచలిని ఆస్వాదిస్తూ, చెట్ల వెనుకనుంచి అస్తమిస్తున్న సుర్యుడిని చూడడం బాగుంటుంది. ఇది అనంతగిరి కాఫీతోటల దగ్గర దృశ్యం.
దూరంగా కనిపిస్తున్నది సూయిసైడ్ పాయింటట. ఫెన్సింగ్ పైనుంచి అఖాతంలోకి చూస్తే కళ్ళుతిరుగుతాయి.
`నువ్వు వస్తానంటే నేనొద్దంటానా,` సినిమా చూశారా? షూటింగ్ చేసింది ఇక్కడేనట. శ్రీహరి ఇల్లు, పొలం అన్ని ఈ లోయలోనివే.
అక్టోబర్, నవంబర్ నెలల్లో అరకులోయలో కొండవాలులు పసుపు వర్ణంతో కళకళ లాడతాయి. ఎక్కడచూసినా వలిసేపువ్వులు విరబూసి కనువిందుచేస్తాయి. మేము సీజన్ కొంచెం దాటిన తరువాత వెళ్ళడంవల్ల అప్పటికే చాలా చోట్ల పంటకోతలు అయిపోయి, ఖాళీ మడులు ఉన్నాయి. కానీ, అదృష్టంకొద్దీ ఒక్కచోటమాత్రం కొన్ని మడుల్లో ఇంకా వలిసెలు వుండడంతో ఇలా కెమేరా కళ్ళల్లో చిక్కుకొన్నాయి.
ఇది తిరుగు ప్రయాణపు దారి.
© Dantuluri Kishore Varma
నేను కూడా చూసానంటే చూశానని ఒక హడావిడి ట్రిప్ వేసానండి అరకు లోయకి ఒకసారి. ఇప్పుడు అంత పచ్చగా లేదని, బాగా కమర్షియల్ వాసన వేస్తోందని ఈమధ్య వెళ్లి వచ్చిన వాళ్ళెవరో చెప్తుంటే విన్నాను. ఇండియా వచ్చినప్పుడల్లా వెళ్లాలనుకొని, వెళ్ళలేని నా ప్రయాణాల లిస్టులో ప్రతిసారి "అరకు" ఉండి తీరుతుంది. అరకు అంటే నాకు గుర్తు వచ్చేది వంశీ గారి కథలు, ఆలాపన మూవీ. చాలా సినిమాల్లో అరకు ప్రకృతి సౌందర్యాన్ని చూపించారు, కానీ ఆలాపనలో మాత్రం ఆ పచ్చదనం, లోయ సౌందర్యంతో పాటు, రైల్వే కళాసీలు,స్టేషన్ మాస్టర్, రైలు పట్టాలు... అన్నీ, అందరూ, పాత్రధారులే.
ReplyDeleteఅరకు అందాలకు ఏమీ కొరతరాలేదు జ్యోతి గారు. కాకపోతే మీరు అన్నట్టు ప్రతీచోటా బాగా డబ్బు లాగేస్తున్నారు. టూరిజంవాళ్ళు ఎంట్రన్స్ టిక్కెట్ల ధర విపరీతంగా పెంచారు. స్థానికులు మొక్కజొన్నపొత్తుని మూడురెట్ల ధరకి అమ్ముతున్నారు. అరకు చూట్టుప్రక్కల తిప్పి చూపించడానికి ఆటోవాళ్ళు రెండువేలు డిమాండ్ చేస్తున్నరని మా టాక్సీ డ్రైవర్ సమాచారం. ఇంతకు ముందు అరకు గురించి మూడు, నాలుగు టపాలు రాశాను. ఆసక్తి ఉంటే చదవండి.
Deleteమొన్నే... నవంబర్ ఆఖర్లో అనుకుంటా... అరకు వెళ్ళి వచ్చాం. మీరు చెప్పిన వాటికి అదనంగా కటిక జలపాతం ఒకటి చూసొచ్చాం. ఎన్నెన్నొ హొయలో... కవిసమయం అద్భుత:
ReplyDeleteమంచి ట్రిప్ వేసి వచ్చారన్న మాట. నవంబర్ చివరలో అంటే చక్కటి సీజన్. మీ కామెంటుకి ధన్యవాదాలు.
Delete