Wednesday, 28 November 2012

డేల్ కార్నగీ

పెద్దవాళ్ళకి సాయంత్రం క్లాసులు చెప్పినందుకు, రోజుకి రెండు డాలర్ల వేతనాన్ని నిరాకరించిన యూనివర్సిటీ, రోజుకి 30 డాలర్లు ఎందుకు చెల్లించింది? ఆత్మన్యూనతతో, నిరుత్సాహంతో, ఓడిపోతానేమో అనే భయంతో ఆత్మహత్య చేసుకొందామనుకొన్న వ్యక్తి, ఒక విజేతగా ఎలా ఎదిగాడు?

డిగ్రీ పూర్తిచేసిన కొత్త. మాఫ్రెండ్స్ అందరం కలసి నిర్వహించుకొంటున్న ఇండివిడ్యువల్ డెవలప్మెంట్ క్లబ్ (IDC) లో నాతోపాటు సహ మెంబర్ ప్రసాద్ నాయుడు. మాకు ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. అప్పట్లో ఒకసంవత్సరం నాపుట్టినరోజుకి అతను ఇచ్చిన గిఫ్ట్ - ఓ పుస్తకం నేను తీసుకొన్న వాటిల్లో అమూల్యమైంది.

ఆ పుస్తకం రచయిత తన జీవితకథని క్లుప్తంగా అరడజను పేజీలలో రాస్తాడు. తండ్రిది వ్యవసాయం. సిటీకి మూడుమైళ్ళ దూరంలో ఉన్న ఫాం హౌస్‌లో గినీ పిగ్ అనే తోకల్లేని చిన్ని ఎలుకల్లాంటి జంతువులని, ఆవుల్ని పెట్టుకొని ఉంటారు.  అమెరికా మిస్సౌరి (Missouri) రాస్ట్రంలో టీచర్స్ కాలేజీలో చదువుతూ ఫాం హౌస్‌ని కూడా చూసుకోవలసిన బాధ్యత  ఉంటుంది రచయితకి. రాత్రి పన్నెండు గంటల వరకూ చమురుదీపం దగ్గర చదువుకోవడం, తెల్లవారుజామున మూడు గంటలకి లేచి గినీ పిగ్ పిల్లల సంరక్షణ చూడడం.  అందరి విద్యార్థుల్లాగా సిటీ హాస్టల్‌లో ఉండి చదువుకోవడానికి రోజుకి ఒక డాలర్ కట్టలేని ఆర్థిక పరిస్థితి, కురచయిపోయిన ప్యాంట్, బిగుతైన కోటు, మూడుమైళ్ళు ప్రయాణించి కాలేజ్‌కి వెళ్ళడానికి గుర్రం - సాధారణమైన విద్యార్థి చదువు మానెయ్యడాని చెప్పగలిగిన అన్ని సాకులూ ఉన్నాయి. మానకుండా కొనసాగించడానికి అతని దగ్గర పట్టుదల ఉంది. 1936వ సంవత్సరంలో `హౌ టూ విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లూయన్స్ పీపుల్` అనే అత్యంత ప్రజాధరణ పొందిన పుస్తకం రాసిన `డేల్ కార్నగీ` నే ఆవ్యక్తి.

భారత దేశంలో 1950, 60, 70 లలో(కొoదరికి ఇప్పటికి కూడా)  చదువుకొని  వృద్దిలోకి వచ్చినచాలామంది ఇటువంటి పరిస్థితులు అధిగమించి విజయం సాధించిన వాళ్ళే కనుక, ఈ కథ కొత్తగా అనిపించదు. కానీ, ప్రస్తుతం తాము ఎన్ని కష్టాలు పడయినా పిల్లల్ని చదివించడానికి అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్న తల్లితండ్రులు, పిల్లల్లో నిబద్ధత కనిపించక ఆందోళన చెందడం చాలాచోట్ల చూస్తూనే ఉన్నాం. అలాంటి విద్యార్థులకి కార్నగీ జీవితకథ మార్గనిర్దేశం చెయ్యగలదు.

మాక్లబ్బులో ప్రతీ ఆదివారం వర్తమాన అంశాలమీద డిబేట్ ఉండేది. ఒకవారం ముందుగానే టాపిక్ నిర్ణయించేవారు కనుక,  విషయసేకరణ, విశ్లేషణ చేసుకొని డిబేట్‌లో పాల్గొనే వాళ్ళం. మొదలుపెట్టే సమయంలో ప్రతీసారీ కాళ్ళు వణికినా, క్రమంగా ఆత్మవిశ్వాశం పెరిగి, స్టేజ్ వదలాలంటే మనసు వొప్పుకొనేదికాదు. అప్పటికి ఒక అర్ధశతాబ్ధం ముందే పబ్లిక్ స్పీకింగ్ వల్ల కాన్‌ఫిడెన్స్ పెరిగి, విజయావకాశాలు మెరుగవుతాయని గ్రహించి నిర్మాణాత్మకంగా తన అభివృద్దికి ఉపయోగించుకొన్న ఒక దార్శినికుడు డేల్ కార్నగీ. అతను కాలేజీలో చేరినప్పుడు బాస్కెట్‌బాల్, బేస్‌బాల్‌లు ఆడే క్రీడాకారులకీ; ఎలక్యూషన్, డిబేట్‌లలో గెలిచేవాళ్ళకీ తోటి విద్యార్థులలో మంచి హీరో వర్షిప్ ఉండేది. కార్నగీకి ఆటలో పాల్గొనేటంత శారీరక ధారుడ్యం ఉండేదికాదు. అందుకే ఎలక్యూషన్‌ని ఎంచుకొని అందులో కృషి చెయ్యడం మొదలుపెడతాడు. పోటీ తరువాత పోటీలో వరుసగా అపజయాలు ఎదురవుతుంటే, ఎంతో నిరుత్సాహ పడతాడు. క్రమంగా మొదటి ఏడాది గడిచే సరికి పోటీలలో బహుమతులు గెలుచుకొంటూ, తన జూనియర్లకి పబ్లిక్ స్పీకింగ్ గురించి సలహాలు ఇవ్వగలిగిన సాధికారత సంపాదిస్తాడు.

`ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్` అనే వాఖ్యంయొక్క ఉదాహరణలు మనకి కార్నగీ జీవితంలో కనిపిస్తాయి. జీవితపు ప్రతీ స్టేజిలోనూ పోరాటం ఉంటుంది. చదువు ముగించిన వెంటనే కరస్పాండెన్స్ కోర్సులు అమ్మే ఉద్యోగంలో చేరతాడు. ఏడు సంవత్సరాలు సేల్స్ డిపార్ట్‌మెంట్లో పనిచేసిన నాకుకూడా టార్గెట్స్  పూర్తిచెయ్యకపోతే ఉండే వొత్తడి ఎంతో తెలుసు. `నువ్వు జింకవైతే ప్రాణం కోసం, పులివైతే ఆహారంకోసం పరుగు తియ్యాలి. నువ్వు ఎవరైయినా కూడా పరుగు పెట్టడం తప్పనిసరి అవసరం,` అని ఎక్కడో చదివిన విషయం జ్ఞాపకం వొస్తుంది. నిరంతరం డెడ్‌లైన్స్ గురించి ఆలోచిస్తూ, అందుకోవడానికి పరుగుతీస్తూ...ఎందరో ఈ జనారణ్యంలో!  అనుకొన్న స్థాయిలో అమ్మకాలు జరపలేక, నిస్పృహతో ఆత్మహత్య చేసుకొందామనుకొంటాడు డేల్ కార్నగీ. ఆ ఉద్యోగం నుంచి మాంసం అమ్మే మరొక ఉద్యోగంలో చేరి పట్టుదలతో 25 ప్రాంతాలలో చిట్ట చివర ఉన్న తన టెరిటొరీని అమ్మకాలలో మొదటిస్థానంలో నిలబెడతాడు. దానికి కారణం అతని వాక్చాతుర్యం, మనుష్యులతో నెరపే మంచి సంబంద బాంధవ్యాలు. కంపెనీ సంతోషించి ప్రమోషన్ ఇవ్వజూపుతుంది. కాని, కార్నగీ ఆ ఉద్యోగాన్ని వదిలేస్తాడు. గెలిచి విరమించడం మనం అశోకుడిలో చూస్తాం... అలాగే కార్నగీలోకూడా!

కొంతకాలం నటుడిగా నాటకాలలో నటించి, కొనసాగే అవకాశంలేక న్యూయార్క్ తిరిగి వస్తాడు. ఆర్ధికంగా పూర్తిగా చితికిపోయిన స్థితిలో, వై.యం.సి.ఏ. యూనివర్సిటీలో వ్యాపారస్తులకి, ఉద్యోగులకి, గృహిణులకి... పబ్లిక్ స్పీకింగ్ నేర్పితే ఎలా ఉంటుందనే ఆలోచనతో యాజమాన్యాన్ని సంప్రదిస్తాడు. రోజుకి రెండు డాలర్ల వేతనాన్ని నిరాకరించిన యూనివర్సిటీ, కమీషన్ పద్దతిలో నేర్పే విధానానికి ఆమోదిస్తుంది. ఎవరయినా కోర్సులో చేరి, అది లాభదాయకంగా ఉంటే కార్నగీకి కొంత కమీషన్ చెల్లించ వచ్చు. లేదంటే, యూనివర్సిటీ నష్టపోయేది ఏమీలేదు. అప్పటివరకూ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ఎక్కడా లేదు. అటువంటప్పుడు కోర్స్ మెటిరియల్ ఎక్కడ దొరుకుతుంది? తన అనుభవాలని రంగరించి, మనుష్యుల మెప్పుపొందే సులువులని తనే ఒక పుస్తకంగా రాస్తాడు. అదే క్రమంగా `హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లూయన్స్ పీపుల్` అయ్యింది. ఈ కోర్సు విపరీతమైన ప్రజాధరణ పొంది, కమీషన్‌గా కార్నగీకి యూనివర్సిటి రోజుకి ముప్పై డాలర్లు చెల్లించవలసి వస్తుంది. అది మొదటిలో అడిగినదానికంటే పదిహేను రెట్లు ఎక్కువ!

ఎన్నో వేలమంది ఈ కోర్స్‌చేసి విజయావకాశాలు మెరుగు పరచుకొన్నారు, ఆ పుస్తకం కొన్ని మిలియన్ కాపీలు అమ్ముడుపోయింది.  డేల్ కార్నగీ రాసిన పుస్తకాల్లాగానే, అతని జీవితంకూడా ఎందరికో మార్గదర్శకమైంది. చేసే పనిలో ఉత్సాహం లేకపోతే గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పిన కార్నగీ పుట్టిందీ, చనిపోయిందీ నవంబర్ నెలలోనే (November 24, 1888 - November 1, 1955).  అందుకే నన్ను బాగా ఇన్స్పయర్ చేసిన మహానీయుల్లో ఒకరైన కార్నగీ గురించి ఈ టపా ఈ నెలలో.

© Dantuluri Kishore Varma 

12 comments:

 1. డేల్ కార్నెగి అద్భుతమైన వ్యక్తి... జీవితం లో వుండే చాల సూక్ష్మమైన intricacies ని అంత గొప్పగా చెప్పిన వారు ఎవరూ లేరు.ఆ విషయంలో ఆయన్ని ఆద్యునిగా చెప్పాలి.స్వామి వివేకానంద ఒక లేఖలో అంటారు..."These Americans are real vedantists" అని. మంచి పోస్ట్ వర్మ గారు...నెనర్లు..!

  ReplyDelete
 2. మీ స్పందనకి ధన్యవాదాలు మూర్తిగారు :)

  ReplyDelete
 3. thanks for ur post Varma garu... chala bhagundi.. inspiring

  ReplyDelete
 4. కిశోర్ గారు, మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు. తప్పకుండా చదవాలనిపిస్తోంది.

  ReplyDelete
 5. పబ్లిక్ స్పీకింగ్ ద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసం తో విజయం పొందిన ఎందరి కథలో ఈ పుస్తకం లో కనిపిస్తాయి. మీ అప్రీసియేషన్‌కి థాంక్స్ చిన్నిగారు.

  ReplyDelete
 6. మొన్న హైదరాబాద్ వెళ్ళి వస్తూంటే ఒక కుర్రాడు నా పక్క కూచున్నాడు, జన్మ భూమిలో. అతని చేతిలో STOP WORRYING AND START LIVING by Dale పుస్తకం చూశా, నాకు పెద్దగా ఇంగ్లీషు రాదుకానండి బాగుంది. :)

  ReplyDelete
 7. కామెంటుకి ధన్యవాదాలు శర్మగారు. ఇంగ్లీష్ అంతగారాదని :)నవ్వుతున్నారు. అందులోనే తెలుస్తుంది మీ చమత్కారం. `ద క్విక్ అండ్ ఈజీ వే టు ఎఫెక్టివ్ స్పీకింగ్` కూడా బాగుంటుందండి.

  ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!