Pages

Saturday, 29 June 2013

అయ్యో ఇంజనీరింగ్!

అన్నిదారులూ రోముకే పోతాయని సామెతలో చెప్పినట్టు గత పది, పదిహేను సంవత్సరాలుగా ఏ పదవతరగతి పాసయిన విద్యార్థి దృష్ఠయినా ఇంజనీరింగ్ పైనే ఉంటూ వచ్చింది. ఉద్యోగావకాశాలుకూడా ఎక్కువగా ఉండేవేమో, ఎలాగయినా - మంచి ర్యాంక్ ద్వారానో, మేనేజ్‌మెంట్ కోటాలోనో సీటు కొట్టేస్తే కలలు చాలా మటుకు సార్ధకమైనట్టే భావించడం ఉండేది. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ఇంజనీరింగ్అంటే హ్యాపీ డేస్ అనే మాట ఇక మరచిపోవలసిందే.
రాష్ట్రం మొత్తమ్మీద ఉన్న సుమారు ఏడువందల ఇంజనీరింగ్ కాలేజీలనుంచి ప్రతీసంవత్సరం రమారమి రెండులక్షల యాభై వేల మంది గ్రాడ్యుయేట్స్ బయటకి వస్తున్నారు. వీళ్ళల్లో కొంతమంది మొక్కుబడి రాయుళ్ళు. తిన్నామా, పడుకొన్నామా, తెల్లారిందా అన్నట్టూ - ఏదో కాలేజీకి వెళ్ళాం, ఎంజాయ్ చేశాం, బయటికి వచ్చాం అనే బాపతు. ఉద్యోగం చెయ్యడానికి కావలసిన కనీస అర్హతలు వీళ్ళకి ఉండవు. వీళ్ళల్లో కేవలం పదివేల మందికి కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడడం రాదని, తమగురించీ, చదివిని సబ్జెక్ట్ గురించీ, వర్తమాన విషయాల గురించీ నాలుగంటే నాలుగు ముక్కలు చెప్పలేని అసమర్ధత ఉందని ఉద్యోగ నియామకాధికారులు బుర్రలు బాదుకొంటున్నారట. కొన్ని కంపెనీలు ఉద్యోగార్ధుల ఫేస్‌బుక్ ఖాతాల వివరాలు తీసుకొని వాటిని పరిశీలించడంద్వారా వాళ్ళ దృక్పదాన్నీ (attitude), వివిధ సందర్భాలలో ప్రతిస్పందించే విధానాన్నీ (temperament), సృజనాత్మకతనీ (creativity) పరిశీలిస్తున్నారట.  ఆలోచనా రహితంగా లైకులు కొట్టడం, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చెయ్యడం, షేర్‌ఖానుల్లాగ కనిపించిన ప్రతీదీ షేర్ చెయ్యడం, ఫ్రొఫైలంతా వెతికినా ఒక్కటంటే ఒక్కటి సొంతవాక్యం కనిపించకపోవడం ఒక అభ్యర్థికి ఏవిధమైన అర్హతలు లేవని చెప్పడానికి బలమైన రుజువులు.  

ఆర్ధికమాద్యం ప్రభావం వల్ల ప్లేస్‌మెంట్స్ తగ్గడం నిజమయినప్పటికీ, గణాంకాలు పరిశీలిస్తే ప్రతీసంవత్సరం ముప్పై వేలదాకా ఐటీ కంపెనీలలో నియామకాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. కానీ, పనికొచ్చే ఇంజనీరింగ్ పట్టబద్రులు పట్టుమని పదివేలు కూడా ఉండటం లేదాయే! కంపెనీల దారిమళ్ళి, ఇప్పుడిప్పుడే డిగ్రీ కాలేజీలవైపుకు వెళుతున్నాయి. సాఫ్ట్స్ స్కిల్స్ బాగున్న విద్యార్ధులు అక్కడ బాగానే లభిస్తున్నారు. ఇంజనీరింగ్ వాళ్ళతో పోల్చుకొంటే వీళ్ళకి తక్కువ జీతాలు ఇవ్వవచ్చు. పైగా కంపెనీ మారకుండా మూడు, నాలుగు సంవత్సరాలు స్థిరంగా పనిచేస్తారు. 

మరి, కాలేజీలనుంచి బయటకు వచ్చిన లక్షలాదిమంది ఇంజనీర్ల పరిస్థితి ఏమిటి? కొంతమంది తిరిగి అవే కాలేజీల్లో ఫేకల్టీగా వెళుతున్నారు. చిన్న చిన్న ప్రయివేట్ స్కూళ్ళల్లో సైన్స్, లెక్కలు భోదిస్తున్నారు, కొంతమంది చేతులకాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్టు సాఫ్ట్స్ స్కిల్స్ అభివృద్దిచేసుకోవడానికి తయారవుతున్నారు. సాధారణ డిగ్రీ చదివిన అభ్యర్థులతో బ్యాంక్, ఇన్సూరెన్స్ లాంటి పరిక్షల్లో పోటీ పడుతున్నారు. ఈ మధ్యన నోటిఫికేషన్ విడుదలైన పదవతరగతి విద్యార్హత సరిపోయే ప్రభుత్వోజ్యోగానికి బీటెక్‌లూ, ఏంటెక్‌లూ చదివిన వాళ్ళు క్యూ కట్టడం గమనించి, `మీ అర్హతలకు తగిన ఉద్యోగాలికి ప్రయత్నిస్తే బాగుంటుందని,` ముఖ్యమంత్రే చెప్పడం చూశాం!    

కేవలం ఇంజనీరింగే కాదు; ఎంబియేలు, బీయీడీలు, ఫార్మసీలు చదివేసిన నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. దానికి కొంతవరకూ కారణం వాళ్ళల్లోనే ఉంది. చదివిన సబ్జెక్ట్ మీద పట్టు సాధించలేకపోవడం, పట్టు ఉన్నా దానిని సరిగా వ్యక్తీకరించలేకపోవడం ప్రధాన లోపాలు. ప్రమాణాలు సరిగా లేని విద్యాసంస్థలని కూడా తప్పుపట్టకుండా ఉండలేం.
ఒకటి, రెండేళ్ళల్లో చార్టర్డ్ ఎకౌంటెన్సీ, కాస్ట్ఎకౌంటెన్సీల పనికూడా ఇలాగే అయ్యేటట్టుంది!  

ఇప్పటికయినా మించిపోయింది లేదని స్పృహ తెచ్చుకొని, ఫన్‌ని పక్కన పెట్టి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ది చేసుకొనే పనిలో పడితే కొలువు చెయ్యగల మంచిరోజులు వస్తాయి. ఆల్ ద వెరీ బెస్ట్!

© Dantuluri Kishore Varma 

Tuesday, 25 June 2013

ఒక విపత్తు ఎన్ని పార్శ్వాలు చూపిస్తుందో!

రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. ఆకాశానికి చిల్లులు పడినట్టు కుండపోత వర్షాలు కురిశాయి. మందాకినీ, అలకనందా నదులు పొంగిపొర్లాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తర్‌ఖండ్‌లో చార్‌దాం యాత్ర చేసుకొంటున్న వేలకొద్దీ భక్తులు వరదల్లో, అవి తీసుకొని వచ్చిన బురదలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. 
దైవం కన్నేర్రజేసిందో, ప్రకృతి కినుక వహించిందో తెలియదు. ఒకవైపు హిమాలయ ప్రాంతంలో చెట్లు నరికేయడం వల్ల వర్షాలకి నేల కోతకు గురయ్యి బురదను విపరీతంగా తీసుకొని వచ్చిందంటున్నారు. మరొకవైపు కేదార్‌నాథ్‌లో ఉన్న ధారిదేవి అని పిలవబడే కాళీమాత విగ్రహాన్ని హైడల్ పవర్ ప్రాజెక్ట్ కోసం తరలించడం వల్ల ఆ మరునాడే వరదలు ముంచెత్తి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేశాయని అంటున్నారు. 1882లో కూడా ఇలానే జరిగిందట. 
భవనాలు కొట్టుకుపోయాయి. వంతెనలు కూలిపోయాయి. అన్ని మార్గాలూ మూసుకొనిపోయాయి. సైనికులు రక్షణగోడలా నిలిచారు. ప్రాణాపాయం లేకుండా ఆపలేకపోవచ్చు. కానీ, చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోయి ప్రాణాలు అరచేత పట్టుకొని సహాయం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళని సురక్షితప్రాంతాలకి తరలిస్తూ, తమప్రాణాలని ఫణంగా పెట్టి కర్తవ్య నిర్వాహణ చేస్తున్న సైనికులకి ఏమి చెప్పి కృతజ్ఞత తెలియజేయగలం! 
విపత్తునుంచి బయట పడినవాళ్ళ ఆనందం, ఆప్తులని కోల్పోయినవాళ్ళ విషాదం, తప్పిపోయిన బందువులు ఏమయ్యారో తెలియని ఆందోళన, `ప్రకృతికి హానిచేస్తే కళ్ళేర్రజేస్తుంది` అనే ప్రశ్చాత్తాపం, `అన్నీ కొట్టుకొనిపోయాయి దేవదేవుని ఆలయం మాత్రం నిలిచేవుంది` అనే దైవం మీద మొక్కవోని విశ్వాశం, వీటన్నింటికీ అతీతమైన అవకాశవాద రాజకీయం - ఒక విపత్తు ఎన్ని పార్శ్వాలు చూపిస్తుందో! 
ఫొటోలు: Deccan Chronicle

© Dantuluri Kishore Varma 

Monday, 24 June 2013

అతి ఎత్తైన వివేకానంద విగ్రహాలలో ఒకటి ఇక్కడ ఉంది

తూర్పుకనుమలు

ఐదవ నెంబరు జాతీయరహదారి
కాకినాడకి 37 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే 5 పైన ప్రత్తిపాడు ఉంది. తూర్పుకనుమలలోని కొండలు హైవేకి ప్రక్కగా కనిపిస్తుంటాయి. ప్రత్తిపాడులో ఈ హైవేకి ప్రక్కనే చిన్న కొండమీద ఎత్తైన వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వివేకానంద విగ్రహాలలో ఒకటి. కొండమీదకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది.  


© Dantuluri Kishore Varma

Sunday, 23 June 2013

వివేకానందా హౌస్

చికాగోలో సర్వమత మహాసభలలో ప్రసంగించి భారతదేశ కీర్తిపతాకను ఎగురవేయడానికి ముందు స్వామీ వివేకానంద ఒక సాధారణ సన్యాసిగా కాశీ నుంచి కన్యాకుమారివరకూ కాలినడకన పర్యటించడం జరిగింది. ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ, ప్రజల స్థితిగతులను గమనిస్తూ, భోజనం దొరికినప్పుడు భుజిస్తూ, లేనప్పుడు రోజులతరబడి పస్తులుంటూ మైసూరూ, మద్రాసులు మీదుగా ప్రయాణించి చిట్టచివరికి కన్యాకుమారివద్ద సముద్రంలో ఉన్న శిలమీద మూడురోజులు ద్యానం చేసుకొని భావి కార్యాచరణని నిర్ణయించుకొన్నాడు. 

తన వాక్పటిమతో, విధ్వత్తుతో, అద్యాత్మికతకు సంబంధించి లోతైన అవగాహనతో అమెరికన్ల మనసుగెలుచుకొని, దేశవ్యాప్తంగా ఎన్నో ఉపన్యాసాలు చేసి, ఇంగ్లండ్‌లో కూడా భారతవాణిని వినిపిస్తూ పర్యటించి నాలుగు సంవత్సరాలతరువాత మళ్ళీ స్వదేశం తిరిగి వచ్చాడు.

1897లో కొలంబో మీదుగా భారతదేశానికి విచ్చేశాడు. ఇప్పుడు వివేకానందుడు ప్రజల గుండె చప్పుడు. భారతజాతి యావత్తునూ సునామీ కెరటంలాంటి సమ్మోహన శక్తితో ప్రభావితం చేసిన మహానీయుడు. మద్రాసు రైలుభవన్ వద్ద ఆయనకి స్వాగతం పలకడానికి జన సముద్రం కదలి వెళ్ళిందట. రధమ్మీద కూర్చుండబెట్టి ప్రజలే దానిని లాగుతూ నగరవీధులవెంట ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారట. మెరీనా బీచ్‌కి ఎదురుగా ఉన్న ఐస్ హౌస్ అనబడే భవంతిలో విడిది ఏర్పాటు చేశారు. ఈ భవనంలో వివేకానందుడు తొమ్మిది రోజులు(ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 15 వరకూ) బసచేసి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నడు. ఆ తరువాత ఈ భవంతిని వివేకానందా హౌస్ అని నామకరణం చేసి, రామకృష్ణా మఠానికి అనుసంధానం చేశారు. పదిసంవత్సరాలపాటు రామకృష్ణ మఠం ఇక్కడ నిర్వహించ బడింది. ప్రస్తుతం ఇది వివేకానందుని జీవిత విశేషాలు, బోధనలు, భారతీయ సంస్కృతిని తెలియజేసే ఎగ్జిబిషన్‌గా ఉంది.
గూగుల్ ఇమేజస్
2000వ సంవత్సరంలో తీసినది.
ఏ విజయమూ సులభంగా లభించదు. లక్ష్యంవైపు ప్రయాణిస్తున్న వాడిని అడ్డగించడానికి వ్యతిరేకశక్తులు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. విజయవంతమయ్యాక అవే శక్తులు `మా సహాయ, సహకారలవల్లే ఇదంతా సాధ్యమైంది` అని ప్రగల్భాలు పలుకవచ్చు. వివేకానందుని విషయంలో అదే జరిగింది. మద్రాసులోని విక్టోరియా హాలులో ఇచ్చిన ప్రసంగంలో వాటిని ప్రజలకి వివరించి చెప్పాడు స్వామీ వివేకానంద. ఈ ఉపన్యాసం స్పూర్తినింపేదిగా ఉంటుంది. లక్ష్యసాధనలో ఎదురయ్యే కష్టాలను అధిగమించడానికి కావలసిన మనోధైర్యాన్ని ఇస్తుంది. ఈ లింకులో చదవండి.

© Dantuluri Kishore Varma

Saturday, 22 June 2013

తిరువళ్ళువార్ కొట్టం

పదమూడు సంవత్సరాలక్రితం, అంటే 2000లో చెన్నైలో ఒక ఇంటర్వ్యూకి హాజరు కావలసి వచ్చింది. చెన్నైని అప్పుడు మద్రాసు అనేవారు. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళి, ఇంటర్వ్యూ పూర్తిచేసుకొని, సాయంత్రానికల్లా తిరుగు ట్రెయిన్ అందుకోవాలని రిటర్న్ జర్నీకి కూడా టిక్కేట్ రిజర్వ్ చేసుకొన్నాను. అనుకున్నదానికన్నా చాలా తొందరగా పని పూర్తయిపోయింది. సాయంత్రం వరకూ ఖాళీ. ఆఫీసునుంచి సరాసరి రైల్వే స్టేషన్‌కి ఎదురుగా ఉన్న తమిళ్‌నాడు టూరిజం డేవలప్‌మెంట్ ఆఫీస్‌కి వెళ్ళి ఒక్కపూటలో తిప్పి చూపించగల పేకేజ్‌టూర్ ఏమయినా ఉందేమో నని తెలుసుకొంటే, అదృష్టవశాత్తూ ఆరోజు కొంచెం ఆలశ్యంగా బయలుదేరబోతుందని చెప్పారు. దగ్గరలో ఉన్న ఒక అరడజను ప్రదేశాలు తిప్పి చూపించి, సాయంత్రానికల్లా దింపేస్తారు. ఈ ట్రిప్‌లో చూసిన ముఖ్యమైన ప్రదేశం తిరువళ్ళువార్ కొట్టం. కొడంబాకం హైరోడ్‌లో ఉంది.
ఓ బుల్లి కెమేరాని కూడా తీసుకొని వెళ్ళడం వల్ల జ్ఞాపకాలు మరుగున పడిపోకుండా ఉన్నాయి. 

తిరువళ్ళువార్ అనే ఆయన తమిళనాడులో 2000 సంవత్సరాలక్రితంనాటి ఒక గొప్పకవి. తిరుక్కురల్ (తెలుగు అనువాదం ఇక్కడ చూడండి) అనే ద్విపద కావ్యం రాశాడు. ఇందులో రెండేసి పంక్తులుగా ఉండే 1330సూక్తులని మూడు విభాగాలలో పొందుపరచడం జరిగింది. ఆరం అనే విభాగం సచ్చీలత గురించి తెలియజేస్తే, పోరుల్ అనేది సంపద గురించి, ఇంబం అనేది ఆనందం గురించి తెలియజేస్తాయి. ఈ మూడు విషయాలూ గుర్తించుకోమని చెప్పడానికే తిరువళ్ళువార్ విగ్రహం మూడువేళ్ళు చూపిస్తుందని అంటారు.
1976లో తిరువళ్ళువార్ జ్ఞాపకార్ధం ఈ కట్టడాన్ని నిర్మించడం జరిగింది. తిరువాయూరులో ఉన్న దేవుడి రధాన్ని పోలిన నిర్మాణం, దానికి చేర్చి 4000 మంది ఒకేసారి కూర్చొని వినడానికి అనువైన ఆడిటోరియం ఉన్నాయి. ఆసియాలో ఉన్న అతిపెద్ద ఆడిటోరియంలలో ఇది ఒకటి. దీని ప్రత్యేకత ఏమిటంటే మధ్యలో స్థంబాలు ఏమీ లేకుండా కట్టారు. చుట్టూ ఉన్న స్థంభాలకి పాలరాతిమీద చెక్కిన తిరువళ్ళువారు 1330 సుక్తులూ తాపడం చేశారు.  
రాతితో చెక్కిన ఈ రధ చక్రాలు చూస్తుంటే కే.విశ్వనాథ్ సాగరసంగమం సినిమాలో మౌనమేలనోయి ఈ మరపురాని రేయి.... అనే పాట గుర్తుకు రావాలి ఎవరికైనా....
 ఒకవేళ రాకపోతే ఇక్కడ చూడండి. పాటలో చిన్న ముక్కని ఈ ప్రదేశంలో చిత్రీకరించారు. 
ఇక్కడ కనిపిస్తున్న గోపురంలాంటి కట్టడమే రథం పై బాగం. ఇందులోనే తిరువళ్ళువార్ విగ్రహం ఉంది. 
 ప్రవేశ ద్వారం.
ఎప్పుడైనా చెన్నై వెళితే తిరువళ్ళువార్ కొట్టాన్ని చూడండి. బాగుంటుంది.
© Dantuluri Kishore Varma

Wednesday, 19 June 2013

వీ కాంట్ హెల్ప్!

`బీచ్ ఫెస్టివల్‌లో బొమ్మల ముసుగులు తొడుక్కొని జనాలమధ్య తిరగాలి. పొద్దున్నే ఎనిమిది గంటలనుంచి రాత్రి పదిగంటల వరకూ. రోజుకి  ఆరొందలు ఇచ్చి భోజనాలు, టిఫిన్లు పెడతారు. మూడు రోజులు పని ఉంటుంది. ఎవరయినా వస్తారా?` లేబర్ కాంట్రాక్టరు నాలుగురోడ్ల జంక్షన్లో పోగయిన డైలీ లేబరుతో అంటున్నాడు.

అప్పుడప్పుడే వెలుగు వస్తుంది. మునిసిపల్ వర్కర్లు పొడుగు చీపుర్లతో రోడ్లు ఊడుస్తున్నారు. పూరీలు, పుల్లట్లు, మైసూరు బోండాలు, ఇడ్లీలు అమ్మే రోడ్డు ప్రక్క బండినుంచి కమ్మని వాసనలు అన్ని వైపులకీ పోతున్నాయి. ఇద్దరు, ముగ్గురు రిక్షావాళ్ళు గాజుగ్లాసుల్లో పొగలుకక్కుతున్న టీని ఊదుకొంటూ తాగుతున్నారు. 

షాపింగ్ కాంప్లెక్స్ మూసిఉన్న షట్టర్లముందు ముణగదీసుకొని పడుకొని వున్న సురేషుకి అప్పుడే మెలుకువవచ్చింది. ముందురోజంతా ఏమీ తినలేదేమో కడుపులో నకనకలాడుతుంది. టిఫిను బండి దగ్గరనుంచి వస్తున్న నోరూరించే వాసన సహనాన్ని పరీక్షిస్తున్నట్టు వుంది. సరిగ్గా అప్పుడే లేబరు కాంట్రాక్టరు మాటలు అతని చెవిలో పడ్డాయి. ఒక్క ఉదుటున లేచి, మెట్లు దిగి వెళ్ళి, `నేను వస్తాను,` అన్నాడు.   ఆకలి తీరడం, అజ్ఞాతవాసం - ఒకే దెబ్బకి రెండు పిట్టలు లాగ మంచి అవకాశం వెతుక్కొంటూ వచ్చింది.  బోనస్‌గా డబ్బు కూడా వస్తుంది. బహుశా పోలీసులు ఇప్పటికే తనకోసం వెతుకుతూ ఉండిఉంటారు. సంఘటన జరిగిన వెంటనే సరాసరి పారిపోయి వచ్చేశాడు. జేబులో నయాపైసా లేదు. సెల్‌ఫోన్ కావాలనే ఆఫీసులో వదిలిపెట్టేశాడు.
*  *  *
బైకుల్లో, కారుల్లో, ఆటోల్లో వచ్చిన ప్రజలు వాకలపూడి లైట్ హౌస్‌కు దగ్గరలో వాహనాలని పార్క్ చేసుకొని ఫెస్టివల్ దగ్గరకి నడచి వెళుతున్నారు. స్వాగత ద్వారం దాటిన వెంటనే ఇరువైపులా కలర్‌ఫుల్‌ నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అన్నవరం సత్యదేవుని నమూనా దేవాలయం, దానికి సమీపంలోనే జిల్లాలోని ప్రముఖ దేవాలయాల స్టాల్ ఏర్పాటుచేసి ప్రసాదాలు అమ్ముతున్నారు. ఉత్తరంవైపు పెద్ద సభాస్థలిని నిర్మించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.సంబరాలు జరుగుతున్న బీచ్ ఏరియా అంతా విద్యుత్ లైట్లు ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఇసుకలో సైకత శిల్పాలు చేశారు. ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. చాట్, బిర్యానీ, బొంగులో చికెన్, స్వగృహా ఫుడ్స్ మొదలన స్టాల్స్ ధక్షిణం వైపు వరుసగా ఏర్పాటు చేశారు. గంగిరెద్దులవాళ్ళు,  జానపద కళాకారులు, రకరకాల వేషదారులు కార్టూన్‌మనుషుల్లాగ బీచ్ ప్రాంతం అంతా తిరుగుతూ సందడి చేస్తున్నారు. వాళ్ళల్లో హాలీవుడ్ హాస్యజంట లారెల్ అండ్ హార్డీలలో, బొద్దుగా ఉండే హార్డీ లాంటి వేషధారణలో సురేష్ కూడా ఉన్నాడు.
* * *
పార్కింగ్ ప్లేస్‌లో ఇన్నోవా ఆగింది. ఈజీ చిట్స్ అధినేత కుమారస్వామి కుతుంభసమేతంగా దిగి ఫెస్టివల్ ప్రాంతానికి చేరుకొన్నాడు. ఫ్లడ్ లైట్ల కాంతిలో ఆ ప్రదేశమంతా చాలా సందడిగా ఉంది. ఒక్కొక్క స్టాలూ చూసుకొంటూ, తెలిసినవాళ్ళు కనిపించినప్పుడు హుందాగా విష్ చేస్తూ ముందుకు వెళూతున్నారు. కాయగూరలని అందంగా చెక్కి ప్రదర్శించిన ముకిమోనో అనే కళాకృతుల స్టాల్ ముందు నిలబడిపోయారు.

`హల్లో, కుమారస్వామీ! ఎలా ఉన్నావ్?` అనే పలకరింపుకి, వెనక్కి తిరిగి, అలా పిలిచిన పెద్దమనిషికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు 

`ఈ మధ్య ఎదో ఎమౌంట్ గల్లంతయ్యిందటకదా? మీ క్యాషియర్ కొట్టేశాడంటున్నారు, నిజమేనా?` అన్నాడు ఆ పెద్దమనిషి. 

కార్టూన్‌కేరెక్టర్ల వేషాలు వేసుకొని, ఆ ప్రాంతం అంతా సందడి చేస్తున్న వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు కుమారస్వామి కూతుళ్ళు. వాళ్ళ వెనుక కదలకుండా శిల్పంలా నిలబడిపోయిన హార్డీని ఎవరూ పట్టించుకోలేదు.   

`లెడ్జర్‌లో ఒక లక్ష రూపాయలు తేడా వచ్చింది. మా క్యాషియర్ సురేషు తీసిఉంటాడని, పోలీసు కేసు పెడతామని బెదిరించేసరికి. ఆఫీసు నుంచే ఎక్కడికో పారిపోయాడు. వాడి పెళ్ళాం తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ అని కూడా చూడలేదు పిరికి సన్నాసి. ఆ పిచ్చిది వీడు ఎక్కడికి పోయాడో తెలియక మూడురోజులుగా ఒకే దారగా ఏడుస్తుంది,` అన్నాడు కుమారస్వామి. 

వెనుకనుంచి వింటున్న హార్డీకి మనసులో కలుక్కుమంది. నవ్వుతున్న ముసుగు ముఖం వెనుక కన్నీళ్ళు చెంపలని తడిపేస్తున్నాయి. 

`మరి లక్షరూపాయలు పోయినట్టేనా?`

`అసలు పోలేదండి. కౌంటర్ ఎంట్రీ ఒకటి పొరపాటున మిస్అయ్యి, తేడా కనిపించింది. ఆ విషయం ఇన్‌టర్నల్ ఆడిట్లో తెలిసింది`.

`పాపం మీ క్యాషియర్ని బాగా భయపెట్టినట్టున్నారు`.

`పూర్ ఫెలో! వీ కాంట్ హెల్ప్. తిరిగి వస్తే ఉద్యోగంలోకి తీసుకొంటాం. లేకపోతే వాడి కర్మా, వాడి పెళ్ళాం దౌర్భాగ్యం` అన్నాడు కుమారస్వామి. ఇద్దరూ గొల్లుమని నవ్వుకున్నారు.

కుమారస్వామి ముఖం మీద నవ్వు విశాలంగా పరచుకొని ఉండగానే ఒక బలమైన తాపు అతని వీపుమీద పడింది. ఎగిరి వెళ్ళి సొరకాయలతో చేసిన హంసల బొమ్మలమీద పడ్డాడు. కాయగూరలు ముక్కలుగా విరిగిపోయి చెల్లా చెదురు అయ్యాయి. ఈ హఠాత్ సంఘటనకి అందరూ నిశ్చేష్ఠులైయ్యారు. కుమారస్వామిని ఎవరు తన్నారో తెలియలేదు. అతన్ని లేవదీసి, వెనక్కి తిరిగిచూస్తే, అటూఇటూ పోతున్న జనాలూ, డ్యాన్స్ చేస్తూ వాళ్ళకి చేతులు ఊపుతున్న కార్టూన్ మనుషులూ తప్పించి ఇంకేమీ కనిపించలేదు.
© Dantuluri Kishore Varma 

Thursday, 13 June 2013

మెసేజ్ ఫ్రం వెంకటేష్

ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫాం మీద ట్రెయిన్ బయలుదేరడానికి సిద్దంగా ఉంది. 

"మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ షాపులో గజ్జలని దొంగతనం చేసిన వాడిని నిన్నే చూశానురా," అన్నాడు ట్రెయిన్లో కూర్చున్న నందకుమార్. 

నందకుమార్‌కి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన వెంకటేష్ కిటికీకి ప్రక్కన ప్లాట్‌ఫాం మీద నుంచొని ఉన్నాడు. స్నేహితుడి మాటలకి ఇబ్బందిగా నవ్వాడు.

ఇరవై సంవత్సరాలక్రితం విడిపోయిన వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకోవడం ఆ రోజే! అదికూడా కావాలని కాదు. నాటకీయంగా జరిగింది.  ఆఫీస్ పనిమీద కాకినాడ వచ్చిన నందకుమార్, జగన్నాధపురం వంతెన డౌన్‌లో యానం బస్టాండుకి ఎదురుగా ఉన్న కోకిలా రెస్టారెంటులో చపాతీ తిని బయటకి వస్తుండగా, పక్కనే ఉన్న వాద్యపరికరాలమ్మే  షాపులోనుంచి గలాటా వినిపిస్తుంటే అటు తొంగి చూశాడు.

చక్కగా డ్రెస్ చేసుకొని, మర్యాదస్తుడిలా ఉన్న ఒక వ్యక్తిని షాపువాళ్ళు కొట్టబోతున్నారు. ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్టు ఉంది. మొహమాటపడుతున్నట్టు ఇబ్బందిగా నవ్వే నవ్వు - అవును అదే - చప్పున గుర్తుకువచ్చింది - డిగ్రీ క్లాస్‌మేట్ వెంకటేష్‌గాడు! ఒక్క పరుగున వెళ్ళి పడబోతున్న దెబ్బల్ని ఆపుచేశాడు. షాపువాళ్ళకి నచ్చజెప్పి, స్నేహితుడిని బయటకి తీసుకువచ్చిన తరువాత అతనికి ఉన్న సైకలాజికల్ డిజార్డర్ గురించి తెలిసింది. 

అన్నీ ఇచ్చినా దేవుడు ఎందుకో మనుష్యులకి కొన్ని అవకరాలు కూడా ఇస్తాడు. ఏదయినా వస్తువు కంటికి ఇంపుగా కనిపిస్తే చాలు స్వంతం చేసుకోవాలనిపిస్తుంది. అది వెంకటేష్ బలహీనత. 
"అవసరంలేకపోయినా దొంగతనం చెయ్యాలనిపించే క్లెప్టోమేనియా గురించి నిన్ను చూశాకే తెలిసింది. దిగులు పడకు, మంచి సైకియాటిస్ట్‌ని కలిస్తే నీ సమస్య పరిష్కారం అవుతుంది. నేను హైదరాబాద్ వెళ్ళాక అక్కడ వివరాలు తెలుసుకొని నీకు ఫోన్ చేస్తాను," అన్నాడు నందకుమార్.  

ఆకుపచ్చ సిగ్నల్ పడింది. ట్రెయిన్ మెల్లగా కదిలింది. ఇబ్బందికరమైన సన్నివేశంలో ఉండగా స్నేహితుడి కంటిలో   పడినా; నందకుమార్ విషయాన్ని అర్థంచేసుకొని సానుభూతిగా ప్రతిస్పందించడంతో అతడి పట్ల కృతజ్ఞతతో కంటిమీద నీటిపొర కమ్ముకొంటుంది. వీడ్కోలుగా చెయ్యి ఊపాడు. క్రమంగా ట్రెయిన్ కనుమరుగయ్యింది. 

నందకుమార్‌కి కనీసం థాంక్స్ కూడా చెప్పలేదన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చింది. జేబులోనుంచి సెల్‌ఫోన్ తీసి `థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్` అని టైప్ చేసి, అంతకుముందే సేవ్ చేసుకొన్న స్నేహితుడి నెంబరుకి పంపాడు.  

`టింగ్ టింగ్` మని చప్పుడు వచ్చింది. వెంకటేష్ చెయ్యి అసంకల్పితంగా ట్రౌజర్ రెండవ జేబులోకి వెళ్ళి ఒక స్మార్ట్ ఫోన్‌ని బయటకి తీసింది. దానితెరమీద `మెసేజ్ ఫ్రం వెంకటేష్` అనే అక్షరాలు మెరుస్తున్నాయి. ఓపెన్ చేస్తే `థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్` అనే మెసేజ్ కనిపించింది.

© Dantuluri Kishore Varma 

Tuesday, 4 June 2013

ఇలా చేస్తే లక్ష్యం నెరవేరుతుంది - ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పరిశుభ్రత అనేది అలవాటు. వంటిని, ఇంటిని, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడం అలవాటు చేసుకోలేకపోవడంవల్ల మసలే ప్రదేశాలన్నింటినీ  మురికి కూపాల్లా మార్చేస్తున్నారు. చెత్తనిండిన ఏ  బస్‌కాంప్లెక్స్‌నో, రైల్వే్‌స్టేషన్‌నో, రోడ్లనో చూసి `చి,చ్చీ!! ఈ జనాలు మారరు` అని తిట్టుకొనే ప్రబుద్ధుల్ని మోషన్ పిక్చర్లో లాగ చిత్రీకరించి, వాళ్ళు కొంతసమయం ముందు  తిని కేర్‌లెస్‌గా పడేసిని అరటిపండు తొక్కనీ, బస్‌స్టాప్ గోడమీద నమిలి ఊసిన కిళ్ళీని, రోడ్డుప్రక్క కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌ని చాటుగా చేసుకొని తడిపిన గోడని రెవైండ్ చేసి చూపించగలిగితే వాళ్ళ ప్రతిస్పంధన ఎలా ఉంటుంది! `చెత్తకుప్ప, ఉమ్మితొట్టి, టాయిలెట్టు ఉపయోగించాలని నీకు ఎవరూ నేర్పలేదా?` అని అడిగితే ఏమి సమధానం చెపుతారు?  

తల్లితండ్రులూ, చదువుచెప్పే పాఠశాలలూ పిల్లలకి పరిశుభ్రంగా ఉండడం యొక్క ఆవశ్యకతని తెలియజెయ్యాలి. కానీ దురదృష్టవశాత్తూ చాలా సందర్భాలలో ఈ విషయం గురించి ఎవ్వరూ పెద్దగా శ్రద్ద కనబరుస్తున్న ధాఖలాలు కనిపించడంలేదు. గోళ్ళు కత్తిరించుకో, ఉతికిన బట్టలు వేసుకో, బూట్లకి పాలిష్ చేసుకో, నీ పుస్తకాలని చక్కగా ఉంచుకో, ఉపయోగించిన తరువాత నీ వస్తువులని వాటి వాటి ప్రదేశాల్లో తిరిగి పెట్టెయ్యి, రెండుపూటలా పళ్ళుతోముకో, స్నానం చెయ్యి, చెత్తని తప్పనిసరిగా చెత్త బుట్టలోనే వెయ్యి...లాంటి ఒక పది, పన్నెండు సూత్రాలని క్రమంతప్పకుండా పిల్లలకి చెప్పగలిగితే కొన్నిరోజుల్లోనే పెద్దవాళ్ళు సైతం ఆశ్చర్యపోయే లాంటి మార్పు వాళ్ళల్లో వస్తుంది.  

ఒక పని అలవాటుగా మారాలంటే ఓ ఇరవై ఒక్క రోజులపాటు దానిని కొనసాగిస్తే చాలని అంటారు. `చిన్నప్పుడు స్కూల్లో పరిశుభ్రతా సూత్రాలేమీ నేర్పలేదు, లేకపోతేనా.....` అని పెద్దవాళ్ళు విచారపడకుండా పైన చెప్పిన ఇరవైఒక్కరోజుల్లో అలవాటు వ్రతం చేసి చూస్తే ఫలితం కనిపిస్తుంది.   

సినిమా హీరోయిన్లని, హీరోలనీ చూసి మనసు పారేసుకొనే వాళ్ళు కోకొల్లల్లు. దీనికి కారణం సినిమా వాళ్ళ అందంమాత్రమే కాదట. తళుక్కుమనే వాళ్ళ పలువరుస, నిగనిగలాడే చర్మం, చక్కగా కత్తిరించుకొన్న గోళ్ళు, సిల్కులాంటి శుభ్రమైన కురులు, వాళ్ళు ధరించే బట్టలు మొదలైనవే ఎక్కువగా ఆకర్షణని కలిగిస్తాయట. కాబట్టి అందంగా లేకపోయినా, ఆకర్షణియంగా ఉండాలంటే శుభ్రంగ ఉండడం ఒక్కటే మార్గమని చెపుతారు.

మనతో పాటూ పరిసరాలని కూడా చక్కగా ఉంచాలి. పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లని వాడకుండా ఉండడం; చెట్లని నరికి నాశనం చెయ్యకుండా, మొక్కలని పెంచి భూమికి పచ్చదనాల అందాలని అందించడం, వాహనాల కాలుష్యం తక్కువస్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మొదలైనవి పర్యావరణాన్ని కాపాడతాయి. 

వ్యక్తి నుంచి కుటుంభానికి, కుటుంభంనుంచి సమజానికి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలన్న అవగాహన వ్యాపించాలి. ప్రతీ వ్యక్తీ మారినప్పుడే సమాజం మారుతుంది. అప్పుడే ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు(జూన్ 5) లాంటివి చేసుకోవడం యొక్క లక్ష్యం నెరవేరుతుంది.
© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!