Pages

Wednesday, 28 November 2012

డేల్ కార్నగీ

పెద్దవాళ్ళకి సాయంత్రం క్లాసులు చెప్పినందుకు, రోజుకి రెండు డాలర్ల వేతనాన్ని నిరాకరించిన యూనివర్సిటీ, రోజుకి 30 డాలర్లు ఎందుకు చెల్లించింది? ఆత్మన్యూనతతో, నిరుత్సాహంతో, ఓడిపోతానేమో అనే భయంతో ఆత్మహత్య చేసుకొందామనుకొన్న వ్యక్తి, ఒక విజేతగా ఎలా ఎదిగాడు?

డిగ్రీ పూర్తిచేసిన కొత్త. మాఫ్రెండ్స్ అందరం కలసి నిర్వహించుకొంటున్న ఇండివిడ్యువల్ డెవలప్మెంట్ క్లబ్ (IDC) లో నాతోపాటు సహ మెంబర్ ప్రసాద్ నాయుడు. మాకు ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. అప్పట్లో ఒకసంవత్సరం నాపుట్టినరోజుకి అతను ఇచ్చిన గిఫ్ట్ - ఓ పుస్తకం నేను తీసుకొన్న వాటిల్లో అమూల్యమైంది.

ఆ పుస్తకం రచయిత తన జీవితకథని క్లుప్తంగా అరడజను పేజీలలో రాస్తాడు. తండ్రిది వ్యవసాయం. సిటీకి మూడుమైళ్ళ దూరంలో ఉన్న ఫాం హౌస్‌లో గినీ పిగ్ అనే తోకల్లేని చిన్ని ఎలుకల్లాంటి జంతువులని, ఆవుల్ని పెట్టుకొని ఉంటారు.  అమెరికా మిస్సౌరి (Missouri) రాస్ట్రంలో టీచర్స్ కాలేజీలో చదువుతూ ఫాం హౌస్‌ని కూడా చూసుకోవలసిన బాధ్యత  ఉంటుంది రచయితకి. రాత్రి పన్నెండు గంటల వరకూ చమురుదీపం దగ్గర చదువుకోవడం, తెల్లవారుజామున మూడు గంటలకి లేచి గినీ పిగ్ పిల్లల సంరక్షణ చూడడం.  అందరి విద్యార్థుల్లాగా సిటీ హాస్టల్‌లో ఉండి చదువుకోవడానికి రోజుకి ఒక డాలర్ కట్టలేని ఆర్థిక పరిస్థితి, కురచయిపోయిన ప్యాంట్, బిగుతైన కోటు, మూడుమైళ్ళు ప్రయాణించి కాలేజ్‌కి వెళ్ళడానికి గుర్రం - సాధారణమైన విద్యార్థి చదువు మానెయ్యడాని చెప్పగలిగిన అన్ని సాకులూ ఉన్నాయి. మానకుండా కొనసాగించడానికి అతని దగ్గర పట్టుదల ఉంది. 1936వ సంవత్సరంలో `హౌ టూ విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లూయన్స్ పీపుల్` అనే అత్యంత ప్రజాధరణ పొందిన పుస్తకం రాసిన `డేల్ కార్నగీ` నే ఆవ్యక్తి.

భారత దేశంలో 1950, 60, 70 లలో(కొoదరికి ఇప్పటికి కూడా)  చదువుకొని  వృద్దిలోకి వచ్చినచాలామంది ఇటువంటి పరిస్థితులు అధిగమించి విజయం సాధించిన వాళ్ళే కనుక, ఈ కథ కొత్తగా అనిపించదు. కానీ, ప్రస్తుతం తాము ఎన్ని కష్టాలు పడయినా పిల్లల్ని చదివించడానికి అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్న తల్లితండ్రులు, పిల్లల్లో నిబద్ధత కనిపించక ఆందోళన చెందడం చాలాచోట్ల చూస్తూనే ఉన్నాం. అలాంటి విద్యార్థులకి కార్నగీ జీవితకథ మార్గనిర్దేశం చెయ్యగలదు.

మాక్లబ్బులో ప్రతీ ఆదివారం వర్తమాన అంశాలమీద డిబేట్ ఉండేది. ఒకవారం ముందుగానే టాపిక్ నిర్ణయించేవారు కనుక,  విషయసేకరణ, విశ్లేషణ చేసుకొని డిబేట్‌లో పాల్గొనే వాళ్ళం. మొదలుపెట్టే సమయంలో ప్రతీసారీ కాళ్ళు వణికినా, క్రమంగా ఆత్మవిశ్వాశం పెరిగి, స్టేజ్ వదలాలంటే మనసు వొప్పుకొనేదికాదు. అప్పటికి ఒక అర్ధశతాబ్ధం ముందే పబ్లిక్ స్పీకింగ్ వల్ల కాన్‌ఫిడెన్స్ పెరిగి, విజయావకాశాలు మెరుగవుతాయని గ్రహించి నిర్మాణాత్మకంగా తన అభివృద్దికి ఉపయోగించుకొన్న ఒక దార్శినికుడు డేల్ కార్నగీ. అతను కాలేజీలో చేరినప్పుడు బాస్కెట్‌బాల్, బేస్‌బాల్‌లు ఆడే క్రీడాకారులకీ; ఎలక్యూషన్, డిబేట్‌లలో గెలిచేవాళ్ళకీ తోటి విద్యార్థులలో మంచి హీరో వర్షిప్ ఉండేది. కార్నగీకి ఆటలో పాల్గొనేటంత శారీరక ధారుడ్యం ఉండేదికాదు. అందుకే ఎలక్యూషన్‌ని ఎంచుకొని అందులో కృషి చెయ్యడం మొదలుపెడతాడు. పోటీ తరువాత పోటీలో వరుసగా అపజయాలు ఎదురవుతుంటే, ఎంతో నిరుత్సాహ పడతాడు. క్రమంగా మొదటి ఏడాది గడిచే సరికి పోటీలలో బహుమతులు గెలుచుకొంటూ, తన జూనియర్లకి పబ్లిక్ స్పీకింగ్ గురించి సలహాలు ఇవ్వగలిగిన సాధికారత సంపాదిస్తాడు.

`ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్` అనే వాఖ్యంయొక్క ఉదాహరణలు మనకి కార్నగీ జీవితంలో కనిపిస్తాయి. జీవితపు ప్రతీ స్టేజిలోనూ పోరాటం ఉంటుంది. చదువు ముగించిన వెంటనే కరస్పాండెన్స్ కోర్సులు అమ్మే ఉద్యోగంలో చేరతాడు. ఏడు సంవత్సరాలు సేల్స్ డిపార్ట్‌మెంట్లో పనిచేసిన నాకుకూడా టార్గెట్స్  పూర్తిచెయ్యకపోతే ఉండే వొత్తడి ఎంతో తెలుసు. `నువ్వు జింకవైతే ప్రాణం కోసం, పులివైతే ఆహారంకోసం పరుగు తియ్యాలి. నువ్వు ఎవరైయినా కూడా పరుగు పెట్టడం తప్పనిసరి అవసరం,` అని ఎక్కడో చదివిన విషయం జ్ఞాపకం వొస్తుంది. నిరంతరం డెడ్‌లైన్స్ గురించి ఆలోచిస్తూ, అందుకోవడానికి పరుగుతీస్తూ...ఎందరో ఈ జనారణ్యంలో!  అనుకొన్న స్థాయిలో అమ్మకాలు జరపలేక, నిస్పృహతో ఆత్మహత్య చేసుకొందామనుకొంటాడు డేల్ కార్నగీ. ఆ ఉద్యోగం నుంచి మాంసం అమ్మే మరొక ఉద్యోగంలో చేరి పట్టుదలతో 25 ప్రాంతాలలో చిట్ట చివర ఉన్న తన టెరిటొరీని అమ్మకాలలో మొదటిస్థానంలో నిలబెడతాడు. దానికి కారణం అతని వాక్చాతుర్యం, మనుష్యులతో నెరపే మంచి సంబంద బాంధవ్యాలు. కంపెనీ సంతోషించి ప్రమోషన్ ఇవ్వజూపుతుంది. కాని, కార్నగీ ఆ ఉద్యోగాన్ని వదిలేస్తాడు. గెలిచి విరమించడం మనం అశోకుడిలో చూస్తాం... అలాగే కార్నగీలోకూడా!

కొంతకాలం నటుడిగా నాటకాలలో నటించి, కొనసాగే అవకాశంలేక న్యూయార్క్ తిరిగి వస్తాడు. ఆర్ధికంగా పూర్తిగా చితికిపోయిన స్థితిలో, వై.యం.సి.ఏ. యూనివర్సిటీలో వ్యాపారస్తులకి, ఉద్యోగులకి, గృహిణులకి... పబ్లిక్ స్పీకింగ్ నేర్పితే ఎలా ఉంటుందనే ఆలోచనతో యాజమాన్యాన్ని సంప్రదిస్తాడు. రోజుకి రెండు డాలర్ల వేతనాన్ని నిరాకరించిన యూనివర్సిటీ, కమీషన్ పద్దతిలో నేర్పే విధానానికి ఆమోదిస్తుంది. ఎవరయినా కోర్సులో చేరి, అది లాభదాయకంగా ఉంటే కార్నగీకి కొంత కమీషన్ చెల్లించ వచ్చు. లేదంటే, యూనివర్సిటీ నష్టపోయేది ఏమీలేదు. అప్పటివరకూ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ఎక్కడా లేదు. అటువంటప్పుడు కోర్స్ మెటిరియల్ ఎక్కడ దొరుకుతుంది? తన అనుభవాలని రంగరించి, మనుష్యుల మెప్పుపొందే సులువులని తనే ఒక పుస్తకంగా రాస్తాడు. అదే క్రమంగా `హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లూయన్స్ పీపుల్` అయ్యింది. ఈ కోర్సు విపరీతమైన ప్రజాధరణ పొంది, కమీషన్‌గా కార్నగీకి యూనివర్సిటి రోజుకి ముప్పై డాలర్లు చెల్లించవలసి వస్తుంది. అది మొదటిలో అడిగినదానికంటే పదిహేను రెట్లు ఎక్కువ!

ఎన్నో వేలమంది ఈ కోర్స్‌చేసి విజయావకాశాలు మెరుగు పరచుకొన్నారు, ఆ పుస్తకం కొన్ని మిలియన్ కాపీలు అమ్ముడుపోయింది.  డేల్ కార్నగీ రాసిన పుస్తకాల్లాగానే, అతని జీవితంకూడా ఎందరికో మార్గదర్శకమైంది. చేసే పనిలో ఉత్సాహం లేకపోతే గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పిన కార్నగీ పుట్టిందీ, చనిపోయిందీ నవంబర్ నెలలోనే (November 24, 1888 - November 1, 1955).  అందుకే నన్ను బాగా ఇన్స్పయర్ చేసిన మహానీయుల్లో ఒకరైన కార్నగీ గురించి ఈ టపా ఈ నెలలో.

© Dantuluri Kishore Varma 

Thursday, 22 November 2012

మన కాకినాడ

సముద్రపువొడ్డున ఉన్న పల్లె లాంటి పట్నం, పట్నం లాంటి పల్లె. అక్కడక్కడా నీటికొలనులు. వాటినిండా ఎర్ర తామర పువ్వులు. బాలాజీ చెరువు, సంతచెరువు, పిండాలచెరువు, కుళాయి చెరువు, ఇంకా చాలా చెరువులు వాటిపేర్లు కూడా మనకు తెలియకుండా కప్పెట్టేసినవి... ఈ ప్రదేశమంతా జలకళతో, ఎర్ర తామర పువ్వులతో చిత్రకారుడు గీసిన వాటర్ పెయింట్‌లా ఎంత బాగుండేదో! ఒక్కసారి ఊహించుకోండి. ఎర్రతామరపువ్వులని తెలుగులో కోకనందములు అంటారట. అందుకే ఈ ప్రదేశాన్ని కోకనందవాడ అని పిలిచేవారట, క్రమంగా అదే కాకినాడ అయ్యింది. ఈ కథ ప్రకారం కాకినాడ పదహారణాల తెలుగు పట్టణమన్నమాట.  ఆగండాగండి....అలాగని ఫిక్సయిపోకండి. ఇంకొక కథ ఉంది. భారతదేశానికి యూరోపియన్లు వస్తున్న క్రమంలో తీరప్రాంతంలో ఉన్నకారణంగా ఫ్రాన్స్ నుంచి, ఇంగ్లాండ్‌నుంచి, కెనడా నుంచి.... వ్యాపార, ఉద్యోగ విషయమై ఇక్కడ చాలామంది సెటిలయ్యరు. వాళ్ళల్లో కెనడా వాళ్ళకి వారిదేశపు పోలికలు ఈ ఊరిలో చాలా కనిపించి, తెగ నాస్టాల్జిక్  గా ఫీలయిపోయి కో-కెనడా అని పిలుచుకొంటూ అదే ఖాయం చేసేశారట. కెనడా వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డారు అని చెప్పడానికి ఒక చారిత్రక ఆధారం కూడా ఉంది. అదే, సరిగ్గా వందసంవత్సరాల క్రితం ఒక కెనడా దేశస్తుడు జాన్ మెక్లారిన్ స్థాపించిన ప్రతిష్టాత్మకమైన మెక్లారిన్ హైస్కూల్. భారతదేశ రాష్ట్రపతిగా చేసిన వరహాగిరి వెంకట గిరి (వి.వి.గిరి), కేంద్రమంత్రిగా పనిచేసిన మంగపతి సంజీవరావుగారు, సినిమాలలో హాస్యపాత్రలు పోషించే గౌతంరాజు, `మనిసన్నాకా కూసoత కలాపోసన ఉండాల`ని డైలాగులతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన రావుగోపాలరావు, నటవిస్వరూపం యస్వీరంగారావులవంటి ఎందరో ఇక్కడే చదువుకొన్నారు.  రేపే (23.11.2012) మెక్లారిన్ హైస్కూల్ వాళ్ళు వందసంవత్సరాల పండుగ జరుపుకొంటున్నారు.

స్కులు గురించి చెప్పుకొంటున్నాం కనుక ఇంకొక్క రెండుముక్కలు - ఏంటంటే, పిఠాపురం రాజా (పి.ఆర్) కళాశాల, మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్, రంగరాయా మెడికల్ కాలేజ్, జె.ఎన్.టీ.యూ ఇంజనీరింగ్‌కాలేజ్(ఈ మధ్యనే యూనివర్సిటిగా మార్చారు), ఆసియాలోనే మొట్టమొదటి మహిళా పోలిటెక్నిక్ కాలేజ్- జీ.పీ.టీ, ఆంద్రా పోలిటెక్నిక్, ఆంద్రా యూనివర్సిటీ ఎక్స్‌టెన్షన్ సెంటర్....లాంటి విద్యాసంస్థలు ఎప్పటినుంచో సేవలు అందిస్తున్నాయి. 
*  *  *
సముద్రతీర ప్రాంతం కాబట్టి,  పడవల తయారీ పరిశ్రమ ఇక్కడ ఉంది. కొంతకాలం క్రితం ద హిందూ న్యూస్ పేపర్లో దీని గురించి రాస్తూ 6000 సంవత్సరాల క్రితంనాటి సాంప్రదాయక పడవల తయారీ విధానం ఇంకా కాకినాడలో కొనసాగుతుందని సోదాహరణంగా చెప్పారు. గుజరాత్లో లోథాల్ అనే ప్రాంతంలో జరిపిన పురావస్తుశాఖ తవ్వకాల్లో హరప్పా నాగరికతకు సంబంధించిన చాలా అవశేషాల్లు బయటపడ్డాయి. వాటిల్లో 710అడుగుల పొడవు, 120అడుగుల వెడల్పూగల అతిపెద్ద పడవలు ఉన్నాయి. వీటిని తయారుచేసే విధానం గురించి ప్రాచీన గ్రంధాలయిన యుక్తి కల్పతరు, ఋగ్వేదం, సమరాంగణ సూత్రధార, కౌటిల్యుని అర్థశాస్త్రం మొదలైన వాటిల్లో రాసి ఉందట. ఇప్పుడు కాకినాడలో తయారు చేస్తున్న పడవలు అచ్చంగా అలాగే ఉంటున్నాయట. బోటు తయారీ దారులు తమకు ఈ విద్య తమ తాతల తాతలు నుంచి వంశపారంపర్యంగా పస్తుందని చెప్తారు. ఎక్కడోఉన్న గుజరాత్‌ని కాకినాడకి ఏదో రకంగా ముడిపెట్టి ఈ ఊరికి చారిత్రక ప్రాధాన్యం కలిగించడానికి కాదుకానీ ఒక పరంపర అప్రతిహతంగా కొనసాగుతున్న ఆనవాళ్ళు ఇక్కడ కనిపించడం చూస్తుంటే ఆనందంగా ఉండదూ?
*  *  * 
పడవల గురించి మాట్లాడుతుంటే ఇంకొక విషయం చెప్పాలని ఉంది. కాకినాడ ఊరికి ధక్షిణంవైపు జగన్నాధపురం ఉంది. మధ్యలో బకింగ్‌హం కాలువ ఉంది. ఈ రెండు ప్రాంతాలనీ అనుసంధానం చేయడానికి రెండు వంతెనలు ఉన్నాయి. వాటిపైనుంచి చూస్తుంటే కాలువ మీద వందలకొద్దీ రంగురంగుల లాంచీలు, బార్జీలు, పడవలు ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. 

పాత వంతెన మల్లెపూల పరిమళంతో గుభాళిస్తుంది. ఎందుకంటే వంతెన ఫుట్‌పాత్‌ని చేర్చి జగన్నాథపురంవైపు ఎన్నో పూలకోట్లు,  `మూర పదిరూపాయలే,` అని అరిచే సైకిళ్ళమీద అమ్మకందార్లూ. పాతవంతెన పేరుని పూల వంతెనగా మార్చేశారు.  పూర్వం వంతెనలు లేనప్పుడు ఈ కాలువ మీద డ్రమ్ములమీద కట్టిన తేలే చెక్క వంతెన ఉండేదట. పగలు వాహనాలు వంతెనదాటి వెళితే, రాత్రి సమయంలో దానిని ప్రక్కకి తొలగించి పడవలకీ, లాంచీలకీ దారి వదిలేవారట.
*  *  *
హంస పాలనీ, నీళ్ళనీ వేరుచేయగలిగి నట్లు, ప్రజలు ముక్తినీ, రక్తినీ వేరుచేశారు. `ఎక్కడా? ఎలా?` అంటారా? ఇక్కడేనండి. మెయిన్ రోడ్డుకి సమాంతరంగా అటొకటీ, ఇటొకటీ రెండు రోడ్లు ఉన్నాయి. ఒక రోడ్డులో ఆచివరినుంచి, ఈ చివరివరకూ  అన్నీ ఆలయాలే. ఇంకొక రోడ్డులో అన్నీ సినిమా థియేటర్లు. ఆ వీధుల పేర్లు - దేవాలయం వీధీ , సినిమా వీధీ.
*  *  *
బందరు పేరుచెపితే లడ్డూలు, కాష్మీరు పేరుచెపితే యాపిళ్ళు ఎలా జ్ఞాపకం వస్తాయో; కాకినాడ పేరు చెపితే కాజాలు అలా వస్తాయి. మడత కాజాలు, గొట్టం కాజాలు - అబ్బా నోరూరడంలేదూ? ఒక్కనిమిషం ఉండండి, ఒక కాజా తినేసి వచ్చి మళ్ళీ కొనసాగిస్తాను....... సుబ్బయ్య హోటల్, మహాలక్ష్మీ పెసరట్లు, అయ్యరు కాఫీ, మీసాలరాజు కోడి పలావు... కాకినాడ వచ్చినప్పుడు టేస్ట్‌చెయ్యండేం?
*  *  * 
`మన కాకినాడలో` పేరుతో ఈ బ్లాగ్ మొదలుపెట్టి అయిదు నెలలు అవుతుంది. గోదావరి జిల్లాల్లో విశేషాల గురించి, చూడదగ్గ ప్రదేశాల గురించి, ఇక్కడ పుట్టి పెరిగిన గొప్పవాళ్ళగురించి రాస్తూనే మిగిలిన నేను రాయగలిగిన విషయాలు రాస్తూ వెళుతున్నాను. పరిది పెంచుకొంటూ ఇంకా చాలా విషయాల గురించి వ్రాయాలని ఉంది. ప్రాధమికంగా నా బ్లాగ్ ఒక ప్రాంతీయ బ్లాగ్‌గా కనిపించినా, నిజానికి కాదు. నాకు బాగా తెలిసున్నవి కొన్ని, తెలుసుకొని వ్రాస్తున్నవి కొన్ని. వూరి మీద అభిమానంతో అలా అలా ముందుకి వెళుతుంది. కొన్ని సంవత్సరాల తరువాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కాకినాడ గురించి తెలుసుకోవాలని అనిపిస్తే నా బ్లాగ్ కొంత ఉపయోగ పడుతుందేమో నని... 

బ్లాగ్ మొదలు పెట్టిన తరువాత ఎంతో మంది సహబ్లాగర్ మిత్రులు తమకామెంట్లతో నన్ను ప్రోత్సహితున్నారు, వారందరికీ ధన్యవాదాలు. ఈ టపాలో ఇవి ప్రస్తావించడానికి కారణం - ఇప్పటికి యాభైకి పైగా పోస్టులు వ్రాస్తే, పదివేల మంది వరకూ(9935 మంది) వాటిని చదివారు. `నేను వ్రాసింది అంతమంది చదివారా!` అని ఆశ్చర్య పోతూ ఈ టపా రాస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలతో...మీ క్లిక్కె పదివేలోది అవుతుందేమో!
*  *  *
ఇంకొక్క విషయం 2012 ఫిబ్రవరిలో `మన కాకినాడ` అనే ఫేస్‌బుక్ గ్రూప్ మొదలు పెట్టడం జరిగింది. దగ్గరగా 6,000 మంది  సభ్యులతో అతిపెద్ద కాకినాడ గ్రూపులలో ఒకటిగా ఉంది. మీకు ఆసక్తి ఉంటే జాయిన్ అవ్వండి 

© Dantuluri Kishore Varma 

Tuesday, 20 November 2012

ఓరి దేవుడా!

దేవుడి కోసం తపస్సు చేసిన ఓ మనిషికి ఆయన ప్రత్యక్ష మయ్యాడు. వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ.... సౌకర్యంగా ఉండడానికి మనిషి మాటలని ఎరుపు రంగులో, దేవుడి మాటలని  నీలం రంగులో ఇవ్వడం జరిగింది.  చదవండి : )

నాకు సంపూర్ణ ఆయిష్షు కావాలి.

అంటే ఎన్ని సంవత్సరాలు?

సంపూర్ణ ఆయుష్షు అంటే ఎన్ని సంవత్సరాలో నీకే తెలియదా స్వామీ!?

ఆశ్చర్యపోవద్దు. `ఒక మనిషి` ఇంతకాలం బ్రతకాలీ` అనే ఎక్స్‌పయరీ డేటు  నేనెప్పుడు  ఇవ్వలేదు. ఒక ఆత్మ ప్రయాణించడానికి కావలసిన వాహనంగా శరీరాన్నీ ఇచ్చి, అందులో బుద్దినీ, మనసునీ పెట్టి  ఉత్కృష్టమైన మనిషిని సృజించాను. ఆ వాహనాన్ని సరిగా ఉపయోగించడం రాక ఎందరో అల్పాయుష్కులు అవుతూ ఉన్నారు.

నేను డబ్బుకూడా అడగాలనుకొంటున్నాను. కావలసినంత ఆస్థి, జీవితం ఉన్నప్పుడు ఎలా, ఎందుకు బ్రతకాలీ అన్న ప్రశ్నే రాదు. జల్సాయే జల్సా, నా సామి రంగా.

ఒక బహుమతిలాగ రంగుకాగితం చుట్టి ఏదీ రెడీమేడ్ గా  నీ చేతిలో పెట్టడానికి నేను రాలేదు. ఆరోగ్యవంతమైన (Healthy) శరీరంలో, ఆరోగ్యమైన ఆలోచనలు ఉంటాయి అంటారు. ముందు శరీరాన్ని అదుపులో ఉంచుకో. యువకుడికి ఉండవలసిన లక్షణాలేవీ నీలో లేవు. మొదటి అవలక్షణం నీ బొజ్జ. ఫాస్ట్ ఫుడ్డ్ తింటున్నావో, మందు కొడుతున్నావో తెలియదుకానీ, కండ ఉండవలసిన చోటా, ఉండకూడని చోటా కూడా కొవ్వే ఉంది. మంచి ఆహారం తిను: యోగా, వ్యాయామం చెయ్యి. మందు, సిగరెట్టు, గుట్కాలాంటివి మానెయ్యి. చక్కటి శరీరాకృతిని పెంపొందించుకో. శరీరంలో ఉన్న మెదడుకి కూడా వ్యాయామం అవసరమే! మంచి పుస్తకాలు చదువు, అభిరుచిగల సినిమాలు చూడు. దీనిని మైండ్ ఫీడింగ్ అనొచ్చు. ఇది పాసివ్ ఆక్టివిటీ మాత్రమే. అంటే ఎవరివో ఆలోచనలని నీ మెదడులోనికి చొప్పించుకోవడం. దేవుడు ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తున్నడేమిటని అనవసరమైన వృధా ఆలోచనలు చెయ్యడం మానేసి చెప్పేది అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు. పాసివ్ ఆక్టివిటీద్వారా పెంచుకొన్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకో. ఏదయినా వ్రాయి, బొమ్మలెయ్యి, వక్తగా బోరుకొట్టించని ఉపన్యాసాలు ఇవ్వు, లేదా నువ్వు పనిచేసే చోట ఆ జ్ఞానాన్నివిచక్షణతో  వాడు...జ్ఞానానికి ప్రొడక్టివ్ వేల్యూని ఇవ్వడం అన్నమాట. అప్పుడు నీకు జీవితం యొక్క నిజ విలువ కొంతతెలుస్తుంది. 

అనవసరంగా బోలెడు సమయం వృదా చేసుకొని నీకోసం తపస్సు చేశానేమో అనిపిస్తుంది. వరాలు ఇమ్మంటే ఉపన్యాసాలు ఇస్తావేమిటి స్వామీ? (నీకంటే మా మేనేజరు వెధవే బెటరు. బుర్రమేసేస్తున్నావు స్వామీ)

తుచ్చుడా! నువ్వు మనసులో ఏమి అనుకొంటున్నావో నాకు తెలియదు అనుకోకు. మేనేజరుని, తోటి ఉద్యోగులని, బందువులని, పక్కింటివాళ్ళని, ఆఖరికి నీ కుటుంభసభ్యులని కూడా తిట్టుకొంటావు. నీకు సమాజంతో ఎలా మెలగాలో తెలియదు. నీభాషలో చెప్పాలంటే, ఇంటర్ పెర్సనల్ స్కిల్స్(Interpersonal Skills)  నీకు జీరో. నచ్చే పని అందరికీ దొరకక పోవచ్చు; దొరికినపనినే ఇష్టంగా చేస్తే విజయం సాధించగలవు.  ఇది నీ ఒక్కడికే కాదు. విద్యార్థులు, గృహిణులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు.... అందరికీ వర్తిస్తుంది. నీకు చేసే పని(Occupation) కంటే, పనిలేకుండా ఉండే ఖాళి సమయం(Leisure) మీద ఇష్ఠం ఎక్కువ. ఎనిమిది గంటల పని తరువాత సమయంలో దొరికే తృప్తి, రోజంతా పనిచెయ్యకుండా కూర్చుంటే రాదు.

(బిక్క మొహం పెట్టి) కాస్త టూకీగా చెప్పొచ్చు కదా స్వామీ? 

అయితే విను. నీకు HOLI పండుగ తెలుసు కదా? ఈ పండుగను నువ్వు గుర్తుపెట్టుకొంటే నీ జీవితం రంగులమయం అవుతుంది. HOLI లో నాలుగు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. H అంటే Health, O అంటే Occupation, L అంటే Leisure, I అంటే Interpersonal Skillsఇవి నాలుగూ సరిగా నిర్వహించేవాడే విజేత కాగలడు.

(మానవుడి మొహం వెలిగింది. దేవుడు చెప్పేది కొంత, కొంత అర్ధమౌతున్నట్టే ఉంది. కానీ అంకా చాలా సందేహాలున్నాయి.) బాగుంది స్వామీ. కానీ డబ్బు మాట ఏమిటి? బోలెడు డబ్బు ఉంటే విలాశవంతమైన జీవితం గడపాలని ఉంది. 

డబ్బే ప్రధానమనుకొని, అక్రమ మార్గాల్లో కోట్లకు కోట్లు మింగేసిన రాజకీయనాయకులు, ప్రభుత్వాధికారుల పరిస్థితి ఏమయ్యిందో చూస్తున్నావు కదా? జీవితానికి శాంతి లేకుండా దొంగల్లాగ జీవించడం ఎందుకు!? కాబట్టి ధనం గురించి మంచి దృక్పదం అలవాటుచేసుకో. నీకు వచ్చినదానికి సరిపోయే జీవనవిధానాన్ని ఏర్పరచుకో. అందనిదానికోసం నిచ్చెనలు వేసి అఖాతంతోకి పడిపోకు. అప్పుడే  సుఖమూ, శాంతీ రెండూ దొరుకుతాయి. 

దీనిని LAMP కాన్సెప్ట్ అని పిలవవచ్చు. అంటే Lifestyle as per the Attitude you form towards Money to attain Peace. ఇది ఒక దీపంలాగ నీబ్రతుకుకి శాంతి ప్రసాదిస్తుంది. సుఖీభవ!!

`ఠంగ్!!` (అంటే దేవుడు మాయమైపోయాడని)!

ఆనందంగా జీవించడానికి కావలసిన ముఖ్యమైన విషయాలేమిటో (నాకు తోచినవి) చెప్పడానికే ఈ పోస్ట్.

సంభాషణ అంతే జరిగింది. మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే తపస్సుచేసుకొని, దేవుడిని ప్రసన్నంచేసుకోoడి. ఆయనే తీరుస్తాడు!
© Dantuluri Kishore Varma

Friday, 16 November 2012

కెమేరా జ్ఞాపకాలు

పాత కెమేరాలని డబ్బా కెమేరాలని వెటకారం ఆడతాంకానీ, అసలు ఒకప్పుడు సొంత కెమేరాని కలిగిఉండడమే ఒక వింత. పోకెట్లో పట్టే చిన్న డిజిటల్ కెమేరాల శకం వచ్చిన తరువాత ఫొటోగ్రఫీ ప్రతీఒక్కరికీ అందుబాటులోకి వచ్చిందికానీ, 1963లో మా నాన్నగారు ఒక డబ్బా కెమేరాని కొనడంతో మావూరికి అది రెండవ కెమేరా అయ్యింది. మొదటిది  స్టుడియో వాడి దగ్గర ఉండేది. యాభైఅయిదు రూపాయలు కెమేరా కోసం ఖర్చుచేయ్యడం ఎవ్వరికీ నచ్చలేదట. ఎనిమిది ఫోటొలు వచ్చే రీలు మూడురూపాయలు, రీలు డెవలప్ చెయ్యడానికి అర్ధరూపాయి, ఎనిమిది ఫోటోలనీ ప్రింట్ చెయ్యడానికి రెండురూపాయలు. ధాన్యంబస్తా ఖరీదు పాతిక రూపాయలు ఉండే రోజులలో ఈ ఖర్చు ఒక లగ్జరీ.

మాన్యువల్ ఫిలింరోలింగ్ ఉండే ఈ కెమేరా ఉపయోగించినప్పుడు, స్నాప్ తరువాత రీలుని తిప్పుకోవాలి, లేకపోతే రెండవబొమ్మకుడా అదే చోట ఎక్స్పోజయి ఫోటో పనికిరాకుండా పోతుంది. ఈ ప్రతికూలతని ఒక కొత్త టెక్నిక్ కోసం ఉపయోగించుకొన్నారు. ఫోటో తీసే ముందు లెన్స్ వెనుకా, రీలుకి ముందూ సరిగ్గా అర్ధచంద్రాకారంగా కప్పేలా ఒక అట్టముక్కని పెట్టి ఒక స్నేప్ తీసిన తరువాత, రీలు తిప్పకుండా ఆ అట్టని రెండవ సగం కప్పేలా పెట్టి ఇంకొకసారి క్లిక్‌చేస్తే ఒకే ఫోటోలో రెండు సీనరీలని, లేదా ఒకేవ్యక్తిని డబుల్ ఫోటోలా తియ్యవచ్చు. ఫోటోషాప్ ఉపయోగించి ఇప్పుడు మనం చెయ్యగలిగిన చమత్కారాలని అప్పుడు ఒక డబ్బ కెమేరాతో చేశారు. ఈ ఫోటో అలా తీసిందే. ఇందులో ఉన్నది మాపెద్దన్నయ్య పృథ్వీరాజు.

మావూళ్ళో శరబయ్య అనే ఒక సన్యాసి ఉండేవాడు. పొడవైన తెల్లగడ్డం, మెడ దగ్గరనుంచి పాదాలవరకూ కాషాయరంగు బురకా, చిరునవ్వు మొహం, ఎప్పుడయినా మాట్లాడే ఒకటి రెండు మాటలు. రోజుకి ఒకరి ఇంటిలో వారాల భోజనాలు చేసే వాడు. ఎవరికైనా దుకాణాలనుంచి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టేవాడు. కొన్నిరోజులు ఊళ్ళో ఉంటే, కొన్నిరోజులు మాపొలాలు దాటిన తరువాత ఎత్తుగా, నిటారుగా ఉండే దొండరాయి కొండమీద, చిన్న గుహలో ధ్యానం చేసుకొనేవాడు.  ఈ కొండమీద వెంకన్న పాదాలూ, అన్నికాలాల్లోనీ మంచినీరు ఊరే ఒక గుంట(లోతుగా ఉండే ప్రదేశం) ఉండేవట. నీరు గుంటలో నిండి, అంచులుదాటి, దిగువకి ప్రవహించి ఒక కాలువలా మా పొలాలని తడిపేది. దీనిని కొండకాలువ అని పిలిచేవారు.

దంతులూరి చలమరాజు - మా నాన్నగారు 

రాత్రివేళల్లో అడవి పందులు, కొండగొర్రెలు, కణుజులనే జంతువులు కొండదిగివచ్చి కందిచేలు, వేరుశనగచేలు వంటివి ఉంటే కొంతవరకూ తిని పాడుచేసేవి. కొండపైనుంచి కనిపించే సుందర దృశ్యాలు, ఆహ్లాదకరమైన చల్లనిగాలి, ఏవయినా జంతువులు ఎదురుపడతాయేమో అనే భయంతో కూడిన కుతూహలం అనుభవించాలంటే సాహసం చేసి కొండపైకి వెళ్ళాలి.  కొండ నిటారుగా ఉండడంవల్ల గొర్రెల కాపర్లు తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ పైకి ఎక్కేవారు కాదట. వాళ్ళ దగ్గర ఒక చివర డొంకినీలు(వంకరగా ఉండే కత్తి లేదా కర్ర) కట్టిన పొడవైన కర్రలు ఉండేవి. డొంకినీలని చెట్టుకొమ్మలకి తగిలించి వాటి సహాయంతో పైకి వెళ్ళేవాళ్ళు.  ప్రతిఫలం లేకుండా సాహసాలు ఎవరుచేస్తారు? కానీ, అలా చెయ్యడానికి మా నాన్నగారికి దొరికే ప్రతిఫలం కొండపైన తీసే ఫోటోలు. ఒకరో ఇద్దరో కలిసి దొడరాయికొండ  ఎక్కి అద్బుతమైన ఫోటోలు తీసుకొన్న ఆనందం ఇప్పటికీ తాజాగా ఫీలవుతారు. 

తాతయ్యకి గంపెడు సంతానం - పిల్లలు, మనుమలు, మనవరాళ్ళుతో ఎప్పుడూ ఇల్లంతా కళకళ లాడుతూండేదట. అల్లరిపిడుగులు, బుద్దిమంతులు, దబ్బపళ్ళలాంటివాళ్ళు, రొయ్యపిల్లల లాంటివాళ్ళు, పేచీకోర్లు... రకరకాల పిల్లలు. `నువ్వు చిన్నప్పుడు దబ్బపండులా ఉండేవాడివి తెలుసా?` అని చెబితే; ఎలా ఉండేవాళ్ళమో చూసుకోవడానికి మనదగ్గర ఒక్కఫోటో అయినా లేక పోతే ఎంత నిరుత్సాహంగా ఉంటుంది? 
  తాతగారి కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు 

మాచిన్నప్పుడు తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఒక ఆల్బం నిండా ఉన్నాయి. అప్పటి మనుషులు, పరిసరాలు, సంఘటనలు ఈ రోజు చూడగలుగుతున్నామంటే కొన్నప్పుడు లగ్జరీ అని భావించిన ఆ డబ్బా కెమేరా పుణ్యమే! నాన్నగారు చెప్పిన విశేషాలని ఈ టపా చూపించి, ఆయనకే చదివి వినిపిస్తే అమ్మా, బావజ్జీ(నాన్న) భలే ఆనందపడతారు. ఊండండి ఒక్కసారి, నేను ఇప్పుడే వెళ్ళి ఆపని చేసి వస్తాను. వచ్చాకా చెబుతానే వాళ్ళ రెస్పాన్సుని! 
ఇక్కడ ముగ్గురిలో చిన్నవాడు - నేనే!
© Dantuluri Kishore Varma

Monday, 12 November 2012

దీపావళి

కటిక చీకటిలో కాంతిపుంజాలని, నిశ్సబ్ధంలో శబ్ధాన్ని, నీరవంలో ఉత్సాహాన్ని నింపే తెలుగువారి ఆత్మీయ పండుగ దీపావళి. వెలుగుతున్న ముత్యాల కాకరపువొత్తునుంచి విరజిమ్మే రంగురంగుల నక్షత్రాల్లాగ చిన్నప్పటి దీపావళి జ్ఞాపకాలు మనసులో ముప్పొరిగొంటాయి.

పండుగ సమీపిస్తున్నకొద్దీ ఎప్పుడెప్పుడు మందుగుండు సామాగ్రి కొనేసుకొందామా అనే ఆత్రుత గుండెల్లో చుచ్చుబుడ్లులాగ ఎగజిమ్మేస్తూ ఉంటే  , భూచక్రాల్లాగ పిల్లలమందరం ఇల్లంతా కలియతిరిగేవాళ్ళం. నాన్నగారికి మతాబులు, చుచ్చుబుడ్లు అంటే చాలా ఇష్టం. చుచ్చుబుడ్లు కాల్చకపోతే పండుగకళే ఉండదనేవారు. తయారుచేసి అమ్మే సామాన్లు కొంటే సరిగావెలగవు, నాణ్యత తక్కువ, మందుకంటే వాటిలో ఉండే ఇసుకా, మట్టీ, కల్తీ ఎక్కువ. ముందరి సంవత్సరపు సరుకు అంటగడితే పుణ్యకాలమంతా వాటిని వెలిగించే ప్రయత్నంలోనే గడచిపోతుంది. అందుకే ప్రత్యేకంగా మతాబులు, చుచ్చుబుడ్లూ తయారుచేసుకొనేవాళ్ళం. సూరేమారం, గంధకం, బీడు, మెరుపులూ, తెచ్చి; విడివిడిగా ఎండబెట్టి, తరువాత ఆముదంతో కలిపి మతాబుల మందు తయారుచేసుకొనేవాళ్ళం. కొంచెం సాంపిల్ పెరట్లోకి తీసుకొనివెళ్ళి, వెలిగించి, బాగా మండుతుందని నిర్ధారించుకొన్న తరువాత కనీసం వంద  గ్రాములు మందుపట్టే చుచ్చుబుడ్డి కుండల్లో మందు  దట్టించి, దళసరి కాగితమ్ముక్క పెట్టి చివరగా తడి జిగురుమట్టితో సీల్‌చేసేవాళ్ళం. మతాబులకి, చుచ్చుబుడ్లకీ ఒకటే మందు. కావలసినన్ని బుడ్లు కూరిన తరువాత మతాబుల గుల్లలోకి ముందు పొడి ఇసుక వేసి, తరువాత వదులుగా మందు  పోసి గొట్టం మడతపెట్టి మూసేవాళ్ళం.

సిసింద్రీలు కూడా వందలకొద్దీ ఒక్కోసారి వెయ్యికిపైగానే కూరుకొని తయారుచేసుకోవడం ఒక తప్పనిసరి విషయం. గుల్ల దగ్గరనుంచి బొగ్గు కాల్చుకొని పొడితయారు చేసుకోవడం, మందు కలుపుకోవడం వరకూ ఎవరికి వాళ్ళు విడివిడిగా తయారుచేసుకోవలసిందే. పండుగకి ఎవరిదగ్గర ఎన్ని ఎక్కువ సిసింద్రీలు ఉంటే వాడే గొప్ప. ఇవికాక బయటకొని తెచ్చుకొన్న కాకరపువ్వొత్తులు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, వెన్నముద్దలు, తాళ్ళు, పెన్‌సిళ్ళు, పాంబిళ్ళలు, దీపావళి అగ్గిపెట్లు... అన్ని సమానంగా పంచేసుకొని, ఎండలో ఎండబెట్టేసుకొని, ఒకటికి పదిసార్లు లెక్కపెట్టుకొని సాయంత్రం అయ్యేసరికి ఎందుకో తెలియదుగానీ బాగా నెమ్మదిగా తిరిగే టైముని తిట్టుకొంటూ అసహనంగా ఎదురుచూడడం - ఎంత విరహం!

గోగికర్రలకి నూనెలో ముంచిన వత్తులు కట్టి, వెలిగించి, ఆకాశానికి చూపించి, "దివ్వీ, దివ్వీ దీపావళి; మళ్ళీ వచ్చే నాగులచవితి," అని దివిటీలు కొట్టేసి, రెండుటపాకాయలు వేసేసరికి ఓపెనింగ్ సెరిమనీ అయిపోయినట్లే. లక్ష్మీ దేవికి నమస్కారం చేసుకొని, ఇంటిలో అన్నిచోట్లా గుగ్గిలం పొగ వెయ్యాలి. ముoదురోజే పొడవైన మైనపు వత్తులు తెచ్చి ఉంచేవారు. ఒక పలుచని గుడ్డకి మైనం పూసి, వెదురు పుల్లకి చుట్టి తయారు చేస్తారు వీటిల్ని. ఈ వత్తుల్ని వెలిగించి గదిగదికీ తిప్పుతూ గుగ్గిలపు పొడిని వెలిగి మండుతున్న మైనపు వత్తి క్రిందనుంచి మంటలోనికి వెళ్ళేలా వెయ్యాలి. ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు 'అగ్గిమీద గుగ్గిలం' అవ్వడం అంటే ఏమిటో తెలుస్తుంది. గుగ్గిలపు పొడి తగలగానే మంట ఒక్కసారి భగ్గు మని పెద్దదవుతుంది. అందుకే పైనుంచి వేస్తే చెయ్యి కాలకుండా, నేర్పుగా క్రిందనుంచి వెయ్యాలి.

దివిటీలు కొట్టినప్పుడు పాడే పాట ఎంతచిన్నగా ఉంటుందో, బాణాసంచా కాల్చే సమయం కూడా అంతే. ఎన్ని కొనుకొన్నా, ఎన్ని కాల్చుకొన్నా 'అప్పుడే అయిపోయాయా!' అని నిట్టూర్చని కుర్రాడు ఒక్కడయినా ఉండడని లక్ష్మీ బాంబు పేల్చి చెప్పచ్చు. ఇక తారాజువ్వాలు, సీమటపాకాయలు కాల్చేటప్పుడు ఉండే భయంతో కూడిన ఆనందం, ఉద్వేగభరితంగా ఉండేది. ఆతరువాత కాల్చి కాల్చి చేతులు నొప్పెట్టే వరకూ మనకు కాలక్షేపం ఇచ్చేవి మనం తయారు చేసుకొన్న సిసింద్రీలే.

సూరేకారం, గంధకంతో చేసే బొగ్గు సిసింద్రీలు వెనుక వరసలోకి పోయి, చురుకు ఎక్కువైన బాలీవుడ్ హీరోయిన్ల లాంటి పటాసు సిసింద్రీలు తెరమీదకి వచ్చాయి. తెల్లగా ఉండే పటాసుకి, అంతే మోతాదులో చక్కెరపొడికలపాలి. మండే గుణం ఎక్కువగా ఉండే ఈ మిశ్రమం బాగా పవర్‌ఫుల్. నాస్నేహితుడు ఒకరు ఒకసారి ఇలా కలిపి ఎండబెట్టిన మందుకి చీమలు పట్టేయడంతో, వాటిని వదిలించడానికి దాన్ని మూకుట్లో వేసి పొయ్యిమీద పెట్టాడు. ఒకటి రెండు నిమిషాలలో పటాసు వేడెక్కి ఒక్కసారిగా పేలిపోయింది. చాతీ, ముఖంలో కొంతబాగం కాలినా, అదృష్టవశాత్తూ  ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్నాడు.

చిన్న అన్నయ్య(శ్రీను) వరుసగా రెండు సంవత్సరాలు, తన స్నేహితులతో కలిసి దీపావళి సామాన్ల కొట్టు పెట్టాడు. పండుగ ముందురోజు వరకూ అంతంత మాత్రంగా ఉన్న అమ్మకాలు, దీపావళి రోజు మాత్రం పదింతలై కజిన్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి అమ్మినా సరుకు అందించలేనంత ఉక్కిరిబిక్కిరై, లాభాలుపంచుకోగా మిగిలిన సామానులు పెట్టెలకొద్దీ ఇంటికి వచ్చాయి. ఆ రెండు సంవత్సరాలలో, 'దివ్వీ దివ్వీ దీపావళి...' వంటి క్లుప్తమైన పాటలా కాకుండా, ఎప్పటికో పూర్తయ్యే గాత్రకచేరీలా కాల్చాం.
*     *     *

లక్ష్మీదేవి సంపదలకు దేవత.
సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు-
పాడిపంటలు, విద్య, అధికారం, సంతానం,
ధైర్యం, విజయాల వలన కలిగే
ఆనందమే అసలైన సంపద.
ఈ సంపదకి అధినేత్రి అయిన
ఆదిలక్ష్మికి ప్రియమైనవి
పరిశుభ్రత, నిర్మలమైనకాంతి.
ఎక్కడయితే ఇవిరెండు ఉంటాయో, అక్కడికి
దీపావళిరోజు లక్ష్మీ దేవి వస్తుంది,
సకల ఐశ్వర్యాలనూ ఇస్తుంది.

పాలకడలినుంచి లక్ష్మీదేవి ఉద్భవించి,
విష్ణుసన్నిధిని చేరుకొన్నప్పుడు
దేవతలందరూ ఆమెని ఈ విధంగా స్థుతించారట -
"నమస్యే సర్వలోకానాం జననీమబ్జసంభవాం
శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష:స్థల స్థితాం"
సంతోషకరమైన సందర్భంలో చేసిన స్థుతి కనుక
ఆ విధంగా ఎవరైతే చెపుతారో
వారికి లక్ష్మీదేవి సకలసంపదలూ ఇస్తుంది.

ప్రమిదల్లో నూనెవేసి వెలిగించే దీపాలు అప్పుడూ, ఇప్పుడూ కూడా నాకు చాలా ఇష్ఠం. కిరణాలుగా సాగే వెలుగులో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. 

ఇంటినిండా దివ్యమైన దీపపు వెలుగులతో జరుపుకొనే దీపావళి శాంతిని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజయాన్నీ, సంపదనీ... అందరికీ పంచాలని కోరుకొంటూ సర్వులకూ దీపావళి శుభాకాంక్షలు.


Happy Diwali!

© Dantuluri Kishore Varma 

Wednesday, 7 November 2012

నేడే చూడండి!

ఒక రిక్షాకి మూడువైపులా  చతురశ్రాకారపు అట్టలు కట్టి, వాటిమీద కొత్తగా హాలుకి వచ్చిన సినిమా వాల్ పోస్టర్లు అంటించి మైకులో "నేడే చూడండి - నాగేశ్వరరావు, సావిత్రీ నటించిన కనీ వినీ ఎరుగని కుటుంబ కథా చిత్రం......," అని ఊరంతా తిప్పి చెవుల్లో తుప్పు వదల గోట్టేసేసరికి, రిక్షా వెనుక కుర్రళ్ళు గోల, గోల గా పరుగెత్తేవాళ్ళు. సంక్షిప్తంగా సినిమా కథ కొంత ముద్రించి, `....అప్పుడేమయ్యిందో వెండితెరమీద చూడండి,`  అని అచ్చువేసిన పాంప్లెట్లు అంది పుచ్చుకొని, ఇంటికి పట్టుకెళ్ళిపోతే (ఇటువంటి రిక్షా ప్రచారం ఇప్పటి తరానికి పరిచయంచెయ్యడానికి ఆమధ్య విడుదలయిన బాపూ సినిమా శ్రీరామరాజ్యం కోసం కొన్నిచోట్ల చేస్తే జనాలు ఆసక్తిగా చూసారని ది హిందూ పేపర్లో వేసారు); సాయంత్రం ఆటకి వెళ్ళడానికి పెద్దవాళ్ళు గుర్రబ్బండిని కబురు పంపేవారు.

అలాగని వచ్చిన ప్రతీ సినిమాకీ చెక్కేసేవాళ్ళనికాదు. ఏక్టర్లు నచ్చినవాళ్ళు అయ్యి ఉండాలి, సినిమా బాగుందని ఆనోటా ఈ నోటా విని ఉండాలి. అప్పుడే  పక్కఊళ్ళో ఉన్న సినిమా హాలుకి ప్రయాణ సన్నాహాలు చేసుకోవడం. ఈ గుర్రబ్బండి సవారీ కుర్రవాళ్ళకోసం కాదు. ఇంటిలో ఆడవాళ్ళ కోసం. వాళ్ళు బండి ఎక్కిన తరువాత ఒకటో, రెండో సీట్లు ఖాళీ ఉంటే పిల్లల్లో అదృష్ఠవంతులకో, లేదా బాగా పెచీ పెట్టగలిగిన కళ ఉన్నవాళ్ళకో అవి దక్కేవి.  

సాయంత్రం ఆరుగంటలు అవకుండానే భోజనం చేసేసి తాతగారు నిద్రపోయిన తరువాత, గుర్రబ్బండి వెనుక గుమ్మం దగ్గరకి వచ్చేది. సినిమా విషయం ఏ మాత్రం ఆయనకి తెలిసినా అక్షింతలు పడిపోయేవి. అందుకే రహస్యం.  అప్పటి గుర్రబ్బండి అంటే, ఇప్పటి లగ్జరీ కారు అన్నమాట. లోపల సీట్లు కూడా కూర్చోవడానికి మహా అనుకూలంగా ఉండేవి. చల్లని పచ్చగడ్డి ఒక అర అడుగు మందాన పరచి దానిమీద ముతక బరకం వేస్తే ఎంత గతుకుల రోడ్డులో నడిపించినా నొప్పి తెలిసేదికాదు. లోపల కూర్చున్న ప్రయాణీకులు బయటకు కనిపించకుండా ముందూ, వెనుకా తెరలు కట్టేవారు. ఎప్పుడయినా బండినడిపేవాడి ప్రక్కన కూర్చుంటే సవారీ భలే ఉండేది. వాడి చేతిలో  ఒక అడుగున్నర పొడవైన అతి సన్నని వెదురు గడకి కట్టిన చెర్నోకొలా ఉండేది . దీనికి రెండు ఉపయోగాలుండేవి - గుర్రాన్ని నడపడం, ఎవరైనా అడ్డువచ్చినప్పుడు కర్రని వెనక్కి త్రిప్పి తిరుగు తున్న బండి చక్రపు ఆకుల(స్పోక్స్)కి తగిలేలా ఉంచడం. అప్పుడు వచ్చే టృ)))))) అనే చప్పుడుకి `అహా....హె్‌య్ హె్‌య్`  అని అదిలింపు కలిపితే స్వారీ మేఘాలలో తేలుతున్నట్టు ఉండేది. 

మావూరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకే ఒక హాలులో వేసే సినిమాలు  అప్పటికే విడుదలయ్యి ఐదో పదో ఏళ్ళు పూర్తయ్యి, రాష్ట్రమంతా తిరిగి, కాళ్ళు నెప్పులు పెట్టెసి, చతికిలబడే సమయానికి  ఆఖరి మజిలీగా వచ్చేవి. లవకుశ, మాయాబజార్, గుండమ్మకథ, ప్రేమనగర్, భక్తకన్నప్ప, సుమంగళీ, బడిపంతులు, కార్తీకదీపం, అమరదీపం, చుట్టాల్లున్నారుజాగ్రత్త, ఇంటింటి రామాయణం, ప్రేమాభిషేకం, బుర్రిపాలెం బుల్లోడు, పదహారేళ్ళ వయసు, దేవత..... నేను ఇక్కడే చూసినట్టు గుర్తు. పేరు భాస్కర్ థియెటర్ అయినా దానిని టూరింగ్ టాకీస్ అని పిలిచేవారు. కుర్చి, బెంచీ, నేల అని మూడు క్లాసులు ఉండేవి. ఫోల్డ్ చెయ్యడానికి అనువుగా ఉండే గోడ్రేజ్ కంపెనీ ఇనుప కుర్చీలు వేసిన  క్లాసుకి వెళ్ళేవాళ్ళకి అమ్మా, నాన్నా మధ్యన కూర్చుని సినిమా చూసే అదృష్టం లేదు. ఈ క్లాసుని నిలువుగా రెండుభాగాలు చేసి, మధ్యన తెర కట్టేవారు - ఒకవైపు మగవాళ్ళకి, మరో వైపు ఆడవాళ్ళకి. 

మసక లైట్ల కాంతిలో, ఘంటశాల పాడిన `నమో వెంకటేశా, నమో తిరుమలేశా.....' అనే పాట వస్తూ ఉండగా లోపలికి వెళ్ళి; చుట్టా, సిగరెట్టు, బీడీ పొగలు మధ్య చిత్రరాజాన్ని అస్వాదించి, మళ్ళీ అదే ఘంటశాల పాట నేపధ్యంలో బయటకు వచ్చేయ్యడమే. హాలు బయట విస్తరాకులతో కోను ఆకారంలో చిన్ని చిన్ని పొట్లాలు కట్టి, పావలాకి ఒకటి చొప్పున అమ్మే కరకజ్జం తప్పని సరిగా కొనుక్కొని బండికోసం ఎదురు చూసేవాళ్ళం. దియేటరు దాటి కొంచం ముందుకు వెళ్ళగానే అప్పుడే చేసిన నేతి సున్నుండల వాసన వచ్చేది. "తాచుపాము ఉన్నచోట ఇలాంటి వాసన వస్తుంది," అని బండి వాడు చెప్పేవాడు. ఊరు నిద్రపోతుండగా రెండు సరిహద్దులకీ మధ్య ఉన్న కంకర గోతులు అనే ప్రదేశంలో ఉండే మర్రి చెట్టు దాటుకొని మావూరు తిరిగి వెళ్ళాలి. ఆ మర్రిచెట్టుమీద దెయ్యాలు ఉంటాయని చెప్పుకొనేవారు. అక్కడి వరకూ సినిమాకబుర్లు చెప్పుకొంటూ ఖుషీ, ఖుషీగా వచ్చేసినా...ఆ ప్రదేశాన్ని సమీపించే సరికి పెద్దవాళ్ళు ఒక్కసారి నోటిమీద వెలు పెట్టి, నిశ్శభ్దంగా ఉండమని సూచిస్తూ `హ్హుష్!' అనేవారు. చీకట్లో కీచురాళ్ళ అరుపులు, నల్ల కంకర రోడ్డు మీద గుర్రపు డెక్కల టక టకలు, తిరిగే బండిచక్రాల చప్పుళ్ళతో గుండే చేసే లబ్‌డబ్‌లు కలిసి వాద్య సంగీతం అదిరిపోయేది. చిరుచెమటమీద చల్లటిగాలి తగిలేసరికి మర్రిచెట్టు దాటి వచ్చేసినట్టు లెక్క.  

చిన్నప్పటి సినిమా అంటే తెరమీద బొమ్మ, ఘంటశాల `నమో వెంకటేశా` పాట, కరకజ్జం రుచి, సున్నుండల వాసన, దెయ్యల మర్రిచెట్టు దాటాక వొంటికి చల్లగా తగిలే గాలి.... ఆ జ్ఞాపకానికి పంచేంద్రియాలూ స్పందిస్తాయి.

© Dantuluri Kishore Varma

Sunday, 4 November 2012

ఈ వర్షం సాక్షిగా....

కాకినాడ మీద పెద్ద ప్రభావం చూపించకుండా నీలం తుఫాను తీరం దాటి పోయింది. హమ్మయ్యా! అని నిట్టూరుస్తుండగానే మధ్యాహ్నమయ్యేటప్పటికి అకాశం పూర్తిగా మేఘావృతమైపోయింది. శీతాకాలంలో  దళసరి రగ్గు  ముఖం నుంచి కాళ్ళ వరకూ ఆసాంతమూ కప్పుకున్నట్టు, రెండుగంటలకే మసక చీకటి కమ్ముకొంది. గాలి లేదు. చిన్నగా చినుకులు మొదలయ్యాయి.    వారాంతం - స్కూళ్ళనుంచి, ఆఫీసులనుంచి, పనీ పాటలనుంచి తొందరగ ఇంటికి వెళ్ళిపోతే వేడి, వేడిగా బోజనం చేసి కుటుంభంతో గడిపే శనివారం సాయంత్రం మూడ్‌లో ప్రతీ ఒక్కరూ కమ్ముకొన్న మబ్బులకేసి, కురుస్తున్న వర్షంకేసి మార్చి మార్చి చూస్తూ గడియారంలో సెకన్ల ముల్లుని కొలుస్తున్నారు.  నీటిదారాలు ఆకాశం నుంచి, భూమికి కట్టినట్టు సాయంత్రానికి వాన పెరిగింది. 
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఏమీలేవు. కానీ, అకాశానికి చిల్లులు పడినట్టు కుండపోతగా వర్షం కురుస్తుంది. కరెంటు తియ్యలేదు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల గురించి న్యూస్ చానళ్ళ వాళ్ళు ఊదరగొట్టేస్తున్నారు. అన్ని ప్రాంతాల పేర్లూ వినిపిస్తున్నాయి. కాకినాడలో వర్షం కురుస్తున్నట్టు ఎవడూ రిపోర్ట్ చెయ్యడం లేదు. బహుశా మర్నాడు మునిగిపోయిన రోడ్లు, పొంగుతున్న కాలువలు, తెగిపోయిన గట్లు గురించి చెబుతారేమో!  
ఆకాశం తెరుచుకొన్నట్టు కురిసి, కురిసి, కురిసి...... పాపం గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఏమి చేస్తారో! ట్రెయిన్‌లు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోతే ప్రయాణీకుల పరిస్థితి ఏమిటో! ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. 
ఉదయానికి ఉదృతి చాలా తగ్గింది. కాలువలు ముంగిట్లోకి నడచివచ్చాయేమో అనేలా రహదార్లు ములిగిపోయాయి. అప్పుడే బైక్‌ల మీదా, స్కూటర్లమీదా బయటకి వచ్చినవాళ్ళు  నీటి చెలమలని దాటలేక ఆగిపోయిన బళ్ళని బాగుచెయ్యడానికి కుస్తీలు పడుతున్నారు. కాలచక్రంలాగా ఎప్పుడూ ఆగని వాహనం ఒక్కటే - ఆటో. రెండుప్రక్కలా ఆటోలోనికి జల్లుకొట్టకుండా వ్రేలాడదీసిన బరకం క్లాత్‌ని తప్పించి తమాషా ఛూస్తున్న ఆటో ప్రయాణికుల సాక్షిగా మిగిలిన రోడ్డు యూజర్లమీద బురదనీరు పిచికారీ చేస్తూ దర్జాగా పోతున్న ఆటోలని ఆపేవాడెవడు! 
వర్షంలో తడిసిన ఆకుకూరలు, కాయగూరలు....... తాజాగా ఉంటాయి.  మాంసాహారులయితే కోడో, మేకో....... కొనుక్కోవాలికదా! అసలే ఆదివారమాయే! బజారుకి చలో!  

© Dantuluri Kishore Varma

Saturday, 3 November 2012

యమలోకం కథ

"నాటకం వేయించండి," అన్నారు మా ప్రిన్సిపాల్. స్కూల్ వార్షికోత్సవంలో ముప్పైరెండు సాంస్కృతిక కార్యక్రమాలని చేయించాలని నిర్ణయించుకొన్నారు.  ఒక ఎజెండా ప్రకారం అన్ని సామాజిక వర్గాలనుంచీ, ప్రాంతాలనుంచీ ప్రజా ప్రతినిధులకి మంత్రిపదవులు ఇచ్చినట్టు, మొత్తం విద్యార్దులలో ఎక్కువశాతం మందిని ఏదో ఒక నాటకంలోనో, డేన్స్‌లోనో చేర్చడం వల్ల తల్లితండ్రులు ఆనందిస్తారు. "నాకు చేతకాదు బాబో్‌య్," అని మొత్తుకొన్నా వినే పరిస్థితి లేదు. ప్రతీ టీచరూ పూనుకొంటే తప్ప అన్ని కార్యక్రమాలు చేయ్యడం సాధ్యం కాదు. అందుకే బలవంతంగానో, బ్రతిమాలో ఒక్కో స్క్రిప్ట్ చేతిలో పెట్టారు. నాకొచ్చిన నాటకం పేరు `యమలోకం`. ఇంటికి తీసుకొనిపోయి చదివేసరికి బుర్ర చెడిపోయి, కడుపుకదిలి పోయి వొమిటింగ్స్, మోషన్స్ పట్టుకొన్నాయి. మరునాడు స్క్రిప్ట్‌ని తీసుకొని పోయి మా ప్రిన్సీ చేతిలో పెట్టేసి, ఓ నమస్కారం పెట్టేశాను. "అంత నచ్చకపోతే కథ మార్చుకోండి. చెయ్యనంటే కుదరదు," అని పీక మీద కత్తిపెట్టాడు. 

యముడు, చిత్రగుప్తుడు ప్రధానమైన పాత్రలు. ఇద్దరు యమబటులు కావాలి. కొంతమంది పాపులు కావాలి. జంధ్యాల సినిమాలో లాగ ఎవరిపిచ్చిలో వాళ్ళుండి కామెడి పుట్టించాలి. ఒక కవి, తాగుబోతు, సినిమా హీరో, లంచగొండి ప్రభుత్వ ఉద్యోగి, వినికిడిలోపమున్న రైల్వే ఇంక్వయరీ క్లార్క్, దూరదర్శన్ డైరెక్టర్ ... ఇంకా ఒకటి, రెండు పాత్రలు ఫైనలైజ్ చేసుకోని కాంబినేషన్ సీన్లు రాసుకొన్నాం. అంతకు కొన్నిరోజుల ముందు విడుదలైన యమలీల సినిమాలో యముడు వచ్చేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే `ధూం తత ధూం తత ధూం...` ని వాడుకొని రిహార్‌సల్స్ మొదలుపెట్టాం. లంచగొండితనమ్మీద, ప్రభుత్య ఉద్యోగుల నిర్లక్ష్య ధోరణిమీదా, సినిమా వాళ్ళ ఈగో మీదా వ్యంగ్యంగా ఉన్న డైలాగులు  బాగా వచ్చాయి.  రిహార్‌సల్స్ సమయంలో స్కూల్లో బాగా పాపులరయిపోయిన యమలోకాన్ని కావాలనే కార్యక్రమాల వరసలో చిట్టచివర పెట్టారు. రాత్రి పన్నెండుగంటలు దాటిన తరువాత ప్రదర్శించినా కూడా  గ్రౌండ్లో ఆడియన్స్ ఫుల్‌కెపాసిటీతో,  `ధూం తత ధూం తత ధూం...` బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్తో దర్పంగా ప్రవేశించబోయిన యమధర్మరాజు గుమ్మం తన్నుకొని ముందుకుతూలి, "ఏయ్, యమలోకంలో గుమ్మాలు పెట్టింది ఎవర్రా?" అని ఘర్జించి పుట్టించిన నవ్వుల జల్లు, తెరలు తెరలుగా కొనసాగి నాటకాన్ని విజయవంతం చేసింది.

ఈ నాటకం మొదటిసారి ప్రదర్శించి 17 సంవత్సరాలు అయ్యింది. తరువాత మళ్ళీ చాలా కాలానికి 2001లో ఇంకొక స్కూల్లో కూడా(ప్రగతీ లిటిల్ పబ్లిక్ స్కూల్) వేయించాను. ఇక్కడి ఫొటో 2001 లోదే. ఈ ఫోటోలో ఉన్న కొంతమంది ఇప్పుడు నిజంగానే ప్రభుత్యోద్యోగాలు చేస్తున్నారు. బహుశా ఏ విషయాలగురించి నవ్వులు పుట్టించారో అవే చేస్తున్నారో ఏంటో!
*     *     *

This photo was taken in 2002.  I was working as a teacher in Pragati Little Public School.  It was almost the end of the academic year and was time for annual day celebrations.   I got a socio-fantasy drama by name `Yamalokam` enacted by the students.  We discussed in the play - corruption, boozing, irresponsibility and negligence in government offices, lack of civic sense and other contemporary issues in a sarcastic and humorous way. It was liked immensely by every one. The concept has been borrowed and staged during the annual day celebrations of many other schools, many times since then. Years passed by and  the names of the students in the photograph slipped out of my memory.   More than a decade was over and I shared this photo in facebook. I did not know who among my students first noticed it. The photo went viral in old Pragati students` circles. I kept on receiving friend requests from them and chatting with them. It went on for full two days!  I felt elated over re-establishing links with them.  Interestingly some of the students who played different characters in the play are now  working somewhere, practising a bit the very bad things we ridiculed in the play :) :) .

© Dantuluri Kishore Varma 

Friday, 2 November 2012

కృష్ణ చైతన్యం - ఇస్కాన్ రాజమండ్రీ


ఇస్కాన్ అనగానే సుందరమైన రాధా మాధవుల పాలరాతి విగ్రహాలు, రాసలీలల వర్ణచిత్రాలు, అద్భుతమైన మందిరాలు జ్ఞాపకం వస్తాయి.  ఎప్పటినుంచో రాజమండ్రీ ఇస్కాన్ దేవాలయాన్ని చూడాలని అనుకొంటూ ఆఖరికి ఈమధ్యన వెళ్ళాను.  బెంగళూరు, తిరుపతిల తరువాత ధక్షిణ భారతదేశంతో ఉన్న మూడవ అతిపెద్ద ఇస్కాన్ మందిరం ఇదే.


గోదావరి నదికి, రైల్వే ట్రేక్‌కి మధ్యన గౌతమీఘాట్ మీద రెండెకరాల స్థలంలొ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ్ కాన్షస్నెస్ - ఇస్కాన్) మందిరాన్ని 2006 లో ప్రారంభించారు. ఈ మందిర అద్యక్షులు శ్రీమాన్ సత్య గోపీనాథ్ స్వామి.  దేవాలయం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పది చిన్న చిన్న మందిరాలు నిర్మించి వాటిలో విష్ణుమూర్తియొక్క దశావతారాల విగ్రహాలను ఉంచారు. అందుకే దీనిని  శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ దశావతార మందిరం అని అంటున్నారు.

మందిరంలో ఫోటోలు తీసుకోవడానికి అనుమతికోసం, బ్లాగ్‌లో రాయడానికి వివరాలకోసం మందిరం యొక్క కార్యాలయంలో శ్రీ హేమా నిర్మల్‌దాస్ గారిని కలిసినప్పుడు హరే కృష్ణ మతాన్ని స్థాపించిన ఏ.వీ.భక్తివేదాంత ప్రభుపాద గురించి తెలియజేస్తూ, ఆయన జీవిత చరిత్రని చదవమని సూచించారు. దేవాలయం మొదటి అంతస్తులో ఉన్న గోవిందా గిఫ్ట్ షాపులో ఆ పుస్తకం కొన్నాను. కృష్ణ చైతన్య దీప్తిని రగిలించడానికి జీవితమంతా అంకితంచేసిన శ్రీ ప్రభుపాద చరిత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది.


ఆయన జీవించిన కాలాన్ని రెండు భాగాలుగా విభజిస్తే - మొదటిది ఆయని భారతదేశంలో ఉన్న 69 సంవత్సరాలు, తరువాతది 1965లో అమెరికా వెళ్ళినతరువాత ఆయన జీవించిన చివరి 12 సంవత్సరాలు. ఈ 12 ఏళ్లల్లో భాగవతం గురించి, భగవద్గీత గురించి, భారతదేశ భక్తి వేదాంతాలగురించి 60కంటె ఎక్కువపుస్తకాలు ఆంగ్లంలో రాసి, ప్రపంచవ్యాప్తంగా 120 కృష్ణ చైతన్య సంఘాలు స్థాపించి, 4000కంటే ఎక్కువమందికి మంత్రోపదేశంచేసి శిష్యరికాన్ని ప్రసాదించిన శ్రీపభుపాద స్వామి మనం ఇప్పుడు చెప్పుకొంటున్న మల్టీ టాస్కింగ్ అనే పదానికి నిజమైన ఉదాహరణ. అన్నింటికన్న ముఖ్యంగా ఈ  ప్రక్రియని ఒకవృద్దుడు చేసిచూపించడం!  ఒక చెట్టును కొట్టే వ్యక్తి గొడ్డలితో వందసార్లు నరికితేనే కానీ కూలని చెట్టు ఇంకొక్క దెబ్బకి నేలకొరిగితే ఆ గొప్పతనమంతా నూటఒకటో దెబ్బదే అని ఎలా చెప్పలేమో; అలాగే భక్తి వేదాంత స్వామి భారతదేశంలో ఉన్న 69 సంవత్సరాలలూ ఏవిధమైన ప్రాముఖ్యతా లేనివని చెప్పలేము. ఈ సమయంలో ఆయన కేవలం మూడు పుస్తకాలు రాసి ఉండవచ్చు కానీ, ఎప్పుడూ ఒకే దృక్పదం అదే కృష్ణ ప్రేమ. దానికోసమే నీరు పల్లానికి ప్రవహించినట్లు, విల్లు నుంచి సంధించిన బాణం లక్ష్యం కేసి దూసుకొనిపోయినట్లు ప్రయత్నం తరువాత ప్రయత్నం చేస్తూ నిర్దేశించుకొన్న కర్తవ్యాన్ని నిర్వహించిన మార్గదర్శి ఆ మహానీయుడు.

అసలు టాపిక్ నుంచి కొంచెం డైవర్షన్ తీసుకొన్నట్టున్నాను. సరే, మళ్ళి రాజమండ్రీ ఇస్కాన్ మందిరంకి వస్తే - రెండు అంతస్తులుగా నిర్మించారు. క్రింద వేదిక్ ఎగ్జిబిషన్‌ని నిర్వహిస్తున్నారు. రామాయణం, భాగవతం ఘట్టాలు, సాక్షాత్తు కృష్ణావతారంగా భావించబడే చైతన్య మహాప్రభు జీవిత సంఘటనలను  విగ్రహాల రూపంలో ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. పై అంతస్తులో రాధా మాధవ, చైతన్యప్రభు విగ్రహాలు; పూరీ జగన్నాధుని ఆలయంలో ఉండే శ్రీకృష్ణ,సుభద్ర,బలరామ ప్రతిమలను పోలిన విగ్రహాలు; శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహమూ ప్రతిష్ఠించిన ప్రధాన ఆలయం ఉంది. అలంకరణలతో ఈ ప్రతిమలు అత్యంత సుందరంగా ఉన్నాయి. మందిరానికి చేర్చి వేదాంత పార్క్ ఉంది. పచ్చటి లాన్లతో,ఫౌంటెన్లతో, భాగవతఘట్టాల మందిరాలతో చాలా బాగుంది.

ఒకసారి శ్రీ ప్రభుపాద ఒకపిల్లవాడు వీధిలో పారవేసిన ఎంగిలి విస్తరికోసం ఒక వీధి కుక్కతొ కలియబడడం చూశారట. అప్పుడే ఆయన ఇస్కాన్ మందిరం ఉన్న  చుట్టుప్రక్కల 10మైళ్ళ ప్రాంతంలో పిల్లలెవరూ ఆకలితో ఉండరాదని నిర్ణయించారట. అందువలన రాజమండ్రీలో 42 ప్రభుత్య పాఠశాలల్లో చదువుతున్న సుమారు 20,000 మంది విద్యార్దులకి ప్రతీరోజూ మద్యహ్న భోజనం సమకూరుస్తుంది. ఇస్కాన్ ఆద్వర్యంలో ఒక గోశాల ఉంది. ఇక్కడ 200 గోవులకి సంరక్షణ చూస్తున్నారు.

భక్తి, సేవల అపూర్వ సంగమం - కృష్ణ చైతన్య సంఘం
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare

Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare


© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!