రెండవ ప్రపంచ యుద్దం, అమెరికా అంతర్యుద్ధం, ఫ్రెంచ్ విప్లవం లాంటి చారిత్రకమైన సంఘటనలని ఆధారంగా చేసుకొని చాలా నవలలు వచ్చాయి. మనదేశంలో కూడా అటువంటి దురదృష్ఠకరమైన సంఘటనలు జరిగినా వాటి నేపద్యంగా రాసిన నవలలుకానీ, కథలు కానీ ఎక్కువగా కనిపించవు. పేపర్లలో, పత్రికల్లో వార్తలుగా, వార్తాకథనాలుగా వాస్తవాలను రాయడం వేరు, వాటిని సామాన్యుల దృష్ఠి కోణంనుంచి ఆవిష్కరించడం వేరు. ఉదాహరణకి 1947 దేశవిభజన సమయంలో జరిగిన అల్లర్లలో సుమారు పదిలక్షల మంది చంపబడ్డారట, ఒకకోటిమంది వాళ్ళ, వాళ్ళ ప్రదేశాలనుంచి వెళ్ళగొట్ట బడ్డారట. దీనిని ఇలాగే చెపితే `అయ్యో!` అనుకొని ఒక గంటలో మరచిపోతాం. కానీ, మానోమజ్రా అనే ఒక ఊరిని సృష్ఠించి, అక్కడ ప్రజల బ్రతుకుల్లో దేశవిభజన ఏ రకమైన కల్లోలం కలిగించిందో కొన్ని కల్పిత పాత్రల చుట్టూ కథ అల్లి, ఆ కల్లోల పరిస్థితుల్ని పాఠకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాడు రచయిత కుష్వంత్‌సింగ్ 1956లో రాసిన తన నవల ఎ ట్రెయిన్ టు పాకిస్థాన్‌తో.
మానో మజ్రా పంజాబ్‌లో సట్లెజ్ నది వొడ్డున, పాకిస్థాన్ సరిహద్దు ప్రక్కనే ఉంటుంది. సట్లెజ్ నదిమీద ఒకరైల్వే బ్రిడ్జ్, ఊరిలో రైల్వే స్టేషన్ ఉంటాయి. రెండు వర్గాల ప్రజలు ఉంటారు. సిక్కులు, ముస్లింలు. వీళ్ళుకాక ఒకే ఒక హిందూ కుటుంభం ఉంటుంది - వడ్డీ వ్యాపారి లాలా రాం లాల్‌ది. జుగ్గత్‌సింగ్ అనే బందిపోటు దోపిడీలు, హత్యలు చేస్తూ, జైలుకి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇతనికి నూరాన్ అనబడే ముస్లిం యువతితో ప్రేమాయణం ఉంటుంది. కథా గమనంలో ఇంకా కొంతమంది వ్యక్తులు వస్తారు. కుష్వంత్ సింగ్ ఈ పాత్రల రోజువారి వ్యాపకాలని నిశితంగా వర్ణిస్తూ, వాటికి నిజమైన వ్యక్తుల్లాంటి విస్వశనీయత కలుగ జేస్తాడు. కథలో లీనమైపోతాం. సంఘటనలన్నీ నిజంగా జరుగుతున్నట్టు ఉంటాయి.
ఒకరాత్రి జుగ్గత్ సింగ్, నూరాన్‌లు ఊరిబయట పొలాల్లోకి రహస్యంగా కలుసుకోవడానికి వెళతారు. అదే సమయంలో ఒకబందిపోట్ల ముఠా ఊరిలో ప్రవేశించి రాంలాల్ ని హత్యచేసి డబ్బులు లూటీ చేసి పోతారు. ఇక్బాల్ అనే యూరోప్‌లో చదువుకొన్న సిక్కు యువకుడు సంఘసంస్కరణాభిలాషతో హత్యజరిగిన తరువాతరోజు మానో మజ్రాకి వస్తాడు. అనుమానం జుగ్గత్ సింగ్ మీద, ఇక్బాల్ మీదా వస్తుంది. ఇద్దరినీ అరెస్ట్ చేసి లాకప్‌లో పెడతారు. నిజానికి వీళ్ళిద్దరికీ, రాంలాల్ హత్యకీ సంబంధంలేదు.
దేశవిభజన సమయం అది - పరాయి మతాల మీద అకారణ ద్వేషంతో హత్యలు, మానభంగాలు, లూటీలు లాంటి అకృత్యాలు జరుగుతున్నాయి. తరతరాలుగా ఒక ప్రాంతంలోనే ఉన్నా హిందువులు, సిక్కులు సరిహద్దు ఇవతలకి వస్తే; ముస్లింలు అటువైపు వెళ్ళాలి. వాళ్ళని ట్రెయిన్లలో సరిహద్దులు దాటిస్తారు. కొంపా, గోడూ వదిలి పరాయి ప్రాంతానికి పారిపోతున్న అసహాయుల్ని సరిహద్దు దాటడానికి ముందే మతమౌడ్యం తలకెక్కిన పిచ్చివాళ్ళు ఊచకోత కోస్తున్నారు. మానోమజ్రా ప్రజలకు మాత్రం రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి.
ఒకరాత్రి పీనుగుల ట్రెయిన్ ఊరి స్టేషన్‌కి చేరుకొంటుంది. కొన్ని రోజుల తేడాతో మరొకటి. తరువాత జరిగిన కొన్ని సంఘటనల నేపధ్యంలో మానోమజ్రాలో ముస్లింప్రజలని రెఫ్యూజీ క్యాంపుకి తరలిస్తారు. మరునాడు వాళ్ళందరినీ సరిహద్దు దాటించాలి. ముష్కరులు కొందరు ట్రెయిన్లో వెళ్ళబోయే వాళ్ళని ఊచకోత కోయాలని పధకం పన్నుతారు. ఈ కుట్ర గురించి ఊరిలో మిగిలిన వాళ్ళకి, పోలీసులకి తెలుసు. కానీ ఎలా నిలువరించడం? తక్కువ సంఖ్యలో ఉన్న పోలీసులవల్ల కాదు. మరి ఎవరు ఆపగలరు - జుగ్గత్‌సింగ్? ఇక్బాల్?? వాళ్ళిద్దరినీ విడిచిపెడతారు.
ముష్కరుల పధకంలో భాగంగా ట్రెయిన్ ఎత్తుకంటే ఒక అడుగు పైన బ్రిడ్జ్‌కి అడ్డంగా ఒక బలమైన తాడు కడతారు. దీనివల్ల పైన కూర్చుని ప్రయాణించే జనాలు క్రింద పడి మరణిస్తే, ఈ అయోమయంలో లోపల ఉన్నవాళ్ళని గన్నులతో కాల్చి చంపవచ్చనేది ప్లాన్. ఆయుదాలు పట్టుకొని తిరిగే వాళ్ళకి మంచి మాటలు చెప్పి మార్చుదామనుకొంటే, చెప్పిన వాడే ముందు బలవ్వాలి. కాబట్టి, ఇక్బాల్ నిస్సహాయంగా ఉండిపోతాడు. తాగి, తాగి నిద్రపోతాడు. కానీ, కథమొదటినుంచీ బద్మాష్‌గా ముద్రవెయ్యబడ్డ జుగ్గత్‌సింగ్ పరిస్థితి వేరు. వాడి ప్రియురాలు అదే ట్రెయిన్లో వెళుతుంది. ఆమెని కాపాడుకోవాలి. ఆమెతో పాటూ మిగిలిన అందర్నీ.
కథ చివరికి చేరుకొంటుంది. పట్టాల ప్రక్కన ఆయుదాలతో పొంచి ఉన్న వ్యక్తులు, రైలు వస్తుందని సూచించే సిగ్నల్ పడిన తరువాత బ్రిడ్జ్‌కి అడ్డంగా కట్టిన తాడుమీద ఒక ఆకారాన్ని గమనిస్తారు. ఏమిజరుగుతుందో తెలిసేలోగానే ట్రెయిన్ సమీపిస్తుంది. తాడుమీద వ్యక్తి దాన్ని తెంపడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడ్ని కాలుస్తారు. పట్టువదలడు. మళ్ళీ మళ్ళీ బుల్లెట్ల వర్షం కురుస్తుంది. చివరి క్షణంలో తాడుతెగిపోతుంది. జుగ్గత్‌సింగ్ పట్టాలపైన పడతాడు. ట్రెయిన్ సురక్షితంగా వెళ్ళిపోతుంది.
కథలో పాత్రలమధ్య అనుబంధం, సహజీవనం ఒక మానవీయకోణాన్ని ఆవిష్కరిస్తాయి. జరుగుతున్న అల్లర్లని, నిస్సహాయంగా బలవుతున్న సామాన్యుడి దృష్టికోణంనుంచి అవగాహన చేయ్యడం సాహిత్యంయొక్క ప్రధానమైన ప్రయోజనం. రచయిత రక్తపాతాన్ని ఎక్కడా గ్లోరిఫై చెయ్యడు, మతపక్షపాతం చూపడు. కేవలం పాత్రలే కథని నడిపిస్తాయి. అందుకే, ఈ నవల కుష్వంత్‌సింగ్ యొక్క మేగ్నం ఓపస్ అయ్యింది. క్లాసిక్స్‌లో ఒకటిగా పరిగణించ బడుతుంది. నూట యాభైఏడు పేజీల చిన్ని నవల. దీనిగురించి రెండుముక్కల్లో చెప్పాలంటే - మనసులో ముద్రవేస్తుంది.
© Dantuluri Kishore Varma
మంచి నవలని పరిచయం చేసారు.
ReplyDeleteJust can't wait to read this.
ధన్యవాదాలు చిన్ని ఆశ గారు.
Delete