Tuesday, 30 April 2013

అదే నవ్వు!

సందుమొదటిలో షేర్ ఆటో ఆగింది. కుమార్ దిగేడు. ఎండ సిమ్మెంట్‌రోడ్డుమీదపడి క్రిందనుంచికూడా వేడి వచ్చేస్తుంది. అక్కడికి ఇరవైమీటర్లదూరంలో ఆ వీధి అంతటికీ ఒకే ఒక గానుగచెట్టు, దానికి ఆనుకొని కుమార్ ఇల్లు. గానుగచెట్టు ఎడారిలో ఒయాసిస్సులా ఉంది.  దానినీడ విశాలంగా పరచుకొని ఉంది. చెట్టుమీద పక్షులు కునుకుతీస్తున్నట్టు చప్పుడు చెయ్యకుండా కూర్చున్నాయి. ఒకే ఒక కాకి మాత్రం అరుస్తుంది. ఓ కొబ్బరికాయల సైకిల్ చెట్టు మొదలుకి జారవేసి ఉంది. చెట్టుక్రింద నీడపట్టున నలుగురైదుగురు చేరారు. కుమార్ ఇంటి గేటునుంచి రోడ్డుకి కలిసే ఏటవాలు చప్టా పూర్తిగా నీడలో ఉండడంతో ఓ ముసలోడు తలక్రింద తుండుగుడ్డ పెట్టుకొని పడుకొని ఉన్నాడు. ప్రతిమధ్యాహ్నం వాడు అక్కడే సేదతీరుతుంటాడు.

కుమార్ ఆటో దిగడం చూసిన కొబ్బరికాయల సైకిలు వాడు ఒక్క ఉదుటున లేచాడు. `ఒరేయ్,ఓనర్రా!. చెట్టునీడేమయినా ఈడి తాతగారి సొత్తా? సైకిలు ఇక్కడ పెడితే, రోజుకి రెండు బొండాలు ఇయ్యాలట. ఈడెంకమ్మా...` అంటూ సైకిల్ తీసాడు, `....ఆడేం తిట్టినా నీకు చీమకుట్టినట్టుండదురా ముసలి నాయాలా. నువ్వు ఇక్కడే పడేడు. నేంపోతున్నా,` అనేసి - ముచ్చిక గిల్లి అంటించిన సిసింద్రీలా సర్ర్..మని అక్కడినుంచి పారిపోయాడు. మిగిలిన వాళ్ళు కూడా దాగుడు మూతలాటలో కుర్రాళ్ళలా `ఎక్కడి దొంగలక్కడే గప్ చిప్,` అన్నట్టు మాయమైపోయారు. ముసలోడు మిగిలి పోయాడు.  

తనరాక కలిగించిన అలజడిని కుమార్ స్పష్టంగా చూశాడు. `ఆ మాత్రం భయం ఉండాలి,` అనుకొన్నాడు. సెల్ఫ్ ఇంపార్టెన్స్‌తో చాతీ పొంగింది. కానీ చొక్కా బొత్తాల్ని తెంపేసేలా తన్నుకు వస్తున బొజ్జ ముందు, పొంగిన చాతీ ఏమీ కనిపించలేదు. బ్యాగ్ బరువుకేమో ఎడమభుజం లాగుతుంటే దాన్ని కుడివైపుకి మార్చుకొని ఇంటివైపు పెద్ద పెద్ద అంగలతో నడిచాడు.  

ముసలోడు అటెన్‌షన్‌లోకి వచ్చేశాడు. తలక్రింద పెట్టుకొన్న తుండుగుడ్డ చంకలోకి వెళ్ళిపోయింది. గేటు మూలలోకి నక్కిపోయి కూర్చున్నాడు. 

`ఎన్నిసార్లు చెప్పినా బుద్దిరాదురా నీకు? ఎండదెబ్బకి నువ్వు గేటు ముందు చస్తే నాకు అదొక తలనెప్పి. పోరా ఇక్కడి నుంచి. మళ్ళీ కనిపించావంటే కాళ్ళు విరగ్గొడతాను,` అన్నాడు. ముసలోడు ఏమీ సమాదానం చెప్పలేదు. పళ్ళ చిగుళ్ళు  కనిపించేలా నవ్వాడంతే! సరిగ్గా ఆ సమయంలో కుమార్ బీ.పీ ఎవరైనా కొలవడానికి ప్రయత్నిస్తే - పైలెవెల్ బద్దల గొట్టుకొని పాదరసం ఫౌంటెన్లా చిమ్మేసి ఉండేది! ఉగ్రంగా పళ్ళుకొరుక్కొన్ని, విసురుగా గేటు తీశాడు. గుండెల్లో కలుక్కు మంది.  

ఆ సమయంలో ఇంటిలో ఎవరూ ఉండరు. కుమార్ పెళ్ళం అక్కడికి ఒక కిలో మీటరు దూరంలో ఉన్న మీ-సేవ ఆఫీసులో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తుంది. పిల్లలు స్కూలు, స్టడీ అవర్లు పూర్తిచేసుకొని సాయంత్రం ఎప్పుడో ఇల్లు చేరతారు. గేటు మూసి, మెయిన్‌డోర్ తాళంతీసుకొని లోపలికి వెళ్ళి, తలుపు మూశాడు. నుదురు చెమటతో తడిసిపోయింది. నోరు పిడచ కట్టుకు పోతుంది. మంచినీళ్ళు తాగితే సుఖంగా ఉంటుందేమో! అడుగులో అడుగు వేసుకొంటూ ఫ్రిడ్జ్ వైపు నడిచాడు. డోర్ తీస్తుండగా ఉప్పెనలా గుండెల్లోకి నొప్పి తన్నుకు వచ్చింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. చెయ్యిజారి బాటిల్స్ నేలమీద పడి `బళ్ళు` మని బ్రద్దలయ్యాయి. కుమార్ కుప్ప కూలిపోయాడు.

*  *  *

ఇరవై రోజుల తరువాత ఆ ఇంటిముందు ఓ టాక్సీ ఆగింది. వెనుక డోర్‌లోంచి పెళ్ళాం సహాయంతో కుమార్ దిగేడు. లుంగీలో ఉన్నాడు. చేతికి సెలైన్లు ఎక్కించిన చోట ఇంకా ప్లాస్టర్లు అలాగే ఉన్నాయి. కొబ్బరికాయలు వాడు ఎక్కడికీ పారిపోలేదు,  నుంచుని చూస్తున్నాడు. ముసలోడు ఎప్పటిలాగే  కూర్చుని ఉన్నాడు. కుమార్ కారులోంచి దిగడం చూసి పళ్ళ చిగుళ్ళు కనిపించేలా నవ్వాడు. హార్టాపరేషన్ చేయించుకొని అప్పుడే హాస్పిటల్‌నుంచి డిస్చార్జ్ అయిఉన్నాడుకనుక సరిపోయింది కానీ, లేకపోతే వచ్చిన కోపానికి ముసలోడిని అక్కడే గొంతుపిసికి చంపేసును. తలుపుమూసేముందు కసిగా  `పోరా ముసలిపీనుగా,` అన్నాడు.

నవ్వుతున్న ముసలోడిని చూసి ఒళ్ళుమండిపోయింది కొబ్బరికాయల వాడికి. `ఇసయం ఇంకా ఆ బాబుకి తెలిసుండదు. చప్పుడువిని నువ్వెల్లి సూడకపోతే ఆ పొట్టోడి పని ఏటయ్యేది ఆయాల?`  అన్నాడు. ` చల్లగా పడుకొన్న ఒక్కడంటే ఒక్కడు బయటకి రాలేదు. ఎండలో చెప్పుల్లేకుండా పరుగెత్తుకెల్లి ఆళ్ళావిడ్ని తోలుకు రాకపోతే ఆడూ, నిన్ను తిట్టడానికి ఆడినోరూ ఉండేయి కాదు. ఆయమ్మ చెపితే నిన్ను పిలిచి బువ్వెడతాడేమోరా!` అన్నాడు.  

ముసిలోడు పళ్ళ చిగుళ్ళు కనిపించేలా నవ్వాడు.
© Dantuluri Kishore Varma

2 comments:

 1. చక్కని కధ. ముఖ్యంగా ముసలాడి నవ్వు బాగుంది.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు కిషోర్‌గారు.

   Delete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!