ఇంగ్లీషులో ఏబ్‌స్టినెన్స్(abstinence) అనే ఒక పదం ఉంది. అంటే మధ్యపానం, మత్తుమందులు, దూమపానం, అక్రమ మరియు వివాహేతర సెక్స్ సంబంధాల వంటివాటినుంచి దూరంగా ఉండడం. `ఎందుకు దూరంగా ఉండాలి?` అంటే....మనం రోజు చూస్తున్న నేరాల్లో సగంపైగా వాటికి కారణం ఇవే.
సంపాదించిన దానిలో తొంభైశాతం వ్యసనాలకి ఖర్చుపెట్టేసి, కుటుంభాన్ని పస్తులు పడుకోబెట్టే ప్రబుద్ధులు ఎందరో. ఎందుకిలా చేస్తున్నావని అడిగితే గృహహింస మొదలౌతుంది. మందుబాబుల పని ఇలా ఉంటే పొగరాయుళ్ళు వాతావరణాన్ని కలుషితం చేస్తూ, తమ ఊపిరితిత్తుల్ని పొగగొట్టాల్లాగ మసిబార్చుకొని వందేళ్ళ జీవితాన్ని నలభై, ఏభైలకే ముగిస్తున్నారు. ఇవి పర్పస్‌లెస్ డెత్స్! కామాందుల విషయానికి వస్తే `కామాతురాణాం న భయం! న లజ్జ!!` అన్నట్టు విచక్షణ మరచి పశువుల్లా సమాజం మీద తెగబడుతున్నారు.
`తప్పు! అలా చెయ్యకూడదు,` అని సుద్దులు చెప్పడం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది. ఎవరూ వినరు. ఒకసారి మందురాయుళ్ళు కొంతమందికి ఎవర్షన్ థెరపీ చేస్తూ ఒక ప్రయోగం చేసి చూపించారు. రెండు గాజు గ్లాసులని వాళ్ళముందు ఉంచి ఒకదానిలో మంచినీరు, రెండవదానిలో సారాయినీ పోశారు. అప్పుడు రెండు కీటకాలని తీసుకొని వచ్చి ఒక్కో గ్లాసులో ఒక్కోదాన్ని వేశారు. మంచినీళ్ళ గ్లాసులో ఉన్నది అంచువరకూ ఈదుకొని వచ్చి, పైకి ఎక్కేస్తుంది. మందు గ్లాసులో ఉన్నది మాత్రం కొంచం సేపు ప్రయత్నించి మునిగి పోతుంది. ఇది ఆల్కహాల్ ప్రభావాన్ని చక్కగా వివరించే అద్భుతమైన ప్రయోగం. `దీన్ని బట్టి మీకు ఏమి అర్థమైంది?` అని అడిగిన డాక్టర్లకి షాకిచ్చే సమాదానం చెప్పి మందుబాబులు `మేం మారమంటే మారం!` అనే దృక్పదాన్ని స్పష్టంగా వ్యక్తీకరించారు. ఇంతకీ వాళ్ళిచ్చిన సమాదానం ఏమిటంటే - `ఆల్కహాల్ సేవిస్తే కడుపులో క్రిములు చస్తాయి. కాబట్టి ఆల్కహాల్ ఆరోగ్యానికి చాలా మంచిది ,` అని. ఈ జోకు చాలా మంది వినే ఉంటారు. అయినప్పటికీ దీనిని ఇక్కడ ఉదహరించడానికి కారణం కరుడు గట్టిన వ్యసనపరులు అంత త్వరగా మారరు అని చెప్పడానికే.
మారే అవకాశం లేదని కాదు. కానీ, ఒక వ్యసనం మానడానికి బలమైన కారణం ఉండాలి. చాసో అని పిలవబడే చాగంటి సోమయాజులు గారు రాసిన కథ `ఎందుకు పారేస్తాను నాన్నా?` అనేది ఈ విషయాన్నేచెపుతుంది. కృష్ణుడనే కుర్రాడు, చదువంటే చాలా ఇష్టం వాడికి. కానీ, కుటుంభానికి ఫీజు కట్టగలిగిన స్థోమత లేదు. బడి మానిపిస్తానంటాడు తండ్రి. ఒకరోజు కొట్టుకి వెళ్ళి చుట్టలు తెమ్మని, కృష్ణుడి చేతికి డబ్బులు ఇస్తాడు. దారిలో, బడిని చూసి ఆగిపోతాడు కుర్రాడు, అక్కడే కూర్చుండిపోతాడు. ఎంతకీ ఇంటికి రాని కొడుకుని వెతుక్కొంటూ వచ్చిన తండ్రిని వెక్కి వెక్కి ఏడుస్తూ బడిలో వెయ్యమని బ్రతిమాలతాడు. ఏ మనసు మాత్రం కరుగకుండా ఉంటుంది? `సరే, రేపు వద్దాం,` అంటాడు తండ్రి. `కాదు ఇప్పుడే. కనీసం పుస్తకమైనా కొనిపెట్టు, రేపు పంపుతావని నమ్ముతాను,` అంటాడు కుర్రాడు. దానికైనా డబ్బులుండాలి కదా? నిజానికి తండ్రి చుట్టలు మానేస్తే అది కొడుకు చదువుకి సరిపోతుంది. `అయితే సరే, ఇందాక చుట్టలు తెమ్మని ఇచ్చిన డబ్బులు ఉన్నాయా, పారేశావా?` అని అడుగుతాడు, వాటితో ఇంగ్లీషు పుస్తకం కొనాలని నిస్చయించుకొంటూ.
ఇతిహాసాల్లో, పురాణాల్లో, ఆధునిక సాహిత్యంలో ఈ వ్యసనాల గురించి అన్నో కనువుప్పు కలిగించే కథలు కనిపిస్తాయి. రాముడ్ని కోరుకొన్న సుర్పణక ముక్కూ, చెవులూ కోల్పోతే; పరస్త్రీని వాంచించి ప్రాణాలే కోల్పోయాడు రావణాసురుడు. అహల్య రాయయితే, ఆమెని పొందిన ఇంద్రుడు శాపగ్రస్తుడై వొళ్ళాంతా తన కామపూరిత వికారపు ఆలోచనలు తెలియజేసే కళ్ళను పొందాడు. చాలా కాలం క్రితం ప్రఖ్యాత కార్టూనిస్ట్ జయదేవ్ దూమపానం మీద ఒక కార్టూన్ గీస్తే అంతర్జాతీయ స్థాయిలో బహుమతి గెలుచుకొంది అది. సిగరెట్ నుంచి వెలువడుతున్న పొగ ఒక సర్పంలా వెనుకనుంచి పొగ పీలుస్తున్న వాడిని కబళించడానికి వస్తుంటుంది. ఎన్నో ఏళ్ళక్రితం చూసినా మనసులో ముద్రపడిపోవడానికి కారణం చెప్పినవిధానమే. పదిపేజీల్లొ రాసినా చెప్పలేనిదాన్ని కొన్నిగీతల్లొ చూపించారు. వ్యసనాలవల్ల జరిగే అనర్ధాలని ఇటువంటి వాటి సహాయంతో పిల్లలకి చెప్పాలి.
నేషనల్ కరికులం ఫ్రేంవర్క్(NCF)లో చదువుతోపాటూ నేర్చవలసిన విలువల చిట్టాను తయారుచేశారు. వ్యక్తిగత విలువలు, కుటుంభ విలువలు, సామాజిక విలువలు, జాతీయ విలువలుగా వాటిని విభజించి ప్రచురించారు. ఈ వ్యాసం మొదటిలో చెప్పిన ఏబ్‌స్టినెన్స్ కూడా వీటిలో ఒకటి. పాఠశాలల్లో మోరల్ ఎడ్యుకేషన్‌ని తప్పనిసరి చెయ్యాలి. తల్లి తండ్రుల కొంత సమయాన్ని మంచి విషయాలు చెపుతూ పిల్లలతో గడపాలి. అప్పుడే జాతి యావత్తూ సిగ్గుతో తలవంచుకొనేలాంటి అత్యాచారాలు జరిగే సంభావ్యత తగ్గుతుంది. వంకరగా పెరిగిన చెట్టుని సరిచెయ్యడం కష్టం! కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే నిటారుగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యావేత్తలు, ప్రభుత్వం దీనిని పూర్తిగా సమర్ధిస్తున్నా - ఆచరణలో పెడుతున్న వాళ్ళు ఎంతమంది?
© Dantuluri Kishore Varma
సులభాః పురుషారాజన్ ........వక్తా శ్రోతాచ దుర్లభః, మారీచుడు చెప్పినా మంచిమాట చెప్పేడు. ఉప్చ్..లోకం మారదు..
ReplyDeleteమార్పు ఓవర్‌నైట్ రాకపోవచ్చు శర్మగారు. కానీ చెప్పగా, చెప్పగా చెవికెక్కుతుందేమో!
DeleteWell said, sir
ReplyDeleteధన్యవాదాలు మీకు.
Deletechaala manchi post Varma gaaruu
ReplyDeleteధన్యవాదాలు కిరణ్.
Delete