Pages

Tuesday, 9 April 2013

చదువు P- V Formula

*     *     *
చాలా స్కూళ్ళు ఫేక్టరీల్లా మారాయి. ఎలాగయినా పరీక్షల్లో మార్కులు రప్పించడమే లక్ష్యం. పాఠశాలల్లో బోధనమీద సమయం తగ్గించి, స్టడీ అవర్ మీద  దృష్టి ఎక్కువ పెడుతున్నారు. దీనివల్ల విద్యార్థుల స్కోరింగ్ బాగానే ఉన్నా, పాఠ్యాంశాలమీద సాధికారత  రావడం లేదు. అందువల్లనే, చదువుకొనే పిల్లలు బట్టీ పట్టే విధానం నుంచి మారాలని సర్వత్రా సూచనలు వినిపిస్తూ ఉంటాయి. చెప్పడం సులువే, కానీ ఎలా మారాలి? ఏ విధంగా చదివితే ఎక్కువ ఫలితం ఉంటుంది? అనే మార్గనిర్దేశం  చెయ్యగల వనరులు(నిపుణులు, పుస్తకాలు) అంతగా అందుబాటులో ఉండడం లేదు. ప్రైమరీ స్కూల్ విద్యార్థి నుంచి ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ వరకూ ఈ అవగాహనా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రెగ్యులర్‌గా చదివే కోర్సుల్లో పరీక్షలకు ఒక సంవత్సరం సమయం ఉంటుంది కనుక బట్టీ పట్టో, ముక్కునబట్టో గట్టెక్కేయవచ్చు. వల్లెవెయ్యడం జ్ణాపకం ఉంచుకోవడానికి ఒక మంచి పద్దతే. అయినా కూడా ఇది  అన్ని చోట్లా ఉపయోగకరంగా ఉండదు.  పోటీ పరీక్షలకి, పెద్ద ఉద్యోగాల ఇంటర్వ్యూలకీ తయారవుతున్నప్పుడు సమయాభావం మనల్ని పరాజితుల్ని చేస్తుంది. కొంతమంది అందుబాటులో ఉన్న తక్కువ సమయంలోనే కొండలాంటి సిలబస్‌ని అవలీలగా చదివేసి, విజేతలు కాగలుగుతారు. `అది అంతా బట్టీ పట్టి ఉంటారా?` అంటే , సాధ్యంకాదని మనకే తెలుస్తుంది.  `వాళ్ళకి ఉన్నదేంటి, మనకి లేనిదేంటి?` అని ప్రశ్నించుకొంటే,  చదివే విధానం అని అవగతం అవుతుంది. పాఠశాల స్థాయినుంచీ సరయిన చదివే పద్దతి అలవాటు చేసుకొంటే, ఎవరయినా విజేతలు కావచ్చు.  

సరయిన చదివే పద్దతి అంటే ఏమిటి?

చాలా కాలం క్రితం పోటీ పరీక్షలు నిర్వహించే ఒక సంస్థ వాళ్ళు, ఒక చిన్న బుక్‌లెట్‌ని ఇవ్వడం జరిగింది. దానిలో  స్టడీ టెక్నిక్‌లు కొన్ని క్రోఢీకరించి ఇచ్చారు. అందులో P-V formula ఒకటి. దీనిని మొదటినుంచీ మాస్కూల్లో అవలంభిస్తున్నాం. ఆ ఫార్ములా గురించి ఇక్కడ వివరించాలని అనుకొంటున్నాను. నాబ్లాగ్ చదువుతున్న వాళ్ళలో `మనకాకినాడ` ఫేస్‌బుక్ గ్రూపునుంచి చాలామంది ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఉన్నారు.  ఇటువంటి విషయాలగురించి కూడా వ్రాయమని ఒకరిద్దరు నాకు సూచించడంతో, అప్పుడప్పుడూ ఆఫ్ టాపిక్ అంశాలు మనకాకినాడబ్లాగ్‌లో కనిపిస్తూ ఉంటాయి. 

P-V formula అంటే ఇంగ్లీష్ అక్షరాలలో p నుంచి v వరకూ ఒక్కొక్క అక్షరం -  చదివి అవగాహన చేసుకోవడంలో ఒక్కో స్థాయిని తెలియజేస్తాయి.  

P అంటే Preview. ఎంచుకొన్న చాప్టర్‌ని గుడ్డెద్దు చేలో పడినట్టూ చదివెయ్యడం కాకుండా, ఇచ్చిన సబ్ హెడ్డింగ్స్, హైలైట్ చేసిన విషయాలు లాంటివి చూసుకొంటూ చివరి వరకూ పేజీలు త్రిప్పి పాఠ్యాంశం మీద కనీస అవగాహన తెచ్చుకోవాలి. ప్రివ్యూనే సర్ఫేస్ రీడింగ్ (పైపైన చదవడం) అనవచ్చు. ఇలా చెయ్యడం వల్ల పాఠం దేనిగురించో తెలుస్తుంది. 

Q అంటే Question.  ప్రివ్యూ చేసిన పాఠం మీద కొన్ని సాధారణ ప్రశ్నలను తయారు చేసుకొని, సమాధానం కోసం ప్రయత్నించాలి. చాలాసార్లు, చాప్టర్ మొడటిలో ప్రశ్నలు ఇస్తారు. వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ స్థాయిలో పాఠం కొంతవరకూ అర్థమౌతుంది. 

R అంటే Read - చదవడం. పాఠం పూర్తిగా చదవాలి.  ప్రతీవిషయాన్నీ అవగాహన చేసుకొంటూ, ముఖ్యమైన విషయాలని అండర్‌లైన్ చేసుకొంటూ, సైడ్ మార్జిన్లలో పాయింట్స్ నోట్ చేసుకొంటూ చదవాలి. విషయాలని బొమ్మలుగా, మెమొరీ ట్రిక్కులుగా రాసుకొని ఉంచుకోవాలి.ఇది thorough reading.  

S అంటే  Summarize - చదివిన దానిలో ముఖ్యమైన విషయాలనన్నింటినీ పాయింట్లగా క్రోఢీకరించుకోవడం. మీరు ఈ రకంగా రాసి ఉంచుకొన్న పాయింట్ల లిస్టు, పరీక్షలకు ముందు పునరుచ్చరణ సమయంలో కూడా బాగా ఉపయోగ పడుతుంది. 

T అంటే Test - పాఠం చివర ఇచ్చిన ప్రశ్నలు, గత పరీక్షలలో ఇచ్చిన ప్రశ్నలని ఆన్సర్ చెయ్యండి. 

U అంటే Use - సంపాదించుకొన్న పరిజ్ఞానాన్ని సమయానుకూలంగా ఉపయోగించుకోవాలి. చదువుకొన్న చాలా మందికి ఫారాలు నింపడం రాదు.  ఒక సబ్జెక్ట్‌గా ఇంగ్లీష్ పదమూడు నుంచి. పదిహేను ఏళ్ళు  చదివినా, సందర్భం వచ్చినప్పుడు తప్పులు లేకుండా ఒక్క వాఖ్యం మాట్లాడలేరు. తెలియడం నాలెడ్జ్ అయితే, ఉపయోగించగలగడం విజ్డం. చదువు యొక్క లక్ష్యం ఇదే.  

V అంటే Visualize - ఇంతకు ముందు చూసిన విషయాలని కళ్ళు మూసుకొని  జ్ఞాపకం చేసుకోవడం. ఇప్పుడు ఒక్కసారి  `R అంటే  Read` అనే పాయింట్ దగ్గరకి వెళ్ళండి. అక్కడ మీరు చదువుతూ విషయాలని బొమ్మలుగా, మెమొరీ ట్రిక్కులుగా రాసుకొని ఉన్నారు కదా? వాటిని అప్పుడప్పుడూ విజువలైజ్ చేసుకొంటూ ఉండండి. 

ఇది అంతా ఒకే రోజు అలవాటు అవ్వదు. కొన్నిరోజుల అభ్యాసంతో, చదువు యొక్క నిజమైన ప్రయోజనం ఏమిటో మీరు తెలుసుకోవడంతో పాటూ మిగిలిన వారికికూడా చూపించగలుగుతారు.    
© Dantuluri Kishore Varma 

8 comments:

  1. పి.వి ఫార్ములా అంటే సమస్యని వాయిదా వేసెయ్యడమనుకున్నాండీ! :)

    ReplyDelete
  2. హ.. హా.. అది రాజకీయాల్లో పి.వీ. ఫార్ములా శర్మగారు.

    ReplyDelete
  3. chala bagundi mr.dantuluri kishore kumar

    ReplyDelete
  4. ఉపయోగకరం . చాలా వివరంగా చెప్పారు . నైస్ వర్క్ కిషోర్ గారూ .. ధన్యవాదములు

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ ఎ లాట్ వనజగారు :)

      Delete
  5. KEKA ANNAIAH GARU.. SURAJ SINGH BUNDELA

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!