కిటికీలోంచి ఉండుండి ఒక్కో పిల్లతెమ్మెర వస్తుంది. ఏదీకాని చోటులో ట్రెయిన్ ఆగిపోకుండా వెళుతూ ఉండుంటే బాగుండేది. బండి ఎందుకాగిందో, మళ్ళీ ఎప్పుడు కదులుతుందో తెలియదు. కౌశిక్ ఊచల్లోనుంచి ఆకాశంలోకి చూసున్నాడు. చందమామ అమ్మచేతిలోనుంచి జారి నేలమీద పడిన సున్నుండలా ఉంది. మరొకసారి ఎప్పుడయినా అయితే ఇంకోపోలిక ఏదో తోచివుండేది.
* * *
ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి అమ్మదగ్గరకి వెళ్ళాడు. మద్యహ్నం సీరియస్‌గా చర్చ జరుగుతుంటే, `బెల్లం సున్నుండలు నీకు ఇష్టమని చేశాను. తిను` అంది.
`అక్కర్లెద్దు!`అంటూ కోపంగా చెయ్యివిసిరాడు. ప్లేటుజారి నేలమీద పడింది. సున్నుండలు చెల్లాచెదురుగా నేల మీద దొర్లిపోయాయి.
`సున్నండలు, అరిసలు, బొబ్బట్లు వీటికి మాత్రం లోటులేదు. నీకోడలు అడిగింది ఏమిటే అమ్మా? ఒక చిన్న బూటీక్ ప్రారంభించుకోడానికి నీ బంగారు గాజులో, గొలుసో ఇమ్మనే కదా? ఏం నీతో పాటూ తీసుకొని పోతావా?` అన్నాడు.
`నీకు లక్షసార్లు చెప్పాను. నా వంటిమీద మిగిలినవి అవే ఇంక. అన్నీ నీకే దోచిపెడితే, తమ్ముడు ఏమయిపోవాలి? నాకు తోచినప్పుడు వాడిపిల్లలకీ, నీ పిల్లలకీ సమానంగా ఏవో వస్తువులు చేయించి పెడతాను. అంతవరకూ ఎవరు అరిచి గీపెట్టినా చిల్లిగవ్వ ఇచ్చేది లేదు,` అంది అంతే విసురుగా.
`సమానం, సమానం, సమానం...` ఒళ్ళుమండిపోతుంది. అమ్మమీద కోపంతో ఏమీ తినకుండా తిరిగి బయలుదేరిపోయాడు. వచ్చేటప్పుడు నేలపాలు కాగా మిగిలిన రెండో, మూడో ఉండలు పొట్లం కట్టి బలవంతంగా బ్యాగ్‌లో పెట్టింది. కడుపులో నకనకలాడుతుంది. బ్యాగ్ జిప్ తీసి పొట్లం బయటకి తీసాడు. రెండువుండలు ఉన్నాయి. నానమ్మ చేసిన స్వీట్లంటే కౌశిక్ పిల్లలు ఇద్దరికీ చాలా ఇష్టం. ఇంటికి వెళ్ళగానే `మాకేమిచ్చింది?` అని మీదపడతారు. రెండింటిలో ఒకటి తినేస్తే మిగిలిన ఒక్కటీ వాళ్ళకేమి పంచుతాడు సమానంగా! సమానంగా, సమానంగా....
వాటిని మళ్ళీ లోపల పెట్టేసి, మినరల్ వాటర్ బాటిల్లో మిగిలిన నాలుగు చుక్కల నీళ్ళూ గొంతులో పోసుకొని కళ్ళు మూసుకొన్నాడు. ట్రెయిన్ కదిలింది.
సెల్‌ఫోన్ తీసి డయల్ చేశాడు. సగం రాత్రి అయ్యిందేమో! అయినా పరవాలేదు. అవతలినుంచి `హలో` అని వినిపించిన వెంటనే,`అమ్మా, భోజనం చేశావా?` అన్నాడు.
* * *
అందరికీ హ్యాపీ మదర్స్ డే!
© Dantuluri Kishore Varma
ఏదైనా స్వానుభవం తోనే కదా !తెలిసేది .ఆమె అమ్మ 'మీరు నాన్న .అంతే తేడా . చాలా .బాగుంది .
ReplyDeleteధన్యవాదాలు నాగరాణిగారు. కానీ, ఇది స్వానుభవం కాదని, కేవలం కథ అని మీరు తెలుసుకోవాలి. హ్యూమన్ రిలేషన్స్‌లో ఉండే చిన్న చిన్న మిస్అండర్‌స్టాండింగ్స్ నేపధ్యంగా ఈ కథలు వ్రాయడానికి కారణం వ్యక్తిత్యలోపాలు ఉంటే సరిదిద్దుకొంటారనే!
Deleteమీరు వ్రాస్తున్న చిన్న చిన్న కథల్లో పాయింట్ బాగుంటోంది.
ReplyDeleteకొంచెం ఓపికగా సమగ్రమైన(?) కథగా వ్రాస్తే చదవడానికి బాగుంటుంది. మీకు మంచి పేరు వస్తుంది.
మీకు నా బ్లాగ్‌కి హృదయపూర్వక స్వాగతం బోనగిరి గారు. ఇప్పుడిప్పుడే కథలు వ్రాయడం అలవాటు చేసుకొంటున్నాను. మీ సూచన సరైనదే! ధన్యవాదాలు.
Deleteహ్యాపీ మదర్స్ డే!
ReplyDeleteచిన్న కథ అయినా అందులోని అమ్మ ప్రేమ గొప్పతం మాత్రం చాలా పెద్దది.
చిన్న విత్తనంలో మహావృక్షం దాక్కున్నట్టు... :)
DeleteVarma Garu, I have written a news article about your blog in a news portal,visit here: www.goutaminews.com ...and sorry ..I have used profile photo without your permission.
ReplyDeleteThanks a million indeed Murthy garu. I am privileged to have been chosen for this article. I felt elated on seeing the article. :) :)
DeleteNice..చాలా బాగుంది.
ReplyDeleteథాంక్స్ కృష్ణప్రియ గారు.
Delete