కథలు రాయాలనే ఆసక్తి నాకు చిన్నప్పటినుంచీ ఉండేది. అయితే, రచయితగా మారలేక పోవడానికి కారణం కథరాసి, పత్రికలకి పంపి, నెలకో ఆరునెలలకో ప్రచురింపబడుతుందో, త్రిప్పి పంపబడుతుందో తెలియకుండా ఎదురుచూస్తూ ఉండేటంత సహనం లేకపోవడం ఒక కారణం అయితే; వ్రాయడంలో మెళుకువలను తెలుసుకోవడానికి, సందేహాలుంటే నివృత్తి చేసుకోవడానికి వాటిగురించి తెలిసిన పెద్దవాళ్ళెవరితోను పరిచయాలు లేకపోవడం రెండవ కారణం. సంగీతం, నాట్యం, చిత్రలేఖనం లాంటివి నేర్చుకొన్నట్టు కథలు రాయడం నేర్చుకోవడానికి రైటర్స్ వర్క్‌షాప్‌లు అందరికీ అందుబాటులో ఉండవు. చాసో, సత్యం శంకరమంచి, వంశీ, పాలగుమ్మి పద్మరాజు, ముళ్ళపూడివెంకటరమణ... లాంటి రచయితల రచనలు చదివి కొంతవరకూ స్టోరీ క్రాఫ్ట్‌ని నేర్చుకొంటే; సంఘటనలని, మనుష్యులని పరిశీలించడంద్వారా మరికొంత నేర్చుకోవచ్చు అనుకొంటాను.
సుమారు ఒక సంవత్సరం క్రిందట బ్లాగ్‌లోకంలోకి వచ్చినతరువాత ఎప్పటిదో ఆసక్తి మళ్ళీ తెరమీదకి వచ్చింది. మిగిలిన విషయాలతో పాటూ అడపాదడపా ఓ పది కథలు రాశాను. నిజానికి వాటిని కథలు అనవచ్చో, లేదో కూడా సరిగ్గా తెలియదు నాకు. ఎందుకంటే, ఈ కథల్లో కొన్నింటి నిడివి చాలా తక్కువ. ఇంత చిన్న కథలని చాలా కాలం క్రితం ఈసప్ అనే ఆయన రాశాడు. తరువాత ఒకటి రెండు తెలుగు పత్రికల్లో కాలం దాటని కథలు అని వచ్చేవి. ఇంగ్లీష్ రచయిత ఓ హెన్రీ రాసిన కథల్లోలాగ చివ్వరి వాఖ్యంలో ఊహించని ముగింపు ఉంటే ఇటువంటి చిన్న కథలు రక్తి కడతాయి.
నా బ్లాగ్‌లో కథలు అనే లేబుల్‌తో ఉన్న వీటి లింకుని, `కథ` అనే ఫేస్‌బుక్ గ్రూపులో ఇచ్చి, ఆ గ్రూపుసభ్యులని విశ్లేషించమని కోరడం జరిగింది. కొంతమంది సభ్యులు తమ విలువైన సమయం కేటాయించి వీటిని చదివి అభిప్రాయాలు తెలియజేశారు. రాసే విధానం బాగుందని.. పాత్రల స్వభావాన్ని పూర్తిగా వ్యక్తీకరించడానికి కథ నిడివి పెంచాలని సూచించారు.
సందర్భం వచ్చింది కనుక, కథగురించి అవగాహన పెంచుకోవడానికి ప్రేంచంద్ సాహిత్యవ్యాసాలు, బుచ్చిబాబు సాహిత్యవ్యాసాలు, మల్లాది వెంకట కృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్‌లు రాసిన `కథలు ఎలా రాస్తారు?` అనే పుస్తకాలు, ఇంకా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కొంత చదివాను.
కథలకి వివిధ నిర్వచనాలు కనిపించాయి. వాటిల్లో ఒకటి మాత్రం చదివిన వెంటనే బాగా ఇంప్రెసివ్‌గా అనిపించింది.
కథ చెప్పడం అంటే కొంతమందిని సినిమాకి తీసుకొని వెళ్ళడం లాంటిది. దర్శకుడు తనుతీసిన సినిమాని ఎలా తెరమీద చూపిస్తాడో రచయితకూడా మనసులో ఊహించుకొన్న విషయాన్ని అలానే పాఠకుల మనసులమీదకి ప్రొజెక్ట్ చెయ్యడమే కథచెప్పడం.
నిర్వచనం బాగుంది కదా?
వాఖ్యం వాఖ్యానికీ కథని ముగింపువైపు తీసుకొనివెళుతూ, అవసరమైన చోట వర్ణనల్ని, సంభాషణల్ని ఉపయోగిస్తూ రాస్తే చిన్న కథయినా, పెద్ద కథయినా అందగిస్తుందనుకొంటాను.
వాఖ్యం వాఖ్యానికీ కథని ముగింపువైపు తీసుకొనివెళుతూ, అవసరమైన చోట వర్ణనల్ని, సంభాషణల్ని ఉపయోగిస్తూ రాస్తే చిన్న కథయినా, పెద్ద కథయినా అందగిస్తుందనుకొంటాను.
© Dantuluri Kishore Varma
interesting!
ReplyDeleteలక్మీ రాఘవ గారు ధన్యవాదాలు. మీ కామెంట్ చూసి ఆనందంగా ఉంది.
Deleteకిషొర్ వర్మ గారు మీ ప్రొత్సాహంతో నేను బ్లాగర్ గా మారి చిన్న చిన్న కవితలు ఇతర టపాలు వ్రాస్తున్నాను. నాకు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న యండమూరి రచనలు ప్రేంచంద్ హిందీ సాహిత్యం కొంతవరకు చదివాను .ఇది అనుభవం అనలెను కాని ఏదో వ్రాస్తున్నాను.నాకు వేరే దారులు తెలియవు ,మీరే నాకు మార్గదర్శనం చేయాలి .మీ ప్రోత్సాహాన్ని ఆశిస్తూ
ReplyDeleteఆచార్యులుగారు, మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీరు బ్లాగు ప్రారంభించినప్పుడు ఒకటి రెండు సాంకేతిక వివరాలు తెలియజెయ్యడం మినహా నేను చేసింది ఏమీలేదు. మీకు మార్గదర్శనం చెయ్యగలిగినంత అనుభవం నాకు లేదు. కానీ, నా టపాలలో ఏమయినా విషయాలు మీకు ఉపయోగపడితే అంతకన్నా ఆనందం ఏముంటుంది? :)
Delete