Pages

Tuesday, 7 May 2013

గ్రేప్ వైన్

హియరింగ్ త్రూ గ్రేప్ వైన్ అని ఒక నానుడి ఉంది. అంటే ఏదయినా విషయాన్ని ఆనోటా, ఈ నోటా వినడం. విన్నదాన్ని మిగిలినవాళ్ళకి చేరవెయ్యడం. సినిమారంగంలో, రాజకీయాల్లో, షేర్‌మార్కెట్లో,  రోజువారీ సంభాషణల్లో మన పరిచయస్తుల గురించి, బంధువుల గురించి గ్రేప్‌వైన్ పుకార్లు సహజం. వాఖ్యాలకి చివర `అట` తగిలించి అవీ, ఇవీ చెపితే దానికి ఎవరినీ బాధ్యులుగా చెయ్యడం సాధ్యం కాదు. పలానా హీరోయిన్‌కి ఆ అగ్రదర్శకుడితో సంబంధం ఉందట, ఈ నాయకుడు ఉన్న పార్టీని విడిచిపెట్టి ప్రత్యర్థి పార్టీలో చేరబోతున్నాడని బోగట్టా, ఎగిరే పళ్ళాలని రష్యాలో చాలా మంది చూశారట, డిసెంబరు 31 అర్థరాత్రికల్లా భూమి నాశనం అవుతుందని అందరూ అనుకొంటున్నారు, పలానా సిమ్మెంటు కంపెనీ షేర్లని ఎఫ్.ఐ.ఐలు  పెద్ద ఎత్తున కొంటున్నారట, హిమాలయాల్లో యతి అనే భీకరాకార మంచుమనిషి ఉన్నట్టు ఎవరో చెప్పారు, మన కొలీగ్ సుధీర్‌కి పింక్‌స్లిప్ ఇస్తారని విన్నాను, మేనేజర్ ఏకలింగంతొ సుజ్జీ కారులో లాంగ్ డ్రైవ్ కెళ్ళడం చూశారట.... ఇలాంటివి విన్నప్పుడు ఒకరకమైన కిక్కుతో ఊగిపోతాం. విన్నదాన్ని మరొకళ్ళతో పంచుకొంటే మరింత మజా పెరుగుతుంది. `గ్రేప్‌వైన్‌లో ఉన్న వైన్‌కి, ఈ కిక్కుకీ ఏమయినా సంబంధం ఉందా!?` అంటే లేదనే చెప్పాలి. కారణం ఏమిటంటే ఈ వైన్ ద్రాక్ష సారాకి(wine) చెందిన స్పెల్లింగ్ కాదు. ద్రాక్ష తీగకి(vine) చెందినది.

 "Heard it through the grapevine"

`అసలు గ్రేప్‌వైన్ అనే మాట ఎలా వాడుకలోకి వచ్చింది?` అని తెలుసు కోవడానికి చిన్న పరిశోధన చేస్తే తెలిసిన విషయం ఇది - అమెరికాలో అంతర్యుద్ధం(సివిల్ వార్) జరుగుతున్న రోజుల్లో సమాచార బట్వాడా ద్రాక్ష తీగల్ని పోలిన సన్నని టెలీగ్రాఫ్ వైర్ల ద్వారా జరిగేది. విషయాన్ని తొందర తొందరగా చెప్పడం, ట్రాన్స్‌మిషన్‌లో అంతరాయాలు మొదలైనవాటి వల్ల సమాచారంలో స్పష్ఠత ఉండేదికాదు. విన్నవాళ్ళు మిగిలిన వారికి చెప్పినా అది చాలా సందర్భాలలో అసలైన సమాచారానికి పొంతనలేకుండా ఉండేది. కాబట్టి ద్రాక్ష తీగల (టెలీగ్రాఫ్ వైర్లు)ద్వారా విన్నవి నమ్మదగినవి కావని అభిప్రాయం స్థిరపడిపోయింది. అందుకే వాళ్ళూ, వీళ్ళూ `అట` కలిపి చెప్పిన పుకార్లని హియరింగ్ త్రూ గ్రేప్ వైన్ అని వ్యవహరించడం మొదలైంది.

ఊరిలో ఈ మధ్యన ఒక విషయం గ్రేప్‌వైన్ ద్వారా వేగంగా వ్యాపిస్తుంది.  దొంగలముఠా ఒకటి దిగింది అని, పట్టపగలు మెడలో గొలుసులు లాగేస్తున్నారు అని, టార్జాన్‌లాంటి ఒక వ్యక్తి చెట్టుకొమ్మల మీదనుంచి స్పైడర్ మ్యాన్‌లా జంప్ చేసుకొంటూ తిరుగుతున్నాడని... ఇంకా చాలా, చాలా. కొన్ని ప్రాంతాల్లో అయితే నలభై, యాభై మంది పౌరులు చేతుల్లో కర్రలు, ఫోకస్ లైట్లు పట్టుకొని రాత్రిపూట వీధుల్లో పహారా తిరుగుతున్నారు. ఒకటి రెండు చోట్ల పోలీస్ పికెట్‌లు ఏర్పాటు చేశారు. రోజూతిరిగే ప్రాంతాల్లో కాకుండా కొత్త ప్రాంతాలకి ఎవరైనా చీకటి పడిన తరువాత పనిమీద వెళితే వీళ్ళు ఆపి ప్రశ్నించే అవకాశం ఉంది. నోటితో అడిగితే పరవాలేదు, మూకుమ్మడిగా కర్రలతో అడిగితేనే కష్ఠం!

© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!