Saturday, 8 December 2012

నేను నేనే - బ్నిం

బ్నింగారితో నా పరిచయం విచిత్రంగా జరిగింది. బహు గ్రంధకర్త అయిన ఆయన మాతామహులు  శ్రీజటావల్లభుల పురుషోత్తం గారు, స్వయంగా పద్యాలు రాసి, బ్నింగారికి పద్య చందస్సు నేర్పిన అమ్మమ్మ బాలాత్రిపురసుందరి గార్ల ఫోటోని నేను ఎడ్మిన్‌గా ఉన్న మనకాకినాడ అనే ఫేస్ బుక్ గ్రూపులో ఉంచారు. బ్నిం అనే పేరులోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇది భమిడిపల్లి నరశింహ మూర్తి అనే పేరుకి సంక్షిప్త రూపం. చిన్నప్పుడు పత్రికల్లో వచ్చే వారి  కార్టూన్లని చూసేవాడ్ని. కార్టూనిస్ట్‌గా ఆయన బాగా తెలుసు. గ్రూపులో చూసిన మూర్తిగారు ఆయనేనా, కాదా అనే సందేహనివృత్తికోసం  సరాసరి వారినే అడిగేశా `ప్రముఖ రచయితా, కార్టూనిస్టు మీరేనా?` అని.  ఆయన చిరునవ్వుతో, "అవునండీ, నేను నేనే," అన్నారు. ఆయన స్నేహశీలుడు, ప్రజ్ఞావంతుడు, నిగర్వి, హాస్యచతురుడు అన్నింటికీ మించి స్పూర్తి ప్రదాత.  సునిశితమైన పరిశీలనా శక్తి ఆయన సొంతం. ఈ విషయాలలో ఆయనకి ఆయనే సాటి. అందుకే, `నేను నేనే` అన్న మాట బ్నింగారికి ఖచ్చితంగా సరిపోతుంది. 

అచ్చమైన స్నేహితులంటే ముందుగా మనకి జ్ఞాపకం వచ్చేది బాపూ, రమణలు. రమణగారు లేని లోటుని చెప్తూ ఒకసారి బాపూగారు మెచ్చుతునకలాంటి ఒక మాట అన్నారు. "రమణ లేని నేను గోడలేని చిత్రపటంలా ఉన్నాను," అని. స్నేహబంధానికి నిర్వచనం లాంటి వాఖ్యం ఇది. అటువంటి మిత్రద్వయం అంటే బ్నింగారికి వల్లమాలిన అభిమానం, భక్తీ. "నా హృదయం బాపూ ఆలయం," అంటారు. ముళ్ళపూడి వారినుంచి చమత్కార రచనా సంవిధానం, బాపూ నుంచి రేఖా విన్యాసం పుణికి పుచ్చుకొన్న ఆయన భావ చిత్రాలు `మరపురాని మాణిక్యాలు`. వివిధ రంగాల్లో 132 తెలుగు ప్రముఖులని లలితమైన రేఖల్లో, క్లుప్తమైన రాతల్లో పరిచయం చేశారు. బహుశా తెలుగులో ఇటువంటి ప్రయోగం మొట్టమొదటిది అనుకొంటాను. ఈ పుస్తకానికి కవర్‌పేజీ గీసింది స్వయంగా బాపూగారే.   `బాపూ అంటే  బ్నింకి ఎంత భక్తో, బ్నిం అంటే బాపూకి అంత వాత్సల్యం`ట. బాపూగారికి హైదరాబాదులో ఎంతమంది మిత్రులున్నా, ఆ వూరికి వచ్చినప్పుడు కినీసం అరగంట సమయం దొరికినా బ్నింగారితో గడుపుతారట. బాపూ ఒరిజినల్ పెయింటింగ్స్ ఎన్నో  మూర్తిగారి దగ్గర ఉన్నాయి.మొన్న అక్టోబర్ 28న బ్నింగారి జన్మదినోత్సవసందర్భంగా `హాస్యానందం` వారిగురించి ప్రత్యేక సంచిక వేశారు. టీ.వీ, సినిమా, కళ, సాహిత్య రంగాలలో ప్రముఖులు ఎందరో బ్నింగారి స్వీట్ నేచర్ గురించి, దృక్పదం గురించి, ఆత్మస్థైర్యం గురించి రాసినవి చదివితే ఎవరికైనా `వాహ్, బ్నిం!` అనిపించక మానదు.

కాకినాడ జన్మస్థలం అయినా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో పెరిగారు. అనారోగ్యం వల్ల స్కూలుకి వెళ్ళలేక పోయినా, అమ్మ ఒడే బడి అయ్యింది. అదే తనకి గొప్ప అదృష్టం అంటారు. తెలుగు, సంస్కృతాల్లో గొప్పప్రవేశం ఉన్న సాక్షాత్తు సరస్వతీ సమానురాలయిన తల్లి శ్రీమతి విజయలక్ష్మి గారి సమక్షంలో కాళిదాసు రాసిన మేఘసందేశం, కుమార సంభవం లాంటి ప్రబంధాలు, ఇతిహాసాలు చదవగలిగే అదృష్టం బడిలో చదివే సాధారణ కుర్రవాడికి ఉండదుకదా!ఈయన తండ్రి భమిడిపల్లి సూర్యనారాయణ మూర్తిగారు ఆయుర్వేద వైద్యులు.

ఊరిలో డ్రాయింగ్ మాష్టారు శేషాచలం గారిదగ్గర చిత్రలేఖనం నేర్చుకొన్నారు. ఇక రాయడంలో ప్రవేశం, తన సోదరి కోసం రచించిన బుర్రకథ వల్ల జరిగిందని చెప్పారు. చేతితో రాసే ప్రత్రికని కొన్నిరోజులు నడిపారట.

తన 24వ ఏట భాగ్యనగరం వచ్చి, కొంతకాలం పత్రికలలో పనిచేసిన తరువాత, వాటినుంచి బయటకు వచ్చి  సాహిత్య వ్యవసాయం చేస్తున్నారు.   తెలుగులో 208 నృత్య రూపకాలు రాసి ప్రపంచంలో ఏఒక్క రచయితా చెయ్యని ఫీట్‌ని సాధించారు. నూటయాభై కథలు నాలుగు సంపుటాలుగా విడుదలయ్యాయి. మిసెస్ అండర్స్టాండింగ్ అనే కథల పుస్తకం ఆలూమగల మధ్య ఉండవలసిన సరైన కమ్యూనికేషన్ గురించి హస్యస్పోరకంగా చెబుతుంది. పత్రికల  కవర్ పేజీలు, శుభలేఖలు, లోగోలు డిజైన్ చేస్తారు. టీవీ సీరియళ్ళ కథలు, టైటిల్ సాంగ్‌లు రాస్తారు. సవ్యసాచిలాగ ఇవ్వన్నీ చేస్తూనే అడిగిన వారికి కాదనకుండా సహాయం చేస్తారు.

బ్నింగారి కృషికి గుర్తింపుగా ఎన్నో సాంస్కృతిక సంస్థలు అవార్డులతో సత్కరించాయి. ముఖ్యంగా నాలుగు నందులు, కళారత్న(హంస) బహుమతులు వారి ప్రతిభకి పురస్కారాలు. నిండుకుండ తొణకదు అన్నట్టు ఎవరినైనా ఆత్మీయంగా పలకరించే నిగర్వి మూర్తిగారు. కష్టాలు, నష్టాలు ఎన్ని ఎదురైనా ఆత్మవిశ్వాసం సడలకుండా ముదుకు సాగిపోయే వాడే నిజమైన స్పూర్తి ప్రధాత. అటు వంటి మనీషి శ్రీ బ్నిం.  బెంగగా ఉన్నప్పుడు బ్నింని తలచుకొంటే ధైర్యం వస్తుందని తనికెళ్ళభరణి గారు చెప్పడం, బ్నింగారి స్థైర్యానికి ఒక గొప్ప కితాబు.

భమిడిపల్లి నరశింహ మూర్తి (బ్నిం) గారి గురించి రాసేటంత సామర్ధ్యం నాకు లేకపోయినా, స్పూర్తిని రగిలించగల విజయగాధని నా సహచరులకి పంచుదామన్న స్వార్ధంతో ఈ చిన్ని పరిచయాన్ని రాశాను. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.
© Dantuluri Kishore Varma

19 comments:

 1. బావుందండి పోస్టు ! బ్నిం గారు AG ఆఫీస్ లోనో , DGP ఆఫీస్ లోనో వర్క్ చేస్తారు కదండీ ?

  ReplyDelete
 2. బ్నింగారి గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. శ్రీ బ్నిం వ్రాసిన "మిసెస్ అండర్ స్టాండింగ్" పుస్తకం బాపుగారు
  నాకు ఆయనింటికి వెళ్ళినప్పుడు కానుకగా ఇచ్చారు.!!

  ReplyDelete
 3. ధన్యవాదాలండీ అప్పారావుగారు. మిమ్మల్ని నా బ్లాగులో చూడడం చాలా ఆనందంగా ఉంది. బ్నిం గారి సక్సెస్ చాలా ఇన్స్పయరింగ్‌గా ఉంటుందండి. బాపూగారి చేతులమీదుగా బ్నింగారి పుస్తకం తీసుకోవడం - చాలా సంతోషించి ఉంటారు మీరు :)

  ReplyDelete
 4. మీరు పొరపాటుపడ్డారేమో శ్రావ్యగారు!

  ReplyDelete
  Replies
  1. కిషోర్ వర్మ గారు హ్మ్ నాదే పొరపాటండి అయితే. DGP ఆఫీస్ ,AG ఆఫీస్ వీళ్ళకి ఎదో organizations ఉంటాయండి ప్రతి సంవత్సరం నాటికలు అవీ ఇవీ వేస్తుంటారు. ఒకసారి ఎప్పుడో వీరిని అక్కడ చూసాను అని పొరపడ్డాను :-)
   Thanks you Kishore gaaru !

   Delete
  2. :) శ్రావ్యగారు చెప్పడం మరిచాను, మీకు నా బ్లాగ్‌కి స్వాగతం. మీ రవీయం బ్లాగ్ అద్బుతంగా ఉంటుంది. నేను రెగ్యులర్‌గా చదువుతూ ఉంటాను.

   Delete
 5. బాగుంది. చాలా సంతోషించా.

  ReplyDelete
 6. ధన్యవాదాలు శర్మగారు.

  ReplyDelete
 7. యాంకర్ పున్నమరాజు9 December 2012 at 00:08

  మంచి ప్రయత్నం వర్మ గారూ .. మన గోదావరి ప్రముఖుల్ని కూడా ప్రపంచానికి పరిచయం చెయ్యండి ..

  ReplyDelete
 8. నా బ్లాగుకి మీకు హృదయపూర్వక స్వాగతం పున్నమరాజుగారు. మీ ప్రశంసకు ధన్యవాదాలు. మీ సూచన తప్పక పాటిస్తాను. అందుకోసం మీవంటివారి సహకారం ఉంటే సంతోషం.

  ReplyDelete
 9. క్లుప్తంగా అయినా బ్నిం గారి పరిచయం బాగుందండీ...
  ఆయన కార్టూన్లు చూసిన గుర్తు తప్ప ఆయనగురించి ఇంకేమీ తెలీదు. ఇప్పుడు కొంత తెలిసినందుకు చాలా సంతోషం.

  ReplyDelete
 10. ధన్యవాదాలు చిన్ని ఆశ గారు.

  ReplyDelete
 11. మంచి టపా వేశారు !జన్మ దిన శుభాకాంక్షలు!బ్నిం గారి జీవితం స్ఫూర్తి దాయకం !

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సుధాకర్‌గారు.

   Delete
 12. dhanyavadalu. Manchi information

  ReplyDelete
  Replies
  1. మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

   Delete
 13. ఆదర్శవంతమైన, స్ఫూర్థిదాయకమైన మూర్తిగారి గురించి క్లుప్తంగా+వివరంగా చాలా బాగా చెప్పారు, ధన్యవాదములండీ.

  ReplyDelete
  Replies
  1. మీకు నచ్చడం సంతోషదాయకం.

   Delete
  2. బ్నిం గారి మీద వ్యాసం చాలా బాగా రాసారు. ఆయన ఎందరికొ స్పూర్థి ప్రదాత. ధన్యవాదములండీ.

   Delete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!