`ఎండ నిప్పులు చెరుగుతుంది.`
`వేసవితాపం శృతిమించిపోతుంది.`
`ఇలాంటి ఎండలు నేను ఎప్పుడూ చూడలేదు.`
`జనాలు ఎండవేడికి పిట్టాల్లా రాలిపోతున్నారు`
`అసలు వేసవనేది లేకపోతే?` ......
ఇలాంటి మాటలు నాకు ఊహ తెలిసిన దగ్గరనుంచీ ప్రతీసంవత్సరం వింటున్నాను. క్రమంగా వేసవి తాపం పెరుగుతున్న మాట వాస్తవమే కానీ, అసలు వేసవనేది లేకపోతే మనకి మధురమైన జ్ఞాపకాలే లేకుండా పోతాయి.
వేసవితో మనందరికీ లవ్‌హేట్ రిలేషన్ షిప్ ఉంటుంది. కమ్మగా పాడే కోయిలపాటలు ఇప్పుడే వినిపిస్తూ ఉంటాయి. పిల్లలకి శెలవులు, కావలసినంత సమయం, చదువనే బాధ్యతలేకుండా బలాదూరు తిరగ గలిగిన అవకాశం ఉన్న కాలం.. అమ్మమ్మ, తాతయ్య ఇంటిలో కజిన్స్‌తో కలిసి ఆటలాడుకోవడం... అన్నీ ఈ కాలలంలోనే కుదురుతాయి. పచ్చిమామిడికాయ బద్దలకి ఉప్పూకారం అద్దుకొని తిన్న సందర్భాలు జ్ఞాపకం ఉన్నాయా? చిన్నప్పుడు చెరువుల్లో, దొరువుల్లో చల్లటినీటిలో జలకాలాడినప్పటి జ్ఞాపకాలు వేసవి కాలంలోనివే. పుచ్చకాయల్లో తియ్యని నీళ్ళు, మావిడిపళ్ళ మధుర రసం, ముంజికాయల్లో మృదువైన ముంజులు, నోరూరించే హిమక్రీములు, పళ్ళరసాలు, మల్లెపువ్వులు వేసవి ఆనందాలకి కొనసాగింపు. అయితే... ఎండలు మండే కాలంలో ఉక్కబోత, చెమట, గాళుపులు, పవర్‌కట్‌లు నచ్చని విషయాలు. ఎండ వేడి లేకపోతే ఊటీ గురించో, కాశ్మీరు గురించో ఆలోచించే వాళ్ళు ఎవరయినా ఉంటారా? వడదెబ్బ, నోరు పిడచకట్టుకొనిపోవడం మరి ఏ ఇతర కాలంలోనూ మనల్ని ఇబ్బంది పెట్టవు. కానీ... అంతగా దాహార్తి ఉంటుందికనుకనే పుచ్చకాయలో, కొబ్బరిబొండాలో... పుల్లయిసులో, చెరుకురసమో ఈ కాలంలో ఉన్నంత అద్భుతంగా మరెప్పుడూ ఉండవు.
ఎవరో అన్నారు, `మనకే కాదు ఈ రోజు లంబసింగి లోనే 42 డిగ్రీలు దాటిందట,` అని. లంబసింగి గురించి అంతకుముందు ఎప్పుడో విన్నాను. ఎక్కువ వర్షంకురిసేచోటో, మంచుకురిసే ప్రదేశమో జ్ఞాపకంలేదు. ప్రతీ సందేహానికీ సమాదానం చెప్పే గూగుల్ గూటిలో రాసిపెడితే, ఒక వీడియోని నా చేతిలో పెట్టింది .మీ ఉక్కబోతని మరచిపోయి - చలిదుప్పట్లు కప్పుకొనితిరుగుతున్న గిరిపుత్రుల్ని కాసేపు చూడండి. ఇలాంటి ప్రదేశానికి చలో అంటే బాగుంటుంది కదా? ఈ ఏడాదికి నాకయితే సాధ్యం కాదులెండి. ఈ రోజు కన్న కలని మరో వసంతానికి వాయిదా వేస్తే, ఈ వేసవి వెళ్ళిన దగ్గరనుంచీ, మళ్ళీవేసవికోసం ఎదురు చూడాలి!
`వడదెబ్బ బారిన పడకండి, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంద`ని పేపర్లలో, టీవీల్లో చెపుతున్నారు. ఎండవేడికి తట్టుకోలేక చెట్ల కొమ్మలపైనుంచి నేలరాలుతున్న గబ్బిలాలూ, పక్షులు; దాహార్తితో కుళాయిల దగ్గర చేరుతున్న చిన్న చిన్న జంతువులు; కర్ఫ్యూ విధించినట్టు జనసంచారంలేక నిర్మానుష్యంగా ఉన్న రోడ్లు, ముఖ్యమైన పనులతో, తప్పనిసరి ప్రయాణాలతో మార్గమధ్యంలోనే ప్రాణాలుపోగొట్టుకొంటున్న వృద్దులు, యువకులు, పిల్లలు...ప్రతీరోజూ చూడవలసివస్తున్న వార్తలు. వెలుగు ఉన్నప్పుడు, చీకటి ఉన్నట్టు - ఇవికూడా వేసవికే ప్రత్యేకం.
ప్రతీ మేఘానికీ వెండి అంచు ఉన్నట్టు భరించలేని వేసవికి కూడా పైన చెప్పిన కొన్నిప్రత్యేకతలు ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకొని, మండేకాలాన్ని దాటేస్తే మట్టివాసనతో వర్షాకాలం వచ్చేస్తుంది.
© Dantuluri Kishore Varma