ఇంగ్లీష్ భాషతో కొంత పరిచయం ఉన్నవాళ్ళు ఓ పదిమాటలు ఆ భాషలో మాట్లాడితే అందులో మూడో, నాలుగో జాతీయాలుగా స్థిరపడిపోయిన షేక్‌స్పియర్ మాటలే ఉంటాయి. చిత్రమేమిటంటే అవి మాట్లాడిన వాడికే ఆ విషయం తెలియదు. మాయాబజారు సినిమాలో ఎస్.వీ.రంగారావుతో `ఎవరూ పుట్టించకపోతే కొత్తమాటలు ఎలా పుడతాయి,` అని చెప్పించినట్టు; ఆగ్లంలో ఉన్న మాటల్ని అటుతిప్పి ఇటుతిప్పి మొత్తమ్మీద 1700 కొత్త పదాల్ని షేక్‌స్పియరే సృష్టించాడట. ఒక భాషకి అంత సేవ చేసిన మరొక వ్యక్తి ఆ మహారచయితకి ముందూ, ఆ తరువాత ఇప్పటివరకూ కూడా ఎవరూ లేరు! బార్డ్(షేక్‌స్పియర్ని అలా పిలుస్తారు) పుట్టి నాలుగువందల యాభై సంవత్సరాలు గడిచిపోయినా ఆశ్చర్యపోతూ, అబ్బురపడుతూ, పాత్రల్లో మమేకమైపోయి దుఖ:పడుతూ, నవ్వుకొంటూ, ఊహాలోకాల్లో విహరిస్తూ... ఇప్పటికీ ఆయన రాసిన నాటకాలని చదువుకొంటున్నామంటే - కాలం ఒక మనిషి ముందు చిన్నబోయినట్టే కదూ! బార్డ్ రాసిన 37 నాటకాల్లో రెండో, మూడో తప్పించి మిగిలినవన్నీ అంతకు ముందు జనాలకి తెలిసున్న కథలే - కానీ కథనం, పాత్రల నడత(క్యారెక్టరైజేషన్), భావ వ్యక్తీకరణ, శైలి చాలా గొప్పవి. ప్రేమనో, విరహాన్నీ, కష్టాన్నో ఎంతబాగా వ్యక్తీకరిస్తాడో! ఆ వాఖ్యాలని నమిలి మింగేసి పూర్తిగా సొంతం చేసుకోవాలనిపిస్తుంది. కానీ, అది ఎరికైనా సాధ్యమా? చారిత్రక నవలలు, సుఖాంతాలు, దుఖాంతాలు, జానపదకథలు, ఫెయిరీటేల్స్... ఇన్ని రకాలుగా రచనా వైశిష్ఠ్యాన్ని ప్రదర్శించాడు కనుకే ప్రపంచం మెచ్చిన మహాకవి అయ్యాడు. ఏప్రిల్ 23 ఆయన జయంతి అని అంటారు (ఖచ్చితంగా నిర్ధారింపబడలేదు). వర్దంతి కూడా ఏప్రిల్ ఇరవైమూడే.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment