`ది హిందూ పేపర్ వాళ్ళు ప్రతీరోజూ అర్థశతాబ్ధం క్రితం నాటి వాళ్ళ పేపర్లనుంచి ఫ్రం ద ఆర్కైవ్స్ అనే శీర్షికతో విశేషాలని ఇస్తూ ఉంటారు. దానిలో ఈ రోజు ఒక నమ్మలేని నిజం లాంటి విషయం చదివాను,` చమన్ అన్నాడు.
`ఏమిటని అడక్కపోయినా చెపుతావు కదా? చెప్పేయి,` అన్నాడు దీపక్.
ఇంటి డాబామీద కూర్చొని ఉన్నారు ఇద్దరూ. కరెంటు లేదేమో అంతా కటిక చీకటిగా ఉంది. ఆకాశంలో చందమామ కాదుకదా, కనీసం నక్షత్రాలు కూడా కనిపించడంలేదు.
చమన్ మొదలు పెట్టాడు, `గుజరాత్‌లో ఒక చిన్న పల్లెటూరు. దానికి దగ్గరలో అడవి ఉంది. ఒక పశువుల కాపరి మేతకోసం ఆవుల్ని అక్కడికి తీసుకొని వెళ్ళాడట. పులి వచ్చింది. దానినుంచి పశువుల్నీ, తననీ కూడా రక్షించుకోవాలి. చేతిలో ఉన్న కర్రతో పులిని అదిలించడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఆవులు దూరంగా పరిగెత్తాయి. పులి కొంచెం బెదిరింది కానీ, ఆ చిన్న కర్ర తనని ఏమీ చెయ్యలేదని తెలిసిన తరువాత దాడి మొదలు పెట్టింది.`
`వెర్రివాడిలా ఉన్నాడు. తనసంగతి చూసుకొని ఏ చెట్టో ఎక్కేసి ఉంటే, పులి ఓ ఆవుని చంపి ఉండేది. తాను బ్రతికి పోయేవాడు,` దీపక్ అన్నాడు.
`అలాచేస్తే నమ్మకానికి ద్రోహం చేసినట్టే!`
`ఏడిశావులే... నమ్మకమట, నమ్మకం! మన రాజకీయ నాయకుల్ని చూడు ఒక పార్టీ మానిఫెస్టోతో ఓట్లు అడుక్కొని, గెలిచి, తరువాత పార్టీ పిరాయించడంలేదూ? అది నమ్మక ద్రోహంకాదా? ప్రాణం కంటే గొప్పదా నమ్మకం? పాపం తమ యజమాని పులికి బలయిపోతున్నాడని ఆవులేమన్న ఫీలయిపోయి కన్నీళ్ళు కారుస్తాయా? `
`నిజంగా అలాగే జరిగిందిరా దీపక్! కన్నీళ్ళు పెట్టుకోలేదు కానీ, దూరంగా పారిపోయినవి అన్నీ ఒకజట్టుగా కలిసివచ్చి పులిమీద ఎదురుదాడి చేసి, దానిని చంపేశాయి. తమ కాపరిని కాపాడుకొన్నాయి.`
`భలేగా ఉందిరా చమన్ నీ కథలాంటి నిజం. ఈ మధ్య ఏ విషయం విన్నా దానిమీద రాజకీయాలు ఓవర్‌లేప్ అయిపోతున్నాయి. ఆవులు ప్రజలు, పులి ప్రజాస్వామ్యాన్ని కబళించడానికి వచ్చే స్వార్థరాజకీయం, పశువులకాపరి ప్రజాస్వామ్యం అన్నమాట. ప్రజలసహకారం లేకపోతే ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకడుతుందా? ఓటుతో అరా(జ)చకీయుల్ని మట్టి కరిపించవచ్చు కదా?`
చప్పున కరెంట్ వచ్చింది. దానితో పాటు వెలుగూనూ. పద క్రిందకి పోదాం అనుకొని ఇద్దరూ మెట్లవైపు నడిచారు.

© Dantuluri Kishore Varma
chaala baagundi varma gaaruu
ReplyDeleteThank you Kiran garu.
Delete