Wednesday, 10 October 2012

నా గుండె నమిలి మింగిన పిల్ల

ఫ్రెండ్స్, సినిమాలు, పార్టీలు, ఫేస్ బుక్కు…. జీవితం, వేసవికాలం సాయంత్రం మెల్లగా ప్రవహించే నదిలాగ సాగిపోతూఉంటుంది. అంతా అలా సవ్యంగా జరిగిపోతే దానిని జీవితం అని ఎందుకు అంటారు? ఏదో ఒక రోజు అకస్మాత్తుగా ఓపిల్ల ఓలా నవ్వేసరికి- వెన్నెల రాత్రి తిరునాళ్ళలో రంగులరాట్నం ఎక్కి, అది వేగంగా క్రిందకి దిగుతున్నప్పుడు గుండె అడుగున ఏర్పడే ఖాళీలా హార్ట్ బీట్లు రెండో, మూడో తప్పిపోయి,మిస్సయిపోయిన బీట్లని తిరిగి భర్తీ చేసుకోవడానికి హృదయస్పందన రెట్టింపయితే; పండుగాడు చెప్పినట్టు `దిమ్మతిరిగి, మైండ్ బ్లాంక్ అయిపోతుంది`. అక్కడినుంచి ప్రశాంతత అనేది మనసుకి విడాకులు ఇచ్చేసి ఎక్కడికో ఎగిరిపోతుంది.

`Love is the master key that opens every ward of the heart`  అన్నట్టు ఆ పిల్ల ఫోటో గుండెల్లో పచ్చబొట్టు అయిపోతుంది.  సెమిస్టర్స్, ఎగ్జాంస్, మార్క్స్, ప్లేస్మెంట్స్, గోల్, లాంటి వొకాబ్యులరీని వెన్నెల, విరహం, ప్రేమ, యండమూరి వీరేంద్రనాథ్ లాంటి పదాలు రీప్లేస్ చెసేస్తాయి.

వెన్నల రాత్రి మిద్దెమీద వెల్లకిలా పడుకొని, ఆకాశంలో ఎడంగాఉన్న నక్షత్రాలని శూన్యంలో గీతలు గీసి కలుపుతూ, ఆమె గురించి ఆలోచిస్తుంటే – “ఎందుకురా ఆమె అంటే అంత లౌస్,” అంటాడు ఒక క్లోజ్ బడ్డీ.  ప్రేమించడానికి కారణం ఏముంటుంది?
దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి అయితే-
“సౌరభములేల చిమ్ము పుష్పప్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబుపారు? గాడ్పేల విసరు?
ఏల నాహృదయంబు ప్రేమించు తనను”
నండూరి సుబ్బారావు అయితే -
“మెళ్ళో పూసలపేరు
తల్లో పువ్వులు సేరు
కళ్ళెత్తితే సాలు
కనకాబిసేకాలు

సెక్కిట సిన్నిమచ్చ
సెపితే సాలదు లచ్చ
ఒక్క నవ్వే సాలు
వొజ్జిర వయిడూరాలు

పదము పాడిందంటె
పాపాలు పోవాల
కతలు సెప్పిందంటె
కలకాల ముండాల

రాసోరింటికైన
రంగుతెచ్చే పిల్ల
నాసొమ్ము నా గుండె
నమిలి మింగిన పిల్ల”

అని-  ప్రేమ బాధలన్నీ ఏకరువు పెట్టుకొనేవాడే.

తొండ ముదిరి ఊసరవిల్లి అయినట్టు, ప్రేమ ముదిరి పాకాన పడుతుంది. ఊహల్లో, వాస్తవంలో; ఉషస్సులో, సంధ్యలో; శశికాంతిలో, నిశిరాత్రిలో ఆమె ద్యాసే శ్వాశవుతుంది. ఆమె వేలికొసలను తాకుతూ అందుకొనే ఏదైనా అమృతమే. ప్రాణంలేని వస్తువులు కూడా సెంటిమెంట్లు ఆపాదించుకొంటాయి – చాకొలేట్ రేపర్లు,ఆమె నోట్ బుక్కులలో కాగితాలు… అతనికి అమూల్యమైన సంపద అవుతాయి. గాలికి కదులుతున్న చెవి జుంకీ గుండెగదిలో గంట కొడుతుంది.

ప్రేమంటే అనుభవిస్తున్న ఈ అద్భుతమైన భావం  చిన్ని గుండెలో ఇమడటంలేదే అన్న తపన. ఫ్రెండ్స్ దృష్టిలో వీడిది పైత్యం, వాడికి మాత్రం ప్రాణశంకటం. “చెప్పెయ్యవచ్చు కదా!” అంటాడు ఒక స్నేహితుడు. అందుకోలేని లోతుల్లో ఆమె మనసు, మొహమాటపు సుదూర తీరాల్లో అతడు. అతని భావం ఆమెకి చేరాలంటే కొన్ని యుగాలు పడుతుందేమో! తీరా చెప్పాక కాదంటే…అమ్మో!

సెమిస్టర్ ఎగ్జాంస్ పూర్తిఅవుతాయి. ఆలోచనలు ఆమెకి అంకితమైతే, ఖాళీ ఆన్సర్ స్క్రిప్స్ ఎగ్జామినర్కి నైవేద్యమౌతాయి.ఎగ్జాం పోతేనేమి, ప్రేమగెలిస్తేచాలు.

Holidays -

“ఏ దూర తీరాల్లో నీవుంటావో నేస్తం! కానీ ఏదో ఒక రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్లు నీ కనిపిస్తే… ఈ దూర దేశపు పాత స్నేహితుదు నిన్ను తలుస్తున్నాడనడానికి సంకేతంగా దానిని భావించు చాలు,” అంటాడు యండమూరి. అలా చెప్పుకొంటే ప్రతీరోజూ చంద్రుడు ప్రకాశవంతంగానే ఉండాలికదా! అయినా పిచ్చికానీ, రాత్రిపూట అకాశంవంక చూసి పరవశించే భావుకత్వం ఆమెకి ఉంటుందా!

సముద్రం మీద నురుగుకీ, పౌర్ణమి నాటి వెన్నెలకి ఎలా శాశ్వతత్వాన్ని ఆపాదించగలం? అటువంటిదే ప్రేమ కూడా. చివరిరోజు ఆటోగ్రాఫ్ బుక్ మీద అతనికొక స్నేహసందేశం రాసి, కవితాఝరిలా సాగిపోతుంది, విరహం కీచురాళ్ళ శబ్ధంలా మిగులుతుంది.ఆల్ఫ్స్ పర్వతాలలో ఘనీభవించిన మంచు కరిగి నైల్ నదిలా మారినట్టు, గుండెగదిలో జ్ఞాపకాలు గట్టు తెగి, నీటిచుక్కై కంటిచివరమెరుస్తాయి.

షేర్ మార్కెట్ లో సర్వం కోల్పోయినట్లు, నాశనమైన కెరీర్ని, ముక్కలైన మనసుని తిరిగి అతికించుకోవడానికి ఎంతకాలం పడుతుందో?

వాడి సంగతి అలాఉంచండి - మీ ప్రేమ ఎంతవరకూ వచ్చింది?
© Dantuluri Kishore Varma 

27 comments:

 1. రసజ్ఞగారు, కష్టేఫలే శర్మగారు మీ చిరునవ్వుల ప్రశంశలకి నా దరహాసాల ధన్యవాదాలు :)

  ReplyDelete
 2. :) :) పిల్లమాటెలావున్నా...ఎంకిని గుర్తుచేశారు థాంక్స్ !

  ReplyDelete
 3. పరిమళంగారు నా బ్లాగుకి స్వాగతం. ఎంకిలాటి పిల్ల లేదోయి... అన్నారుకదండీ నండూరి సుబ్బారావుగారు. అందుకే అలా గుర్తు చేసానన్నమాట.

  ReplyDelete
 4. చాలా బాగుందండి. భాష మీద మంచి పట్టుంది మీకు.

  ReplyDelete
 5. చాలా విలువైన సర్టిఫికెట్ ఇచ్చారండీ శిశిరగారు. ఐ యాం రియల్లీ ఫ్లాటర్డ్!

  ReplyDelete
 6. చాలా బాగుంది చిన్నన్న...తెలుగు భాష పరిజ్ఞానాన్నిపెంచు కోవడానికి చాలా ఉపయోగపడుతుంది.

  ReplyDelete
 7. నా బ్లాగ్‌కి నీకు స్వాగతం స్వాతీ! నీకు ఈ పోస్ట్ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

  ReplyDelete
 8. thanks kishor garu love gurinchi chala baga cheparu kani meku nadoka prasna amaelu love nu enduku antha thawaraga marchipotharu

  ReplyDelete
 9. థాంక్స్ పవన్‌గారు. కేవలం అమ్మాయిలే త్వరగా మరచిపోవడం అని కాదనుకొంటాను.అటూ, ఇటూ కూడా అలా జరిగే సంభావ్యత ఉంటుందని నా అభిప్రాయం.

  ReplyDelete
 10. హెంత దారుణం. మొదటి రెండు పేరాల వరకూ ఓకే. తర్వాత యండమూరిని తెచ్చారు. ఓహో అనుకున్నా. ఆ తర్వాత కృష్ణశాస్త్రినీ నండూరినీ తీసుకొచ్చారు. అదిరింది. కానీ ఆ భావకవులిద్దరి మధ్యనా.. బొడ్డూడని త్రిషని కురిపిస్తారా! ఇది నిఝంగా చాలా ఘోరం, నేరం. కాపోతే మా రాజమండ్రీ గోదారి దాటాక కాకినాడ సముద్రానికి దగ్గరి వారని ఊరుకుంటున్నా. :)

  ReplyDelete
 11. త్రిష మిమ్మల్ని బాగా డిస్టర్బ్‌చేసినట్టుంది ఫణిగారు :) పోనీలెండి, ఆఫోటో పెట్టినందుకు, కాకినాడవాడినని క్షమించేశారు కనుక గండం గట్టెక్కింది. మీ కామెంట్‌ద్వారా మీబ్లాగ్ చూశాను. ఇంతకాలం ఎలా మిస్సయ్యానా అని ఆశ్చర్యంగా ఉంది. మీకు నా బ్లాగ్‌కి స్వాగతం. కామెంటినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 12. నా బ్లాగ్‌కి స్వాగతం కిషోర్ తేజ్ గారు. మీ కామెంట్‌కి ధన్యవాదాలు. ఇకముందుకూడా మీ స్పందన తెలియజేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 13. "షేర్ మార్కెట్ లో సర్వం కోల్పోయినట్లు," hit us hard :-)

  Rest.. Very good.

  ReplyDelete
  Replies
  1. అయ్యో, ఏదో మాటవరసకి అలా రాశానుకానీ, మీకు తగులుతుందని అనుకోలేదు :) ధన్యవాదాలు.

   Delete
 14. sweet - the only thing I protest is inclusion of Thrisha picture :)

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు నారాయణస్వామి గారు. త్రిషవల్ల పోస్టుకి గ్లామర్ వస్తుందనుకొన్నాను, కానీ ఇలా అవుతుందనుకోలేదు. :)

   Delete
 15. wahva wahva!!! salam me basha ki!! gulam me bhavukatha ki.

  ReplyDelete
  Replies
  1. హృదయపూర్వక ధన్యవాదాలు :)

   Delete
 16. సముద్రం మీద నురుగుకి పౌర్ణమినాటి వెన్నెలకి ఎలా శాశ్వతత్వాన్ని అపాదించగలను . అటువంటిదే ప్రేమ కూడా !..chaalaa Baavundi . :)

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు వనజ తాతినేని గారు. :)

   Delete
 17. మీరు ప్రస్తావించిన ఎంకి నాయుడు బావ పాటను ట్యూన్ కట్టి రేడియోలో పాడాను . చాలా అందంగా వర్ణించారు

  ReplyDelete
  Replies
  1. పాటలు పాడగలగడం నిజంగా అదృష్టం - అందులోనూ ఎంకి పాటలు. మీకు అభినందనలు. మీ ప్రశంసకు ధన్యవాదాలు రవిశేఖర్‌గారు. :)

   Delete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!