Pages

Thursday, 25 October 2012

కోరుకొండ

విష్ణుద్వేషి ఐన హిరణ్యకశిపుడు నరుడిచేతకానీ, మృగంచేతకానీ; రాత్రికానీ, పగలుకానీ; నేలపైనకానీ, ఆకాశంలోకానీ; ఏ ఆయుదం చేతకానీ సంహరించబడకుండా ఉండాలని వరం పొందుతాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమ భక్తుడు. అతడిని తండ్రినుంచి రక్షించడానికి రాత్రీపగలూకాని సాయం సంధ్యవేళలో, సగంమృగంగా, సగంమనిషిగా అవతరించి, గడపమీద కూర్చొని, హిరణ్యకశిపుడిని తనవొడిలో పెట్టుకొని, పదునైన గోళ్ళతో సంహరించిన ఉగ్రనరసింహుడికి అడుగడుగునా గుడులున్నాయి. వాటిలో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలా ప్రాచీనమైనది. కోరుకొండ కాకినాడనుంచి 60 కిలోమీటర్లు, రాజమండ్రీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండమీద వెలసిన లక్ష్మీనరసింహ స్వామి శాంతమూర్తి.  సముద్రమట్టానికి 120 మీటర్ల ఎత్తులో దేవాలయం ఉంది. సుమారు 700 మెట్ల మీదుగా పైకి వెళ్ళాలి.

కోరుకొండ క్షేత్రంలో రెండు ఆలయాలు ఉన్నాయి. కొండ దిగువన ఒకటి, పైన ఒకటి. పైన స్వయంభూగా వెలసిన మూర్తి. ఈ  విగ్రహం కేవలం ఒకటిన్నర అంగుళాలు మాత్రమే ఉంటుంది. క్రీస్తుశకం 12వ శతాబ్ధంలో రెడ్డిరాజులు ఈ దేవాలయం నిర్మించారు. విశిష్ఠాద్వైతాన్ని ప్రభోధించిన రామానుజుని ప్రధాన శిష్యుడు, తమిళనాడులోని అతి ప్రాచీనమైన  శ్రీరంగపట్టణం దేవాలయంలో అప్పటి వైష్ణవ ప్రధాన అర్చకుడిగా ఉన్న  పరాశర్ భట్నాగర్ని  ప్రత్యేకంగా కోరుకొండ తీసుకొనివచ్చి ప్రతిష్ఠ చేయించారు.



మెట్లు ఎక్కుతున్నప్పుడు చుట్టూ ప్రకృతి సోయగం, క్రింద ఊరిలో నుంచి అగ్గిపెట్టెల్లా కనిపించే ఇళ్ళు, చల్లటి మలయ మారుతం, ఎగిరివచ్చే రంగురంగుల సీతాకోక చిలుకలు, చెంగు చెంగున చెట్లు ఎక్కే ఉడుతలు... వి కెన్ హేవ్ ప్లెజంట్ ఎక్స్‌పీరియన్స్. 

కొండ మీద చిన్నగుడి - నాలుగు వైపులా రాతి గోడలపైన అద్భుతంగా చెక్కబడిన శిల్పాలు చుట్టు ఉన్న ప్రకృతితో పోటీ పడుతున్నట్లు ఉంటాయి. ఎన్నో పురాణ ఘట్టాలు రాళ్ళ మీద ప్రాణం పోసినట్లు మలిచారు.

నర్తకి
కర్నాటకాలో చెన్నకేశవస్వామి ఆలయాన్ని చెక్కిన శిల్పి జక్కన్న గురించి కథలలో విన్నాం, పుస్తకాలలో చదివాం, జక్కన్న లాంటి ఎంతో మంది శిల్పులు భారతదేశంలో ఆసేతుహిమాచలమూ దేవాలయాలలో తమకళా నైపుణ్యాన్ని ఉపయోగించి బండరాళ్ళని సుందరమైన ఆకృతులుగా మలచారు. అందమైన లతలని, దేవతామూర్తుల ఆకారాలని, జంతువులని, పక్షులని, పురాణగాధల్ని, కళల్ని, శృంగారాన్ని... లలిత లలితంగా చెక్కి ప్రాణప్రతిష్ఠ  చేశారు.   అయితే వారెవరికీ గుర్తింపులేదు. శిల్పుల చేతిలో సజీవాకృతి పొందిన అందాలను చూసి, నిబిడాశ్చర్యంతో `ఇవన్ని చెక్కినది ఎవరో!` అనుకొంటాం.

అందమైన చిత్రాన్ని చూసినప్పుడో, శ్రావ్యమైన సంగీతాన్ని విన్నప్పుడో ఆనందం కలగడం సహజం. ఇది సహజ ప్రవృత్తి. అలాకాకుండా చిత్రాన్ని ఎలా గీశారు, రంగులేమిటి; ఈ పాట ఏ రాగంలో ఉంది, సాహిత్యం ఏమిటి, ఉపయోగించిన వాయిద్యాలు ఏమిటి...? లాంటి పరిశీలనతో  ఆనందం మరింత పెరుగుతుంది. దీనిని విమర్శనాత్మక ఆనందం అని పిలవచ్చుననుకొంటాను - ఇది హృదయంతోనూ, మెదడుతోనూ కూడా ఆనందించడం. చిత్రాలని చూడటానికి ఆర్టుగేలరీలకి, ఎగ్జిబిషన్లకి వెళ్ళడం; సంగీతాన్ని ఆస్వాదించడానికి కచేరీలకు వేళ్ళడం ఎలాగో శిల్పాలని చూడాలంటే మ్యూజియంలకో, దేవాలయాలకో వెళ్ళాలి. మన చుట్టుపట్ల ఉన్న పురాతనమైన రాతితో నిర్మించిన దేవాలయాలను సందర్శించినప్పుడు కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కారం చేసుకొన్నా, కళ్ళుతెరుచుకొని శిల్పసంపదని చూడాలి.
రామాయణగాధ
మరొక వైపు కొండదిగువన ఆకుపచ్చ తివాచీ పరచినట్టున్న పంట పొలాలు. తామరపువ్వులతో నిండిన ఒక సుందరమైన తటాకం. దాని మెడ చుట్టూ నెక్లెస్ పెట్టినట్టు ఒంపుతిరిగిన తారురోడ్డు. రాత్రంతా అడవిలో తిరిగి అలసిపోయిన ఏనుగుల గుంపు ఉదయపు పొగ మంచులో   విశ్రాంతి తీసు కొంటున్నట్టు అక్కడక్కడా కొండలు - ఏడువందల మెట్లు ఎక్కి వచ్చిన శ్రమకి తగిన ప్రతిఫలం దక్కినట్టే.


ఇక్కడ ఉగాది, శ్రీకృష్ణ జన్మాష్ఠమి, దసరా పండుగలు ఘనంగా చేస్తారు. అలాగే బ్రహ్మోత్సవాలూ, కళ్యాణోత్సవాలు చేస్తారు. కళ్యాణోత్సవ సందర్భంగా రథయాత్ర జరుగుతుంది. 

కొండపైన దేవాలయం ఉదయం తొమ్మిది గంటలకి కానీ తెరవరు. మళ్ళీ సాయంత్రం 4 లేదా 5 గంటలకి తెరుస్తారు. రెండుపూటలా కేవలం ఒక అరగంటో, గంటో తెరిచి ఉంచుతారు. పైకి వెళ్ళేముందు. సమయాలు తెలుసుకొని వెళ్ళడం మంచిది. మోకాళ్ళు నెప్పులు, బీ.పీ. లాంటివి ఉన్న పెద్ద వాళ్ళు మెట్లు ఎక్కడం కొంచెం కష్టం కావచ్చు. ఎందుకంటే మెట్ల వెడల్పు తక్కువగా ఉంటుంది; ఒక్కొక్క చోట చాలా నిట్టనిలువుగా ఉంటాయి. కొండమీద కోతులు కూడా ఎక్కువే. మీ చేతిలో ఏవయినా అరటి పళ్ళు, కొబ్బరిచిప్పలు ఉంటే అవి లాక్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఒకరో, ఇద్దరోగా కాకుండా ఇంకెవరయినా భక్తులు కూడా ఉంటే కలసి వెళ్ళడం శ్రేయస్కరం. మన చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వారాంతంలో సరదాగా జాలీ ట్రీప్ వెళ్ళవచ్చు. హేపీ విజిటింగ్!


© Dantuluri Kishore Varma

11 comments:

  1. రాత్రంతా అడవిలో తిరిగి అలసిపోయిన ఏనుగుల గుంపు ఉదయపు పొగ మంచులో విశ్రాంతి తీసు కొంటున్నట్టు అక్కడక్కడా కొండలు...ఏమి ఉపమానం ..చాలా బాగుంది...
    మంచి ప్లేస్ చెప్పారు ఈసారి వెళ్ళాలి ఆంధ్ర వచ్చినపుడు...
    @శ్రీ

    ReplyDelete
  2. @ జగదీష్ వర్మా, నా బ్లాగ్‌కి స్వాగతం. థాంక్స్ ఫర్ ద కామెంట్.

    @ శ్రీగారూ ధన్యవాదాలు.

    ReplyDelete
  3. mrng 9 ki temple open chesi a time varaku vuntundi?

    ReplyDelete
  4. టెంపుల్ టైమింగ్స్ పూర్తిగా తెలియకే ఇక్కడ ఇవ్వలేకపోయాను శివ.

    ReplyDelete
  5. వర్మగారు మీ కోరుకొండపోస్ట్ చదివాను.కొండపైకి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే వానరాల గురించి చాలా జాగ్రత్తగా వుండాలి.నా దగ్గర కొన్ని ఫొటోలు వున్నాయి, మీరు అనుమతిస్తే వాటిని మీ పోస్ట్ కి ఏడ్ చేస్తాను. ఎలా ఏడ్ చేయాలొ తెలుపగలరు.

    ReplyDelete
  6. మరొకరి బ్లాగ్‌లో ఫోటోలు అప్లోడ్ చెయ్యడం సాధ్యంకాదు ఆచార్యులుగారు.

    ReplyDelete
  7. Suresh Kumar Vemuri9 August 2013 at 03:17

    Nice Information Sir... Small Changes.... Suggested as i am citizen of this village since 1992 till now.... Temple at top of the hill....Opening time after 10AM only, closed before 12AM. No Darsanam at evenings. Only in Theertham (Phalguna masam), it will be opened for maximum time evenings also. Steps around600 not 700. One more speciality is There is "Very small temple" inside the temple at the top of the hill where the Lord Lakshmi Narasimha is present.

    ReplyDelete
    Replies
    1. టెంపుల్ టైమింగ్స్ అన్నీ అక్కడి అర్చకులని అడిగి రాసినవే. స్థానికులుగా మీరు చెబుతున్నారు కనుక సాయంత్రం తెరవక పోవచ్చు అని అనిపిస్తుంది. << పైకి వెళ్ళేముందు. సమయాలు తెలుసుకొని వెళ్ళడం మంచిది.>> అని పైన కాషన్ చేశాను. ఒకటిన్నర అంగుళాల నరసిమ్హ మూర్తిని గురించి రెండవ పేరాగ్రాఫ్‌లో రాశాను చూడండి. ఇకపోతే మెట్లు 600 దాటి ఏడువందల లోపులో ఉన్నకారణంగా సుమారు 700 అని చెప్పాను. మీ కామెంటుకి ధన్యవాదాలు సురేష్ గారు! రెగ్యులర్ అప్డేట్స్ కోసం సైట్‌లో జాయిన్ అవ్వండి.

      Delete
  8. Mottaniki swami gurinchi chepparu maku ippatvaraku telidu

    ReplyDelete
    Replies
    1. త్రినాథశర్మగారు మొత్తానికి మీకు నచ్చింది కదా? ధన్యవాదాలు..

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!