కాకినాడకి 50 కిలోమీటర్లదూరంలో 5వ నెంబరు జాతీయరహదారి ప్రక్కన, పంపానదికి చేర్చి ఉన్న తూర్పుకనుమలలోని రత్నగిరి అనబడే కొండమీద వెలసిన శ్రీ సత్యనారాయణస్వామి భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతి పొందిన దేవుళ్ళలో ఒకరు. ఈయననే అన్నవరం సత్యనారాయణ స్వామి అంటారు. అన్నవరం కొండని రత్నగిరి అని పిలుస్తారు. దీని గురించి కథ ఆసక్తికరంగా ఉంటుంది. పర్వతరాజు మేరువు అనే ఆయనకి ఇద్దరు కుమారులు ఉంటారు. వారిలో పెద్దవాడు బద్రగిరి. బద్రాచలంలో రామాలయం ఈ బద్రగిరిమీదే ఉంది. రెండవవాడు రత్నగిరి. ఆ గిరే అన్నవరం కొండ. బద్రగిరిమీద రాముడు వెలియడం చూసి తనకికూడా అటువంటి అదృష్టం కావాలని పరితపించి, విష్ణువును గూర్చి తపస్సు చేసి, ఆయనని ప్రసన్నం చేసుకొంటాడు. అలా ఈ కొండమీద వెలసిన స్వామే శ్రీ సత్యనారాయణ స్వామి.
1891లో గోరస, కిర్లంపూడి ఎస్టేటుకి జమీందారుగా ఉన్న శ్రీరాజా ఇనుగంటి వెంకట రామ నారాయణింగారు ఈ దేవాలయాన్ని నిర్మించారని తెలుస్తుంది. ద్రావిడ నిర్మాణ శైలిలో కట్టిన ఈ ఆలయం రధాన్ని పోలి ఉంటుంది. రెండు గాలిగోపురాలు, చూట్టూ ప్రాకారం మధ్యలో ప్రధాన ఆలయం ఉన్నాయి. అనంతలక్ష్మీ సమేతుడయిన సత్యనారాయణ స్వామి ఒకవైపున, శివుడు ఒకవైపునా ఉన్న మూలవిరాట్టు శోభాయమానంగా ఉంటుంది. రెండు అంతస్థులుగా ఉన్న ఈ దేవాలయంలో పై అంతస్తులో మూలవిరాట్టు, క్రింది అంతస్థులో కాశీ నుంచి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించిన మహా నారాయణ యంత్రం ఉన్నాయి.
దేవాలయానికి ముందు వ్రతమండపం ఉంది. శ్రీ సత్యన్నారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల సకల కోరికలూ శిద్ధిస్తాయని చెబుతారు. ప్రతీరోజూ రాష్ట్రం నలుమూలలనుంచి, ఇతరరాష్ట్రాలనుంచీ కూడా ఎందరో దంపతులు ఇక్కడికి వచ్చి వ్రతం చేయించుకొంటారు. వివాహం అయిన వెంటనే వధూవరులు ఈ వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
అన్నవరానికి సంభందించిన ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడి ప్రసాదం. అన్నవరం ప్రసాదం అత్యంత రుచికరంగా ఉంటుంది. స్వచ్చమైన నెయ్యి, ఎర్ర గోదుమలతో తయారుచేసే ప్రసాదాన్ని ఒక్కసారి తిన్నవాళ్ళు ఎప్పటికీ ఆరుచిని మరచిపోలేరు. అన్నవరంలో మూడుచోట్ల ప్రసాదం కౌంటర్లు ఉన్నాయి కొండమీద రామాలయం దగ్గర, కొండదిగువన మెట్లదగ్గర, హైవేమీద మోడల్ దేవాలయం దగ్గర.
కళ్యాణ మండపాలు ఉన్నాయి. పెళ్ళి ముహూర్తాలు ఉన్న మంచిరోజుల్లో ఎన్నో వివాహాలు రికార్డు స్థాయిలో ఇక్కడ జరుగుతాయి. క్షేత్రపాలకుడైన రాముడిగుడి, వనదుర్గ, కనకదుర్గ ఆలయాలు ఉన్నాయి. గోకులం అనబడే గోసంరక్షణశాల ఉంది. ప్రధాన ఆలయానికి ఉత్తరంవైపున ఫలబా యంత్రం (సన్ డయల్) ఉంది. 1943లో రాజమండ్రీ వాస్తవ్యులు శ్రీ పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు సన్‌డయల్‌ని డిజైన్ చేసి కట్టారు. దీని సహాయంతో సూర్యుడి నీడను బట్టి సమయాన్ని చెప్పవచ్చు.
అన్నవరం రైల్వే స్టేషన్ విజయవాడ, విశాఖపట్టణం రైల్వే లైన్‌లో ఉంది. రాజమండ్రీ, కాకినాడలనుంచి సుమారు ప్రతీ పదిహేను నిమిషాలకీ ఒక్కొకటి చొప్పున్న అన్నవరం బస్సులు ఉంటాయి. కొండమీదకి మెట్లదారి, వాహనాలు వెళ్ళడానికి, క్రిందకిదిగడానికి రెండు వేరు వేరు రహదారులు ఉన్నాయి. భక్తులను కొoడపైకి తీసుకొనివెళ్ళడానికి బస్సులు ఉన్నాయి. పైకి వెళుతున్నప్పుడు కొండదిగువున జలకళతో పంపానదీ, దానిపైన నిర్మించిన రిజర్వాయర్, పచ్చటిప్రకృతీ ఆహ్లాదకరంగా ఉంటాయి.
కొండపైన వసతికి దేవస్థానం సత్రాలు, గెస్ట్‌హౌస్‌లు; భోజనానికి కేంటీన్లు ఉన్నాయి. దేవస్థానం యొక్క నిత్యాన్నదానం కూడా ఉంది.
అన్నవెంటనే వరాలిచ్చే స్వామి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి.
© Dantuluri Kishore Varma
nice description
ReplyDeleteThanks a lot Mr Ram.
ReplyDeleteఅన్నవరం విశిష్టత వివరించినందుకు ధన్యవాదములు
ReplyDeleteThank you for your comment Vijay Kumar garu.
Delete