తెరిచిన కిటికీలోనుంచి చల్లగాలి వీస్తుంది. గొల్ల గోపిక ఇంటిలో దొంగిలించిన కృష్ణయ్య చేతిలో వెన్నముద్దలా చందమామ మెరుస్తుంది. నల్లనయ్య చీకటిలో కలసిపోగా, వేసుకొన్న ఆభరణాల మీద పొదిగిన వజ్రాల్లా అక్కడక్కడా చుక్కలు మెరుస్తున్నాయి . స్టీరియోలోంచి రఫీ గొంతు మంద్రంగా వినిపిస్తుంది-
"బహారో ఫూల్ బర్సావో
మేరీ మెహబూబ్ ఆయాహై..."
ప్రియురాలిని అహ్వానించడానికి వసంతాన్ని పువ్వులు పరచమని కోరడం - హౌ పోయెటిక్!
బైట మైదానంలో వెన్నెల పరచుకొని ఉంది. కిటికీకి అవతల గాలికి ఊగుతున్న కొబ్బరి ఆకులు గదిలో గోడమీద వెలుగు నీడల్ని సృష్టిస్తున్నాయి. వాటిని చూస్తూ రవి అనుకొన్నాడు, "వెన్నెల రాత్రి ఆరుబైట ప్రియురాలితో కలసి ఉన్నప్పుడు, ఆమె పొడవైన నల్లని కురులు అతని ముఖం మీద పడితే వాటి మధ్యనుంచి అతనికి కనిపించే చంద్రకాంతి అలాగే ఉంటుందేమో!` అని.
అతనికి ఇంజనీరింగ్ అప్పుడే పూర్తయింది. కొంచం తెలుగు సాహిత్యం పిచ్చి. వెన్నెలన్నా, కృస్ణశాస్త్రి కవితలన్నా, హిందీ పాటలన్నా, పొడవైన కురులున్న అమ్మాయిలన్నా చెప్పలేనంత ఇష్టం. కృష్ణశాస్త్రి సృష్టించిన ఊర్వశి లాంటి అమ్మాయి వెన్నెట్లో వయారంగా నడచి వస్తుంటే, ఆమెని ఆహ్వానించడానికి రఫీ లాగ వసంతాన్ని పువ్వులు పరచమని అడగాలనిపిస్తుంది. కానీ, అతని ఊహలకి సుబ్బలక్ష్మి పెద్ద కాంట్రాస్ట్. సుబ్బలక్ష్మి రవి మేనమామ కూతురు. పుట్టినప్పుడే అతనికి పెళ్ళంగా నిర్ణయించబడింది.
***
"ఛీ, ఏం పేరు!," విసుగ్గా అన్నడు రవి.
"సుబ్బలక్ష్మికేమిరా లక్షణంగా ఉంటేనూ?" అతని తల్లి అంది.
"ముసలి పేరు."
"నీకు అంతగా నచ్చకపోతే, మీ పెళ్ళయ్యాకా వెన్నెలనో, మల్లికనో మార్చుకో. ఎవరుకాదంటారు?" నవ్వుతూ అంది.
"అసలు సుబ్బలక్ష్మిని ఎవరు పెళ్ళిచేసుకోబోతున్నారు?" విసుగ్గా అన్నాడు. ఆమెతో పెళ్ళంటేనే రవికి వొళ్ళు మండి పోతుంది. చిన్నప్పుడెప్పుడో చూసిన సుబ్బలక్ష్మి రూపం అతని మనసులో గాఢంగా ముద్రపడిపోయింది. ఆమె పిలక జడలు, చప్పిడి ముక్కూ ఇప్పటికీ గుర్తుకు వచ్చి కలవర పెడతాయి.
"మావయ్య కూతురు ముచ్చటగా ఉంటుందిరా. ఒక్కసారి దాన్ని చూశావంటే, ఎగిరి గంతేసి వొప్పుకొంటావు. ఈ ఒక్కసారికీ మావయ్య వాళ్ళ ఊరు వెళ్ళరా నాయనా..." కొడుకుని ఎలాగయినా బుజ్జగించి పెళ్ళిచూపులకి పంపించాలని ఆమె ఉద్దేశ్యం. "...అప్పటికీ నీకు నచ్చక పోతే అప్పుడే ఆలోచిద్దాం లే." సంభాషణని ముగించి లేచింది. తల్లి చెప్పిన చివరి వాక్యం ఓ రిలాక్సేషన్లా అనిపించింది. స్టీరియో ఆన్ చేసి, పక్కమీద వాలుతూ అనుకొన్నాడు, `ఓ సారి చూసి వచ్చి, నచ్చలేదని చెప్పేస్తే సరి,` అని.
***
సంధ్య చీకట్లు ముసురుకోటుండగా, ఊరు మొదట్లో రవిని దింపేసి బస్సు వెళ్ళిపోయింది. అదొక చిన్న పల్లెటూరు. అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న పాలేరుకి సూట్కేసు అప్పగించి, వాడితో పాటూ పొలం గట్లు మీదనుంచి నడుచుకొంటూ మావయ్యగారింటికి బయలుదేరాడు.
ఇంటిల్లిపాదీ అతన్ని సాదరంగా ఆహ్వానించారు. సుబ్బలక్ష్మి మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్రయాణంలో వొళ్ళంతా హూనమైపోయింది. పెరట్లో పెట్టిన వేడి నీళ్ళతో శుబ్రంగా స్నానం చేసి ఇంటిలోకి రావడంతోటే భోజనానికి పిలుపువచ్చింది. భోజనం చేస్తూ మరదలు ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూసాడు. ఎక్కడా ఆమె ఉన్న అలికిడే లేదు. ఎంతకాదనుకొన్నా మావయ్య కూతురి తాలుకు ఊహలతో మనస్సంతా గజిబిజిగా ఉంది. `అమ్మ చెప్పినట్టు లక్షణంగా ఉంటుందా!` అనుకొన్నడు. `ఒక్కసారి కనిపిస్తే బాగుండు,` అనికూడా అనుకొన్నాడు.
భోజనం ముగించి, డ్రాయింగ్ రూంలోకి వచ్చి కూర్చుంటూ, కుతూహలం పట్టలేక మేనమామని అడిగాడు, "మావయ్యా, సుబ్బలక్ష్మి ఎక్కడా కనపడదేం?" అని.
మావయ్య అన్నాడు, "పెళ్ళిచూపులకి ఎల్లుండి బాగుందని పంతులుగారు అన్నారు. దాన్ని చూడటానికి ఈ రెండు రోజులూ ఆగక తప్పదు."
సరిగ్గా అప్పుడే డ్రాయింగ్ రూం గుమ్మానికి కట్టిన కర్టెన్ వెనుక మువ్వల శభ్ధం వినిపించింది. ఓ నీడ కదిలినట్టు అనిపించింది.
సరిగ్గా అప్పుడే డ్రాయింగ్ రూం గుమ్మానికి కట్టిన కర్టెన్ వెనుక మువ్వల శభ్ధం వినిపించింది. ఓ నీడ కదిలినట్టు అనిపించింది.
అసంకల్పితంగా కర్టెన్ వైపు చూసాడు. అప్పుడే గాలికి ఎగిరిన తెరకి అటువైపు ముందుగా వెండిపట్టీలు పెట్టుకొన్న రెండు పచ్చటి పాదాలు పట్టుపరికిణీ అంచుల వెనుకనుంచి కనిపించాయి. తరువాత, వెనుతిరిగి తుర్రున లోనికి పరిగెడుతున్న సుబ్బలక్ష్మి సొగసైన మెడ మీద పొడవైన వాలుజడ క్షణకాలం మెరిసి మాయమయ్యింది.
రవికి కుతూహలం పెరిగింది. అతని కుతూహలం గమనించి మావయ్య నవ్వాడు. రవికి బిడియమేసి, చప్పున చూపులు తిప్పుకొని, దృష్ఠి చేతిలో ఉన్న పాత మేగజైన్ మీదకి మళ్ళించాడు.
ప్రయాణ బడలిక వల్ల ఆరాత్రి మత్తుగా నిద్ర పట్టేసింది. కలల నిండా వెండి పట్టీలు ఆనంద లాస్యం చేశాయి.
***
మరునాడు ఉదయం మావయ్యతో పాటూ పొలం చూడటానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నమయ్యింది. భోజనంచేసి, రిలాక్స్ అవుతూ ఉండగా ప్రక్క గదిలో నుంచి అతనికి ఎంతో ఇష్టమైన ముఖేష్ పాట సన్నగా అతని చెవిలో పడింది.
"ఖభీ, ఖభీ మెరే దిల్ మే ఖయాల్ ఆతా హై..." ఎవరో పాటలు వింటున్నారు.
"....ఏ హోఠ్, యే బాహే మేరీ అమానత్ హై..." పాట సాగుతూ ఉంటే ఓ అందమైన అమ్మాయి దొండపండు పెదవులు, నున్నని బాహువులు అతని కళ్ళముందు కదలాడ సాగాయి. ఆ వెంటనే ముందురోజు అతను చూసిన పచ్చటి పాదాలు తళుక్కున జ్ఞాపకం వచ్చాయి. `సుబ్బలక్ష్మి అందంగానే ఉంటుందేమో!` అనిపించింది.
పాట సాగుతూనే ఉంది-
"...ఏ కేశావోంకీ ఘనీ చావ్ మే మేరీ ఖాతిర్..." ఈ సారి పొడవైన మరదలి జడ ఊహల్లోకి వచ్చింది. ఇష్టమో, అయిష్టమో తెలియని ఏదో ఫీలింగ్ మనసులో గుచ్చి ఇబ్బంది పెడుతుంది. మనసంతా దిగులుగా అయి పోయింది.
బావకి కంపెనీ కూర్చున్న ఇంటర్మీడియట్ చదువుతున్న సుబ్బలక్ష్మి తమ్ముడు రవిని గమనించి అడిగాడు, "ఏమిటి బావా ఆలోచనల్లోకి వెళ్ళిపోయావు?" అని.
"ఎవర్రా పాటలు పెట్టింది?"
"ఇంకెవరూ? అక్కయ్యే. ఎప్పుడూ పాత పాటలు వింటూ వెన్నెట్లో కూర్చుంటుంది," అవసరమైన దానికంటే ఎక్కువే చెప్పాడు.
సుబ్బలక్ష్మి టేస్టు రవికి నచ్చింది.
వాలు జడలో మల్లె పూలు తురుముకొని నడచి వస్తున్న ఆమె ఊహల్లో మెదిలి మనసు తన్మయత్వం చెందింది.
అప్పుడే అతని ఊహలని చెదరగొడుతూ సెల్ ఫోన్ మ్రోగింది.
***
`టాప్ టెన్ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన ఎంఫసిస్ లిమిటెడ్ వాళ్ళు ఆఫ్ కేంపస్ డ్రైవ్ జరుపుతున్నారని, వెంటనే హైదరాబాద్ వచ్చేయ్యమని,` ఫ్రెండ్ ఫోన్.
పెళ్ళిచూపుల కార్యక్రమమేదో ముగించి వెళ్ళ మని ఎంతచెప్పినా వినలేదు రవి. `పెళ్ళి చూపులు ఎప్పుడైనా పెట్టుకో వచ్చని, ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతే, మళ్ళి అటువంటి మంచి కంపెనీలో ఉద్యోగ అవకాశం రాకపోవచ్చునంటూ, వెంటనే వెళ్ళాలని` పట్టుబట్టాడు.
ఆరోజు సాయంత్రమే మేనమామ పలుకుబడి అంతా ఉపయోగించి సంపాదించిన రిజర్వేషన్ టిక్కెట్టు పట్టుకొని ప్రైవేట్ బస్సు ఎక్కాడు.
***
కొన్నిరోజులు గడిచాయి.
రవికీ, సుబ్బలక్ష్మికీ పెళ్ళిచెయ్యడానికి పెద్దవాళ్ళు ముహూర్తాలు నిర్ణయిస్తుంటే అడ్డుచెప్పలేదు రవి. వాళ్ళ పెళ్ళి అట్టహాసంగా జరిగిపోయింది.
పీటలమీద సుబ్బలక్ష్మిని చూసిన రవికి ఆనందం వేసింది. అందుకు కారణం ఆమె బాగా నచ్చడమే. కానీ, ఆమెకి మాత్రం ఒక సందేహం మిగిలి పోయింది.
`మొదట తనని పెళ్ళాడనని పట్టుబట్టిన బావ, అస్సలు చూడకుండానే ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకొన్నాడా!` అని.
ఆ విషయమే మొదటిరాత్రి అతనిని అడిగింది.
అతనన్నాడు, "నేను, నిన్ను అస్సలు చూడలేదని ఎందుకు అనుకొన్నావు?" అని.
ఆమె ఆశ్చర్య పోయి, ఏమి చూశావంది.
"నవ్వుతున్న పుట్టుమచ్చ," నన్నాడు.
"పుట్టుమచ్చ నవ్వటమేమిటీ!?" అంది.
అప్పటికి వాళ్ళిద్దరూ పందిరి మంచం మీద ఉన్నారు. అతను ఆమె పక్కనుంచి లేచి, పాదాలని కప్పిఉంచిన పట్టుచీర కుచ్చీళ్ళని కొంచెం పైకి జరిపాడు. కుడి పాదపు చర్మం గులాబీ రంగులోకి మారేచోట ఉన్న కందిగింజంత పుట్టుమచ్చ మీద సుతారంగా పెదవులానించాడు. అతని గరుకు మీసాలు వత్తుకొని చక్కిలిగింతలై , "కిల కిల," మని నవ్వింది.
అతను అన్నాడు, "చూశావా, పుట్టుమచ్చ ఎలా నవ్విందో?" అని.
© Dantuluri Kishore Varma
Hi Kishore, mee posts chaalaa baavunnayi.. telugulo chaduvuthoo unte.. inkaaa haayiiga undi..
ReplyDeleteధన్యవాదాలు :)
Deletenice..
ReplyDeleteThank you Ramesh garu for your appreciation.
DeleteIlantivi inka chala rayandi.. Chala bavundi, endukante naaku naa mardalu gurtochindi.. :)
ReplyDeleteBhaskar.
మీ మెచ్చుకోలుకు ధన్యవాదాలు భాస్కర్‌గారు. తప్పనిసరిగా రాస్తాను.
DeleteNice one sir.
ReplyDeleteథాంక్స్ అండి.
Deletesweet love story, narrated with sufficient sensitivity. ఐతే, కథ మొదట్లో పుట్టుమచ్చకి ఏమీ ప్రాధాన్యత లేకపోవడం, చివర్లో అకస్మాత్తుగా అదే కారణం అన్నట్టు చెప్పడం అతకలేదు. అంతకంటే, ఆమె రూపలావణ్యాలకంటే ఆమె టేస్టుకి అతను ఎక్కువ ప్రాధాన్యత నిచ్చాడు వరించడంలో అని చూపిస్తే ఇంకా పసందుగా ఉంటుంది.
ReplyDeleteకథానాయకుడు భావుకుడు. మొదటిసారి మరదల్ని చూసినప్పుడు వెండి పట్టీలు పెట్టుకొన్న పాదాలని చూశాడని చెప్పడం జరిగింది. కానీ, కావాలనే పుట్టుమచ్చ ప్రస్థావన తీసుకొనిరాలేదు. భావుకులు ఏ పాయింట్ దగ్గర ఇంప్రెస్ అవుతారో చెప్పలేం. ఆరోజు రాత్రి అతని కలల నిండా ఆమె పాదాలే ఆనంద లాస్యం చేశాయి. అది నిజానికి పుట్టుమచ్చ నచ్చడం వల్లే! చివరిలో `నిన్ను ఏమీ చూడకపోవడం ఏమిటి? పుట్టుమచ్చ చూశాను,` అని చెపుతాడు. ఓ హెన్రీ కథల్లో లాగ కథపేరుని చివరి జస్టిఫై చేసే ఉద్దేశ్యంతోనే అలా రాశాను. కాకపోతే, మీరన్నట్టు మొదటిలో ఈ పాయింట్‌కి ఇంకొంత ప్రాధాన్యత ఇచ్చి, పాఠకుడికి పాయిట్ రిజిస్టర్ చేసి ఉండవలసింది. మీ విలువైన కామెంటుకి ధన్యవాదాలు నారాయణస్వామి గారు.
Deleteఎప్పుడో ఒకసారి బహారో ఫూల్ బర్సావో పాట విన్నా,కాని ట్యూన్ మాత్రమే ఇప్పటి వరకూ గుర్తుంది.మీ పోస్ట్ చదవగానే ఆ పాట వెంటనే స్ఫురణకు వచ్చింది.గూగుల్ లో సెర్చ్ చేస్తే ఆ పాట సూరజ్ చిత్రంలోదని తెలిసింది.Thankyou so much :p
ReplyDeleteధన్యవాదాలు.
Deletechaala bagundandi. andamyna katha la, kavitha la, kala la haayi ga undi chadavadaniki.
ReplyDeleteధన్యవాదాలండి!
Delete