Pages

Wednesday, 3 October 2012

క్లబ్బుకి వెళదామా?

"ఈ రోజు క్లబ్బుకి వెళదామా?" అన్నాడు మోహన్.

ముందురోజే ప్రోగ్రాం ఫిక్స్ చేసుకొన్నాం ఆరోజు వెళ్ళాలని. అప్పటినుంచీ ఏదో ఆందోళనగా, భయంగా ఉంది. మోహన్ గాడు రాకుండా ఉంటే బాగుండునని అనుకొంటూ ఉండగానే సాయంత్రం నాలుగున్నర అయిపోయింది. వాడు రానే వచ్చాడు. నాకంటే భిన్నంగా ఏమీ లేదు వాడి పరిస్థితి. కనుగుడ్లు అస్థిరంగా కదులుతున్నాయి, గుటకలు మింగుతున్నాడు, మాటిమాటికీ కర్చీఫ్ తీసుకొని నుదుటిమీద పట్టిన చెమట్లు తుడుచుకొంటున్నాడు. ఉరిశిక్ష పడిన ఖైదీల్లాగ 5 గంటలు అవడం కోసం ఎదురుచూస్తున్నాం.

మాయింటినుంచి ఘా..ట్టిగా రాయి విసిరినా కూడా తగలనంత దూరంలో క్లబ్బు నడిపే ఇల్లు ఉంది. కాకపోతే మధ్యలో ఏ ఇళ్ళూ లేని కారణంగా ( అప్పుడే డెవలప్ అవుతున్న కోలనీ)  అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ మాటెర్రస్ మీదకి అస్పస్టంగా కనిపిస్తూ ఉండేవి. టైం దగ్గర పడుతున్నకొద్దీ ఒక్కొక్కరూ, శుబ్రంగా స్నానాలు చేసి, సైకిళ్ళమీదా, నడిచీ రావడం మొదలుపెట్టారు. అయిదు అవుతూవుంది. ఏదయినా అద్భుతం జరిగి ఈ ప్రోగ్రాం కేన్సిల్ అయిపోతే బాగుండునని ఉంది. 

"వెళదామా?" అన్నాను వినీవినిపించకుండా. 

"వెళదామా....!" అన్నాడు వాడుకూడా.  ఇద్దరికీ మహా టెన్షనుగా ఉంది.

మేము క్లబ్బుదగ్గరకి వెళ్ళేసరికి, డాబామీద అంచులు చిరిగిపోయిన రెండుచాపలు నీటుగా పరచిఉన్నాయి. వాటికి ఎదురుగా వెనుక కోళ్ళు తుప్పుపట్టి ముక్కలువిరిగిపోయిన ఒక గోద్రేజ్ కుర్చీ ఠీవీగా నిల్చుని ఉంది. చాపలు రెండిటిమీదా ఎనిమిది, తొమ్మిది మంది కుర్రాళ్ళు కూర్చుని ఉండడంతో మాకు జాగా లేక వాళ్ళకి వెనుక కూర్చున్నాం. 

ఠంచనుగా 5 అవ్వడంతో మాముందునుంచి ఒకడు లేచివెళ్ళి, "గుడీవినింగ్ ఫ్రెండ్స్," అన్నాడు. ఆత్మవిశ్వాసం అణువణువునా తోణికిసలాడుతుంది. "టుడే మిస్టర్ కిషోర్ అండ్ మిస్టర్ మోహన్ హావ్ జాయిండ్ అవర్ ఇండివిడ్యువల్ డెవలప్మెంట్ క్లబ్(ఐ.డీ.సీ). గివ్ దెం ఎ బిగ్ హ్యాండ్," అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు.

"వి హావ్ ఫోర్ ఆక్టివిటీస్ టుడే. ఐ వుడ్ లైక్ కుమార్ టు కండక్ట్ స్పెల్లింగ్ టెస్ట్ ఫస్ట్," అని అనౌన్స్ చేసి వచ్చి కుర్చున్నాడు. కుమార్ అనే మెంబర్ తుప్పుపట్టిన గోద్రేజ్ కుర్చీలో కుర్చుని స్పెల్లింగ్ టెస్ట్ నిర్వహించాడు; తరువాత మరొకటి; ఆతరువాత ఇంకొకటి వరుసగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ఎవ్వరూ తెలుగు మాట్లాడడం లేదు.

సీనియర్ మెంబర్లు చివరిలో  ఎవరయినా తప్పులు మాట్లాడిఉంటే కరెక్షన్స్ చెప్పి, ఇంకా బాగా ఇంగ్లీష్ ఉపయోగించాలని ప్రొత్సహిస్తూ మాట్లాడటంతో మాకు చాలా వరకూ ఇంగ్లీషులో జరిగే క్లబ్ ఆక్టివిటీస్ అంటే భయం తగ్గింది. ఆరోజు స్పెల్లింగ్ టెస్టులో ఒక్క పదానికి మాత్రమే(అది `ఆమ్లెట్`. మీకు ఏమయినా తెలుసా దీని స్పెల్లింగ్!?) తప్పు స్పెల్లింగ్ రాసిన నాకు ఆతరువాతి వారంలో ఆ టెస్ట్ నిర్వహించే అవకాశం ఇచ్చారు. మనం `ఫు...ల్లు హ్యాపీసు`.
***
ఇదంతా నేను డిగ్రీ పూర్తి చేసిన కొత్తలో(ఓ ఇరవై సంవత్సరాల క్రితం) సంగతి. ఇప్పటిలాగ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లేని రోజులు. బీకామో, బీఎస్సీనో చదివేసి సంవత్సరాలకొద్దీ ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యవలసిందే. పబ్లిక్ సెక్టార్లో గ్రూప్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలకోసం గట్టిగా ప్రయత్నించేవారు. కోచింగ్ సెంటర్లు కూడా మంచివి ఉండేవికావు. అప్పటివరకూ తెలుగుమీడియంలో చదివి, ఇంగ్లీష్లో ఉండే ఈ పోటీ పరీక్షలు నెగ్గి ఉద్యోగం సంపాదించాలంటే ఒక భగీరద ప్రయత్నమే చెయ్యవలసి వచ్చేది. అటువంటి పరిస్థితుల్లో, సుమారు 1980 ప్రాంతాల్లో కొంతమంది ఔత్సాహికులు ఇండివిడ్యువల్ డెవలప్మెంట్ క్లబ్ ని ప్రారంభించారు. ఈ క్లబ్బుకి ఒక వెన్యూ అనేది లేకపోవడంతో, ఒకరి టెర్రస్ మీదనుంచి వేరొక టెర్రస్ మీదకి ప్రయాణించేది. ఎవరు చురుకయిన మెంబరు అయితే వాళ్ళ ఇంటి మీద అతనికి ఉద్యోగంవచ్చి, మా వూరునుంచి వెళ్ళేంతవరకూ నడిచేది. ఆ తరువాత వేరొక చోటుకి.. ...       

పైన చెప్పినట్టు స్పెల్లింగుటెస్టు, కామన్ ఎర్రర్స్, అర్ధమెటికల్ ఎబిలిటి, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, క్విజ్, డిబేట్, ఎస్సే రైటింగ్ వంటి చాలా కార్యక్రమాలు నిర్వహించేవారు. మెంబర్లే టీచర్లు. ఒక్కసారి రాసింది పదిసార్లు చదివినదానితో సమానం అంటారు. అలాగే ఒక్కసారి వివరించి చెబితే పదిసార్లు రాసినదానితో సమానం అన్న సత్యం నాకు ఇక్కడే తెలిసింది. ఒక డిబేట్ కోసం తయారవుతున్నప్పుడు, విషయం మనకి మాత్రమే అర్ధమైతే సరిపోదు, దానిని మన ప్రత్యర్దులు మెచ్చేలా చెప్పాలి - దీనినే  డ్రైవింగ్ ద పాయింట్ హోం అంటారు. నుంచునే పద్దతి, మాట్లాడే విధానం, తార్కికంగా విశదపరచే సులువులు మొదలైన వాటిని అప్పటికే విజయం సాధించిన సీనియర్లు ఎంతో ఓపికగా చెప్పేవారు.

కాంపిటీషన్ మాస్టర్, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, కాంపిటీషన్ రిఫ్రెషర్ వంటి మేగజైన్స్ ఉండేవి. వాటి ధర పన్నెండు నుంచి పద్నాలుగు రూపాయల మధ్యలో ఉండడంతో ప్రతీమెంబరూ నెలసరి ఫీజు కింద పన్నెండు రూపాయలు కట్టాలి. ఆ డబ్బుతో ఉపయోగపడే బుక్స్ కొనుక్కొని, అందరి మధ్యలో సర్క్యులేట్ చేసుకొనేవాళ్ళం. ఇది ఒక రకంగా బుక్ పూలింగ్ వంటిది. పెద్ద ధర పెట్టి కొనలేని పుస్తకాల లిస్టు రాసుకొని అట్టిపెట్టుకొనే వాళ్ళం. ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు సెండాఫ్ సమయంలో ఆ లిస్టులో ఉన్న పుస్తకాలలో కొన్నిటిని కొని క్లబ్బుకి ఇచ్చేవాళ్ళు. 

ఈ రోజు ఎంతో మంది దేశం నలుమూలలా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో, సెంట్రల్, స్టేట్ గరర్నమెంట్ డిపార్ట్మెంటుల్లో, ప్రయివేట్ సంస్థల్లో మంచి స్థానాల్లో ఉన్న ఆనాటి మాక్లబ్బు మెంబర్లు ఇప్పటికి కూడా ఇదంతా మా ఐ.డీ.సీ చలవే అని గర్వంగా చెప్పుకొంటారు - మాకు అది ఒక కల్ట్.

ఇటువంటి క్లబ్బులు ఇప్పుడు కూడా నిర్వహించుకొంటే ఆ మెంబర్స్ ఎన్నో సాఫ్ట్ స్కిల్స్ ని అలవోకగా నేర్చుకోగలరని నా నిశ్చితాభిప్రాయం.
© Dantuluri Kishore Varma 

7 comments:

  1. IDC concept is novel and very nice.

    ReplyDelete
  2. BTW, you are working in your home town itself? If so, very Lucky.

    ReplyDelete
  3. తెలుగు మీడియం లో చదువుకున్న వారికి న్యూనతా భావం బిడియం ఎక్కువగా ఉంటాయి. వారి లోనిInhibitions ని పోగొట్టాలంటే ఇలాంటి క్లబ్బులవసరమే. నేను కూడా హైస్కూల్లో తెలుగు మీడియమే కాని కాలేజీలో ఇంగ్లీషు మీడియం.అయితే ఇంగ్లీషులో మాట్లాడడానికి బెరుకుగా ఉన్నా ఈ న్య్తూనతా భావం ఉండేది కాదు .కారణం 50ఏళ్లక్రితం అప్పట్లో కాలేజీలో నూటికి 98 మంది తెలుగు మీడియం వాళ్లే.ఆ ఉన్నఒకరిద్దరు కాన్వెంటు సరుకు కంటే ఇంగ్లీషు లో మాకే మంచి మార్కులు వచ్చేవి.ఇటువంటి క్లబ్బులను ప్రోత్సహించాలి.

    ReplyDelete
  4. అవును తేజస్వి గారు నేను సొంతఊరిలోనే. మీరు అన్నట్లే ఐ.డీ.సీ. ఓ గొప్ప కాన్సెప్ట్.

    ReplyDelete
  5. "ఎవరో హేళన చేస్తారని మాట్లాడక పోతే నువ్వు ఎప్పటికీ మాట్లాడలేవు; తప్పో, రైటో ధైర్యం చెప్పేయ్," అనే ప్రోత్సాహం ఉంటే ఎవరైనా మంచి కమ్యూనికెషన్ స్కిల్స్ అభివృద్ది చేసుకోగలరు. అందుకే ఇటువంటి క్లబ్బుల అవసరం ఉంది. కానీ, కమర్షియల్ గా నడుస్తున్న క్రాష్ కోర్సులవైపే జనాల నడక. మీ స్పందన తెలియజేసినందుకు ఆనందంగా ఉంది గోపాలకృష్ణా రావుగారు.

    ReplyDelete
  6. ఈ క్లబ్ గురించి తెలుసుకోవడం బాగుందండీ.

    >>>ఒక్కసారి రాసింది పదిసార్లు చదివినదానితో సమానం. అలాగే ఒక్కసారి వివరించి చెబితే పదిసార్లు రాసినదానితో సమానం.

    True.

    ReplyDelete
  7. థాంక్స్ ఎ మిలియన్, శిశిర గారు.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!