Pages

Thursday, 4 October 2012

ద్వారపూడి

బయటనుంచి
కాకినాడకి 32 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రీ వైపు వెళ్ళే కెనాల్ రోడ్డు ప్రక్కన ద్వారపూడి ఉంది. ఇక్కడ ఒకే ప్రాంగణంలో సుమారు పది పెద్ద దేవాలయాలు ఉన్నాయి. 
పాలరాతితో నాలుగు అంతస్తులుగా నిర్మించిన శివాలయం: ఇందులో స్తూపాకారంగా క్రిందనుంచి నాలుగవ అంతస్తువరకూ వ్యాపించిన శివలింగం ఉంది. రెండవ, మూడవ అంతస్తులలో ప్రదక్షిణ మార్గం చుట్టూ పురాణగాధలో సన్నివేశాలని తెలియజేసే విగ్రహాలను ఏర్పాటుచేశారు. నాలుగవ అంతస్తులో, శివలింగ శిఖరానికి అబిషేకం చేస్తే, అబిషేక జలం క్రిదకి వచ్చే మార్గంలో ప్రధాన లింగానికి అనుసంధానం చేసిఉన్న 18 చిన్న లింగాలని తాకుతూ క్రిందకి వస్తుంది. ఈ దేవాలయాన్ని అష్ఠాదశ(18) ఉమా సోమేశ్వరదేవాలయం అంటారు.
శివాలయం
శివాలయానికి ఎదురుగా నటరాజస్వామి, రెండువైపులా హనుమంతుడు, నందీశ్వరులు తమ తమ హృదయాలలో శ్రీరామ పట్టాభిషేకాన్ని చూపిస్తూ పెద్ద విగ్రహాలు ఉన్నాయి.
(ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంచడం యొక్క ఉద్దేశ్యం, నందీశ్వరుడి గుండెల్లో సీతారాములు ఎందుకు ఉన్నారో నాకు అర్ధంకాలేదు)
శివాలయం ప్రక్క ప్రవేశద్వారానికి ఎదురుగా మహానంది ఉంది. ఆలయం నాలుగవ అంతస్తు కిటికీ నుంచి కనిపించేలాగ దీనిని నిర్మించారు.
పురాణాలలో నందీశ్వరుడికి సంబంధించిన మూడునాలుగు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ప్రతీశివాలయంలోనూ శివలింగానికి అభిముఖంగా నందిని చూస్తుంటాం. నంది శివుని వాహనంగా మనకి తెలుసు. కానీ లింగపురాణంలో నంది సాక్షాత్తూ శివుని అవతారం అని చెప్పబడింది. శిలాదుడు అనే మహర్షి అమరుడైన(మరణం ఉండబోని చిరంజీవి అయిన) ఒక పుతృనికోసం శివునికి తపస్సుచేస్తాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి తానే అతనికి పుత్రునిగా జన్మిస్తానని వరం ఇచ్చి, అలాగే చేస్తాడు. అంతేకాకుండా కైలాసంలో శివునికి ద్వారపాలకులిగా ఉండే ఇద్దరిలో ఒకరు నంది, రెండవవాడు మహాకాళి. శివుని ప్రమదగణాలకు అధిపతికూడా నందీశ్వరుడే. నందికి దివ్యత్వం, బలం, అధికారమే కాకుండా తెలివి కూడా ఉందని చెప్పే కథ ఏమిటంటే - ఈయన పురాణాలలో చెప్పబడిన ప్రధమగురువులలో ఒకడట. ఈ సారి ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు నందిని కేవలం ఒక వాహనంగానే కాకుండా, ఇంకా మిగిలిన అంశాలుకూడా దృష్ఠిలో ఉంచుకొని చూడండి.
భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం: శివాలయానికి ఎడమవైపు భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం ఉంది. వెండి శివలింగం భారతదేశం మొత్తానికి ఇక్కడే ఉందట. దర్శనానికి ఆడవారు చీరలో, మగవారు పంచలో సాంప్రదాయబద్దంగా వెళ్ళాలి. లేకపోతే అనుమతించరు. బయట మగవాళ్ళకి పంచలు రెండురూపాయలకి అద్దెకి ఇస్తున్నారు. అందరికీ అవే ఇస్తూ ఉంటారుకనుక ఎవరైనా ధైర్యం ఉంటే అద్దెకితీసుకొని లోనికి వెళ్ళవచ్చు.    
 ఇక్కడే విష్ణుమూర్తి యొక్క దశావతార దేవాలయం నిర్మాణంలో ఉంది. 
అయ్యప్పస్వామి దేవాలయం: ఈ గుడిని ఆంధ్రా శబరిమల అని అంటారు. అయ్యప్ప మాలదారులు అంతదూరం ప్రయాణించి శబరిమల వెళ్ళలేనప్పుడు ఇక్కడికి వస్తారు. 1989లో అయ్యప్పస్వామి పంచలోహ విగ్రహాన్ని కంచి పీఠాధిపతి స్వామీ జయేంద్ర సరస్వతి వారి చేతులమీదగా ప్రతిష్టించారు.  ఒకేరాతి మీద చెక్కిన 18 మెట్లను తమిళనాడు నుంచి తీసుకువచ్చారట. కేరళలోని శబరిమల ఆలయంలో జరిగిన విధంగానే ఇక్కడకూడా సాంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహిస్తారు.
మహిషాసురిడిని దుర్గాదేవి సమ్హరించిన తరువాత, అతని సోదరి మహిష బ్రహ్మగురించి తపస్సుచేసి శివుడి చేత కానీ, విష్ణువు చేత గానీ చంపబడకుండా ఉండాలని వరంపొందుతుంది. తరువాత కొంతకాలానికి మోహినీ రూపంలో ఉన్న విష్ణువుని చూసి శివుడు మోహించిన కారణంగా వారికి జన్మించిన పుత్రుడే ధర్మశాస్త అనబడే అయ్యప్ప. మహిషను చంపడానికి పుట్టిన కారణజన్ముడు.   అయ్యప్పని హరిహర పుత్రుడు అని కూడా అంటారు.  ఈ పురాణ గాధని సూచిస్తూ దేవాలయానికి ముందు ఎత్తైన్ శివకేశవ విగ్రహం ఉంది.
శివకేశవ విగ్రహం
దుర్గాదేవి ఆలయం: గుదిలోనికి  సింహపు నోటి ప్రవేశ ఆకారపు ద్వారంగుండావెళ్ళాలి.  
లోపల చిన్న అష్ఠలక్ష్ముల మందిరం, వివేకానంద, వేమన, బ్రహ్మంగారు వంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. మధ్యలో దేవి.  
ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. సాయిబాబా మందిరం, నాగదేవత ఆలయం, శనీశ్వరాలయం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం....
శిరిడీ సాయిబాబా ఆలయంలో సాయినాధుని విగ్రహానికి వెనుకవైపు ఒక గర్భ గుడిలాంటి చాంబర్లో పవళించి ఉన్న  అనంత పద్మనాభ స్వామి ఇక్కడ ఉన్న అన్నింటిలోనూ నాకు బాగానచ్చింది. అందుకే ఒక ప్రత్యేకమైన పోస్టు వేశాను చూడండి. 

పెద్ద గుడి. చూడటానికి ఎలా లేదన్నా గంట పడుతుంది. ఇక్కడి పరిసరాలు సుచీ శుబ్రతలతో ఉంటే దర్శనం ఒక గొప్ప అనుభూతిని మిగల్చడం ఖాయం. కానీ, ఎవరూ అంత శ్రద్ద తీసుకొంటున్నట్లు కనిపించడం లేదు.

దేవాలయం స్టాల్లో పద్దెనిమిది పిక్చర్ పోస్టుకార్డుల సెట్ పాతికరూపాయలకి అమ్ముతున్నారు. ఈ వాల్ మీద టైటిల్స్ ప్రింట్ చేసి ఉన్న ఫోటోలు అందులోనివే. మిగిలినవి నేను తీసినవి. కెమేరా అనుమతిస్తున్నారు. దానికి టిక్కెట్టు ముప్పై రూపాయలు. కారు పార్కింగి కి ప్రత్యేకమైన స్థలం లేకపొయినా, రోడ్డుప్రక్క నిలుపుకొన్నందుకు దేవాలయం వాళ్ళకి ఇరవై రూపాయలు కట్టాలి. చిల్లర దగ్గర ఉంచుకోండే!   

ఇంకా ఓపిక ఉంటే ఇదికూడా చదవచ్చు మీరు వీకెండ్ @ కడియం . 


© Dantuluri Kishore Varma

6 comments:

  1. మీ బ్లాగులన్నీ చూశాను. చక్కటి ఫొటోలతో సహా చాలా చక్కటి విషయాలు రాస్తున్నారు. అభినందనలు. ద్వారపూడి బిక్కవోలు ఊళ్ళ ప్రస్తావన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి కథల్లో చాలా సార్లు వస్తుంది. కానీ నేరుగా ఎప్పుడూ చూడలేదు.

    ReplyDelete
  2. ఈ మధ్యనే వ్రాయడం మొదలు పెట్టానండి. చాలా తప్పులు కూడా వస్తున్నాయేమో! మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నారాయణస్వామి గారు.

    ReplyDelete
    Replies
    1. మీరు అలాగ అప్పుడు అనుకోవద్దు మీరు వ్రాయడం వాళ్ళనే అందరికి దేముడికి సంభందించిన విషయాలు తెలుస్తున్నాయీ

      Delete
  3. వర్మ గారు మాదీ కాకినాడే మీరు ఆ చుట్టుప్రక్కల విషయాలు రాస్తుంటే చాలా ఆనందంగా ఉంది కడియం,ద్వారపూడి గురించి చదివాం బాగా రాస్తున్నారు పెద్దగా తప్పులు పట్టించుకోనవసరం లేదు మేం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి మీరు రాస్తున్నవిషయాలు చదివుతుంటే చాలా ఆనందంగా ఉంది ధన్యవాదములు...రాంజీ

    ReplyDelete
  4. మీ కామెంట్ చదువుతుంటే వెంటనే ఇంకొక పది పోస్టులు రాసేయాలన్నంత ఎంకరేజింగ్ గా ఉంది రాంజీ గారు. నా బ్లాగ్ చదువుతూ మీ అభిప్రాయాలు ఇలాగే తెలియజేస్తూ ఉండాలని కోరుకొంటున్నాను.

    ReplyDelete
  5. నారాయణ స్వామిగారూ మీ కొత్తపాళీ బ్లాగ్ చూశాను. మీ కామెంట్ నాబ్లాగులో ఉండడం ఒక ప్రివిలేజ్ గా భావిస్తున్నాను. థాంక్యూ!

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!