తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో ఉన్న బలబద్రపురం అనే ఊరిలో శిరిడీ సాయిబాబా గుడి ఉంది. దీనిని ఆంధ్రాశిరిడీ అని వ్యవహరిస్తున్నారు. కాకినాడనుంచి రాజమండ్రీ కెనాల్ రోడ్డు ద్వారా వెళుతున్నప్పుడు ఈ గుడి కుడిచేతివైపు కనిపిస్తుంది.
ఈ దేవాలయాన్ని 2004లో నిర్మించారట. జైపూర్ నుంచి బాబా పాలరాతి విగ్రహాన్ని తీసుకొనివచ్చారని అక్కడ ఉన్న పంతులుగారు చెప్పారు. ఇంకా ఆయన తెలియజేసిన వివరాల ప్రకారం, ఈ విగ్రహాన్ని శిరిడీ తీసుకొనివెళ్ళి అక్కడి దేవాలయ అర్చకులచేత అభిషేక పూజలు చేయించి, తీసుకొని వచ్చి ప్రతిష్ట చేసారట. ఒక వందమంది సాయి మాల ధరించిన భక్తులు ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మధ్యనే బంగారు కిరీటం కూడా చేయించారట.
రెండు అంతస్తులుగా ఉన్న దేవాలయంలో క్రింద కళ్యాణ మండపం, పైన సాయి ఆలయం ఉన్నాయి.
ప్రతిసంవత్సరం గురుపూర్ణిమ సమయంలో (కొన్నిరోజులు అటూ, ఇటూగా) సూర్యకిరణాలు సాయి ముఖమ్మీద ప్రసరిస్తాయట. అప్పుడు బాబా మరింత అందంగా కనిపిస్తారట. దేవీ నవరాత్రుల వంటి పండుగరోజులలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలూ నిర్వహిస్తారు. బాబా జన్మదినమైన గురుపూర్ణిమకు పాలాభిషేకం చేస్తారు.
ఆలయానికి వెనుక ప్రార్ధనా మందిరం ఉంది. మెడిటేషన్ అలవాటు ఉంటే, ఇక్కడ కొంతసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు.
ప్రార్ధనా మందిరం కిటికీఅద్దంలోనుంచి కొన్ని కొండముచ్చులు సందర్శకులని నిశితంగా గమనిస్తున్నాయి. బహుశా భక్తులు ఇచ్చే కొబ్బరిచిప్పలు, అరటిపళ్ళు తీసుకొనే అలవాటు వీటికి ఉన్నట్లుంది. ప్రశాంతమైన వాతావరణంలో గుడి బాగుంది. ఎప్పుడయినా ఈ మార్గంలో వెళుతున్నప్పుడు, మరచిపోకుండా ఈ గుడిని సందర్శించండి.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment