Sunday, 13 January 2013

ఓరిగామి, ఇకెబన, ముకిమోనో

ఓరిగామి, ఇకెబన, ముకిమోనో అనే మూడు రకాలైన కళల గురించి ఈరోజు టపాయిద్దామని (కంగారు పడకండి. టపాయించడమంటే టపా రాయడమనే! - మాయా బజారు సినిమాలో చెప్పినట్టు, అసలు ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి) ఇలా మొదలుపెట్టాను. `టపాయించడం మాట సరే ఆ మూడు కళలు ఏమిటి?` అంటారా? కమింగ్!

కాగితాన్ని రకరకాలుగా మడతలుపెట్టి కళారూపాలుగా మలచడాన్ని ఓరిగామీ అంటారు. వర్షం వచ్చినప్పుడు చేసే కాగితంపడవలు, కాలేజీలో లెక్చరర్ని ఆటపట్టించాలనుకొన్నప్పుడు తయారుచేసి విసిరే రాకెట్లూ ఓరిగామీ లోకే వస్తాయి. మాచిన్నప్పుడయితే కాగితాన్ని ఒక పద్దతిలో మడతపెట్టి, పాత్రలాచేసి, దానిలో నీరుపోస్తే ఒక్క చుక్క కూడా క్రిందకి వొలికేది కాదు. హంసలు, బాతులు లాంటివి కూడా కొంతమంది తయారు చేసేవారు. జపాన్ భాషలో `కామి` అంటే కాగితం అట. `ఒరి` అంటే మడతపెట్టడం. అందుకే దీన్ని ఒరిగామి అని పిలుస్తారు. `అసలు జపాన్ మాటని ఎందుకు ఉపయోగించాలి?` అంటే, దానికీ ఒక కారణం ఉంది. ఆరేడు వందల ఏళ్ళ క్రితమే జపానులో కాగితంతో రకరకాల రూపాలు చేసినట్టు చారిత్రక, సాహిత్యపరమైన సాక్ష్యాలు ఉన్నాయట. అందుకే జపాన్ పదాన్నే వ్యవహరిస్తున్నారు. అసందర్భపు ప్రలాపంలాగ ఇక్కడ ఈ గోల ఎందుకని సందేహ పడుతున్నారు కదూ?  సందర్భం ఉంది. ఇదిగో ముందు ఈ ఫోటో చూడండి.  

బుద్ధిజం ఇండియాలో పుట్టి, చైనాకి వెళ్ళి అక్కడినుంచి జపానుకి కూడా పయనించింది. చైనా వాళ్ళకి ప్రకృతి ఆరాధన కొంచం ఎక్కువ. వాళ్ళ చిత్రలేఖనం, కవితలూ అవీ చూస్తే ఈ విషయం మనకి అర్థం అవుతుంది. బౌద్ధ మతంలో మరణించిన వారి ఆత్మలకు గౌరవ ప్రధంగా పూజాపీఠింమీద పువ్వులను అలంకరించే పద్దతి ఉందట. చైనావాళ్ళ ప్రకృతి ప్రేమ కలిసి, క్రమంగా ఇది ఒక కళగా రూపాంతరం చెందింది. క్రీస్తు శకం ఏడవ శతాభ్దంలో జపానులోని క్యోటో నగరంలో, ఇకెనోబో అనే ఒక సరస్సు ప్రక్కన ఉన్న దేవాలయ పూజారిగారు ఒకాయనకి ఈ పువ్వులు పేర్చడంలో చాలా అద్భుతమైన నైపుణ్యం ఉండేదట. ఆ చుట్టుప్రక్కల ఉండే మిగిలిన దేవాలయాల వాళ్ళు కూడా ఆయన దగ్గరకి వచ్చి, ఈ కళని నేర్చుకొంటూ, క్రమంగా సిద్దహస్థులు అవుతారు. ఇకెనోబో సరస్సు దగ్గర ప్రదేశంలో ఈ కళ వేళ్ళూనుకొంది కనుక ఆ మాటని కొంచం తారుమారు చేసి, పువ్వులు పేర్చే పద్దతిని ఇకెబన అని వ్యవహరించడం మొదలైందట.  ఇకెబనాలో కేవలం పువ్వులే కాకుండా, ఆకులని, కాండాల్నీ కూడా ఉపయోగించి అందమైన ఏర్పాటు చేస్తారు. స్టార్ హోటళ్ళ లాంజ్‌ల్లో, షాపుల విండోల్లో, ఇళ్ళ డ్రాయింగ్ రూముల్లో, సభావేధికల దగ్గరా మనకు కనిపించే పూల అమరిక ఇకెబనాలో ఒక భాగమే. మనిషిని యాంత్రిక జీవితపు వొత్తడులనుంచి కొంచెం మళ్ళించి, ప్రకృతి అందాలతో సేదతీర్చడమే ఈ కళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.  ఇంకా చాలా ఫొటోలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

వంటకాలని గార్నిష్ చేసి వడ్డించడం మనవాళ్ళకి అలవాటే. తినేదాన్ని చక్కగా  అమర్చుకొంటే, కంటికి ఇంపుగా ఉంటుంది. నోరూరి, ఆకలి పెరుగుతుంది కూడా! గార్నిష్ చెయ్యడంలో పదార్ధాలమీద అవీ, ఇవీ చల్లడమే కాకుండా, కాయగూరలని అందంగా చెక్కి అమరుస్తారు. దీన్నే వెజిటబుల్ కార్వింగ్ అంటాం. ఇదికూడా చాలా వందల సంవత్సరాలక్రితం జపాన్‌లో ప్రారంభమైందట. అందుకే ముకిమోనో అనే జపాన్ పేరుతో వెజిటబుల్ కార్వింగ్‌ని వ్యవహరిస్తారు. ఇక్కడ ఇచ్చిన ఫోటో ఒక్కసారి చూడండి. ఇంకా చాలా వాటికోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి.

కాకినాడలో ఈ రోజుతో ముగిసిన సాగర సంబరాల్లో, బీచ్ దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో వీటిని ప్రదర్శించారు. జపాన్ పేర్లతో వాటిని వ్యవహరించలేదు కానీ, వాళ్ళు చేసినవి ఇవి మూడింటినే.

© Dantuluri Kishore Varma

4 comments:

 1. అయ్ బాబోయ్...ఏంటి...ఇవన్నీ మన కాకినాడ లోనే....
  భలే ఉన్నాయండీ కాకినాడ బీచి సంబరాలు. కన్నుల పండువగా జరిపినట్టున్నారు.
  మరి "కాకినాడ కాజా" ప్రత్యేకత చాటారా అంతటా అక్కడ?

  ReplyDelete
 2. కాజా ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి పొందింది కదండీ, అందుకే నునుకొంటా ఈ ఉత్సవాలలో కాజా స్టాల్స్ ఏమీ పెట్టలేదు.

  ReplyDelete
 3. thank you sir you gave recognition to my art origami and paper art.

  ReplyDelete
 4. It`s my pleasure to write about your artistic expression in my blog Sridevi garu.

  ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!