Pages

Saturday, 26 January 2013

నాగులకొండ లొద్ది జలపాతం

ఆంధ్రా శబరిమలై గురించి ముందు టపాలో రాయడం జరిగింది. అక్కడికి రమారమి 10 కిలోమీటర్ల దూరంలో నాగులకొండ లొద్ది జలపాతం ఉంది. ఎక్కడా దారి చూపించే వే బోర్డులు కనిపించవు. దీనిని ధార అంటున్నారు. `ధార కి దారి ఎలా?` అని మీరు  అడుగుతూ ముందుకు పోవలసిందే. `ఎంతదూరం?` అని ఎవరినైనా అడిగితే `ఎనిమిది కిలోమీటర్లు` అని ఒకరు చెప్పవచ్చు. ఇంకొంత దూరం వెళ్ళినతరువాత మరొక వ్యక్తిని అదే ప్రశ్న అడిగారనుకోండి, అతను 10 కిలో మీటర్లు అంటే ఆశ్చర్యపోవద్దు. మాకు ఇలా దారి పొడవునా అయ్యింది. `తప్పుదారిలో వెళుతున్నామేమో!` అనే అనుమానం వస్తుంది. అసలు జలపాతం ఉందో, లేదో అనే సందేహంతో వెనుతిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచన కూడా చెసే అవకాశం ఉంది. సెల్‌ఫోన్ సిగ్నల్ ఉండదు. ఎక్కడయినా వాహనం ఇబ్బంది పెడితే మెకానిక్ దొరికే అవకాశం కూడా ఉండకపోవచ్చు.అప్పుడు మీకు ఒక మోస్తరు పల్లెటూరు కనిపిస్తుంది. దానిపేరు వేళంగి. మీరు సరయిన దారిలోనే వెళుతున్నట్టు లెక్క. అలాగే ముందుకు వెళ్ళండి.

ధార మల్లాపురం అనే గ్రామానికి సమీపంలో లొద్ది  జలపాతం ఉంది. జలపాతం దగ్గరవరకూ కార్లు వెళ్ళవు. బైకులు అయితే వెళ్ళే అవకాశం ఉంది. గ్రామంలోనుంచి కొండదారిలోనికి తిరిగిన తరువాత, ఏటవాలుగా ఎత్తు ఎక్కే మార్గంలో వీలయినంత దూరం వెళ్ళి అక్కడ కారుని నిలుపుకొన్నాం. వెంట తీసుకొని వెళ్ళిన లంచ్ బాస్కెట్లు తలొకటీ పట్టుకొని సుమారు ఒక అర కిలోమీటరు ఎత్తు ఎక్కిన తరువాత, ముందుగా జలపాతం చేసే శబ్ధం వినిపించింది, ఆ తరువాత జలపాతం కనిపించింది. కార్లలో, వేన్లలో, బైకులమీద కొంతమంది వచ్చి ఉన్నారు. ఒకే  ధారగా జలపాతం పడుతుంది. ఒక మండపం లాంటి గుడిలో పెద్ద రాతి శివలింగం, ఒక పందిరిలో మరొక చిన్న శివలింగం - దానికి ఎదురుగా నంది. దీనిని ధార మల్లిఖార్జునుని క్షేత్రం అని అంటున్నారు. శివరాత్రికి భక్తులు వచ్చి, ఈ జలపాతం క్రింద స్నానాలు చేస్తారట. 

జలపాతం వీడియోలు చూడండి:

జలపాతం పడే ప్రాంతం నుంచి కొండదిగువకి నీటిని సిమెంట్ డ్రెయిన్లు కట్టి వ్యవసాయ భూమికి మళ్ళిస్తున్నారు. వాలులో కట్టిన మడులలో వరి చేలు. దమ్ముచేసుకొని, నాట్లు వేసుకొంటున్నారు. మడులన్ని పుష్కలంగా నీరు పెట్టి ఉన్నాయి.మీరు కష్టపడి వచ్చిన అలసట అంతా మరచిపోయేటంత మనోహర దృశ్యం ఆవిష్కృతమౌతుంది ఇక్కడ . దూరంగా మడుల్లో వాలిన వందల కొద్దీ తెల్లకొంగలు పండగ రోజు ఆవుపేడతో అలికిన నేల మీద రంగవల్లులు వెయ్యడానికి పెట్టిన ముగ్గుపిండి చుక్కల్లాగ ఉంటాయి. వాతావరణంలో చల్లదనం వల్ల అంతటా కమ్ముకొన్నట్టు ఉన్న పలుచటి నీలి మంచు తెర.

సాయంత్రం మూడు, నాలుగు గంటల తరువాత ఇక్కడ ఉండడం అంత ఆహ్లాదంగా ఉండదు. పిక్నిక్‌కి వెళితే ఆ సమయానికే పూర్తి అయ్యేలా ప్లేన్ చేసుకోండి. కాకినాడకి పూర్తిగా ఎనభై కిలోమీటర్లు కూడా లేని ఈ ప్రాంతం గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రదేశం గురించి ప్రచారం లేకపోవడమే దానికి కారణం.  ఈ టపా మీకు నచ్చుతుందని అనుకొంటున్నాను.
© Dantuluri Kishore Varma 

9 comments:

  1. దారకొండ జలపాతం గురించి విన్నాగాని వెళ్ళ్లేకపోయా.

    ReplyDelete
  2. వాహనం దిగిన తరువాత నడక కొంచం శ్రమ ఉంటుంది శర్మగారు. ఒక పెద్దాయన - కోడలో కూతురో చెయ్యి పట్టుకొని నడిపించుకొని వెళుతుంటే `ఇది ఏ పాటి? నేను పెద్ద పెద్ద కొండలేఎక్కాను,` అని అంటున్నారు. మీ కామెంటుకి ధన్యవాదాలు.

    ReplyDelete
  3. baagundi...ee saari choodaali varma gaaroo!...@sri

    ReplyDelete
    Replies
    1. శ్రీగారు,
      ఈ సాంకేతిక లోపం చూడాలండీ, మీ బ్లాగు గురించి. నాకే కాదు వర్మ గారికీ మీ బ్లాగ్ "మన్నా" చెప్పేసిందిట.

      Delete
  4. మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది శ్రీనివాస్ గారు. మీ బ్లాగ్‌లోనికి వెళ్ళాలంటే ఏదో సాంకేతికలోపం వస్తుందండి. మీ పోస్టులేవీ చదవలేక పోతున్నాను.

    ReplyDelete
  5. చాలా అందంగా ఉన్నాయండీ ఆ ప్రదేశాలన్నీ.

    ReplyDelete
  6. అవును చిన్ని ఆశగారు. కొంచం ఇబ్బంది పడ్డా, మంచి ప్రదేశాలు చూశామన్న తృప్తి ఉంటుంది.

    ReplyDelete
  7. అవును Dantuluri Kishore Varma గారూ, నేనూ చూశాని. చాలా ఆహ్లాదకరంగా ఉంది. చివరికి చేరే వరుకూ తప్పు దారిలో వెళ్తున్నామేమో అని అన్పిస్తూనే ఉంది. చివరకి వెళ్ళిన తర్వాత ఆ అలసట అంతా చేత్తో తీసివేసినట్టనిపించింది. కానీ లంచ్ తీసుకెళ్ళకపోతే వెళ్ళటం కాస్సేపు ఉండి రావటం పెద్ద గొప్పగా ఉండదు. కాబట్టి వెళ్ళే వాళ్ళు లంచ్ వెంట తీసుకుని వెళ్ళటం బెటర్.

    ReplyDelete
    Replies
    1. మంచి ప్రదేశాన్ని చూసినందుకు అభినందనలు కిషోర్‌గారు. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!