మా అమ్మాయిలిద్దరికీ ఆక్వేరియంలో చేపలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కొనుక్కొందామని అడగటంతో, ఆక్వేరిస్ట్ దగ్గరకు వెళ్ళి ఒక ఫిష్ బౌల్, రెండు రకాల చేపలు, బౌల్‌కి అడుగున వెయ్యడానికి రంగురంగుల రాళ్ళు, అక్వాటిక్ ప్లాంట్స్ లా కనిపించే కృత్రిమ మొక్కలు, నీటిని సర్క్యులేట్ చేస్తూ బుడగలు రావడానికి గాలిని పంపేచిన్న మోటర్, దానికి ఒక సన్నటి గొట్టం, చేపలకి వెయ్యడానికి గుళికల్లా ఉండే ఆహారం.. అన్నీ కొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఆక్వేరియం ఏర్పాటు చేసుకొన్నాం.
ఆక్వేరియం స్వచ్చమైన నీటితో చాలా అందంగా ఉంటుందికానీ, చేపలకి మేత వేస్తుంటే నీరు మడ్డిగా అయి, తరచూ మార్చకపోతే అసహ్యంగా తయారవుతుంది. కనీసం ప్రతీ వారం శుబ్రం చేస్తూ, చేపలు బౌల్‌లో ఆనందంగా తిరగడం అస్వాదిస్తూ ఉండగా ఒకరోజు ఉదయానికి గోల్డ్ ఫిష్ రెండూ చనిపోయి, పైకి తేలిపోయి కనిపించాయి. తరువాత ఇంకొకటి కూడా చచ్చిపోయింది. మిగిలిన ఒక్క గప్పీ రకం చేపనీ స్కూలుకి వెళ్ళేటప్పుడు, వచ్చినతరువాత `హాయ్, హెలో, ఓయ్ నిన్నే,` అని పలకరించుకొంటూ ఆనందపడిపోతున్నారు పిల్లలు.
ఒక ఆదివారం రోజు ఈ చేపకి ఏదయినా పేరుంటే బాగుంటుందని, `బావజ్జీ(అంటే నాన్న, డాడి అని) పేరుచెప్పండి,` అన్నారు. అప్పుడే టీవీలో `షకలక బేబీ...` పాట వస్తుంది. `మన గప్పీ ఫిష్ పేరు షకలక బేబీ,` అన్నాను.
షకలక బేబీ చాలా రోజులు గుడ్ మాణీంగులు, హాయ్‌లు, గుడ్‌నైట్‌లు చెప్పించుకొంది. తరువాత ఏమైందో తెలియదు ఓ రోజు ప్రొద్దున్నే ఆక్వేరియం లోనుంచి బయటకు జంప్‌చేసి ఫ్లోర్ మీద పడి కొట్టుకొంటుంది. చూసిన వెంటనే దాన్ని జాగ్రత్తగా తీసి బౌల్ లో వేసాం. సాయంత్రం వరకూ బాగుంది. తరువాత చనిపోయి, పైకి తేలిపోయింది.
పేరుకూడా పెట్టి చాలా అటాచ్‌మెంటు పెంచుకొన్నారేమో, పిల్లలు చాలా బాధపడ్డారు. నిజానికి పెద్దవాళ్ళం కూడా అప్సెట్ అయ్యాం. జంతువులని పెంచుకోవడం మనందరికీ అలవాటే, కానీ ఇలాంటి సందర్భాలలో మనసు చాలా బాధపడుతుంది. ఇంకెప్పుడూ ఆక్వేరియం జోలికి వెళ్ళలేదు. చాలా రోజులు ఖాళీ బౌల్ అటకమీద ఉండేది, తరువాత ఎవరికో ఇచ్చేసాం.
© Dantuluri Kishore Varma
హుమ్మ్... !
ReplyDeleteఎంత జాగ్రత్తగా చూసినా ఇలాగే జరుగుతుంది ఎందుకో . మా అక్వేరియం కూడా అటకెక్కింది
ఉష్ణోగ్రతల్లో కొంచం హెచ్చు తగ్గులు వచ్చేసరికి చాలా అక్వేరియం ఫిష్ చనిపోతాయి లలితగారు.
ReplyDelete