* * *
వేంకటేశ్వరుడు అంటే పాపాలు హరించే దేవుడు అని అంటారు. ఆయన వెలసిన అత్యంత ప్రముఖమైన ప్రదేశం తిరుమల. తమిళంలో తిరు అనే మాట చాలా సందర్భాలలో వింటూవుంటాం. దీని అర్థం పవిత్రమైనది అని. అలాగే మాలా అంటే పర్వతం. తిరుమల కలియుగ వైకుంఠం. సముద్రమట్టానికి 850 మీటర్ల ఎత్తులో ఏడుకొండలపైన పదిన్నర చదరపు మైళ్ళ విస్తీర్ణంలో తిరుమల ఉంది. అసలు ఏడుకొండలు ఎందుకు ఉన్నాయని సందేహం రావచ్చు ఎవరికైనా. వైకుంఠంలో విష్ణుమూర్తి పవళించి ఉండే తల్పం ఏడుతలలు ఉండే ఆది శేషువు అని తెలుసుకదా? ఆ ఆదిశేషువే ఈ శేషాచలం అని అంటారు. ఒక్కొక్క పడగా ఒక్కొక్క కొండ. ఏడుకొండలకీ పేర్లు ఉన్నాయి - శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయనాద్రి, వేంకటాద్రి - అని.
వేంకటేశుడు స్వయంభూ. ఆనందనిలయంలో ఉంటాడు. ఆనందనిలయం అంటే బంగారు రేకు తాపడం చేసిన గోపురం ఉన్న దేవాలయం. చుట్టూ రెండు ప్రాకారాలు ఉన్నాయి. స్వామి సన్నిధిలోనికి వెళ్ళాలంటే పెద్ద గోపురంతో ఉన్న ప్రధానద్వారం, మరొక చిన్న గోపురం ఉన్న రెండవ ద్వారం దాటుకొని వెళ్ళాలి.
ఆలయం చుట్టూ ఉన్న వీధులని మాడవీధులు అంటారు. ప్రధాన ద్వారానికి అభిముఖంగా ఉన్న వీధి సన్నిధి వీధి. ఇక్కడే గొల్ల మండపం ఉంది. ఈ వీధి చివర భేది ఆంజనేయస్వామి గుడి ఉంది.
ప్రధాన ద్వారం - తూర్పు మాడవీధి |
ఉత్తరంవైపు ఉన్న మాడవీధి దీనినే తీర్థకట్టవీధి అని కూడా అంటారు |
దేవాలయానికి వెనుక వున్న వీధి పడమర మాడవీధి. దీనిని కూడా తీర్థకట్టవీధి అని అంటారు |
పడమర మాడవీధి అటుచివర కనిపిస్తున్న భవనం యాభైరూపాయల సుదర్శనం టిక్కెట్లకి, సేవల టిక్కెట్లకి, మూడువందల దర్శనం వాళ్ళకి, అధనపు లడ్డూలకోసం టిక్కెట్లు కొనుకొన్నవాళ్ళకి ప్రసాదం ఇచ్చే చోటు. దేవాలయం వెనుక చిన్న పార్కు కూడా అభివృద్ది చేశారు. వేంకటేశ్వరస్వామి నామాలు, శంకు చక్రాలు ఇక్కడ చూడవచ్చు.
దక్షిణపు మాడవీధి |
దక్షిణ మాడవీధి. క్యూకాంప్లెక్స్ నుంచి వచ్చే లైన్ వోవర్ బ్రిడ్జ్ మీదుగా దేవాలయ దక్షిణగోడని చేరుకొంటుంది. అక్కడినుంచి మలుపుతిరిగి, ప్రధానద్వారం వైపు మళ్ళి, లోనికి ప్రవేశిస్తుంది. ఇంకా ఈ వీధిలో తిరుమలనంభిమందిరం ఉంది. వైకుంఠద్వారానికి వెళ్ళే సుపదం కూడా ఈ వీధినుంచే వెళుతుంది. హథీరాంజీ మఠం కనిపిస్తుంది.
కోయిల్ఆళ్వార్ తిరుమంజనం - అంటే దేవాలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమం. తిరుమలలో సంవత్సరానికి తిరుమంజనాన్ని నాలుగుసార్లు జరుపుతారు. రాబోయే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చ్ 25వ తారీకున నిర్వహించారు. దీనికారణంగా మధ్యాహ్నం పన్నెండుగంటల వరకూ దర్శనాన్ని నిలిపివేశారు. అస్సలు భక్తుల రద్దీ లేదు. అందుకే ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు ఇలా తియ్యడానికి అవకాశం చిక్కింది.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment