ఎన్నికల సమయమేమో చాలా చోట్ల పోలీసువాళ్ళు బైకులనీ, కార్లనీ ఆపి సోదాలు చేస్తున్నారు. ప్రతీరోజూ న్యూస్‌పేపర్లలో వార్తలు చూస్తున్నాం కదా - కార్లలో అక్రమంగా తరలిస్తున్న లక్షల రూపాయలు స్వాధీనం చేసుకొంటున్నారు అని? రహదారులమీద ఈ సోదాలు అందుకే! ఆ విషయం జ్ఞాపకం ఉంది. కనుక, కారులో ఉండవలసిన సీబుక్, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్‌లు లాంటివి ఉన్నాయో, లేదో చెక్ చేసుకొని బయలుదేరాం. సామర్లకోటదగ్గర కారుని ఆపారు. డిక్కీ ఓపెన్ చేయించి, చూసి పంపించారు. తిరుగు ప్రయాణంలో మరో చోట ఆపారు. `ఇంతకు ముదే అయ్యింది,` అన్నాం. నవ్వి, వెళ్ళండన్నట్టు చెయ్యి ఊపాడు పోలీసాయన. ఎండ మండిపోతుంది. రోడ్డుమీద ప్రయాణం చేస్తుంటే ఎడారిలో వెళుతున్నట్టు ఉంది. అక్కడక్కడా చెట్లక్రింద చెరుకురసం బళ్ళు, పుచ్చకాయలు, కొబ్బరి బొండాలు ఒయాసిస్సుల్లా ఉన్నాయి. నోరు పిడచగట్టుకుపోతుంటే పుచ్చకాయల బడ్డీ దగ్గర ఆగాం. మేం ఆగుతూ ఉండగా పుచ్చకాయ ముక్కలు తినేసి, మూతి తుడుచుకొన్న ఒకతను బైకు స్టార్ట్ చేసి, తన కుటుంబాన్ని ఉద్దేశించి `ఎక్కండి,` అన్నాడు. భార్య వెనుక ఎక్కింది. ఒక కుర్రాడు వాళ్ళిద్దరి మధ్యా సెట్ అయ్యాడు. ఇంకో ఇద్దరు పిల్లలు పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చున్నారు. బైకు ముందుకు ఉరికింది. మేం అవాక్కయ్యం! అలా ప్రయాణం చెయ్యడానికి వాళ్ళకు ఉన్న కారణాలు ఉంటాయి. కానీ, అడుగడుగునా పోలీసులు ఆపుతుంటే, ఆ చెక్‌పోస్ట్‌లని దాటుకొని వీళ్ళు ఎలా వెళతారు అనేది చిక్కుప్రశ్న. `ఇట్ హేపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా!` అనే కేప్షన్లతో చాలా ఫోటోలు చూశాను నేను. ఆ కేటగిరీలోనికి భహుశా ఈ ఫోటో కూడా చేర్చవచ్చేమో!
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment