టక్..టక్..టక్ మని చప్పుడు వినిపించిన వెంటనే ఇంటిలో ఏ మూలన ఉన్నా, ఏ ఆటలు ఆడుకొంటున్నా వేంటనే పెద్దవాళ్ళదగ్గరకి పరిగెత్తుకెళ్ళి, పది పైసలు తెచ్చుకొంటే చల్లని ఐసు కొనుక్కోవచ్చు. ఇరవై పైసలకైతే రెండు ఐసులు కలిపి గుండచేసి, ఐసుపుల్ల మధ్యలో పెట్టి, మైకా కాగితంతో గట్టిగా నొక్కితే, పుల్లకి గుచ్చిన బంతిలా తయారయ్యే ఐసు వచ్చేది. పీల్చి, పీల్చి తింటే తియ్యతియ్యని, చల్లచల్లని రసం గొంతుదిగడం... అహా!
ఇప్పటికే మీకు అర్దమయ్యి ఉంటుంది. ఈ టకటకల చప్పుడు ఐసు బండి వాడు చేసేది. ఒక్కరోజు వాడు అమ్మే ఐసుకి టెంప్ట్ అయ్యామా, ఇక అంతే! ప్రతీరోజూ అదే టైముకి మన ఇంటిముందు మనం చెవులు మూసుకొన్నా వినిపించేలా చప్పుడు చేస్తాడు. `పాలాయిస్` అని కూడా అరుస్తాడు. అలా అంటే నోరూరుతుంది కదా మరి? ఎలా ఆగగలం? పెద్దవాళ్ళ దగ్గరకి వెళ్ళి డబ్బులు అడుగుతాం. `నిన్నే కదా తిన్నావ్. రోజూ తింటే జలుబుచేస్తుంది,` అని నిర్దాక్షిణ్యంగా మన అప్పీల్‌ని తిరస్కరిస్తారు. మనమీద జాలిచూపించే హ్యూమన్‌రైట్స్ కమీషన్‌కి - అంటే అత్తలో, తాతాలో, బామ్మలో అన్న మాట - మొరపెట్టుకొంటాం. చాలా సార్లు పని జరుగుతుంది. ఒక్కోసారి ఇలాంటి వ్యవహారాల్లో కలగజేసుకొని పిల్లల్ని చెడగొట్టవద్దని వాళ్ళకి వార్నింగ్‌వస్తే, ఇక మన పనిజరగదన్న మాట. అప్పుడు మనం ఘాట్టిగా పేచీ పెట్టాలి. అయితే పని అవుతుంది, లేకపోతే వీపు పగులుతుంది.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, పిల్లల్ని ఏడిపించడానికి పుట్టిన దుర్మార్గుడు ఐసుబండివాడు. మన చిన్నప్పుడు ఏదో అయిపోయిందిలే, ఏనీళ్ళతో చేశారో తెలియని ఐసులు తిన్నాం! మనపిల్లలకి అలాంటివి ఇప్పుడు పెద్దగా అందుబాటులో ఉండటం లేదు అని ఆనంద పడే లోగా....బయటనుంచి పాం..పాం అని బూరా చప్పుడు వినిపిస్తుంది. పిల్లలు టెన్ రూపీస్ కోసం చేతులు చాపుకొని పరిగెత్తుకొని వస్తారు. పాం,పాంలు ఆలా))లా))లా.. వినిపిస్తూనే వుంటాయి. కంపెనీ ఐస్‌కేండీ బండి వాడు వెయిటింగ్!
© Dantuluri Kishore Varma
చరిత్ర పునరావృతం కదండీ ! ఒక్కటే తేడా .అప్పటి పది పైసలు ఇప్పుడు పదిరూపాయలు.
ReplyDeleteTyped with Panini Keypad
నిజమేనండి!
Delete